‘సూట్‌కేసులో మహిళ మృతదేహం.. కాదుకాదు, అచ్చం మనిషిలాంటి బొమ్మ’

ఫొటో సోర్స్, ABC News
- రచయిత, లానా లామ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 2 నిమిషాలు
ఆస్ట్రేలియాలో ‘సూట్‌కేసులో మృతదేహం’ కేసులో పోలీసుల దర్యాప్తు ముగిసింది. సూట్‌కేసులో ఉన్నది మనిషి కాదని.. మనిషిని పోలిన బొమ్మ అని పోలీసులు నిర్ధరించారు.
సిడ్నీకి సుమారు 230 కిలోమీటర్ల దూరంలోని గ్రామం ఓఅల్లెన్ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న ఆ సూట్‌కేసును స్థానికులు ఇద్దరు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఆ తరువాత పోలీసులు ‘హత్య కేసును దర్యాప్తు చేస్తున్నాం’ అని ప్రకటన చేయడంతో దేశవ్యాప్తంగా ఆసక్తి ఏర్పడింది.
అయితే కొన్ని గంటల తర్వాత సూట్‌కేసులో ఉన్నది మృతదేహం కాదని ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలినట్లు పోలీసులు ప్రకటించారు.
సూట్‌కేసులో ఉన్నది "మొదట మనిషిగా పొరపాటుపడ్డారు. అందులో ఉన్నవి చూడ్డానికి అచ్చంగా మనిషి శరీర భాగాల్లానే కనిపించాయి" అని హ్యూమ్ పోలీస్ డిస్ట్రిక్ట్‌కు చెందిన సూపరింటెండెంట్ లిండా బ్రాడ్‌బరీ తెలిపారు.

"అయితే అవి మనిషివి కావని మేం శాస్త్రీయంగా నిర్ధరించాం" అని ఆయన చెప్పారు.
"ఆ బొమ్మకు దుస్తులు, జుట్టు, ముక్కుపుడక ఉంది. దానిపై గాయాల మచ్చలు, గీరుకుపోయినట్లుగా గుర్తులు కూడా ఉన్నాయి" అని పోలీసులు తెలిపారు.
ఆదివారం ఫోరెన్సిక్ బృందాలు, దర్యాప్తు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారని సూపరింటెండెంట్ బ్రాడ్‌బరీ చెప్పారు.
"నేరం జరిగిన ప్రాంతలో సాధ్యమైనంత వరకు దేన్నీ కదిలించకూడదు. కేసును ఎలా దర్యాప్తు చేశారనే విషయంలో ఎలాంటి పశ్చాత్తాపం లేదు" అని ఆమె అన్నారు.
సూట్‌కేసును కనుగొన్న ఇద్దరు వ్యక్తులకు అది "చాలా దిగ్భ్రాంతికరంగా అనిపించి ఉంటుంది" అని ఆమె చెప్పారు.
"వారాంతాల్లో చాలా మంది మాదిరిగానే వాళ్లు కూడా వీకెండ్ డ్రైవ్‌కు వెళ్లి, రెస్ట్ కోసం అక్కడ ఆగారు. దాని గురించి రిపోర్ట్ చేయడం వాళ్లు చేసిన మంచి పని" అని ఆమె అన్నారు.
"నిన్న వాళ్లు చాలా బాధ పడ్డారు. అయితే అది మనిషి కాదని వారిని కలిసి చెబుతాం" అని బ్రాడ్‌బరీ చెప్పారు.
ఈ కేసులో పోలీసుల దర్యాప్తు ముగిసిందని ప్రకటించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























