You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రాబోయే మండే ఎండలకు ఈ సమ్మర్ ట్రైలర్ లాంటిదా? ప్రపంచ వాతావరణ సంస్థ నివేదికలో ఏముంది?
మే 28, 2026... జెనీవా స్విట్జర్లాండ్
వచ్చే ఐదేళ్లలో ప్రపంచ ఉష్ణోగ్రతలు ఇప్పుడు పెరుగుతున్నట్లుగా పెరుగుతూనే రికార్డు స్థాయికి చేరుకోవచ్చని ప్రపంచ వాతావరణ సంస్థ నివేదిక అంచనా వేసింది.
2026-2030 మధ్య ఉష్ణోగ్రతలు 1.3 డిగ్రీల సెల్సియస్ నుంచి 1.6 డిగ్రీల సెల్సియస్ పెరగవచ్చని నివేదిక తెలిపింది.
ఇప్పటి వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా ఉన్న 2024 రికార్డు వచ్చే ఐదేళ్లలో బద్ధలయ్యే అవకాశం ఉంది.
ఆర్కిటిక్‌లో శీతాకాలపు ఉష్ణోగ్రత పెరుగుదల ప్రపంచ సగటు కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థ, బ్రిటన్ వాతావరణ విభాగం విడుదల చేసిన నివేదికలో తెలిపాయి.
చరిత్రలో కాస్త వెనక్కి వెళ్లి చూస్తే..
డిసెంబర్ 11, 1997... క్యోటో ప్రోటోకాల్
అభివృద్ధి చెందిన 37 దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు కర్బన ఉద్గారాలను 5 శాతం తగ్గించి 1990 నాటి స్థాయిలకు తీసుకురావాలని చెప్పింది.
డిసెంబర్ 12, 2015... పారిస్ అగ్రిమెంట్
ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతల పెరుగుదల 1.5 డిగ్రీలోపు ఉండేలా ప్రయత్నాలు చేయడం, పారిశ్రామిక విప్లవకాలానికి పూర్వం ఉన్న ఉష్ణోగ్రతల కంటే 2 డిగ్రీలను తగ్గించడానికి ప్రయత్నాలు కొనసాగించడం ఈ ఒప్పందం లక్ష్యం.
ఇవే కాదు.. పర్యావరణ పరిరక్షణ కోసం గతంలో జరిగిన సదస్సులు, తమ లక్ష్యాల సాధనలో వెనకబడ్డాయని కూడా తాజా నివేదిక చెబుతోంది.
గ్లోబల్ యాన్యువల్-టు-డెకాడల్ అప్‌డేట్ అని పిలిచే ఈ నివేదికను ప్రపంచ వాతావరణ సంస్థ( WMO) కోసం యునైటెడ్ కింగ్‌డమ్ వాతావరణ విభాగం రూపొందించింది.
"2026 చివర్లో ఎల్‌నినో ఏర్పడే అవకాశం ఉంది. దీని వల్ల 2027లో ఉష్ణోగ్రతలు పెరిగి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది" అని ప్రపంచ వాతావరణ సంస్థ నివేదిక రూపొందించిన హెర్మన్‌సన్ చెప్పారు.
నివేదికలో హెచ్చరికలు
2026-2030 మధ్య ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీలు ఎక్కువగా ఉండేందుకు 75శాతం అవకాశం ఉంది.
ఇప్పటి వరకు అత్యంత వేడి సంవత్సరంగా నమోదైన 2024 రికార్డుని రానున్న ఐదేళ్లలో ఏదో ఒక సంవత్సరం బద్దలు కొట్టే అవకాశం 86 శాతం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ నివేదిక తెలిపింది.
రాబోయే ఐదేళ్లలో ఏదో ఒక సంవత్సరం ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల పరిమితి దాటేందుకు 91 శాతం అవకాశం ఉంది.
భూ ఉపరితల ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీలు పెరిగితే మరణాలు, ప్రకృతి విపత్తులు, జాతుల నష్టం ఎక్కువగా సంభవిస్తాయని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది.
1.5 డిగ్రీలు చాలా తక్కువే అయినప్పటికీ పెరిగే ఉష్ణోగ్రతలను కోరల్ రీవ్స్, హిమానీ నదాలు వంటి కొన్ని జీవావరణ వ్యవస్థలు తట్టుకోలేవు.
"మనం ఇప్పటికే రికార్డు స్థాయిలో అత్యంత వేడిగా ఉన్న పది సంవత్సరాలను చూశాం. రానున్న ఐదేళ్లలో ఇది మరింత తీవ్రంగా ఉంటుందని ప్రపంచ వాతావరణ సంస్థ నివేదిక చెబుతోంది. దీనివల్ల మన ఆర్థిక వ్యవస్థలు, రోజువారీ జీవితాలు, పర్యావరణ వ్యవస్థలు, భూమిపై ప్రతికూల ప్రభావం పెరుగుతూనే ఉంటుంది" అని ప్రపంచ వాతావరణ సంస్థ డిప్యూటీ సెక్రటరీ-జనరల్ కో బారెట్ చెప్పారు.
ఉష్ణోగ్రతలు పెరిగితే భయంకరమైన వడగాలులు, భారీ వర్షాలు, తీవ్రమైన కరవు, హిమానీ నదాలు కరగడం, సముద్ర మట్టాలు పెరగడం లాంటి వాటికి దారి తీస్తుంది.
"ఒక ఏడాది పూర్తిగా లేదా అంత కంటే ఎక్కువ రోజులు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల మార్కు కంటే ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతారు. ఆహార ధరలలో భారీ షాక్‌లను ఎదుర్కోవలసి వస్తుంది. అడవులు తగలబడతాయి" అని ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ వాతావరణ శాస్త్రవేత్త ఫ్రెడరిక్ ఒట్టో తెలిపారు.
మధ్య పసిఫిక్‌లోని కొన్ని ప్రాంతాలు సహజంగా వేడెక్కడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణం మారి ప్రపంచ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగే బలమైన ఎల్ నినో త్వరలోనే ఏర్పడుతుందని నివేదిక తెలిపింది.
తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగితే ఎల్‌నినో ఏర్పడుతుంది. ఇది సాధారణంగా 9 నుంచి 12 నెలలు ఉంటుంది.
వివిధ దేశాలకు చెందిన 13 వేర్వేరు వాతావరణ నమూనాలను ఉపయోగించి, సుమారు 200 కంప్యూటర్ రికార్డుల సగటు ఆధారంగా ఈ అంచనాలను రూపొందించారు.
సౌర వికిరణాన్ని అంతరిక్షంలోకి ప్రతిబింబించే మంచు తక్కువగా ఉండటం వల్ల ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాల కంటే ఆర్కిటిక్‌లో వేడెక్కడం 3.5 రెట్లు వేగంగా పెరుగుతోందని సీబ్రూక్ చెప్పారు.
"ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ, సముద్రపు మంచు మరింత కరుగుతుంది. పరిస్థితి దారుణంగా తయారవుతుంది" అని ఆయన అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా మారనున్న వర్షపాత సరళి
ఆర్కిటిక్ ప్రాంతం రికార్డు స్థాయిలో వేగంగా వేడెక్కుతోంది.
రాబోయే ఐదేళ్లు ఆర్కిటిక్‌లో శీతాకాలపు ఉష్ణోగ్రతలు 2.8 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటాయని నివేదిక తెలిపింది.
2026 మార్చ్ నుంచి 2035 వరకు ఆర్కిటిక్ సముద్రపు మంచుపై చేసిన అంచనాల ప్రకారం, బారెంట్స్ సముద్రం, బేరింగ్ సముద్రంలో మంచు సాంద్రత మరింత తగ్గనుంది.
వర్షపాతం, హిమపాతం సరళి కూడా మారనుంది. కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో వేడి, పొడి పరిస్థితులు కనిపిస్తాయని నివేదిక అంచనా వేసింది.
2026-2030 మే-సెప్టెంబర్ మధ్య ఆఫ్రికాలోని సహేల్, ఉత్తర ఐరోపా, అలస్కా, సైబీరియాలో అధిక వర్షపాతం ఉంటుందని, అదే సమయంలో అమెజాన్ పొడిగా ఉండే అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది.
అమెజాన్ అడవుల్లో వేడి పొడి వాతారణం వల్ల భారీ విస్తీర్ణంలో అడవులు తగలబడవచ్చని ప్రపంచ వాతావరణ సంస్థ అంచనా వేసింది.
అమెజాన్ బేసిన్‌లో వేడి పెరగడం వల్ల స్థానిక ఆదిమ జాతులకే కాకుండా భూగోళానికే వినాశకరంగా పరిణమిస్తుందని నివేదిక చెబుతోంది.
ఇప్పటివరకు నమోదైన 11 అత్యంత వేడి సంవత్సరాలన్నీ 2015 నుంచి మొదలయ్యాయని ఈ ధోరణి కొనసాగుతుందని, 2031 కి ముందే మరో అత్యంత వేడి సంవత్సరం నమోదయ్యే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి వాతావరణ, శీతోష్ణస్థితి సంస్థ తెలిపింది.
ప్రజలు నీటి కోసం అమెజాన్‌పై ఆధారపడతారని, వేడి, పొడి పరిస్థితులు కార్చిచ్చు ప్రమాదాన్ని పెంచుతాయని సీబ్రూక్ అన్నారు. ప్రస్తుతం వాతావరణం నుండి వేడిని బంధించే కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహిస్తున్న అమెజాన్, ఈ సమస్యను మరింత తీవ్రతరం చేసే ప్రాంతంగా మారే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు.
"భూతాపాన్ని తగ్గించే ప్రయత్నాల్లో పురోగతి సాధించినప్పటికీ, అవి సరిపోవడం లేదని తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. ఈయూ దేశాలు, భారత్ సహా ఇతర ప్రాంతాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు దీనికి ఉదాహరణగా కనిపిస్తున్నాయి" అని ఐక్యరాజ్యసమితి వాతావరణ శాఖ అధిపతి సైమన్ స్టీల్ అన్నారు.
అమెజాన్ అడవులు ఎందుకంత కీలకం
అమెజాన్ అడవుల్లో 60శాతం బ్రెజిల్‌లో ఉన్నాయి. ఈ అడవులు భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్నాయి. అక్కడ పొడవైన, దట్టమైన పచ్చని చెట్లు ఉంటాయి. ఈ అడవుల్లో అధిక వర్షపాతం నమోదవుతుంటుంది. తేమ ఎక్కువ.
అమెజాన్‌లో నదీతీర ప్రాంతాలు, చెరువులు, సవన్నాలుగా పిలిచే గడ్డిమైదానాలున్నాయి. దక్షిణ అమెరికాలో 6.7మిలియన్ చదరపు కిలోమీటర్ల మేర ఇవి విస్తరించి ఉన్నాయి. ఇది భారత వైశాల్యం కన్నా రెండింతలకు పైగా పెద్దది. భూమిపై జీవవైవిధ్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అమెజాన్ వర్షారణ్యం ఒకటి.
అమెజాన్ నది ప్రపంచంలోనే పెద్దది. దానికి 1100కు పైగా ఉపనదులున్నాయి. ప్రపంచంలోనే తాజా నీటివనరులు ఎక్కువున్న ప్రాంతం. ఈ నదిలో నీరు అట్లాంటిక్ సముద్రంలో కలుస్తుంది.
స్థానికంగా, అంతర్జాతీయంగా వాతావరణ వ్యవస్థలపై ప్రభావం చూపే సముద్ర ప్రవాహాల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది.
అమెజాన్ అడవులు కార్బన్‌డైఆక్సైడ్‌ను గ్రహిస్తాయి. అయితే ఇప్పుడు కొన్ని ప్రాంతాలు అవి గ్రహించేవాటికన్నా ఎక్కువగా కార్బన్ డై ఆక్సైడ్‌ను విడుదల చేస్తున్నాయి.
20శాతం అడవి నాశనమైందని అంతే మొత్తంలో అడవి పాడైపోయిందని పర్యావరణ పరిరక్షణ సంస్థలు చెబుతున్నాయి.
సాధారణంగా తేమగా ఉండే ఈ వర్షారణ్యం ఇప్పుడు మరింత పొడిగా మారి అగ్నిప్రమాదాలకు సులభంగా గురయ్యే స్థితికి చేరింది.
ఉదాహరణకు 2024 సెప్టెంబరులో 41,463 అగ్నిప్రమాదాలు జరిగాయి.
ఇది 2010 తర్వాత ఆ నెలలో నమోదైన అత్యధిక సంఖ్య అని బ్రెజిల్ అంతరిక్ష సంస్థ (ఐఎన్‌పీఈ) చెబుతోంది.
అమెజాన్ అడవులు ఇప్పటికీ కార్బన్‌డైఆక్సైడ్‌ను పెద్దస్థాయిలో పీల్చుకుంటున్నాయి. అమెజాన్ ధ్వంసం కావడమంటే వాతావరణ సంక్షోభంపై పోరాటంలో ఓడిపోవడంతో సమానమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
"అమెజాన్ అడవులకు ఉష్ణోగ్రతలను నియంత్రించడం భూమిని చల్లబరచడం వంటి సామర్థ్యాలుంటాయి. అందుకే అమెజాన్‌ను ప్రపంచాన్ని చల్లబరిచే భారీ ఎయిర్ కండీషనర్ అని పిలుస్తాం" అని'అని బ్రెజిల్ అటవీశాస్త్రవేత్త టస్సో అజెవెడో చెప్పారు.
"తీవ్రమైన వేడి, భారీ తుఫానులు, వరదలు, పెద్ద కార్చిచ్చులు లేదా ఆహార సరఫరా, ధరలపై ప్రభావం చూపుతున్న కరవులు ఏవైనా సరే ప్రపంచ వాతావరణ సంక్షోభం వల్ల ప్రతి దేశం ఇప్పటికే భారీ మూల్యం చెల్లిస్తోంది" అని సైమన్ స్టీల్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)