You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల చుట్టూ ఇంత వివాదం ఎందుకు? పవన్ కల్యాణ్ ఏమన్నారు?
- రచయిత, కమలాదేవి నల్లపనేని
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
గడిచిన కొన్నిరోజులుగా ఏపీ రాజకీయాల్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ హాట్‌టాపిక్‌గా మారారు.
జనసేన, పవన్ కల్యాణ్‌లను ఉద్దేశించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం, వాటిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్, తర్వాత ఆ వ్యాఖ్యలను నాగేశ్వర్ ఉపసంహరించుకోవడం చర్చనీయాంశమయ్యాయి.
తర్వాత ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి.
పలు పార్టీల నేతలు, ప్రముఖులు ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు మద్దతుగా నిలిచారు. మరోవైపు ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేరుగా స్పందించారు. నాగేశ్వర్ అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
మొత్తంగా అసలు ఈ వ్యవహారం ఎక్కడ మొదలై, ఎలా సాగిందో, తన వ్యాఖ్యలు, వాటి ఉపసంహరణ, తర్వాతి పరిణామాలపై ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏమంటున్నారో తెలుసుకుందాం.
జగన్‌ను అరెస్టు చేయాలని అమిత్ షాను పవన్ కల్యాణ్ కోరారని, దానికి అమిత్ షా ఒప్పుకోలేదని, జగన్ పర్మినెంట్ ఫ్రెండ్, చంద్రబాబు నాయుడు ఇన్‌స్టంట్ ఫ్రెండ్ అని పవన్‌తో అమిత్ షా చెప్పారని, ఆ సమాచారం తనకు ఉందని ప్రొఫెసర్ నాగేశ్వర్ మే 19న ఓ టీవీ చానల్‌లో వ్యాఖ్యానించారు.
''జనసేన నాయకులు పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, ఇతరులు కలిసి అమిత్ షా దగ్గరకు వెళ్లారు. నాకున్న అత్యున్నత సోర్స్ అందించిన సమాచారం ప్రకారం ఈ మాటలు చెబుతున్నా. జగన్‌ను లోపలెయ్యాలి, మా వాళ్లు ఒత్తిడి తెస్తున్నారు అని అమిత్ షాను అడిగారు’’ అని నాగేశ్వర్ అన్నారు.
‘‘రాజకీయాల్లో ఇన్‌స్టంట్ ఫ్రెండ్ ఉంటారు. లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉంటారు. తెలుగుదేశం ఇన్‌స్టంట్ ఫ్రెండ్, వై.ఎస్. జగన్ లాంగ్ టర్మ్‌ఫ్రెండ్. చంద్రబాబు నాయుడుకు ఆయనంటే శత్రుత్వం ఉండొచ్చు. మనకెందుకు ఉండాలి? మీక్కూడా మంచి చెబుతున్నా. మీకు అవసరమేంటి? లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉపయోగపడతారు. మనకు 25మంది ఎంపీలు సాయపడుతున్నారు కదా..మీరు కూడా ఆ వైఖరి మార్చుకోండి’’ అని అమిత్ షా చెప్పినట్టు నాగేశ్వర్ తెలిపారు.
వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని జనసేన డిమాండ్
ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారం సృష్టించాయి. ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. టీడీపీ, జనసేనకు చెందిన సోషల్ మీడియాల్లో నాగేశ్వర్‌కు వైసీపీతో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ ప్రచారం సాగింది.
తెలుగుదేశం పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాలో ప్రొఫెసర్ నాగేశ్వర్ మెడలో వైసీపీ కండువా కప్పిన ఫోటో పోస్టయింది. ఆంధ్రప్రదేశ్‌లో ఆయనపై మూడు కేసులు నమోదయ్యాయి.
నాగేశ్వర్ వ్యాఖ్యలపై జనసేన నేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు స్పందించారు.
ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై తనకు చాలా గౌరవముందని, ఆయన ఎందుకు అలా మాట్లాడారో తెలియదని, ఆ వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తమవని నాదెండ్ల మనోహర్ అన్నారు.
''ఆ సమాచారం సరైంది కాదు. ఆయన ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. ఎప్పుడూ కూడా ఏపీ ప్రజలు బాగుండాలని, కూటమి బలోపేతం చెయ్యాలని పవన్ కల్యాణ్ చూస్తుంటారు. ఇతర పార్టీల గురించి చర్చించాల్సిన అవసరం లేదు. అదెప్పుడూ జరగలేదు. దయచేసి వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి'' అని నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి చేశారు.
ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై ట్రోలింగ్ తనకు బాధ కలిగించిందని నాగబాబు అన్నారు.
''ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటే నాకు చాలా గౌరవం. కానీ ఆయన ప్రవర్తన అలా అనుకునేలా చేసింది. ఆ వ్యాఖ్యలను నాగేశ్వర్ సరిదిద్దుకోవాలి. నాగేశ్వర్ వ్యాఖ్యలు సరిగా లేవని చెప్పేందుకే నేను వీడియో పెట్టా'' అని నాగబాబు అన్నారు.
కుట్రపూరిత ప్రచారాలపై న్యాయపరమైన కేసులు పెడతామని హెచ్చరిస్తూ ఈ నెల 21న జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.
ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు ప్రముఖుల మద్దతు
మరోవైపు ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు కొందరు ప్రముఖుల నుంచి మద్దతు లభించింది.
ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను అరెస్టు చేస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిగా బయటికొస్తారని, దేశమంతా కాక్రోచ్‌లు బయటికి వస్తాయని సీపీఐ నేత నారాయణ హెచ్చరించారు.
ప్రొఫెసర్ నాగేశ్వర్ అధికారం, ప్రతిపక్షంలో ఉన్నవారందరినీ ప్రశ్నించారని, ప్రజల పక్షాన నిలబడ్డారని నటుడు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు.
''నాగేశ్వర్ పై సోషల్ మీడియాలో ఈ స్థాయిలో ట్రోలింగ్ చేయడం ప్రజాస్వామ్యమా, రాజకీయ గూండాయిజమా? నాగేశ్వర్ వ్యాఖ్యలు తప్పనిపిస్తే ఆధారాలు అడగాలి. రాజకీయంగా కౌంటర్ ఇవ్వాలి. అంతేగానీ వ్యక్తిత్వ హననం చేయడం సరికాదు. సోషల్ మీడియాలో అవమానించడం, కేసులతో భయపెట్టడం సరైనది కాదు'' అని ప్రకాశ్ రాజ్ అన్నారు.
‘‘నాదెండ్ల మనోహర్ అడిగారనే ఉపసంహరించుకున్నా’’
సోషల్ మీడియాలో సాగుతున్న ట్రోలింగ్ మధ్య రెండు రోజుల తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు.
‘‘నేను బేషరతుగా, ఎలాంటి భేషజాలకు పోకుండా, శషభిషలు లేకుండా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నా. నాకెవరో తప్పుడు సమాచారమిస్తే నేను చెప్పాను. నేను కొద్దిగా వెరిఫై చేసుకోవాల్సి ఉంది. నాదెండ్ల మనోహర్‌పై గౌరవంతో నేను నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా'' అని చెప్పారు.
''ఇది ప్రజాసమస్య కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలను ప్రభావితం చేసే విషయం కాదు. ఈ చర్చ దారి తప్పింది. అరెస్టుకు భయపడి నేను నా వ్యాఖ్యలను ఉపసంహరించుకోలేదు. అనేక ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు ప్రశ్నించా. ఒక వ్యక్తి ప్రమేయుమన్న సంఘటన గురించి మాట్లాడినప్పుడు, ఆ వ్యక్తి చాలా గౌరవంగా వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని కోరారు. దాని వల్ల ప్రభావమవుతున్న వ్యక్తి అడిగారు. అందుకే ఉపసంహరించుకున్నా. జన సైనికుల పేరుతో నాపై ట్రోలింగ్ చేస్తున్నవాళ్లంతా జనసైనికులు కాదు. 21మంది ఎమ్మెల్యేలున్నపార్టీ తరఫున నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి చేయడం వల్లే నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నా. పవన్ కల్యాణ్ అంటే నాకు చాలా గౌరవం. మా ఇంట్లో పెళ్లికి కూడా పవన్ వచ్చారు'' అని తన యూట్యూబ్ చానల్‌లో నాగేశ్వర్ తెలిపారు.
‘న్యాయవ్యవస్థపై నమ్మకముంది’
జనసేన నేతల విషయంలో తన వ్యాఖ్యలు, తనపై జరిగిన ట్రోలింగ్, తర్వాతి పరిణామాలపై ప్రొఫెసర్ నాగేశ్వర్ బీబీసీతో మాట్లాడారు.
అరెస్టుకు భయపడి వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నాననడం సరైనది కాదని, చర్చ పక్కదోవపడుతోందనే వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నానని స్పష్టంచేశారు. తాను వ్యాఖ్యలు ఉపసంహరించుకున్న తర్వాత తనపై కేసులు నమోదయ్యాయని ఆయన అన్నారు.
''నాకు వైసీపీ కండువా కప్పి టీడీపీ సోషల్ మీడియాలో పెట్టడానికి సోర్స్ ఏంటి? నేను హుందాగా వ్యవహరించినప్పుడు టీడీపీ, జనసేన కూడా హుందాగా వ్యవహరించాలి. పేటీఎం వంటి పరువునష్టం మాటలు మాట్లాడడానికి సోర్స్ ఏంటి? వ్యక్తిగతంగా నన్ను అమానవీయ భాషలో, నీచాతినీచంగా ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్లనేమనాలో సమాజానికే వదిలేస్తున్నా. జనసేన పార్టీ విజ్ఞప్తిని నేను గౌరవించాగానీ ఈ విషయాన్ని ఇంతటితో ముగించాలన్నఆ పార్టీ నిర్ణయాన్ని కార్యకర్తలు, కూటమి నేతలు, టీడీపీ కార్యకర్తలు గౌరవించడం లేదు'' అని ఆయన అన్నారు.
కేసు నమోదైన తర్వాత రోజే తనను అరెస్టు చేస్తారని తనకు సమాచారమొచ్చిందని ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలిపారు. అరెస్టు చేస్తే చేసుకోవచ్చని తన యూట్యూబ్ చానెల్‌లో ఆయన స్పష్టం చేశారు.
పవన్ కల్యాణ్ ఏమన్నారంటే...
ప్రొఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు చెప్పిన తర్వాత జనసేన స్పందించింది.
నాగేశ్వర్ ప్రకటనను స్వాగతిస్తున్నామని ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
''సీనియర్ ఎనలిస్ట్‌గా, మాజీ ఎమ్మెల్సీగా, ప్రొఫెసర్‌గా మీకున్న అనుభవం, మీరు చేసే విశ్లేషణలపై మాకు గౌరవం ఉంది. ఇలాంటి అవాస్తవ వార్తలు భవిష్యత్తులో మీ దృష్టికి వచ్చినప్పుడు దయచేసి జనసేన కార్యాలయాన్ని సంప్రదిస్తే సరైన సమాచారం అందిస్తాం. ఊహాజనిత, ఆధారరహిత కథనాలను భవిష్యత్తులో ప్రస్తావించరని ఆశిస్తున్నాం. అలాగే జనసైనికులు, కూటమి నేతలు, కార్యకర్తలు ఈ అంశాన్ని ఇక్కడితో ముగించాలని, సోషల్ మీడియాలో దీనిపై ఎలాంటి పోస్టులు లేదా వ్యాఖ్యలు చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం'' అని పోస్ట్ చేసింది.
ఇటు నాగేశ్వర్ వ్యాఖ్యలపై వైసీపీ అధినేత జగన్ ఓ ప్రెస్‌మీట్‌లో స్పందించారు.
ప్రొఫెసర్ నాగేశ్వర్ తానుచూసిన, తనకున్న అనుభవాలతో చెబుతున్నారని జగన్ వ్యాఖ్యానించారు.
''ప్రొఫెసర్ నాగేశ్వర్ చంద్రబాబు, జగన్ పరిపాలనను చూశారు. ప్రజలంతా ఇవన్నీ చూశారు. ఎవరి నోటినుంచైనా ఇలాంటి మాటలే వస్తాయి'' అని జగన్ అన్నారు.
ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై కేసులు నమోదు చేయడాన్ని జగన్ ఖండించారు.
‘‘మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తున్న గౌరవప్రదమైన వ్యక్తులపై కేసులు పెట్టించి బెదిరింపులకు దిగుతారా? ఆయన అన్ని పార్టీల మీద విమర్శలు, అన్నివార్తాంశాల మీద విశ్లేషణలు చేస్తారు కదా..ఆయన నిజం మాట్లాడితే కేసులా..ప్రశ్నిస్తే అరెస్టులా’’ అని జగన్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై కేసులు పెట్టి వేధించడం కూటమి ప్రభుత్వానికి తగదని ఏపీ కాంగ్రెస్ నాయకురాలు షర్మిల అన్నారు. కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
మరోవైపు ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు బీజేపీ నేత మురళీధర్ రావు మద్దతు పలికారు. రాజకీయ విశ్లేషకునిగా విస్తృత గౌరవాన్ని పొందిన ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై కేసు నమోదు చేయడం సరైన సందేశాన్నివ్వదని అన్నారు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛపై ఇది ఆందోళన పెంచుతుందని హెచ్చరించారు.
ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై కేసులు వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు డిమాండ్ చేశారు.
అయితే, ప్రొఫెసర్ నాగేశ్వర్ అలాంటి నిరాధారమైన వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు గాలి నాగరాజు అభిప్రాయపడ్డారు.
అదే సమయంలో స్వతంత్ర అభిప్రాయం వ్యక్తంచేసే పరిస్థితి ఏపీలో లేకపోవడం బాధాకరమని ఆయన బీబీసీతో అన్నారు.
‘‘వ్యతిరేక వ్యాఖ్యలు చేసేవారిని నియంత్రణలో ఉంచాలని చూడడం జగన్ ప్రభుత్వంలో కూడా ఉండేది. అది ఇప్పుడు తీవ్రస్థాయికి చేరింది’’ అని ఆయన అన్నారు.
‘‘ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను అరెస్టు చేయడం ద్వారా తమపై విమర్శలు చేసేవారికి గట్టి సందేశం పంపించాలని టీడీపీ అగ్రనేతలు భావిస్తున్నారు. ఇది భావ ప్రకటనాస్వేచ్ఛను అడ్డుకోవడమే. పౌరసమాజానికి ఇది మంచిది కాదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ఈ వివాదాన్ని ఇంతటితో ముగించడం మంచిది’’ అని ఆయన సూచించారు.
మరోవైపు నాగేశ్వర్ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ నేరుగా స్పందించారు. రాజమహేంద్రవరం జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన ‘‘విశ్వసనీయత ఉన్న వ్యక్తులు ఇలాంటి మాటలు మాట్లాడడం సరికాదు. అమిత్ షా స్థాయిలాంటి వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధ కలిగించింది. అమిత్ షా గురించి మాట్లాడితే ఏపీ బీజేపీ నేతలు స్పందించకుండా ఉండడం సరికాదు’’ అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.