సరళా భట్: ఈ కశ్మీరీ పండిట్ నర్సు హత్య కేసులో 36 ఏళ్ల తర్వాత చార్జిషీట్, ఆమె కుటుంబ సభ్యులు ఏమన్నారు?

జమ్మూ కశ్మీర్, కశ్మీరీ పండిట్లు, తీవ్రవాదం, ఉగ్రవాదం

ఫొటో సోర్స్, Sarla Bhat family

ఫొటో క్యాప్షన్, సరళా భట్ 1990లో హత్యకు గురయ్యారు.
    • రచయిత, జహంగీర్ అలీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

కశ్మీరీ పండిట్ కమ్యూనిటీకి చెందిన నర్సు సరళా భట్ హత్యోదంతం 36 ఏళ్ల తర్వాత మరోసారి వార్తల్లో ప్రధానంగా నిలిచింది. ఈ కేసులో జమ్మూ కశ్మీర్ పోలీసులు తాజాగా చార్జిషీట్ దాఖలు చేశారు.

అయితే, వృద్ధులైన సరళ తల్లిదండ్రులకు ఈ చార్జిషీట్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఆమె కుటుంబ సభ్యులు అంటున్నారు.

"వారికి 36 ఏళ్లుగా న్యాయం జరగలేదు, కాబట్టి ఇప్పుడు ఈ చార్జిషీట్ వల్ల ఒరిగేదేమీ లేదు" అని సరళ అత్త కుమారుడు ప్రెదిమన్ కృష్ణ భట్ అన్నారు.

"న్యాయం ఆలస్యం కావడమంటే న్యాయాన్ని నిరాకరించినట్లే అనే నానుడి ఉంది. ఈ చార్జిషీట్ సరళ హంతకులకు శిక్ష పడుతుందనే ఆశ కల్పించి ఉండొచ్చు. కానీ, ఆమె తల్లిదండ్రులకు మాత్రం న్యాయం దక్కలేదు. మన (హిందూ) సంప్రదాయం ప్రకారం, వారికి ఆత్మశాంతి కలిగిస్తే అదే చాలు" అని ఆమె అన్నారు.

ఈ కేసుకు సంబంధించి యాంటీ టెర్రరిజం కోర్టులో 737 పేజీల చార్జిషీట్‌ దాఖలు చేసినట్లు జమ్మూ కశ్మీర్ పోలీసులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిషేధిత 'జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్' (జేకేఎల్‌ఎఫ్)‌ తీవ్రవాదులు సరళా భట్‌ను అపహరించినట్లు అందులో పేర్కొన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

సరళా భట్‌ను చిత్రవధ చేసి, ఆ తర్వాత హత్య చేసినట్లు పోలీసులు ఆ ప్రకటనలో తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, "కశ్మీరీ పండిట్లలో భయం పుట్టించి, వారు కశ్మీర్ నుంచి పారిపోయేలా చేసే లక్ష్యంతో సాగించిన వ్యవస్థీకృత హింసాకాండలో ఇదొక భాగం."

భట్‌ను ఖుర్షీద్ అహ్మద్ చాల్కూ అనే వ్యక్తి కాల్చి చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ తర్వాత, చాల్కూ పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌కు పారిపోయినట్లు స్థానిక పోలీసులు చెబుతున్నారు.

ఈ కేసులో మరో ముగ్గురు నిందితుల పేర్లను పోలీసులు వెల్లడించారు. అబ్దుల్ హమీద్ షేక్, మొహమ్మద్ యూసుఫ్ సూఫీ, మొహమ్మద్ తఫ్ - వీరు ఇప్పటికే మరణించారు.

జమ్మూ కశ్మీర్, కశ్మీరీ పండిట్లు, తీవ్రవాదం, ఉగ్రవాదం

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, జేకేఎల్ఎఫ్ చీఫ్ యాసిన్ మాలిక్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు.

కిడ్నాప్, మర్డర్

దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాకు చెందిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శంభునాథ్ భట్‌కు నలుగురు పిల్లలు. వారిలో సరళ (27) అందరికంటే పెద్దది. ఆమె శ్రీనగర్‌లోని షేర్- ఎ-కశ్మీర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎస్‌కేఐఎంఎస్)‌లో నియో నేటాలజీ విభాగం (అప్పుడే పుట్టిన శిశువుల వైద్య సేవల విభాగం)లో నర్సుగా పనిచేసేవారు.

కశ్మీర్‌లో తీవ్రవాదం ఉధృతంగా ఉన్న సమయంలో, తన వర్గానికి (కశ్మీరీ పండిట్) తీవ్రమైన ముప్పు ఉన్నప్పటికీ ఆమె ఆస్పత్రిలో విధులకు హాజరయ్యేవారని ఆమె బంధువు ఒకరు బీబీసీతో చెప్పారు.

సరళాభట్ 1990 ఏప్రిల్ 18న ఆస్పత్రి హాస్టల్ హబ్బా ఖాతూన్ నుంచి కిడ్నాప్ అయ్యారు. జేకేఎల్‌ఎఫ్ తీవ్రవాదులు ఆమెను ఒక వ్యాన్‌లో అపహరించారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఆ తర్వాతి రోజు, లాల్ బజార్‌లోని మల్లా బాగ్ ఉమర్ కాలనీ రోడ్డు సమీపంలో బుల్లెట్ గాయాలతో ఆమె మృతదేహం కనిపించింది.

పోలీసులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ హత్యకు జేకేఎల్ఎఫ్ బాధ్యత ప్రకటించింది. భట్ మృతదేహం వద్ద చేతిరాతతో రాసి ఉన్న లేఖ దీనికి సాక్ష్యం.

ఆ లేఖలో ఆమెను 'సెక్యూరిటీ ఇన్ఫర్మాట్'(ఇన్ఫార్మర్)గా పేర్కొన్నారు. ఆమె ఇచ్చిన సమాచారంతోనే 1990 ఏప్రిల్ 8న శ్రీనగర్‌లోని నర్వారా ప్రాంతంలో దాడి జరిగిందని అందులో ఆరోపించారు.

ఈ దాడిలో, ప్రస్తుతం ఉగ్రవాద కార్యకలాపాల ఆరోపణలతో తీహార్ జైల్లో ఉన్న జేకేఎల్‌ఎఫ్ చీఫ్ యాసిన్ మాలిక్ గాయపడినప్పటికీ, తప్పించుకోగలిగారు. అయితే, ఆ సంస్థకు చెందిన కొందరు తీవ్రవాదులు పట్టుబడ్డారు.

హత్య తర్వాత..

సరళ హత్య గురించి మొదట బీబీసీ ప్రసారాల ద్వారా తెలుసుకున్నట్లు శ్రీనగర్‌లో ఉంటున్న ఆమె బంధువు భట్ చెప్పారు. 1990లలో కశ్మీర్ లోయలో బీబీసీ హిందీ, బీబీసీ ఉర్దూ రేడియోలు వినిపించేవి.

ఆ సమాచారంతో భట్ అనంత్‌నాగ్ వెళ్లేప్పటికే సరళ అంత్యక్రియలు పూర్తయ్యాయి.

సాయంత్రం సరళ అస్థికలు తీసుకొచ్చేందుకు ఆయనతో పాటు మరికొందరు బంధువులు శ్మశానవాటికకు వెళ్లారు. అక్కడికి వెళ్లేప్పటికే, ఘాట్ వద్ద దాదాపు 150 నుంచి 200 మంది ఉన్నారని ఆయన చెప్పారు.

"వాళ్లు మమ్మల్ని తిట్టడం, ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. కశ్మీర్ నుంచి ఇంకా ఎందుకు పారిపోలేదని అన్నారు. వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించాను. బదులుగా , వారు అస్థికలను కాళ్లతో తొక్కడం మొదలుపెట్టారు. నేను వెంటనే చేతికందినంత వరకు అస్థికలను పట్టుకుని అక్కడి నుంచి పరుగెత్తాను."

అనంత్‌నాగ్‌లోని ఆమె ఇంటిపై గ్రనేడ్ విసిరారని, అది ఇంటి మెయిన్ గేటు వద్ద పేలిందని భట్ చెప్పారు.

"మాకు సాయం చేసేందుకు ఏ పోలీసులూ రాలేదు. ఎలాగో, ధైర్యంచేసి మేమే రోడ్డు వరకూ వచ్చాం. విమెన్స్ డిగ్రీ కాలేజీ దగ్గర కొంతమంది ఆర్మీ సిబ్బంది ఉన్నారు. మా అంకుల్, ఆంటీ, నా కజిన్ ఖానాబల్ వరకూ వెళ్లేందుకు వారు సాయం చేశారు. అక్కడి నుంచి వారు జమ్మూ వెళ్లారు" అని ఆయన అన్నారు.

జమ్మూ కశ్మీర్, కశ్మీరీ పండిట్లు, తీవ్రవాదం, ఉగ్రవాదం

ఫొటో సోర్స్, @Nruphoto

ఫొటో క్యాప్షన్, అనంత్‌నాగ్‌లో కశ్మీరీ పండిట్‌ల ఇల్లు

'జీవచ్ఛవాల్లా బతుకుతున్నారు'

ప్రస్తుతం 90 ఏళ్ల వయసుకు చేరుకున్న సరళ తల్లిదండ్రులు జమ్మూలోని ముత్తి ప్రాంతంలో ఉంటున్నారు. వారి ఆరోగ్యం అంతంతమాత్రమే. తరచూ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సరళ తోబుట్టువులకు పెళ్లిళ్లు అయిపోయాయి. ఆమె సోదరుల్లో ఒకరైన రమేశ్ కుమార్ భట్ ఇటీవల విద్యాశాఖ నుంచి పదవీ విరమణ పొందారు.

అప్పటి పరిస్థితులను గుర్తుచేసుకుంటూ, సరళకు అప్పటికి పెళ్లి కాలేదని, కానీ ఆమె చెల్లెలికి వివాహమైందని భట్ తెలిపారు.

"ఆమెకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు. తన తల్లిదండ్రులు, తోబుట్టువులను చూసుకోవడంపైనే ఆసక్తి ఉండేది. ఇప్పుడు ఆలోచిస్తే, ఆమె నిర్ణయం సరైనదేనని భావిస్తున్నా. ఒకవేళ ఆమెకు వివాహం జరిగివుంటే, ఈ విషాదం మరింత బాధ కలిగించేది."

"ఆమె తల్లిదండ్రులు జీవచ్ఛవాల్లా బతుకుతున్నారు. తమ కూతురు అత్యంత క్రూరంగా హత్యకు గురైన బాధను వారు అనుభవించారు" అని ఆయన అన్నారు.

దర్యాప్తులో ఆలస్యమెందుకు?

గత మూడు దశాబ్దాల పాటు కొనసాగిన హింస దర్యాప్తుపై "ప్రతికూల ప్రభావం" చూపిందని ఈ కేసును 2024 మార్చి 18న దర్యాప్తునకు స్వీకరించిన జమ్మూ కశ్మీర్ పోలీస్‌కి చెందిన దర్యాప్తు సంస్థ శ్రీనగర్ కోర్టులో వాదించింది.

"ఉగ్రవాద సంస్థలు కశ్మీర్‌లో భయానక, బెదిరింపుల వాతావరణంసృష్టించాయి. అది సాక్షులు ముందుకొచ్చి సాక్ష్యం చెప్పే అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపింది’’ అని ఆ సంస్థ కోర్టుకు తెలిపింది.

"ఉగ్రవాద బాధితులకు న్యాయం చేయడంలో తమ దర్యాప్తు ఒక చారిత్రక మైలురాయి" అని ఆ సంస్థ అభివర్ణించింది.

2008 నాటి పోలీస్ నివేదిక ప్రకారం, 1989 నుంచి కశ్మీర్ వ్యాలీలో జరిగిన తీవ్రవాద దాడుల్లో 209 మంది కశ్మీరీ పండిట్‌లు చనిపోయారు. వారిలో ఒక్క 1990లోనే 109 మంది మరణించారు. అయితే, మృతుల సంఖ్య చాలా ఎక్కువని కశ్మీర్ పండిట్ సంఘాలు వాదిస్తున్నాయి. అదే సమయంలో, వేలాది మంది కశ్మీరీ పండిట్‌లు లోయను విడిచి వెళ్లిపోవాల్సి వచ్చిందని కూడా నివేదికలు అంచనా వేశాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.