గెయిట్ అనాలసిస్: కేతన్ అగర్వాల్ కేసులో నిందితుడికి పోలీసులు చేసిన ఈ టెస్ట్ ఏంటి?

    • రచయిత, పారా పద్దయ్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితుడైన చేతన్ చౌధురికి ‘గెయిట్ అనాలసిస్’ చేసేందుకు లోనావాలా పోలీసులు అతన్ని నేర స్థలానికి తీసుకొచ్చినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

చేతన్‌కు 'గెయిట్ అనాలసిస్‌'తో పాటు క్రైమ్ సీన్ రీక్రియేట్ చేశారు.

ఈ కేసులో మరో నిందితురాలు సియా గోయల్‌తో ఇప్పటికే క్రైమ్ సీన్ రీక్రియేట్ చేశారు పోలీసులు. ఇందులో భాగంగా కేతన్ ఎంత బరువున్నాడో అంతే బరువున్న డమ్మీ బొమ్మను కోటపై నుంచి తోసేసినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.

జూన్ 29న లోనావాలాలో రూరల్ పోలీసులు నిందితులిద్దరిని వడ్గావ్ మావల్‌లోని కోర్టులో హాజరు పరిచారు.

పుణెలోని లోహగఢ్ కోట వద్ద అతని కదలికలను చిత్రీకరించిన సీసీటీవీ ఫుటేజీలో దృశ్యాలను రీకనస్ట్రక్ట్ చేసి సీసీ కెమెరాలో రికార్డైన వీడియోతో పోల్చి చూడాలని భావిస్తున్నట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు.

"చేతన్ చౌధురికి గెయిట్ అనాలసిస్ చేయాలని అనుకుంటున్నాం. అతను హుడీలో మొహం దాచుకుని నడుస్తున్న దృశ్యాలున్న సీసీటీవీ ఫుటేజ్ మా వద్ద ఉంది. గెయిట్ అనాలసిస్ సాయంతో అతని నడక రికార్డు చేసి సీసీటీవీ ఫుటేజ్‌లో అతని కదలికల్ని పోల్చి చూస్తాం. దాని ద్వారా అతని నడక సీసీటీవీలో దృశ్యాలతో సరిపోలిందో లేదో చూస్తాం" అని పోలీసులు కోర్టుకు చెప్పారని పీటీఐ తెలిపింది.

ఈ కేసులో నిందితులుగా ఉన్న సియా గోయల్, చేతన్ చౌధురిల పోలీస్ కస్టడీని కోర్టు జులై 3 వరకు పొడిగించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ కథనం వెల్లడించింది.

పోలీసులు ఏడు రోజుల కస్టడీని కోరారని, అయితే ఇరువైపుల వాదనలు విన్న తర్వాత కోర్టు మూడు రోజుల కస్టడీకి మాత్రమే అనుమతించిందని సియా గోయల్ తరపు న్యాయవాది విపుల్ దుషింగ్ చెప్పారు.

గెయిట్ అనాలసిస్ అంటే ఏంటి?

గెయిట్ అనాలసిస్ అంటే నడక విశ్లేషణ. మనిషి నడిచేప్పుడు కదలికలను అధ్యయనం చేయడమే గెయిట్ అనాలసిస్ అని అమెరికాకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెబ్‌సైట్ చెబుతోంది.

ఇది ఒక వ్యక్తి ఎలా నిలబడతాడు, ఎలా నడుస్తాడు అని చేసే ఒక వివరణాత్మక అంచనా. వ్యాధి లేదా గాయం వలన సంభవించే అసాధారణ నడక తీరును గుర్తించడానికి దీనిని వైద్యంలో భాగంగా ఉపయోగిస్తారు.

రెండు నుంచి నాలుగు గంటలపాటు సాగే ఈ ప్రక్రియలో ఉత్తమ ఫలితాల కోసం వ్యక్తి ఎలాంటి సాయం లేకుండా వరుసగా 10 అడుగులు వేయాల్సి ఉంటుంది.

ఫోరెన్సిక్ దర్యాప్తు, సీసీటీవీ లేదా ఇతర వీడియో ఫుటేజీలలో పట్టుబడిన అనుమానితులను గుర్తించడంలో పోలీసులు నడక విశ్లేషణను ఉపయోగిస్తారు.

ఒక వ్యక్తి ఎలా నడుస్తాడో అర్థం చేసుకోవడానికి, నిపుణులు ముందుగా నడక తీరును పరిశీలిస్తారు. నడకలో భాగంగా ఒక పాదం నేలను తాకిన క్షణం నుంచి అదే పాదం మళ్లీ నేలను తాకే వరకు జరిగే సంఘటనల క్రమాన్ని నడక తీరుగా భావిస్తారు.

గెయిట్ అనాలసిస్ ఎలా చేస్తారు?

నడక విశ్లేషణ సమయంలో ఒక వ్యక్తి అనేక నడక చక్రాలను పూర్తి చేస్తారు. నిమిషానికి వేసే అడుగుల సంఖ్య, అడుగు పొడవు, స్ట్రైడ్ పొడవు, కాళ్ల కీళ్ల కోణాలు, మడమ తిరిగే కోణాలు అలాగే పాదం నేలను తాకే సమయంలో ప్రయోగించే బలాన్ని కొలవడానికి నిపుణులు వివిధ పరికరాలను ఉపయోగిస్తారు.

కొన్నిసార్లు "పరికరాలు" అంటే వైద్య నిపుణుడి కళ్లూ, ఒక నోట్‌ప్యాడ్ మాత్రమే.

ప్రస్తుతం ఒక వ్యక్తి నడక చక్రాలను వీడియోలో కూడా రికార్డు చేసి తరువాత కంప్యూటర్ సాయంతో విశ్లేషిస్తున్నారు.

నడకలో పాదాలు ఎక్కడ ఎక్కువ ఒత్తిడిని ప్రయోగిస్తున్నాయో తెలుసుకోవడానికి ప్రెషర్ మ్యాట్స్, ఫోర్స్ ప్లేట్స్ సెన్సర్లను ఉపయోగిస్తారు.

అదనంగా, వ్యక్తి శరీరానికి అమర్చే సెన్సర్లు, నేరం జరిగిన స్థలం లేదా క్రీడా మైదానం వంటి వాస్తవ ప్రపంచ పరిస్థితుల్లో వారి కదలికలను కూడా గమనించి విశ్లేషిస్తారు.

చేతన్ విషయంలో పోలీసులు ఏం చేశారు?

చేతన్ చౌధురికి గెయిట్ అనాలసిస్ నిర్వహించేందుకు ఆయన్ని లోహగఢ్ తీసుకెళ్లిన దృశ్యాలను ఏఎన్ఐ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

"అతనికి అక్కడ జూన్ 18న సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల్లో ఉన్న హుడీని వేసి లోహగఢ్ కోటలో అదే ప్రదేశంలో మళ్లీ నడవమని చెబుతారు. అతని రూపం, అక్కడ అతని ఉనికిని నిర్ధరించడానికి సహయపడే ఏఐ సాధనాలను ఉపయోగిస్తారు" అని పోలీసు అధికారి ఒకరు తమతో చెప్పినట్లు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం వెల్లడించింది.

అదే ప్రదేశంలో ఇలా చేయడం ద్వారా, కెమెరా కోణం, నేల వాలు, వెలుతురు వంటి అంశాల ప్రభావాలను నిపుణులు తిరిగి సృష్టించగల అవకాశం ఉంటుంది.

చివరగా, అసలు దృశ్యాల్లోని నడకను కొత్తగా రికార్డు చేసిన నడకతో నిపుణులు పోల్చి సారూప్యతకు ఒక స్కోరు కేటాయించవచ్చు.

ఈ ప్రక్రియలో కృత్రిమ మేధస్సు సాధనాలను ఉపయోగిస్తారని పేరు వెల్లడించని ఆ పోలీసు అధికారి తెలిపారు.

ఈ కేసులో గెయిట్ అనాలసిస్ ఎందుకు?

కేతన్ అగర్వాల్ హత్య జరిగిన రోజు లోహగఢ్ కోట సమీపంలో ముసుగు ధరించిన వ్యక్తి నడుస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది.

ఈ కేసులో మొదట చేతన్ చౌధురి పేరు ఎఫ్ఐఆర్‌లో చేర్చలేదు. సియాను ప్రశ్నించిన తర్వాతే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల్లో ఉన్న వ్యక్తి చేతనేనా అనేది తేల్చుకునేందుకు పోలీసులు గెయిట్ అనాలసిస్ ప్రక్రియను ఉపయోగిస్తున్నారు.

సియా గోయల్‌ను ఘటనా స్థలానికి తీసుకెళ్లి క్రైమ్ సీన్ రీక్రియేషన్ చేసినప్పుడు సంఘటన ఎలా జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు అగర్వాల్ బరువుకు సరిపోయే ఒక డమ్మీ బొమ్మను ఉపయోగించారు.

జూన్ 18న చేతన్ ధరించి ఉన్నాడని వారు భావిస్తున్న హూడీ, హెడ్‌ఫోన్‌లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఇది కోర్టులో చెల్లుతుందా?

ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872లో సెక్షన్ 45,సెక్షన్ 65 A కింద గెయిట్ అనాలసిస్‌ను కోర్టులు ఆధారంగా పరిగణిస్తాయి

వ్యక్తిగత గుర్తింపును నిర్థరించే ప్రక్రియలో ఫోరెన్సిక్ సైన్స్‌లో భాగమైన నడక విశ్లేషణను తప్పనిసరిగా నిపుణుడే నిర్వహించాలి అనే విషయం గమనించాలి. అలాంటప్పుడు ఆ నిపుణుడి సాక్ష్యాన్ని కోర్టులు పరిగణనలోకి తీసుకుంటాయి.

కేసు విచారణలో ఎలక్ట్రానిక్ సాక్ష్యాధారాల గురించి 65A నిర్దేశిస్తుంది. కంప్యూటర్ ఆధారిత విశ్లేషణ జరిగే సందర్భాల్లో ఈ సెక్షన్ వర్తిస్తుంది.

2021లో ముంబైలో జరిగిన సకినాకా అత్యాచారం హత్య కేసులో మోహన్ చౌహాన్‌ను ముంబై ప్రత్యేక న్యాయస్థానం దోషిగా తేల్చి మరణశిక్ష విధించింది.

ఈ కేసులో నేరాన్ని నిర్ధరించడానికి గెయిట్ అనాలసిస్‌ను ఉపయోగించారు. గతంలోనూ దీన్ని ఆధారంగా పరిగణించినప్పటికీ చాలా కొద్ది కేసుల్లోనే మాత్రమే ఉపయోగించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)