‘‘కెప్టెన్.. అంత గర్వం పనికిరాదు’’ అంటూ శ్రేయస్ అయ్యర్‌పై క్రికెట్ అభిమానుల విమర్శలకు కారణమేంటి?

ప్రచురణ
చదివే సమయం: 5 నిమిషాలు

రిపోర్టర్: ఎక్కడ చూసినా వైభవ్ సూర్యవంశీ గురించే చర్చ జరుగుతోంది.ఈ పరిస్థితి కోచ్, కెప్టెన్‌కు కష్టంగా అనిపిస్తోందా?

ఈ ప్రశ్నకు భారత టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. అతని వైఖరిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ట్రోలింగ్‌ జరిగింది.

భారత్ ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-0 తేడాతో ఓడిపోయింది.

వైభవ్ సూర్యవంశీ రెండు మ్యాచ్‌లలోనూ ఆడకపోవడంతో కెప్టెన్, జట్టు యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలపై క్రికెట్ నిపుణులు, మాజీ క్రికెటర్లు, అభిమానుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోని తొలి మ్యాచ్‌ను జూన్ 1న ఆడనుంది. దీనికి ముందు నిర్వహించిన ప్రెస్ మీట్‌లో వైభవ్ సూర్యవంశీ గురించి, అతనిపై జరుగుతున్న చర్చల గురించి విలేఖరులు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను ప్రశ్నించారు. దీనిపై అతని ఇచ్చిన సమాధానాలు వైరల్ అయ్యాయి. ట్రోలింగ్ కూడా జరిగింది.

అయ్యర్ ఏం చెప్పాడు?

ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ గురించి అంతటా చర్చ జరగడం కెప్టెన్, కోచ్‌లకు ఇబ్బందికరంగా ఉంటుందా అని ఒక జర్నలిస్ట్ అయ్యర్‌ను ప్రశ్నించగా "నాకు అలాంటిదేమీ కనిపించడం లేదు. నేను మీ వార్తలను పట్టించుకోను. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, మరే ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో గానీ ఎవరినీ అనుసరించను. కాబట్టి ఈ చర్చ గురించి నాకేమీ తెలియదు" అని చెప్పాడు.

మరో జర్నలిస్ట్ "ఇన్ని పరుగులు చేసిన ఆటగాడు బెంచ్‌పై కూర్చున్నప్పుడు, అతనికి ఎప్పుడు అవకాశం ఇవ్వాలో నిర్ణయించడం కెప్టెన్‌కు లేదా జట్టు యాజమాన్యానికి కష్టమవుతుందా?" అని అడిగారు.

దీనికి అయ్యర్ "జట్టులోని ప్రతి ఆటగాడు రాణించాడు. కేవలం ఒక ఆటగాడు మాత్రమే బాగా ఆడాడని కాదు. ప్రతి ఆటగాడికి అవకాశం ఇవ్వడంతో పాటు, జట్టులో వారి స్థానంపై భరోసా కల్పించాలి. అప్పుడే వారి ఆత్మవిశ్వాసం చెక్కుచెదరకుండా ఉంటుంది. గత ప్రపంచ కప్ గెలుపులో పాలుపంచుకున్న ఆటగాళ్లకు టీ20లో ఎలా ఆడాలో అనుభవం ఉంది. వారే ఈ ఫార్మాట్‌కు మూల స్తంభాలుగా ఉన్నారు. అందువల్ల వారికి మద్దతు ఇవ్వడం చాలా ముఖ్యం" అని బదులిచ్చాడు.

జట్టు కూర్పు గురించి అడిగినప్పుడు "ఏం జరగబోతుందో ఎవరికీ తెలియదు. ఈ సమాచారం రహస్యంగా ఉంచాలి కాబట్టి, మేమేం చేయబోతున్నామో చెప్పలేం. అది జట్టు అంతర్గత విషయం. మా జట్టు కూర్పు ఎలా ఉంటుందో అందరికీ చెప్పలేం.కచ్చితంగా వైభవ్ చాలా మంచి ఆటగాడు. అతను అద్భుతమైన ప్రతిభావంతుడు. అతనికి ఆడే అవకాశం వచ్చినప్పుడల్లా బాగా ఆడతాడు" అని అయ్యర్ అన్నాడు.

అయ్యర్‌పై ట్రోలింగ్

వైభవ్ సూర్యవంశీ గురించి శ్రేయస్ అయ్యర్ ఇచ్చిన సమాధానం క్రికెట్ అభిమానులకు నచ్చలేదు. సోషల్ మీడియాలో అయ్యర్‌పై ట్రోలింగ్ జరిగింది.

Xలో, @MARCUS907935 అనే యూజర్ "ఇదేం వైఖరి? ఇదేనా కొత్త కెప్టెన్ మాట్లాడాల్సిన తీరు ?" అని వ్యాఖ్యానించగా, @RanjanSinghh_ అనే యూజర్

"వైభవ్ పేరు వినగానే మన కొత్త కెప్టెన్ ఎంత అహంకారంగా స్పందిస్తున్నాడో" అని పోస్ట్ చేశారు.

యూజర్ @Param_117 "ఆత్మవిశ్వాసం మంచిదే కానీ ఈ సమాధానం పూర్తిగా వ్యతిరేకించినట్టుగా ఉంది. వైభవ్ ఆటతీరుపై అభిమానులు, మీడియా బాగా స్పందిస్తోంది. ఆ స్పందనను గుర్తించడంలో తప్పులేదు. కాస్త వినయంగా ఉంటే ఎప్పుడూ గౌరవం లభిస్తుంది. ఇలాంటి కోపంతో ఉండే వైఖరి సరైనది కాదు" అని పోస్ట్ చేశారు.

ఐర్లాండ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు, ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను భారత జట్టు కెప్టెన్‌గా నియమించారు.

ఈ ఏడాది సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత జట్టు టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. అయితే ప్రస్తుత సిరీస్‌కు అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించడమే కాకుండా జట్టు నుంచి కూడా తీసివేశారు. అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా నియమించడంతో అభిమానులు, క్రికెట్ నిపుణుల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి.

సూర్యవంశీకి స్థానం కల్పించక పోవడంపై ఎవరేమన్నారు?

ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో భారత్ ఓటమి అభిమానులను నిరాశపరిచింది. వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తీసుకోకపోవడంపై ప్రశ్నలు తలెత్తాయి. భారత కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా సోషల్ మీడియాలో ప్రశ్నించారు.

వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అవకాశం ఇవ్వకపోవడంపై భారత మాజీ క్రికెటర్లు నిరాశ వ్యక్తం చేశారు.

భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఒక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో "వైభవ్ సూర్యవంశీ ఫామ్‌ను బట్టి చూస్తే, అతడిని రెండు మ్యాచ్‌లలోనూ ఆడించి ఉండవచ్చు. ఒక మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించి ఉండవచ్చు. రెండో మ్యాచ్‌లో అభిషేక్ శర్మను కింది వరుసకు పంపి, సంజు శాంసన్‌ను జట్టులోకి తీసుకుని ఉండవచ్చు. కానీ అలా జరగలేదు"

"వైభవ్ కేవలం 10-15 పరుగులు మాత్రమే చేసి ఉండే అవకాశం ఉంది. కానీ యువ ఆటగాళ్లను పరీక్షించడానికి ఇది ఒక గొప్ప అవకాశం. ఇంగ్లాండ్‌తో జరిగే మొదటి మ్యాచ్‌లో అయినా అతన్ని ఆడించాల్సి ఉంటుంది. ఫామ్‌లో లేని బ్యాట్స్‌మెన్‌ను పక్కన పెట్టి వైభవ్ సూర్యవంశీని ఆడించాలి. ఓపెనింగ్ కాకుండా మరే స్థానంలో అయినాసరే అతనికి జట్టులో చోటు దక్కాలి'' అని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు.

అత్యుత్తమ తుది జట్టుపై భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ప్రశ్నలు లేవనెత్తారు.

"ఉత్తమ తుది జట్టును ఎంపిక చేసి ఉంటే, అందులో వైభవ్ సూర్యవంశీ పేరు కచ్చితంగా ఉండేది. ఇది ప్రపంచ కప్ గెలిచిన జట్టు కాబట్టి అదే 11 మంది ఆటగాళ్లతో బరిలోకి దిగుతామన్న వాదన వినిపించారు. వైభవ్ వేచి చూడాల్సి ఉంటుంది. కానీ ఈ వాదనను అన్నిచోట్లా వినిపించాలి. రోహిత్ శర్మ కెప్టెన్‌గా గెలిపించాడు. కానీ తర్వాత అతడిని తొలగించి, యువ కెప్టెన్‌కు అవకాశం ఇవ్వాలని చెప్పారు. సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించడానికి కూడా ఇదే వాదనను వినిపించారు"

''భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కంటే గొప్ప భవిష్యత్తు ఉన్న ఆటగాడు ఎవరుంటారు? అతను పరుగులు సాధిస్తూనే ఉన్నాడు. ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. కేవలం ఒక సిక్సర్‌తో క్రిస్ గేల్ రికార్డును సమం చేసే అవకాశాన్ని కోల్పోయాడు. ఉత్తమ తుది జట్టులో అతని పేరు ఉండాల్సింది'' అని కైఫ్ అన్నాడు.

"వైభవ్ సూర్యవంశీని కేవలం బెంచ్‌పై కూర్చోబెట్టడానికే ఐర్లాండ్‌కు పంపారా? లేక ఈ సిరీస్‌ను టీవీలో మార్కెట్ చేయడానికా? తరంలో ఒక్కసారి మాత్రమే కనిపించే ప్రతిభావంతుడు ఉన్నప్పుడు, అతను రాణించడానికి ప్రతి అవకాశమూ ఇవ్వాలి. ఇది చాలా వింతగా ఉంది" అని సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ ' ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.