‘ఫోటో ఆధారంగా అనారోగ్యాన్ని, ఎంత కాలం జీవించే అవకాశముందో చెప్పేసే ఏఐ టూల్’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మిషెల్ రాబర్ట్స్
- హోదా, డిజిటల్ హెల్త్ ఎడిటర్
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
రోగి ముఖానికి సంబంధించిన ఒక్క ఫొటో ఆధారంగా ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అంచనా వేయడంలో వైద్యులకు కృత్రిమ మేధ (ఏఐ) టూల్ సహాయపడవచ్చని అమెరికా పరిశోధకులు చెబుతున్నారు.
లక్షలాది మంది ఆరోగ్యవంతుల ముఖాలకు సంబంధించిన ఫొటోలతో పాటు క్యాన్సర్ రోగుల 35 వేల ఫొటోలను ఉపయోగించి ఈ ఏఐ టూల్‌కు శిక్షణ ఇచ్చారు.
కళ్ల సమీపంలోని ముఖ లక్షణాలను నిశితంగా పరిశీలించడం ద్వారా రోగి ఎంతకాలం జీవించే అవకాశం ఉందో ఈ టూల్ అంచనా వేయగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అయితే, ఆస్పత్రుల్లో ఉపయోగించేందుకు ఈ టూల్ ఇంకా సిద్ధంగా లేదని పరిశోధకులు తెలిపారు. రోగులకు తగిన చికిత్సలను సూచించడంలో వైద్యులకు సహాయపడటమే తమ లక్ష్యమని చెప్పారు.
ఈ పరిశోధనకు సంబంధించిన ప్రాథమిక ఫలితాలు లాన్సెట్ డిజిటల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.


ఫొటో సోర్స్, Mass General Brigham/Lancet Digital Health
కళ్ల దగ్గర కనిపించే లక్షణాలే కీలకం
ఒక వ్యక్తి ఎంతకాలం జీవించే అవకాశం ఉందో అంచనా వేయడంలో కళ్ల కింద భాగం, ముక్కు పైభాగం చుట్టూ ఉన్న ప్రాంతాలు అత్యంత కీలకమని 'ఫేస్సర్వైవల్' అనే ఏఐ టూల్ సూచిస్తోంది.
క్యాన్సర్ తీవ్రతతో సంబంధం లేకుండా వివిధ రకాల క్యాన్సర్ రోగుల విషయంలోనూ ఈ అంచనా పద్ధతి వర్తించింది. ఎముకలు లేదా మెదడుకు వ్యాపించిన క్యాన్సర్ కేసులు కూడా వీటిలో ఉన్నాయి.
ఈ పరిశోధనలో పాల్గొన్న క్యాన్సర్ రోగుల్లో ఎక్కువ మంది అమెరికా, నెదర్లాండ్స్‌కు చెందినవారు. వీరిలో అధిక శాతం మంది 50 నుంచి 60 ఏళ్ల వయసువారే. అయితే, కొందరు చిన్నపిల్లలు కూడా ఉండగా, మరికొందరి వయసు 90 ఏళ్లకు పైగా ఉంది.
ప్రస్తుతం వైద్యులు రోగులను పరీక్షించడంతో పాటు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో, భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉండవచ్చో అంచనా వేస్తున్నారు.
పేటెంట్ దరఖాస్తు పరిశీలనలో ఉన్న ఈ ఏఐ టూల్‌ను వైద్యులకు సహాయపడేలా రూపొందించారు. వైద్యుల స్థానాన్ని భర్తీ చేయడం దీని ఉద్దేశం కాదు.
"జనాభాలో వృద్ధుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రేడియేషన్, శస్త్రచికిత్స లేదా శరీరమంతటా ప్రభావం చూపే చికిత్సల వంటి తీవ్రమైన చికిత్సలను సూచించే ముందు రోగి శారీరక సామర్థ్యాన్ని, బలహీనతను అంచనా వేసేందుకు వైద్యులకు మెరుగైన పద్ధతులు అవసరం" అని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన బోస్టన్లోని మాస్ జనరల్ బ్రిగమ్‌కు చెందిన డాక్టర్ రేమండ్ మాక్ అన్నారు.
"ముఖ ఫొటోల ఆధారంగా ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసే ప్రక్రియను మరింత పరిమాణాత్మకంగా, స్థిరంగా, విస్తృత స్థాయిలో ఉపయోగించగలిగేలా చేయడమే మా లక్ష్యం. వైద్యుల నిర్ణయాలను భర్తీ చేయడం కాకుండా, ప్రతి రోగికి తగిన చికిత్సను నిర్ణయించడంలో ఈ టూల్ సహాయపడాలని భావిస్తున్నాం" అన్నారు.
ముఖాన్ని చూసి వయసును అంచనా వేయవచ్చా?
ఒక వ్యక్తి జీవసంబంధమైన వయసును అంచనా వేసే మరో ఏఐ టూల్‌ను కూడా మాక్, ఆయన సహచరులు పరిశీలిస్తున్నారు.
పుట్టిన తేదీ ఆధారంగా లెక్కించే వయసుకు బదులుగా, ఒక వ్యక్తి శారీరకంగా ఎంత వయసు ఉన్నవారిలా కనిపిస్తున్నారో అంచనా వేయడమే ఈ పరిశోధన ఉద్దేశం.
'ఫేస్ఏజ్' అనే ఈ టూల్ ప్రకారం, ముక్కు కింద నుంచి నోటి చుట్టూ ఏర్పడే ముడతలు, నోటి మూలల నుంచి కిందికి కనిపించే గీతలు, నుదుటిపై ముడతలు, కణతల దగ్గర కళ్ల పక్కన ఏర్పడే ముడతలు, బుగ్గలు వయసు పెరిగే వేగాన్ని సూచించే ముఖ్యమైన లక్షణాలు.
అధికంగా మద్యం తాగడం, మాదకద్రవ్యాల వినియోగం, ధూమపానం వంటి జీవనశైలి అలవాట్లు వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేయవచ్చు.
ముఖం కనిపించే కోణం, వెలుతురు, ముఖ కవళికలు, మేకప్‌లో తేడాలు ఉన్నప్పటికీ, సాధారణంగా తీసిన ఫొటోల ఆధారంగా ఈ టూల్ ఇచ్చిన అంచనాలు స్థిరంగా ఉన్నాయని మాక్ తెలిపారు.
"పరీక్షించిన చాలా రకాల ప్లాస్టిక్ సర్జరీల తర్వాత కూడా ఈ టూల్ అంచనాలు స్థిరంగానే ఉన్నాయి. అయితే, ముక్కు ఆకృతిని మార్చే రైనోప్లాస్టీ శస్త్రచికిత్స తర్వాత మాత్రం అంచనాల్లో స్వల్ప మార్పు కనిపించింది" అని ఆయన చెప్పారు.
అయితే, ఈ టూల్స్ ఎంత సమర్థంగా పనిచేస్తాయో నిర్ధరించేందుకు మరింత సమాచారం, ముఖ ఫొటోలు అవసరమని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా వివిధ జాతుల ప్రజలకు సంబంధించిన ఫొటోలను పెద్ద సంఖ్యలో సేకరించాల్సి ఉందన్నారు.
ఈ రెండు టూల్స్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నాయని తెలిపారు.
ఈ పరిశోధనలో పాల్గొనాలని పరిశోధకుల బృందం ప్రజలను ఆహ్వానిస్తోంది. తమ ముఖ ఫొటోను పరిశోధకుల బృందానికి అప్లోడ్ చేయడం ద్వారా వ్యక్తులు తమ జీవసంబంధమైన వయసుకు సంబంధించిన అంచనాను పొందవచ్చు.
బ్రిటన్‌లోని సర్రే యూనివర్సిటీలో వీడియో ప్రాసెసింగ్, మెషిన్ లెర్నింగ్ నిపుణుడైన ప్రొఫెసర్ మిరోస్లా బోబర్ ఈ పరిశోధనపై స్పందించారు.
కాలక్రమంలో వృద్ధాప్య ప్రక్రియను లేదా జీవనశైలిలో మార్పులను ఈ టూల్ గుర్తించగలదని ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
"ఇది ఆశాజనకమైన ప్రాథమిక ప్రయోగం. అయితే, వైద్యపరంగా ఉపయోగించేందుకు ఇంకా సిద్ధంగా లేదు" అని ఆయన చెప్పారు.
"ఈ టూల్ ఇచ్చే అంచనాలను వైద్యుల సొంత అంచనాలతో పోల్చి పరీక్షించాల్సి ఉంది. అలాగే, వివిధ ఆస్పత్రుల్లో, వేర్వేరు రోగుల సమూహాలపై కూడా పరీక్షలు నిర్వహించాలి" అని తెలిపారు.
అయితే, "ఏదైనా ఫలితాన్ని ముందుగానే అంచనా వేయడం, ఆ ఫలితం ఎందుకు వస్తుందో వివరించడం రెండూ ఒకటి కాదు" అని ప్రొఫెసర్ బోబర్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























