విమానం టేకాఫ్‌ అయిన క్షణాల్లోనే 'ఎవరినో ఢీకొట్టాం’ అంటూ పైలట్ ఫోన్.. ఆ తర్వాత ఏం జరిగింది?

ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్

ఫొటో సోర్స్, Al Drago/Getty Images

    • రచయిత, గ్రేస్ ఎలిజా గుడ్‌విన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 4 నిమిషాలు

డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో (డీఐఏలో) శుక్రవారం రాత్రి ఫెన్సింగ్ మీద నుంచి దూకి రన్‌వేపైకి వచ్చిన ఒక వ్యక్తిని ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ విమానం ఢీకొట్టింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు రికార్డు అయిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) ఆడియో బయటికి వచ్చింది.

ఆ ఆడియోలో.. ఫ్లైట్ 4345 టేకాఫ్‌ను నిలిపివేసిన తర్వాత కంట్రోల్ టవర్‌తో మాట్లాడిన పైలట్.. ''మేం ఇప్పుడే ఎవరినో ఢీకొన్నాం. ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి'' అని తెలిపారు.

ఎయిర్‌బస్ ఏ321 క్యాబిన్ లో పొగలు వచ్చాయి. కానీ, డెన్వర్ అగ్నిమాపక విభాగపు సిబ్బంది వెంటనే ఆ మంటలను ఆర్పివేశారు.

ముందు జాగ్రత్తగా విమానంలోని 224 మంది ప్రయాణికులను గాలితో నింపిన ఎమర్జెన్సీ స్లైడ్‌ల ద్వారా సురక్షితంగా కిందకి తీసుకొచ్చినట్లు ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ పేర్కొంది.

''ఈ ఘటన మమ్మల్ని కలిచివేసింది'' అని ఈ ఎయిర్‌లైన్స్ తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

విమానంలోని పన్నెండు మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయని డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పేర్కొంది.

గాయాలైన వారిలో ఐదుగురిని ఆస్పత్రులకు తరలించినట్లు ఎయిర్‌పోర్టు అథారిటీలు తెలిపాయి. వారి పరిస్థితి ప్రస్తుతం ఇంకా తెలియలేదు.

స్థానిక కాలమానం ప్రకారం రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో (భారత కాలమానం ప్రకారం ఉదయం 10.30కు) లాస్‌ఏంజలెస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లేందుకు ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ విమానం ఒకటి టేకాఫ్ అయినప్పుడు, రన్‌వే మీదకు వచ్చిన ఒక వ్యక్తిని ఢీకొందని అధికారులు తెలిపారు.

ప్రమాదానికి రెండు నిమిషాల ముందు గుర్తు తెలియని ఒక వ్యక్తి రక్షణ కంచె (ఆవరణ కంచెను) పైనుంచి దూకి లోపలకి వచ్చాడని ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ తెలిపింది.

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అప్పుడే ఫ్రాంటియర్ పైలట్‌కు టేకాఫ్ కోసం అనుమతి ఇచ్చి, గుడ్‌నైట్ చెప్పారు.

ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే పైలట్ తిరిగి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్‌కు కాల్ చేసినట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆడియోలో వెల్లడైంది.

''మేం రన్‌వేపై ఆగిపోయాం'' అని టవర్‌కు సమాచారం ఇచ్చారు పైలట్. విమానం ఎవరినో ఢీకొన్నదని తెలిపారు.

''రన్‌వే గుండా ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు'' అని పైలట్ చెప్పారు.

విమానంలో ఏడుగురు సిబ్బందితో సహా 231 మంది ఉన్నారని తెలిపారు.

ఆ సమయంలో విమానం అత్యధిక వేగంతో వెళుతోందని రవాణా కార్యదర్శి షాన్ డఫీ చెప్పారు.

''డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఒక చొరబాటుదారుడు విమానాశ్రయ భద్రత నిబంధనలను ఉల్లంఘించి, కావాలనే రక్షణ కంచెను ఎక్కి దూకి, రన్‌వేపైకి పరిగెత్తాడు'' అని డఫీ తన ప్రకటనలో పేర్కొన్నారు.

''విమానాశ్రయం లోపలికి చొరబడటం నేరం'' అని ఆయన చెప్పారు.

కమర్షియల్ ఎయిర్‌లైనర్లు (వాణిజ్య విమానాలు) గంటకు 240 నుంచి 290 కిలోమీటర్ల మధ్య వేగంతో టేకాఫ్ అవుతుంటాయి.

డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయం

ఫొటో సోర్స్, Brooks Kraft LLC/Sygma via Getty Images

ఫొటో క్యాప్షన్, డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయం కంట్రోల్ టవర్ (ఫైల్ ఫోటో)

ఈ చొరబడిన వ్యక్తి ఎయిర్‌పోర్ట్ సిబ్బంది కాకపోచ్చని డెన్వర్ విమానాశ్రయ అధికారులు చెప్పారు.

''విమానాశ్రయం ఈ రక్షణ కంచెను పరిశీలించింది. దానికెలాంటి ఇబ్బంది కలగలేదు'' అని ఒక ప్రకటనలో డీఐఏ తెలిపింది.

క్యాబిన్ నుంచి పొగ వస్తున్నట్లు ప్రయాణికుల్లో ఒకరు రికార్డు చేసిన వీడియోలు, ఫోటోలలో కనిపించింది.

''ఒక పెద్ద శబ్దం విన్నాను. ఆ తర్వాత కుడివైపు రెక్క మంటల్లో చిక్కుకోవడం, అది పేలిపోతున్నట్లు కనిపించడం నేను చూశాను'' అని ప్రయాణికుడు జోస్ సెర్వాంటెస్ బీబీసీ అమెరికా పార్టనర్ సీబీఎస్‌తో చెప్పారు. ''నేను కూడా కాలిపోయి చనిపోతానని అనిపించింది'' అని ఆయన అన్నారు.

విమానంలోని వారందర్ని హుటాహుటిన ఖాళీ చేయించారు. వారిలో చాలామంది ప్రయాణికులు మరో ఫ్రాంటియర్ విమానంలో డెన్వర్ నుంచి బయలుదేరారని విమానాశ్రయం పేర్కొంది.

ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు ఈ ఘటనపై విచారణ ప్రారంభించడంతో.. ప్రస్తుతానికి రన్‌వేను మూసివేశారు.

‘‘ఈ ఘటన చాలా బాధాకరం. బాధిత కుటుంబాలకు మా సానుభూతి'' అని డీఐఏ తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)