You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సూర్యవంశీ బౌండరీల తుపానును తట్టుకుని ఫైనల్ తీరం చేరిన ‘గుజరాత్ టైటాని’క్
ఐపీఎల్-2026 క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో తన మెరుపు బ్యాటింగ్‌తో వైభవ్ సూర్యవంశీ అనేక రికార్డులను బద్దలు కొట్టాడు.
న్యూ చండీగఢ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ 47 బంతుల్లోనే 96 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 7 సిక్సర్లు, 8 ఫోర్లు కొట్టాడు. వైభవ్ విధ్వంసకర బ్యాటింగ్ కారణంగా రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు శుభారంభం దక్కలేదు. మొదటి ఓవర్లోనే యశస్వి జైస్వాల్, రెండో ఓవర్‌లో ధ్రువ్ జురెల్ అవుటయ్యారు.
వైభవ్, రవీంద్ర జడేజాలు కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. దూకుడుగా ఆడిన వైభవ్, రబడ బౌలింగ్‌లో అవుటయ్యాడు. వైభవ్ ఆటతీరుపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఒక ట్వీట్ చేశారు.
''15 ఏళ్ల వైభవ్‌ను నిలువరించడానికి బాడీ లైన్ బౌలింగ్ (శరీరాన్ని లక్ష్యంగా చేసుకుని బౌలింగ్ చేయడం) చేయడం సరైనదిగా అనిపించలేదు. అతను పెద్ద ఆటగాళ్లతో ఆడుతున్నాడని నాకు తెలుసు. కానీ, ఒక తండ్రిగా దీన్ని నేను అంగీకరించలేకపోతున్నా'' అని ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
నిజానికి రబడ వేసిన ఆ బంతి బౌన్సర్ కాగా, ప్రసిద్ధ్ కృష్ణ క్యాచ్‌గా అందుకున్నాడు.
'బహుశా టోర్నీలోనే అత్యుత్తమ షాట్ కావొచ్చు'
వైభవ్ కొట్టిన ఒక సిక్సర్‌ను ఉద్దేశించి కామెంటేటర్ హర్షా భోగ్లే ఎక్స్‌లో ఒక ట్వీట్ చేశారు.
''రబడ గంటకు 153 కి.మీ. వేగంతో సంధించిన ఒక బంతిని వైభవ్ సూర్యవంశీ స్ట్రయిట్ సిక్సర్‌గా మలిచిన తీరు బహుశా ఈ టోర్నీలోనే అత్యుత్తమ షాట్ కావొచ్చు. ఆ బంతి 91 మీటర్ల దూరం వెళ్లింది. వైభవ్ ఆడుతున్నప్పడు ఒక్క నిమిషం కూడా నా చూపును పక్కకు తిప్పుకోలేకపోతున్నాను'' అని భోగ్లే ట్వీట్‌లో రాశారు.
వైభవ్ బ్యాటింగ్‌ను చూస్తుంటే అతను ఇంత చిన్నపిల్లాడని నమ్మడం కష్టంగా ఉందని భారత మరో మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ఎక్స్‌లో రాశారు.
''అతని ఓపిక, షాట్ల ఎంపిక, ఆటను అర్థం చేసుకునే తీరు అద్భుతం. అదరగొట్టావు యంగ్ మ్యాన్'' అని శిఖర్ అభినందించారు.
వైభవ్‌లో వయస్సుకు మించిన పరిణితి కనిపిస్తోందంటూ ఆకాశ్ చోప్రా ట్వీట్ చేశారు.
''అద్భుతమైన ఆటగాడు. హోల్డర్ బౌలింగ్‌లో వైభవ్ బ్యాటింగ్ చేసిన తీరు నమ్మశక్యంగా లేదు'' అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నారు.
వైభవ్ రికార్డులు
క్వాలిఫయర్-2 మ్యాచ్ ఇన్నింగ్స్‌తో, ఒక టీ20 టోర్నీలో పవర్‌ప్లేలోనే 500 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా వైభవ్ రికార్డు సృష్టించాడు.
అలాగే, ఒక ఐపీఎల్ సీజన్‌లో 700 పరుగులు చేసిన మొదటి అన్‌క్యాప్డ్ (భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించని) బ్యాట్స్‌మన్‌గా కూడా వైభవ్ నిలిచాడు.
గత బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో పదేళ్లకు పైగా క్రిస్ గేల్ పేరిట ఉన్న ఒక రికార్డును బద్దలు కొట్టాడు. ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్స్‌లు (59) కొట్టిన రికార్డు గేల్ పేరిట ఉండేది. గేల్‌ను వెనక్కి నెట్టి 72 సిక్సర్లతో వైభవ్ ఈ రికార్డును తన పేర రాసుకున్నాడు.
ఈ సీజన్ ఐపీఎల్‌లో వైభవ్ మొత్తం 16 మ్యాచ్‌ల్లో 63 ఫోర్లు, 72 సిక్సర్లతో 776 పరుగులు చేశాడు. ఇందులో 5 అర్ధసెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి.
హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఆ జట్టు కెప్టెన్, ప్రపంచ అత్యుత్తమ బౌలర్లలో ఒకరిగా పేరున్న పాట్ కమిన్స్ వేసిన ఒక ఓవర్లో వైభవ్ సూర్యవంశీ ఒక ఫోర్, ఆ తర్వాత వరుసగా మూడు సిక్సర్లు సాధించాడు. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో 97 పరుగులు చేసి కొద్దిలో సెంచరీ మిస్సయ్యాడు.
''వైభవ్‌కు తనపై తనకు నమ్మకం ఎక్కువ. 'నేను ఇది చేయలేను' అనే సందేహానికి కూడా అతని మనస్సులో చోటుండదు'' అని మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు ధ్రువ్ జురెల్ అన్నాడు.
'నేను బౌలర్లను చూడను, బంతినే చూస్తాను'
గత సీజన్ ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 38 బంతుల్లో 101 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ... పురుషుల టీ20ల్లో అతి చిన్న వయస్సులో (14 ఏళ్లు) సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు.
''నేను బౌలర్లను చూడను. కేవలం బంతిని మాత్రమే చూసి ఆడతాను'' అని ఈ ఇన్నింగ్స్ తర్వాత వైభవ్ అన్నాడు.
వైభవ్ సెంచరీ చేసిన తీరును భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ అభినందించారు.
''భయం లేని వైఖరి, బ్యాట్‌ను కదిపే విధానం, బంతి లెంగ్త్‌ను త్వరగా అంచనా వేయడం, పూర్తి బలంతో బంతిని బాదడమే ఈ ఇన్నింగ్స్ విజయ రహస్యం'' అని సచిన్ సోషల్ మీడియా వేదికగా ప్రశంసించారు.
''వైభవ్ ఆటతీరే వేరు. అతనిలో ఎలాంటి భయం లేదు. సహజంగా ఆడుతున్నాడు. రాహుల్ ద్రవిడ్, చతేశ్వర్ పుజారాలకు 'ఓపిక' అనేది ఎలాగైతే పుట్టుకతో వచ్చిందో, వైభవ్ సూర్యవంశీలో దూకుడైన ఆటతీరు కూడా అంతే సహజంగా అబ్బింది. ఇలాంటి ప్రతిభ ఉన్నవారికి ప్రత్యేకంగా నేర్పించాల్సిన అవసరం లేదు. అది వారిలో సహజంగానే ఉంటుంది'' అని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ అకాడమీ డైరెక్టర్ హితేష్ మజుందార్ అన్నారు.
''వైభవ్ ఎనిమిదేళ్ల వయసులో నా దగ్గరకు వచ్చాడు. చిన్నప్పటి నుంచే ఇలా భయం లేకుండానే ఆడుతున్నాడు. ఒకసారి 'నువ్వు సింగిల్స్ కూడా తీస్తూ ఉండాలి' అని వైభవ్‌తో అన్నాను. 'నేను సిక్స్ కొట్టగలిగినప్పుడు ఒకట్రెండు పరుగులు చేయడం ఎందుకు?' అని ఎదురు ప్రశ్నించాడు. ఒక పదకొండేళ్ల పిల్లాడు ఇలా మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరేం చెప్పగలరు. అప్పటినుంచి ఇక సింగిల్స్ తీయమని నేనెప్పుడూ వైభవ్‌కు చెప్పలేదు' అని వైభవ్ చిన్ననాటి కోచ్ మనీష్ ఓఝా వివరించారు.
అద్భుతమైన ఫుట్‌వర్క్
సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై వైభవ్ 29 బంతుల్లో 97 పరుగులు చేశారు. అందులో 12 సిక్సర్లు ఉన్నాయి. మైదానం నలుమూలలా బంతి పరుగులు పెట్టింది.
ఈ ఇన్నింగ్స్ గురించి కూడా సచిన్ ప్రశంసించారు.
''వైభవ్ బ్యాట్ స్వింగ్ అద్భుతం. అలాగే, బంతి తన కాళ్ల వైపు వస్తున్నప్పుడు ముందు కాలును చక్కగా కదుపుతాడు. ఇలా చేయడం వల్ల ఓపెన్ షాట్లు ఆడేందుకు, సులభంగా సిక్సర్లు కొట్టేందుకు వీలవుతుంది' అని సచిన్ ఎక్స్‌లో రాశారు.
వైభవ్ తన మణికట్టును అద్భుతంగా ఉపయోగిస్తూ బ్యాట్‌తో విరుచుకుపడతాడని ఆకాశ్ చోప్రా అభినందించారు.
వైభవ్ ప్రత్యేకతలివే..
ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ ఆరోన్ ఫించ్, వైభవ్ ఆటతీరు గురించి ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడారు.
''వైభవ్ తన చేతులను పైకి ఉంచుతాడు. బ్యాట్ పైభాగం గాల్లో ఉంటుంది. దీనివల్ల బ్యాట్ బరువు తగ్గినట్లు అనిపిస్తుంది. బ్యాట్‌ను ప్రత్యేకంగా పైకి లేపాల్సిన అవసరం ఉండదు. అప్పుడు బ్యాట్‌ను స్వేచ్ఛగా తిప్పే అవకాశం దొరుకుతుంది. వైభవ్ తన తలను ఎటూ కదలకుండా, వంచకుండా స్థిరంగా ఉంచుతాడు. తన చేతులను పైకే ఉంచుతాడు.
మామూలుగా ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌లకు నడుము దగ్గర ఒక బ్లైండ్ స్పాట్ ఉంటుంది. కానీ, వైభవ్ విషయంలో అలాంటిది ఉండదు. ఎందుకంటే అతను తన తలను స్థిరంగా ఉంచుతాడు'' అని ఫించ్ విశ్లేషించాడు.
వైభవ్ సూర్యవంశీలో ఉన్న మరో ప్రత్యేకత అతను బ్యాట్‌ను పట్టుకునే విధానం. చాలా మంది క్రికెటర్లు బ్యాట్‌ను 'V' ఆకారంలో పట్టుకుంటారు. కానీ, వైభవ్ బ్యాట్‌ను 'O' ఆకారంలో పట్టుకుంటాడు. క్రికెట్ పరిభాషలో దీన్ని ''బాటమ్-హ్యాండ్ డామినెంట్ గ్రిప్'' లేదా ''రౌండ్ గ్రిప్'' అని పిలుస్తారు. ఇలాంటి గ్రిప్‌తో లాఫ్టెడ్ షాట్లు ఆడటానికి మరింత పట్టు దొరుకుతుంది.
రాజస్థాన్ ఓటమి, ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్‌పై 7 వికెట్ల తేడాతో గెలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఫైనల్ బెర్తును సంపాదించింది. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో వైభవ్‌తో పాటు జడేజా (45) రాణించాడు. 215 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ జట్టు 18.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
కెప్టెన్ గిల్ సెంచరీతో చెలరేగాడు. అతను 53 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 104 పరుగులు చేశాడు.
సాయి సుదర్శన్ మళ్లీ హిట్ వికెట్
గిల్‌తో పాటు సాయి సుదర్శన్ 32 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 58 పరుగులు చేశాడు. అయితే, దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్‌లోనూ సుదర్శన్ హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు.
క్వాలిఫయర్-1లో కూడా సుదర్శన్ హిట్ వికెట్ అయ్యాడు. ఆ మ్యాచ్‌లో జాకబ్ డఫీ బౌలింగ్‌లో వెనుదిరిగిన సుదర్శన్.. క్వాలిఫయర్ 2లో బ్రిజేశ్ శర్మ వేసిన బంతిని డ్రైవ్ ఆడి బ్యాటుపై నియంత్రణ కోల్పోయాడు.
గత మ్యాచ్‌లో బ్యాట్ నేలమీద పడి తర్వాత స్టంప్స్‌ను తాకగా, ఈసారి నేరుగా వికెట్ల మీదే పడింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ రూపంలో అవుట్ అయిన తొలి బ్యాటర్‌గా సుదర్శన్ నిలిచాడు.
గుజరాత్ టైటాన్స్ vs రాజస్థాన్ రాయల్స్ స్కోర్ కార్డ్
రాజస్థాన్ రాయల్స్: 214/6
యశస్వీ జైస్వాల్ 1, వైభవ్ సూర్యవంశీ 96, ధ్రువ్ జురెల్ 7, రవీంద్ర జడేజా 45 నాటౌట్, రియాన్ పరాగ్ 11, దసున్ షనక 3, జోఫ్రా ఆర్చర్ 7, ఫెరీరా 38 నాటౌట్; బౌలింగ్: మొహమ్మద్ సిరాజ్ 4-0-42-1, కగిసో రబడ 4-0-35-2, ప్రసిధ్ కృష్ణ 4-0-42-1, వాషింగ్టన్ సుందర్ 2-0-23-0, జేసన్ హోల్డర్ 4-0-27, రషీద్ ఖాన్ 2-0-45-0.
గుజరాత్ టైటాన్స్: 219/3
సాయి సుదర్శన్ 58, గిల్ 104, జోస్ బట్లర్ 9, సుందర్ 16, రాహుల్ తేవటియా 17; బౌలింగ్: జోఫ్రా ఆర్చర్ 4-0-45-1, బర్గర్ 4-0-35-1, బ్రిజేశ్ శర్మ 3.4-0-44-1, తుషార్ దేశ్‌పాండే 3-0-34-0, యశ్‌రాజ్ పుంజా 2-0-29-0, జడేజా 2-0-28-0.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.