వైభవ్ సూర్యవంశీ: ‘‘బౌలర్ల గురించి పెద్దగా ఆలోచించను’’

ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

ఆ ఆటేంటి, ఆ బాదుడేంటి.. 15 ఏళ్ల కుర్రాడు తన బ్యాట్‌తో సిక్సర్ల సునామీ సృష్టిస్తుంటే స్టేడియంలో కూర్చున్నవారితో పాటు, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు కూడా ప్రేక్షకులైపోయారు. బాల్ వేయడం ఆలస్యం.. స్టాండ్‌లో తేలుతుంటే.. ఏ బౌలరైనా ఏం చేస్తాడు?

'ఆ కుర్రాడికి అస్సలు భయం లేదు' అనుకోవడం తప్ప.

సాంతం 30 బంతులు కూడా ఆడకుండానే 97 పరుగులు చేసిన చిచ్చర పిడుగును చూసి 'ఓరి పిడుగా' అనుకోకుండా ఉండలేరు కదా.

మరి... లేకపోతే పాట్‌ కమిన్స్ లాంటి బౌలర్లు కూడా ఇటు బంతి వేసి అటు స్టాండ్స్ వైపు చూసేలా చేయడమేంటి?

బాల్ ఏదైనా బౌండరీకి ఆవలే..

సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు యార్కర్లు వేసినా ప్రయోజనం లేకపోయింది. బాల్ ఏదైనా బౌండరీ ఆవలకు పంపడమే లక్ష్యం అన్నట్టుగా వైభవ్ దంచేశాడు. బహుశా అందువల్లే కావచ్చు.. 'నేను బౌలర్ల గురించి పెద్దగా ఆలోచించను' అని 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌' అవార్డు తీసుకున్న తరువాత వ్యాఖ్యానించాడు వైభవ్ సూర్యవంశీ.

చండీగఢ్ వేదికగా బుధవారం (మే 27న) జరిగిన ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 47 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గెలిచింది.

ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన ఘనత సూర్యవంశీకే దక్కుతుంది. ఆ తరువాత భారీగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ కీలకమైన వికెట్లు తీసిన జోఫ్రా ఆర్చర్ (4 ఓవర్లు, 58 పరుగులు, 3 వికెట్లు)కు కూడా ఈ గెలుపులో పాత్ర ఉందని చెప్పాలి. అలాగే ఆర్చర్ మూడు అద్భుతమైన క్యాచ్‌లు కూడా పట్టాడు.

మొత్తం 29 బంతులు ఆడిన వైభవ్ 5 ఫోర్లు, 12 సిక్సులు బాది 97 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో అతని స్ట్రైక్ రేట్ 334.48. అతని తరువాత ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున అత్యుత్తమ స్ట్రైక్ రేటు ధ్రువ్ జురేల్‌ది. అతను 21 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 238.09 స్ట్రైక్ రేటుతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని ఔటయ్యాడు.

మొత్తం మీద 8 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్ 243 పరుగులు చేసింది. అంటే వైభవ్ చేసిన 97 పరుగులు తీసేస్తే మిగిలినవారందరూ కలిసి చేసిన పరుగులు 146 మాత్రమే.

ఈ మ్యాచ్‌లో వైభవ్ మరో ఘనత కూడా సాధించాడు. ఐపీఎల్‌లో క్రిస్ గేల్ పేరిట ఉన్న ఒకే సీజన్‌ (2012)లో అత్యధిక సిక్సర్లు (59) రికార్డును వైభవ్ చెరిపేశాడు. వైభవ్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు 65 సిక్సర్లు బాదాడు.

అవకాశం కుదిరితే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయే సూర్యవంశీ 'వైభవాన్ని' కట్టడి చేస్తామని, అతన్ని అడ్డుకోవడానికి తమ వద్ద ప్రణాళికలు ఉన్నాయని మ్యాచ్‌కు ముందు సన్‌రైజర్స్ వ్యాఖ్యానించింది. కానీ అవేవీ ఈ చిచ్చర పిడుగు ముందు సాగలేదు.

కూలిన సన్‌రైజర్స్ టాపార్డర్

ఎటువంటి భయం లేకుండా దూకుడుగా ఆడాలనే మంత్రాన్ని ఈ సీజన్ మొత్తం ఎస్ఆర్‌హెచ్ పాటించింది. కానీ 244 పరుగుల కొండంత లక్ష్యం ముందు ఈ 'హై-రిస్క్' వ్యూహం పూర్తిగా బెడిసికొట్టింది.

విధ్వంసకర బ్యాటింగ్‌కు పేరుపొందిన అభిషేక్ శర్మ 2 బంతులు మాత్రమే ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే అవుట్ అవడంతో ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ లైనప్ ఏం కానుందో సంకేతాలు ఇచ్చినట్లైంది. ఆర్చర్ బంతిని అంచనా వేయడంలో విఫలమై అభిషేక్ కీపర్ క్యాచ్ ఇచ్చి సన్‌రైజర్స్ అభిమానులను నిరాశలో ముంచేశాడు.

ఆదుకుంటాడనుకున్న ఇషాన్ కిషన్ 11 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 300 స్ట్రైక్ రేట్‌తో 33 పరుగులు చేసి అవుటయ్యాడు. తరువాత భీకర బ్యాటింగ్‌కు పేరుపొందిన ట్రావిస్ హెడ్ (17 రన్స్, 8 బంతులు) కూడా 5వ ఓవర్లో ఆర్చర్ వేసిన అద్భుతమైన ఇన్‌స్వింగర్‌కు క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

దీంతో పవర్‌ ప్లే (6 ఓవర్లు) ముగిసేసరికి సన్‌రైజర్స్ 71 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి తీవ్రమైన కష్టాల్లో పడింది.

అయితే హెన్రిచ్ క్లాసెన్ క్రీజులో ఉన్నంతసేపు హైదరాబాద్‌కు ఏదో ఒక మూల ఆశ ఉంది. కానీ యష్ రాజ్ పుంజా వేసిన స్పిన్ బంతికి అతను ఎల్బీడబ్ల్యూ కావడంతో హైదరాబాద్ ఓటమి ఖాయమైపోయింది.

తరువాత నితీష్ కుమార్ రెడ్డి (38 పరుగులు), సలీల్ అరోరా (35 పరుగులు) జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా, భారీ రన్ రేట్, ఒత్తిడి కారణంగా చివరకు హైదరాబాద్ జట్టు 19.2 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌట్ అయింది.

రాజస్థాన్ రాయల్స్‌కు న్యూ ఛండీగఢ్‌లో అజేయమైన రికార్డు ఉంది. ఇక రాజస్థాన్ రాయల్స్ మే 29న గుజరాత్ టైటాన్స్‌తో తలపడుతుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.