భారత్ నుంచి నేపాల్ ఏం ఆశిస్తోంది, బాలేంద్ర షా దాన్ని సాధించగలరా?

ఫొటో సోర్స్, www.pmindia.gov.in
- రచయిత, స్నేహ
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా (బాలెన్ షా) భారత్‌లో రెండు రోజులపాటు పర్యటించారు.
ఇరుదేశాల మధ్య ఉన్న సంబంధాలను పరిగణనలోకి తీసుకుంటే ఇది తక్కువ సమయంగా అనిపించినప్పటికీ, నిపుణులు ఈ పర్యటనను అత్యంత ముఖ్యమైనదిగా చెబుతున్నారు.
నేపాల్ 'జెన్ జీ ఉద్యమం' తర్వాత ఈ ఏడాది అధికారంలోకి వచ్చిన బాలేంద్ర షా.. తన తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన కోసం భారత్‌కు వచ్చారు. ఆయన ఇంతకుముందు న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు.
నేపాలీ తిరుగుబాటు తర్వాత ఉద్భవించిన రాజకీయ నాయకుల్లో చాలామంది రాజకీయాలే వృత్తిగా ఎదిగినవారు కాకపోవడంతో, షా పర్యటన ప్రాముఖ్యత సంతరించుకుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇరు దేశాలు పరస్పర అవగాహనను పెంపొందించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా కూడా చూస్తున్నారు.
బాలేంద్ర షా తన భారత పర్యటనలో ద్వైపాక్షిక వాణిజ్యం, వాతావరణ మార్పులు, ఎయిర్ కనెక్టివిటీ, పర్యాటకం, ఇంధనం, సరిహద్దు వివాదాల వంటి అంశాలపై చర్చించారు.


ఫొటో సోర్స్, X/S.Jaishankar
బాలేంద్ర షా పర్యటన భారత్‌కు ఎందుకంత ప్రాధాన్యత
కేంద్ర సహాయ మంత్రి జితిన్ ప్రసాద విమానాశ్రయంలో బాలేంద్ర షాకు స్వాగతం పలికారు. సోమవారం బాలేంద్ర షా ప్రధాని మోదీని కలిశారు.
అంతరిక్ష సాంకేతికత, భద్రతా శిక్షణ, ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్య పెంపు, ఆరోగ్యం, సంప్రదాయ వైద్యం, సుస్థిర పట్టణ అభివృద్ధి, వ్యవసాయం తదితర రంగాలకు సంబంధించి ఇరు దేశాలు ఎనిమిది అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి.
హైదరాబాద్ హౌస్‌లో ఇరు దేశాల నేతల మధ్య సమావేశం జరిగిన అనంతరం ఈ ఒప్పందాలు కుదిరాయి.
భారత్, నేపాల్ మధ్య సుమారు 1750 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. ఇది ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్, సిక్కిం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను తాకుతుంది.
ఈ సరిహద్దు ప్రాంతాల్లో చాలా వరకు ఓపెన్ బోర్డర్స్ ఉంటాయి.
''ఈ పర్యటనలో భారత్‌కు అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ముందుగా కొత్త నాయకుడిని అర్థం చేసుకోవడం. ఎందుకంటే ఆయన గురించి మనకు పెద్దగా పరిచయం లేదు. అయితే, గత ఏడెనిమిది నెలల్లో అనేక పర్యటనలు జరిగాయి. రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) అధ్యక్షుడు రవి లామిచానే భారత్‌ను సందర్శించారు. ఆ తర్వాత వారి విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ కూడా భారత్‌కు వచ్చారు. ఈ విధంగా ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఇరు దేశాల ప్రధానమంత్రులు తొలిసారిగా సమావేశమవుతున్నందున, ఈ భేటీకి ఎంతో ప్రాధాన్యత ఉంది" అని నేపాల్‌లో భారత మాజీ రాయబారి రంజిత్ రాయ్ అన్నారు.

ఫొటో సోర్స్, MEA
వాస్తవానికి అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశీ నేతలతో సమావేశం కాకూడదనేది బాలేంద్ర షా విధానంగా ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని నిపుణులు అన్నారు.
ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పెరుగుతున్న ఇంధన ధరలు, ఎరువుల కొరత, నేపాల్‌లోని భోటేకోషిలో ఆకస్మిక వరదలు వంటి అనేక సవాళ్లను షా ఎదుర్కొన్నారు.
షా విదేశీ పర్యటనలకు వెళ్లలేదని, అలాగే విదేశీ నాయకులతో కూడా ఎక్కువగా మాట్లాడ లేదని భారత్‌లో నేపాల్ మాజీ రాయబారి శంకర్ శర్మ అన్నారు.
అయితే, ఈ పర్యటన కోసం ఇరు దేశాలకు చెందిన అధికారులు చాలా కృషి చేశారని చెప్పారు.
''నేపాల్‌లో అంతర్గతంగా ఇతర దేశాలతో సంబంధాలు ఎంతో కీలకమనే భావన ఏర్పడింది. ముఖ్యంగా, భారత్‌తో బలమైన సంబంధాలను కలిగి ఉండటం మరింత అవసరమనే అభిప్రాయం బలపడింది. ఏదేమైనా, ఇరు దేశాల రాయబారులు, నాయకులు సమావేశమైనప్పుడే పరస్పరం మెసేజ్‌లను పంచుకోగలరు. ఈ నేపథ్యంలో నేపాల్‌లో మొత్తం మీద ఒక అనుకూల వాతావరణం ఏర్పడింది. దాని ఫలితంగానే షా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు'' అని శంకర్ శర్మ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
గగనతల సమస్య
రెండు బిలియన్ డాలర్ల అంటే రూ.18,582 కోట్ల గ్రాంట్, లైన్ ఆఫ్ క్రెడిట్ కోసం నేపాల్ చేసిన ప్రతిపాదన విషయంలో భారత్ సానుకూల సంకేతాలను ఇచ్చిందని కాఠ్మాండూ పోస్టు పేర్కొంది. దీనిపై చర్చల విషయంలో ఇరు దేశాలు తుది దశలో ఉన్నాయని తెలిసింది.
వార్తా కథనాల ప్రకారం, భారత్ నుంచి 2 బిలియన్ డాలర్ల గ్రాంట్, రుణ సహాయ ప్యాకేజీని, అలాగే భారత గగనతలం మీదుగా అదనంగా విమాన ప్రవేశ మార్గాన్ని కోరుతోంది.
అధికారుల సమాచారం మేరకు.. ఆర్థిక సహాయ ప్రతిపాదన పట్ల భారత్ సానుకూలత వ్యక్తం చేసింది. అయితే, అదనపు విమాన మార్గం అంశంపై రెండు దేశాల మధ్య ఇంకా ఎటువంటి ఒప్పందం కుదరలేదు.
''అంతకుముందు కూడా ఈ లైన్ ఆఫ్ క్రెడిట్ ఉండేది. ఈ మొత్తం సుమారు రూ.7400 కోట్లు. కానీ, దీన్ని పూర్తిగా ఉపయోగించలేదు. ఈ సౌకర్యాన్ని పొడిగించాలని నేపాల్ కోరుకుంటోంది. కొత్త ఆర్థిక ప్యాకేజీ కింద గ్రాంట్లు, లోన్లు కలుపుకుని 2 బిలియన్ డాలర్లను అందించాలని భావిస్తోంది'' అని శంకర్ శర్మ అన్నారు.
''భోటేకోషి వరదలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. ఈ నష్టం నుంచి బయటపడి పునర్నిర్మాణానికి కూడా ఇది సాయపడనుంది. కానీ, ఈ గ్రాంట్ కేవలం వరదలకు సంబంధించే కాదు. నేపాల్-భారత్ సహకారంతో నిర్మిస్తున్న ఇతర ప్రాజెక్టులను కూడా సాయపడుతుంది'' అని తెలిపారు.
ఇది మాత్రమే కాకుండా.. ఇరు దేశాల మధ్య ఉన్న గగనతల సమస్య కూడా ఉంది. దీనిపై కూడా చర్చలు జరుగుతున్నాయి.
నేపాల్‌లో ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయం దాని రాజధాని కాఠ్మాండ్లో ఉంది. భైరహవా, పోఖారాలలో కొత్త విమానాశ్రయాలను నిర్మించారు.
దేశం లోపల రవాణా అనుసంధానాన్ని మెరుగుపరచడం, విదేశీ పర్యాటకులను ఆకర్షించడం వీటి ప్రధాన ఉద్దేశ్యం.
ఈ విమానాశ్రయాలకు ప్రస్తుతమున్న విమాన ప్రవేశ వ్యవస్థ సమస్యలను సృష్టిస్తోందని నేపాల్ చెబుతోంది. వాస్తవానికి, భారత గగనతలం గుండా నేపాల్‌కు వచ్చే అంతర్జాతీయ విమానాల ప్రవేశ మార్గాల సంఖ్య చాలా పరిమితంగా ఉంది. అందువల్ల, కొన్ని విమానాలు ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తుంది. దానివల్ల వాటి ఖర్చులు కూడా పెరుగుతున్నాయి.
''నిజానికి, ఈ విమానాశ్రయాలలో విమాన కార్యకలాపాలు చాలా తక్కువగా ఉంటాయి. దేశీయ విమానాలు చాలా తక్కువగా నడుస్తాయి. అంతర్జాతీయ విమానాల సంఖ్య ఇంకా తక్కువగా ఉంటుంది. భైరహవా విమానాశ్రయం ఏడీబీ (ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్) నుంచి తీసుకున్న రుణంతో నిర్మించారు. దాని కాంట్రాక్టర్ చైనా వ్యక్తి. మరోవైపు, పోఖారా విమానాశ్రయంలో చైనా పెట్టుబడి పెట్టింది. దాన్ని కూడా ఒక చైనీస్ కంపెనీయే నిర్మించింది" అని దీనిపై మాట్లాడిన రంజిత్ రాయ్ చెప్పారు.
''ఈ విమానాశ్రయాలను సక్సెస్ చేసేందుకు, ఆర్థికంగా నిలకడగా ఉంచేందుకు భారత్ నుంచి అనుమతి అవసరం. ఎందుకంటే, ఇక్కడ్నుంచి, ఇక్కడికి వచ్చే విమానాలు భారత గగనతలాన్ని వాడుకోవాల్సి ఉంటుంది'' అని తెలిపారు.
భైరహవా విమానాశ్రయం నేపాల్‌లోని రూపందేహి జిల్లాలో ఉంది. ఇది ఉత్తరప్రదేశ్‌కు చాలా దగ్గర. గౌతమ బుద్ధుని జన్మస్థలం లుంబిని కూడా ఇక్కడే ఉంది. పోఖారా అనేది నేపాల్‌లో ప్రముఖ పర్యటక ప్రదేశం.
చాలా అంతర్జాతీయ విమానాలు, వాటి గమ్యస్థానం దేశంలోని పశ్చిమ భాగంలో ఉన్నప్పటికీ, నేపాల్‌లోకి ప్రవేశించేటప్పుడు సౌత్ సెంట్రల్ నేపాల్‌లోని సిమ్రా మీదుగానే రావాల్సి ఉంటుంది. దీనివల్ల విమాన ప్రయాణ మార్గాలు సుదీర్ఘంగా మారడమే కాకుండా.. విమాన రాకపోకలపై అదనపు భారం పడుతోంది.
''ఈ రెండు విమానాశ్రయాల నుంచి ఏదైనా విమానం టేకాఫ్ అయితే, అది భారత గగనతలంలోకి ప్రవేశించాలి. ఏదైనా విమానంలో వీటిల్లో దిగాలన్నా.. భారత గగనతలం గుండా రావాల్సి ఉంటుంది. గగనతల అనుమతులను జారీ చేయడం సాంకేతిక, భద్రతా సమస్యతో ముడిపడి ఉంటుంది. అయితే, నేపాల్ అప్పులు తీసుకుని ఈ విమానాశ్రయాలను నిర్మించి, వాటి నిర్వహణ సక్రమంగా లేకపోతే, అవి దేశానికి భారంగా మారతాయి. ఈ సమస్యను నేపాల్ పరిష్కరించుకోవాలి. ఈ విషయంలో భారత్ సాయపడితే బాగుంటుంది. అందుకే దీనికి ఒక పరిష్కారం కనుగొనాలి" అని రంజిత్ రాయ్ చెప్పారు.
"అయితే ఇందులో నేపాల్‌కు కూడా ఒక మెసేజ్ ఉంది. అదేంటంటే.. భవిష్యత్తులో ఇలాంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించినప్పుడు, సంప్రదింపులు కొనసాగాలి. మీరు (నేపాల్) ముందే భారత్‌తో మాట్లాడి, దాని అనుమతి తీసుకుని ఉంటే, ఈ సమస్య తలెత్తి ఉండేది కాదు" అని వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
సరిహద్దు వివాద సమస్య
ఇప్పటికే ఉన్న సరిహద్దు వివాదం కూడా ఈ పర్యటనకు ముందు నుంచి ఇరు దేశాల మధ్య చర్చల్లోని అంశంగా ఉంది.
ఈ ఏడాది బాలేంద్ర షా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా.. ఒకరి భూభాగాన్ని మరొకరు ఆక్రమించుకుంటున్నారంటూ నేపాల్, భారత్ రెండూ ఓ ప్రకటన చేశాయి.
ఈ ప్రకటన తర్వాత.. నేపాల్ విదేశాంగ శాఖ ఒక వివరణ ఇచ్చింది.
ప్రధానమంత్రి ప్రకటన ఏ ప్రాదేశిక వాదనకు సంబంధించినది కాదని, ఇది నేపాల్-భారత్ సరిహద్దులో ఆక్రమణకు గురవుతున్న, భూవినియోగానికి సంబంధించిందని నేపాల్ విదేశాంగ శాఖ పేర్కొంది.
నిజానికి 2019లో భారత్ ఒక కొత్త రాజకీయ మ్యాప్‌ను విడుదల చేసింది.
ఈ మ్యాప్‌లో లింపియాధుర, కాలపానీ, లిపులేఖ్‌లను భారత్‌లో భాగంగా చూపించింది. ఆ తర్వాత నేపాల్ తన రాజ్యాంగాన్ని సవరించి, తమ దేశ రాజకీయ మ్యాప్‌ను అప్డేట్ చేసింది.
అప్డేట్ చేసిన మ్యాప్‌లో వ్యూహాత్మకంగా మూడు ముఖ్యమైన ప్రాంతాలు లిపులేఖ్, కాలపానీ, లింపియాధురాలు నేపాల్ సరిహద్దులోపలివిగా పేర్కొంది. నేపాల్ తీసుకున్న ఈ చర్యను ఆమోదయోగ్యమైంది కాదని భారత్ తెలిపింది.
అయితే, సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకునే విషయంలో ఆయన పర్యటన ఏదైనా సానుకూల చొరవకు దారితీస్తుందా అన్నదే ప్రశ్న?
"వెంటనే పరిష్కారం దొరకకపోవచ్చు. కానీ, ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్చలు మాత్రం ప్రారంభం కావాలి" అని నేపాల్‌కు చెందిన సీనియర్ రాజకీయ విశ్లేషకుడు కనక్ మణి దీక్షిత్ బీబీసీతో అన్నారు.
''క్రాస్-బోర్డర్ హోల్డింగ్‌పై ఒక కమిటీ పనిచేస్తోంది. మూడేళ్లల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, సుస్తా, లింపియాధుర, కాలపానీ వంటి వివాదాల విషయాల్లో.. విదేశాంగ కార్యదర్శి స్థాయి యంత్రాంగం కింద చర్చలు ప్రారంభించాలని అంతకుముందు నిర్ణయించారు. దీనికి అంగీకారం తెలిపారు కూడా. కానీ, ఆ తర్వాత చర్చలే జరగలేదు'' అని నేపాల్ మాజీ రాయబారి శంకర్ శర్మ తెలిపారు.

ఫొటో సోర్స్, Leonardo MUNOZ/AFP via Getty Images
వాతావరణ మార్పు కూడా ప్రధాన అంశం
ఇవి మాత్రమే కాకుండా.. మరో ముఖ్యమైన సమస్య కూడా ఉంది. అదే వాతావరణ మార్పు.
వాస్తవానికి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో బాలెన్ షా ఇచ్చిన ప్రసంగంలో.. ''హిమాలయాల్లో వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఒక ఉమ్మడి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి'' అని ఆయన ప్రతిపాదించారు. దీన్ని భారత్, చైనా, నేపాల్‌లు నిర్వహించాలన్నారు.
"నేను ఈ అంశాన్ని ఈ విధంగా చూస్తాను. వాతావరణ మార్పు, గ్లోబల్ వార్మింగ్ అనే సమస్యలు హిమాలయాలను వేగంగా ప్రభావితం చేస్తున్నాయి. హిమాలయాలను మూడో ధ్రువం, నీటి నిల్వ కేంద్రం అని కూడా పిలుస్తారు. దాదాపు 200 కోట్ల మంది ప్రజలు దాని నీటిపై ఆధారపడి ఉన్నారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా హిమానీనదాలు కరిగి, రాళ్ళు విరిగిపోతే, దాని ప్రభావం కేవలం నేపాల్‌కే పరిమితం కాదు. ఇది అనేక దేశాలను ప్రభావితం చేస్తుంది. చైనా, భారత్‌లు కూడా దీని ప్రభావానికి గురవుతాయి" అని చెప్పారు.
"వాతావరణ మార్పు సమస్య కేవలం బహుముఖ సమస్య మాత్రమే కాదని, ఇదొక ద్వైపాక్షిక సమస్య కూడా అని, ఈ విషయంలో వాతావరణ సమస్య ఒక ముఖ్యమైన అంశమని, భోటేకోషి వరద మనకు తెలియజేస్తుంది" అని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































