బండి భగీరథ్: ఇంకా దొరకని ఆచూకీ, సమాచారం లేదంటున్న విచారణాధికారులు

బండి సంజయ్, నేరాలు, అత్యాచారం, పోక్సో చట్టం

ఫొటో సోర్స్, UGC

పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ ఆచూకీ ఇప్పటి వరకూ లభించలేదని హైదరాబాద్ పోలీసులు చెబుతున్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొడుకే బండి భగీరథ్.

ఈ కేసును విచారిస్తున్న కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ ''బండి భగీరథ్‌ గురించి ఎలాంటి సమాచారం లేదు' అని మీడియాతో అన్నారు.

మొత్తంగా వ్యవహారంపై రాజకీయంగా తీవ్ర దుమారం కొనసాగుతోంది.

బండి సంజయ్ కుమారుణ్ని అరెస్టు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుండగా, ఎలాంటి వివక్షకు తావు లేకుండా విచారణ జరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది.

ఈ వ్యవహారంలో బండి సంజయ్‌కు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ అంటోంది. ఈ పరిణామాలపై బండి సంజయ్ స్పందించాల్సి ఉంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ప్రధాని పర్యటన తర్వాత వేగంగా మారిన పరిణామాలు

బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పై మే నెల 8న పేట్ బషీరాబాద్ పోలీసుస్టేషన్‌లో పోక్సో కేసు నమోదయింది. కేసు నమోదవ్వడానికి కొద్ది గంటల ముందు కరీంనగర్ టూటౌన్ పోలీసుస్టేషన్‌లో బాధిత బాలిక, ఆమె తల్లిదండ్రులు తనను హనీట్రాప్ చేసి వేధిస్తున్నారని బండి భగీరథ్ మరో కేసు పెట్టారు.

పోక్సో కేసు విచారణపై ప్రభుత్వం స్పందించి దర్యాప్తు చేపట్టింది.

మే 10వ తేదీన హైదరాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. తర్వాత రోజు.. మే 11వ తేదీన పరిణామాలు వేగంగా మారిపోయాయి.

పేట్ బషీరాబాద్ పోలీసుస్టేషన్‌లో బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు వ్యవహారాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరా తీసినట్టు, డీజీపీ సీవీ ఆనంద్‌తో మాట్లాడినట్టు సీఎం కార్యాలయం సోమవారం మధ్యాహ్నం ఒక ప్రకటనలో తెలిపింది.

''8వ తేదీన ఫిర్యాదు వస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ప్రధాన మంత్రి మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీస్ సిబ్బంది అంతా భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని ముఖ్యమంత్రికి డీజీపీ వివరించారు'' అని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.

కేసు స‌మ‌గ్ర‌ విచారణ కోసం ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేయాలని డీజీపీని సీఎం ఆదేశించారు.

( మైనర్ బాలికతో ఆమె అంగీకారంతో శృంగారంలో పాల్గొన్నా పోక్సో చట్టం ప్రకారం నేరమవుతుంది)

బండి సంజయ్, నేరాలు, అత్యాచారం, పోక్సో చట్టం

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, బండి భగీరథ్ గురించి ఎలాంటి సమాచారం లేదని పోలీసులు చెప్పారు.

విచారణకు ప్రత్యేకాధికారి నియామకం

కేసు విచారణాధికారిగా కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్‌ను సోమవారం(మే 11న) నియమిస్తూ సైబరాబాద్ కమిషనర్ ఎం.రమేశ్ ఆదేశాలు జారీ చేశారు.

''సరైన రీతిలో, పారదర్శకంగా విచారణ చేయాలని ఆదేశించాం. ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తారు. కేసు పురోగతిని డీసీపీ వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తారు'' అని సైబరాబాద్ కమిషనర్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఈ పరిణామం తర్వాత డీసీపీ రితిరాజ్ పేట్ బషీరాబాద్ పోలీసుస్టేషన్‌ను సందర్శించారు. అక్కడ కేసు పురోగతిని అడిగి తెలుసుకున్నారు.

ఇప్పటివరకు జరిగిన విచారణ, ముందు ముందు విచారణ సాగించాల్సిన తీరుపై ఏసీపీ, ఇన్‌స్పెక్టర్‌తో చర్చించినట్టు మీడియాతో చెప్పారు రితిరాజ్.

బండి సంజయ్, నేరాలు, అత్యాచారం, పోక్సో చట్టం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

దొరికితే అరెస్టు చేస్తాం: డీసీపీ

ఆయన(బండి భగీరథ్) దొరికితే, నేరం రుజువైతే కచ్చితంగా అరెస్టు చేస్తామని మీడియాకు చెప్పారు డీసీపీ రితిరాజ్.

''ఇప్పటివరకు నిందారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తి గురించి సమాచారం లేదు. అతని కాల్ డిటైల్ రికార్డ్స్ కూడా పరిశీలిస్తున్నాం'' అని చెప్పారు.

గత రెండు రోజులుగా పేట్ బషీరాబాద్ పోలీసులు తగిన విచారణ చేశారని చెప్పారు.

''బాధితురాలి స్టేట్‌మెంట్ ఒకసారి రికార్డు చేశాం. ఇంకా వివరాలు అవసరం ఉంది. మరోసారి ఆమెతో మాట్లాడతాం'' అని తెలిపారామె.

బండి సంజయ్, నేరాలు, అత్యాచారం, పోక్సో చట్టం

ఫొటో సోర్స్, FB/Harish Rao Thanneeru

ఫొటో క్యాప్షన్, బండి భగీరథ్‌ను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

సిట్ అంటే కేసు నీరుగార్చడమే: బీఆర్ఎస్

ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటుపై రాజకీయ పార్టీలు స్పందించాయి.

బండి భగీరథ్ కేసు విషయంలో సిట్ వేయడం అంటేనే కేసును నీరుగార్చడమని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

''ఫిర్యాదు వచ్చి నాలుగు రోజులైనా భగీరథ్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేదు..? క్రిశాంక్, నల్లబాలు రీట్వీట్ కొడితేనే ఇంటికి వచ్చి ఎత్తుకుపోయారు కదా..? మరి రేప్ కేసులో ఫిర్యాదు వచ్చిన అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు..?'' అని ప్రశ్నించారు.

ఇప్పటివరకు వేసిన సిట్‌ల నివేదికలు బయటపెట్టాలన్నారు హరీశ్‌రావు.

మరోవైపు ఈ కేసుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు స్పందించారు.

బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌ కేసు వ్యక్తిగత విషయమని అన్నారు.

''అది వారి కుటుంబ వ్యవహారం. అందులో బండి సంజయ్ పాత్ర లేదు. కుటుంబ సభ్యులపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరుగుతోంది. ఇందులో రాజకీయాలకు తావు లేదు'' అని రాంచందర్ రావు పీటీఐతో అన్నారు.

తీవ్రంగా కలిచివేసింది: మంచు మనోజ్

బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పొక్సో కేసు వ్యవహారం తనను తీవ్రంగా కలచివేసిందని సినీ నటుడు మంచు మనోజ్ అన్నారు.

''ఇది రాజకీయాలు, వ్యక్తుల గురించి కాదు. నిజం బయటకు రావాలి. న్యాయం జరగాలి'' అని ట్వీట్ చేశారు.

వేగంగా, పారదర్శకంగా ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా న్యాయబద్దమైన విధానంలో విచారణ జరుగుతుందని భావిస్తున్నట్టుగా మంచు మనోజ్ చెప్పారు.

''దేశ చరిత్రలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కుమారుడు పరారీలో ఉండటం ఇదే మొదటిసారి అనుకుంటా కదా..'' అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

బండి సంజయ్, నేరాలు, అత్యాచారం, పోక్సో చట్టం

ఫొటో సోర్స్, FB/Ponnam Prabhakar

ఫొటో క్యాప్షన్, బాధితురాలికి తెలంగాణ ప్రభుత్వం న్యాయం చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.

కేసు విచారణకు సహకరించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

కేసు విచారణకు సహకరించాలని, కేంద్ర మంత్రి హోదాలో ఒత్తిడి తెస్తే ఉపేక్షించేది లేదని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

''బండి సంజయ్ స్వయంగా తానే విచారణకు ఆదేశించాల్సి ఉంది. నిష్పక్షపాతంగా విచారణ చేయాలని చెప్పాల్సింది'' అని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం చట్టబద్దంగా విచారణ చేస్తుందని తెలిపారు. బాధితురాలి కుటుంబం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం తప్పకుండా న్యాయం చేస్తుందని అన్నారు.

కొందరు కుల సంఘాల నాయకులు ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని ప్రయత్నిస్తున్నారని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.

''ఇక్కడ కులాల ప్రస్తావన లేదు. బీసీలు, ఎస్సీ, ఎస్టీలనే ప్రస్తావన లేదు. అమ్మాయి కూడా అదే కులానికి చెందిన అమ్మాయే. రాజకీయం చేసే ఆలోచన లేదు.

కుల పెద్దమనుషులు పంచాయితీ చేసి పెళ్లి చేస్తారా.. పంచాయితీ చేస్తారా.. మీ ఇష్టం. ఆ అంశానికీ, ప్రభుత్వానికీ సంబంధం లేదు. ఫిర్యాదు వచ్చినప్పుడు ప్రభుత్వం తప్పకుండా స్పందిస్తుంది. పోలీసులు ఎలాంటి వివక్ష లేకుండా కఠినంగా, క్రియాశీలకంగా వ్యవహరిస్తారు'' అని పొన్నం ప్రభాకర్ చెప్పారు.

అయితే మొత్తం వ్యవహారంపై బండి సంజయ్, ఆయన కుమారుడు బండి భగీరథ్ స్పందించాల్సి ఉంది. వారి స్పందన కోసం బీబీసీ ప్రయత్నిస్తోంది. వారి స్పందన రాగానే ఇక్కడ అప్‌డేట్ చేస్తాం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)