పెళ్లి కోసం ఒత్తిడి పెరగడంతో టాక్సీ ఎక్కి పారిపోయిన అఫ్గానీ యువతి, ‘‘ఇక్కడ మా పని అయిపోయినట్లే’’ అని మహిళలు ఎందుకు అంటున్నారు?

    • రచయిత, యోగితా లిమయే
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 8 నిమిషాలు

అలియా- ఇది ఆమె అసలు పేరు కాదు. భద్రత దృష్ట్యా ఆమె పేరును మార్చాం.

పెళ్లిని తప్పించుకునేందుకు ఆమె తన గ్రామం నుంచి వేల మైళ్ల దూరం ప్రయాణించి కాబూల్ చేరుకున్నారు.

తల నుంచి బొటన వేలి వరకు కేవలం కళ్లు మాత్రమే కనిపించేలా ఒళ్లంతా దుస్తులు కప్పుకుని తన వదినతో కలిసి గతేడాది ఆమె ఈ ప్రయాణం చేశారు.

అఫ్గానిస్తాన్‌లో ఇది చాలా ప్రమాదకరమైన ప్రయాణమే కాదు, అసాధారమణమైనది కూడా.

ఎందుకంటే మగవారి తోడు లేకుండా మహిళలు సుదూర ప్రయాణాలు చేయడాన్ని నిషేధిస్తూ అమల్లో ఉన్న నిబంధనలను పర్యవేక్షించే తాలిబాన్ ఇన్‌స్పెక్టర్లకు వాళ్లు ఏ క్షణంలోనైనా పట్టుబడే ప్రమాదం ఉంది.

అయితే 19 ఏళ్ల ఆలియా, ఆమె వదిన ప్రయాణిస్తున్న వాహనాన్ని తాలిబాన్ల చెక్‌పోస్టుల వద్ద ఆపకపోవడంతో వాళ్లు కాబూల్ చేరుకున్నారు.

"నా స్నేహితులు, నాతో చదువుకున్న వాళ్లను కలిసేందుకు వెళుతున్నానని చెప్పాను. అయితే అది నిజం కాదు. ఎందుకంటే వాళ్లిక్కడ లేరు. అసలు కారణం ఏంటంటే నేను డేకుండి (ఆమె ఉండే ప్రాంతం)లో ఉంటే వాళ్లు బలవంతంగా నాకు పెళ్లి చేస్తారు" అని ఆలియా బీబీసీతో చెప్పారు.

అందుకే ఆమె ఒక ప్లాన్ వేసి కాబూల్ వచ్చారు. అక్కడ ఒక ఇంగ్లిష్ లాంగ్వేజ్ కోర్సులో చేరారు.

ఈ షార్ట్ టర్మ్ ప్రైవేట్ కోర్సులు డబ్బున్న వాళ్లకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. మత విద్యను బోధించే మదర్సాలతో పాటు అఫ్గానిస్తాన్‌లో ప్రాథమిక విద్య తర్వాత బాలికలు చదువుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ఈ షార్ట్ టర్మ్ కోర్సు.

మదర్సాలో చదువుగానీ, షార్ట్ టర్మ్ కోర్సుగానీ పాఠశాల విద్యకు సమానవైనవి కాదు.

ఒక అసాధారణ, సాహసోపేత ప్రయత్నం

12 ఏళ్లు పైబడిన బాలికలు చదువుకోకుండా తాలిబాన్లు నిషేధం విధించి ఐదేళ్లవుతోంది. ఈ నిషేధం ఇప్పటికీ ఎందుకు అమల్లో ఉందనే దాని గురించి రకరకాల వివరణలు ఇస్తున్నారు.

చదువుకోవాలన్న తమ కోరికను నెరవేర్చుకోలేని ఆలియా లాంటి అమ్మాయిలు ఈ ఐదేళ్లలో పెరిగి పెద్దవాళ్లయ్యారు. వారికి కెరీర్‌ అనేది లేకుండా చేసి వారి అవకాశాలను పూర్తిగా తొక్కేసిన సంవత్సరాలివి. చివరకు అఫ్గానిస్తాన్‌లో లక్షల మంది అమ్మాయిలకు మిగిలిన ఒకే ఒక్క మార్గం వివాహం.

ఆలియా స్టోరీ అసాధారణమైనది. అది కేవలం ధైర్యానికి సంబంధించింది మాత్రమే కాదు.

దేశంలో ప్రతి నలుగురిలో ముగ్గురు తమ ప్రాథమిక అవసరాలను కూడా తీర్చుకోలేకపోతున్నారని ఐక్యరాజ్య సమితి చెబుతోంది.

అలాంటి దేశంలో అమ్మాయిలకు అందుబాటులో ఉన్న కొద్దిపాటి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఆమె ముందుకు వచ్చారు. అందుకు అవసరమైన ఆర్థిక స్థోమత ఆమె కుటుంబానికి ఉండటం ఆమె అదృష్టం.

ఆలియా చదువును ఆమె కుటుంబం వ్యతిరేకించడం లేదు. ఆమె కాబూల్‌లో ఉండేందుకు వారు అంగీకరించారు. ఇంగ్లిష్ కోర్సు చదువుకోవడానికి అవసరమైన డబ్బులు పంపిస్తున్నారు. అయితే అఫ్గానిస్తాన్‌లో వాస్తవ పరిస్థితులవల్ల వాళ్లు కూడా కొన్ని పరిమితులను ఎదుర్కొంటున్నారు.

"బాలికల చదువుపై నిషేధానికి ముందు నా తల్లిదండ్రులు నన్ను పాఠశాలకు వెళ్లమని ప్రోత్సహించారు. పైలట్ కావాలనే నీ కలను నువ్వు సాధించగలవని నాతో చెప్పారు" అని ఆలియా చెప్పారు.

"అయితే ఇప్పుడు నువ్వు స్కూలుకు వెళ్లలేవు కాబట్టి పెళ్లి చేసుకోవడమే ఉత్తమమ మార్గం అని వాళ్లు చెబుతున్నారు. నేనిప్పుడు స్కూలు, యూనివర్సిటీకి వెళ్లలేను. ఉద్యోగం చేయలేను" అన్నారామె.

ఆలియాకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. వాటిలో ఏదో ఒకదాన్ని ఒప్పుకోవాల్సి వస్తుందని, తనకు పుట్టింట్లో లభిస్తున్నంత స్వేచ్ఛ అత్తారింట్లో ఉంటుందో లేదోనని ఆమె ఆందోళన చెందుతున్నారు.

"కొన్ని కుటుంబాల్లో కట్టుబాట్లు తీవ్రంగా ఉంటాయి. వాళ్లు నా ఆశల్ని అణచివేసే అవకాశం ఉంది. పెళ్లి నాకసలు సానుకూలంగా అనిపించడం లేదు" అని ఆలియా చెప్పారు.

‘‘నా కుటుంబం పెళ్లి చేసుకోవాలని నన్ను బలవంత పెట్టకపోతే నేను వేచి చూస్తాను. నా చివరి శ్వాస వరకు పోరాడతాను" అని ఆలియా అంటున్నప్పటికీ అలాంటి పోరాటం చేయడం చాలా కష్టం.

షామా కథ కూడా అదే

పశ్చిమ కాబూల్‌లోని ఓ మామూలు ఇంట్లో బీబీసీ ప్రతినిధి షామాను కలిశారు.

"తాలిబాన్లు అధికారంలోకి రాకపోతే నేనీపాటికి స్కూలు విద్య పూర్తి చేసి ఉండేదాన్ని. డాక్టర్ కావాలన్న నా కలను నెరవేర్చుకోవడానికి చాలా దగ్గరగా ఉండేదాన్ని. నేను డాక్టర్ కావాలనుకున్నా" అని షామా చెప్పారు.

చదువుకునే అవకాశం లేకపోవడంతో నాలుగేళ్ల క్రితం, ఆమెకు 18ఏళ్లు ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవాలని ఆమె తల్లి కమీలా బలవంతం చేశారు. షామా ఇప్పుడు ఇద్దరు బిడ్డల తల్లి. ఇద్దరూ అమ్మాయిలే.

భద్రత దృష్ట్యా మేము ఆమె, ఆమె కుటుంబ సభ్యుల పేర్లు మార్చాం.

ఆరేళ్ల కిందట భర్త చనిపోవడంతో పిల్లల్ని చదివించేందుకు క్లీనర్‌గా పని చేసిన కమీలాకు మరో దారి లేకపోయింది.

యుక్త వయసులో ఉన్న కూతురికి పెళ్లి వయసులో ఉన్న కూతురు ఒంటరిగా ఉండి అందరి దృష్టిలో పడితే ఇబ్బంది పడాల్సి వస్తుందేమోనని ఆమె భయపడ్డారు

"తాలిబన్ ప్రభుత్వ అధికారులు నీ కూతురికి పెళ్లెందుకు చేయలేదని అడుగుతారేమోనని నేను భయపడ్డాను" అని కమీలా బీబీసీతో చెప్పారు.

"ఆమె చదువుకోవాలని అనుకున్నాను. ఉద్యోగం చేసి సమాజానికి ఉపయోగపడాలని కోరుకున్నారు. నాకు చదువు లేదు. అయితే నా కూతురు చదువుకోవాలనున్నాను. షామాకు చాలా ఆశలు ఉన్నాయి. అయితే అవేవీ నెరవేరలేదు" అని కమీలా అన్నారు.

తాలిబన్ ప్రభుత్వం బాలికల విద్యపై విధించిన నిషేధం లక్షల మంది అమ్మాయిల జీవితాలపై కోలుకోలేని ప్రభావం చూపింది.

నోరాలోనూ అదే భయం

ఇది 2030 వరకు కొనసాగితే "ప్రపంచంలో అత్యల్ప మహిళల అక్షరాస్యత ఉన్న దేశాల్లో ఒకటైన ఆ దేశంలో 20 లక్షలమందికి పైగా బాలికలు విద్యకు దూరమవుతారు" అని ఐక్యరాజ్య సమితి చెబుతోంది.

"పెళ్లి చేసుకోవడం, భర్తతో కాపురం చేయడం ఒక్కటే అమ్మాయిల కల కాదు" అని షామా అంటారు.

తాలిబాన్లు అధికారం చేపట్టక ముందు అనేక పెళ్లి ప్రతిపాదనలు వచ్చాయి. అయితే వాటన్నింటినీ ఆమె తిరస్కరించారు.

ఇప్పుడు తాను ఒత్తిడిని అనుభవిస్తున్నానని, మహిళా పాత్రలు ఉద్యోగం చేస్తున్నట్లు లేదా చదువుకుంటున్నట్లు చూపించే సినిమాలు చూసినా ఆ ఒత్తిడి పెరుగుతోందని ఆమె చెప్పారు.

భర్త ఆమెను బాగానే చూసుకుంటున్నారు. అయితే తన సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం తనకు దక్కలేదనే బాధ తరచుగా ఆమెను వేధిస్తోంది.

"ఇది చాలా కష్టంగా ఉంది. ఇంట్లోనే బందీ అయినట్లుగా ఉంది. నేనిప్పుడు నా పిల్లల కోసమే జీవిస్తున్నాను" అని షామా చెప్పారు.

ఆమె 18 ఏళ్ల సోదరి నోరా తన అక్కకు ఎదురైన పరిస్థితే తనకు కూడా వస్తుందని భయపడుతున్నారు.

"నా వయసు చాలా తక్కువ. పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు. చదువుకోవాలనుకుంటున్నాను. బయటకు వెళ్లాలంటే అధికారులను చూసి భయమేస్తోంది. ఇంట్లో ఉంటే అమ్మ పెళ్లి చేసుకో అంటోంది" అని నోరా చెప్పారు.

తాలిబాన్లు అధికారంలో ఉన్నంత కాలం, తాను స్కూలుకు వెళ్లి చదువుకుంటాననే నమ్మకం ఆమెకు కలగడం లేదు.

సమాధానాలు దాటవేస్తున్న ప్రభుత్వం

2021లో స్కూళ్లలో బాలికల ప్రవేశంపై నిషేధాన్ని ఎప్పుడు తొలగిస్తారని అడిగినప్పుడల్లా తాలిబాన్ ప్రభుత్వం రకరకాల కారణాలు చెబుతోంది. ఇప్పుడు అసలు మౌనంగా ఉంటోంది.

2021 సెప్టెంబర్‌లో తాలిబాన్లు అధికారం దక్కించుకున్న తర్వాత తాలిబాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధితో బీబీసీ జరిపిన ఇంటర్వ్యూలో "బాలికలను స్కూళ్లలోకి ఎప్పుడు అనుమతిస్తారు" అని ప్రశ్నించింది.

ఈ ప్రశ్నకు స్పందించిన తాలిబాన్ల అధికార ప్రతినిధి, బాలికల పాఠశాలలు తెరుస్తామని భద్రతను మెరుగు పరిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

ఏడాది తర్వాత ఈ ప్రశ్నకు సమాధానం మారింది. "బాలికల భద్రత విషయంలో మత పండితులకు అభ్యంతరాలు ఉన్నాయి" అని ఆయన చెప్పారు.

2024లో తాలిబన్ ప్రభుత్వ ఉప అధికార ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రాత్ బీబీసీ ప్రతినిధితో మాట్లాడుతూ "అధ్యక్షుడి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం" అని చెప్పారు.

2026 మేలో బీబీసీ ప్రతినిధి మరోసారి ఫిత్రాత్‌ను కలిశారు. ఆయన తన ముందు ఒక మహిళ కూర్చుని ఉండగా వీడియో చిత్రీకరించడాన్ని ఇష్టపడలేదు.

బాలికల చదువుపై నిషేధం గురించి బీబీసీ ప్రతినిధి మరోసారి ఆయనను ప్రశ్నించారు.

"ప్రస్తుతం 70 లక్షల మంది అబ్బాయిలు, 50 లక్షల మంది అమ్మాయిలు చదువుకుంటున్నారు. ఆరో తరగతి తర్వాత ఆడపిల్లల చదువుల మీద నిషేధం అనేది వేరే విషయం. మీరు దీని గురించి విద్యాశాఖను అడగండి. వాళ్లు మీకు సంతృప్తికరమైన సమాధానం ఇస్తారనుకుంటా" అని ఫిత్రాత్ చెప్పారు.

అఫ్గానిస్తాన్‌లో తమకు చదువుకునే అవకాశం రాదని బాలికలు, యువతులు ఆందోళన చెందుతున్నారని బీబీసీ ప్రతినిధి గట్టిగా నిలదీయడంతో ఆయన మరోసారి విద్యాశాఖను అడగాలని చెప్పారు.

బీబీసీ ప్రతినిధి విద్యాశాఖను సంప్రదించారు. వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.

'ప్రపంచం మమ్మల్ని మర్చిపోయింది'

మహిళల విద్య విషయంలో తాలిబన్ ప్రభుత్వంలో విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏళ్లు గడిచే కొద్దీ సర్వోన్నత నాయకుడి వైఖరి మరింత కఠినంగా మారుతోంది.

పాఠశాలలు మూసివేసిన రోజు మహిళలకు, బాలికల మదిలో ఇప్పటికీ స్పష్టంగా ఉంది.

"రేయింబవళ్లు ఏడుస్తూనే ఉన్నాను. వారంరోజులు నిద్ర పట్టలేదు. శవంలా తిరుగుతున్నట్లు అనిపించింది" అని ఆలియా చెప్పారు.

తాలిబన్ సర్వోన్నత నాయకుడు విధించిన అనేక ఇతర ఆంక్షలను మహిళలు ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల వీటిని కఠినంగా అమలు చేస్తుంటే.. మరికొన్ని చోట్ల వారికి కొంచెం ఎక్కువ స్వేచ్ఛ ఉంది.

ఈ ఆదేశాలు ప్రజలలో భయాన్ని రేకెత్తిస్తున్నాయి. ప్రభుత్వ కఠిన చర్యల వల్ల రోజువారీ ప్రజా జీవితంలో మహిళలు దాదాపుగా కనిపించడం లేదు.

ఫిత్రాత్ తమ ప్రభుత్వాన్ని సమర్థించుకున్నారు. "మహిళలు వ్యాపారాలు చేసుకునేందుకు వేల సంఖ్యలో అనుమతులిచ్చాం. ఇది వారికి సానుకూలమే కదా" అని ఆయన అన్నారు.

మహిళలకు ఆస్తిలో వారసత్వంగా అందాల్సిన వాటాకు సంబంధించి పాపపుణ్యాల విభాగం 2వేలకు పైగా కేసులను పరిష్కరించిందని, 2500 మంది మైనర్ల బలవంతపు వివాహాలను ఆపిందని ఫిత్రాత్ చెప్పారు.

అయితే బాల్య వివాహాలకు చట్టపరమైన ఆమోదాన్ని సూచించే నిబంధనల గురించి తాలిబాన్ ప్రభుత్వం గతవారంలో కొత్త నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం మైనర్ బాలిక మౌనాన్ని వివాహానికి అంగీకారంగా పరిగణించవచ్చు.

బాలికలకు చదువు నిరాకరించడంతో బాల్య వివాహాలు, బలవంతపు పెళ్లిళ్లు పెరుగుతున్నాయి.

ఈ ప్రపంచం తమను వదిలేసిందని అఫ్గానిస్తాన్ బాలికలు, యువతులు భావిస్తున్నారు.

"మమ్మల్ని మర్చిపోకపోయి ఉంటే ఇప్పటికి కచ్చితంగా ఏదో ఒకటి చేసి ఉండేవారు" అని ఆలియా చెప్పారు.

"మనం అఫ్గానిస్తాన్‌లో ఎందుకు పుట్టామా అని తరచుగా ఆలోచిస్తుంటాను" అని నోరా అన్నారు.

"మీ కుమార్తెలు చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి అవకాశం ఉన్న ప్రపంచంలో వారిని అలా చేయనివ్వండి. వారిని స్వతంత్రులుగా ఎదగనివ్వండి" అని నోరా, షామా తల్లి కమీలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తల్లులకు సందేశం ఇచ్చారు. ఆమె ఇంకో మాట కూడా అన్నారు.

"ఇక్కడ అఫ్గానిస్తాన్‌లో మా పనైపోయింది" అని.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)