You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
"కోర్టు, విచారణ, ఆ బాధ.. ఇవన్నీ ఎందుకు?", రేప్‌కు గురైన బాలిక ఆవేదన
- రచయిత, లారా కూన్స్‌బర్గ్
- హోదా, సండే విత్ లారా కూన్స్‌బర్గ్
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
హెచ్చరిక: ఈ కథనంలోని కొన్ని అంశాలు మిమ్మల్ని కలవరపరచవచ్చు.
తనపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు టీనేజ్ బాలురకు జైలు శిక్ష విధించకుండా వదిలేస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చినప్పుడు "నా ముఖంమీద చాచికొట్టినట్లు" అనిపించిందని బాధితురాలు బీబీసీతో చెప్పారు.
"నాకు ఇలా చేయడం వల్ల ప్రయోజనం ఏంటి?" అని 16 ఏళ్ల ఆ అమ్మాయి ప్రశ్నిస్తున్నారు. బీబీసీ ప్రతినిధి లారా కూన్స్‌బర్గ్‌తో "సండే విత్ లారా కూన్స్‌బర్గ్" కార్యక్రమంలో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు.
న్యాయమూర్తి "వారు చేసింది తప్పే కానీ, వాళ్లను వదిలేయడం చట్టం దృష్టిలో తప్పేమీ కాదు. ఎందుకంటే, వాళ్లు ఇంకా పిల్లలే కాబట్టి" అని చెప్పారని ఆమె తెలిపారు. ఆమె తన గురించి, తన కుటుంబం గురించిన వివరాలను గోప్యంగా ఉంచారు.
'చిన్న వయసు' బాలురను 'నేరస్తులుగా' చిత్రీకరించడాన్ని తప్పిస్తూ జడ్జ్ నికొలస్ రౌలాండ్ ఇచ్చిన తీర్పును అటార్నీ జనరల్ సమీక్షించనున్నారు.
స్నాప్‌చాట్‌లో స్నేహితుడే రేప్ కేసులో దోషి
అత్యాచారం జరిగినప్పుడు ఆమెకు 15 ఏళ్లు. హాంప్‌షైర్‌లోని ఫోర్డింగ్‌బ్రిడ్జ్‌లో ఏవాన్ నది పక్కన ఉన్న అండర్‌పాస్‌లో ఈ ఘటన జరిగింది.
ఆ సమయంలో, తనపై అత్యాచారం చేసిన బాలురలో ఒకరిని కలిసేందుకు ఆమె అక్కడికి వెళ్లారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ స్నాప్ చాట్ ద్వారా వారిద్దరికీ పరిచయం ఏర్పడింది.
ప్రస్తుతం 15 ఏళ్ల వయసున్న ఆ ఇద్దరు నిందితులు 2025 జనవరిలో మరో బాధితురాలిపై పొలంలో అత్యాచారానికి పాల్పడిన కేసులోనూ దోషులుగా తేలారు. 14 ఏళ్ల వయసున్న మరో బాలుడుకి కూడా ఈ ఘటనలో ప్రమేయం ఉండటంతో కోర్టు అతన్ని కూడా దోషిగా తేల్చింది.
అత్యాచారం చేసిన రెండు సందర్భాల్లోనూ వారు ఆ సంఘటనలను తమ ఫోన్లలో చిత్రీకరించారు. తర్వాత, వాటిలోని కొన్ని దృశ్యాలను ఆన్‌లైన్‌లో షేర్ చేశారు.
సౌతాంప్టన్ క్రౌన్ కోర్టులో న్యాయమూర్తి తీర్పును చదువుతూ "నేరాల తీవ్రతను" నొక్కి చెప్పారు. అత్యాచారం చేస్తున్నప్పుడు ఫోన్‌లో చిత్రీకరించడం "మరింత తీవ్రమైనది"గా పేర్కొన్నారు. ఆ తర్వాత వారి వయసు గురించి ప్రస్తావిస్తూ, విచారణ సమయంలో వారి ప్రవర్తనను ఆయన ప్రశంసించారు.
తనకే శిక్ష పడినట్లుందన్న బాధితురాలు
కోర్టు తీర్పును మార్చాలని, నేరానికి పాల్పడిన పిల్లలను జైలుకు పంపాలని బాధిత బాలిక, ఆమె కుటుంబం కోరుతోంది.
కోర్టు తీర్పు "తీవ్రమైన నేరానికి చాలా చిన్న శిక్ష వేసినట్లు" ఉందని వారు అన్నారు.
"కోర్టుకు వెళ్లడం, విచారణ, సాక్ష్యాధారాల రూపంలో అన్నింటినీ మళ్లీ గుర్తుకుతెచ్చుకోవడం, అదే మళ్లీ జరుగుతున్నట్లు అనిపించడం, అంత బాధ నేనెందుకు భరించాలి?" అని బాలిక వాపోయారు.
"అసలు దీనివల్ల ఉపయోగమేంటి? ఈ ప్రక్రియ అంతా ఎందుకు? చివరికి అంతా బానే ఉందని చెప్పడానికేనా? అనిపించింది" అని ఆమె అన్నారు.
ఈ ఘటన నుంచి కోలుకోవడానికి తనకు 6 నెలలు పట్టిందని ఆమె చెప్పారు.
"ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, నేను ఇందులో ఓడిపోతున్నాను. మానసికంగా కుమిలిపోతున్నాను. నాకు సాయం అవసరమైంది. అయితే, అది ఎలా పొందాలో నాకు తెలియదు. అందుకే మాట్లాడాను" అని ఆమె చెప్పారు.
అత్యాచారం జరిగినప్పటి నుంచి "బాధ, కోపం, ఒత్తిడి, అలసటగా ఉన్నట్లు అనిపించేది. నా చదువు, ఉద్యోగం, అసలు నా జీవితం కూలిపోతున్నట్లు అనిపిస్తున్నా, దాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నాలు మినహా మరేవీ ఆలోచించలేకపోతున్నా" అని ఆమె చెప్పారు.
ప్రధానికి బాధితురాలి తల్లి ప్రశ్నలు
ఈ తీర్పును అప్పీలు కోసం పైకోర్టుకు పంపాలా వద్దా అని తేల్చేందుకు అటార్నీ జనరల్‌కు 28 రోజుల గడువుంటుంది.
క్యాబినెట్ మినిస్టర్ డారెన్ జోన్స్ ఈ కార్యక్రమంలో బీబీసీ ప్రతినిధితో మాట్లాడారు. అటార్నీ జనరల్ ఈ కేసు విషయంలో వీలైనంత వేగంగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు.
"ఇందులో వేగంగా నిర్ణయం తీసుకోవాలని మేమంతా కోరుకుంటున్నాం" అని ఆయన అన్నారు.
"ఆ బాలికలకు, వారి కుటుంబాలకు న్యాయం జరగాల్సిందే. అలాంటి పరిస్థితిలో ఉన్న ఇతర బాలికలకు కూడా న్యాయం జరగాల్సిందే."
తన కూతురిపై అత్యాచారం జరిగినట్లు తెలిసినప్పుడు "ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోయినట్లు" అనిపించిందని బాధితురాలి తల్లి చెప్పారు.
"కాళ్ల కింద నేల బద్దలై అందులో కూరుకుపోయినట్లు అనిపించింది" అని అన్నారు.
ఈ కేసులో తమకు సాయం చేయాలని ఆమె ప్రధాన మంత్రికి విజ్ఞప్తి చేశారు.
"దయచేసి సాయం చేయండి. ఇదే మీ కూతురో, మేనకోడలో, మీ కొడుకో, మేనల్లుడో, మీ కుటుంబ సభ్యులో అయితే మీరు ప్రశాంతంగా ఉండగలరా?" అని ఆమె ప్రశ్నించారు.
"మేం బాధలో ఉన్నాం. దీనివల్ల ఎవరూ సంతోషంగా లేరు. మీరు సాయం చేసే స్థాయిలో ఉన్నారు, మాకు సాయం చేయండి" అని ఆమె అభ్యర్థించారు.
న్యాయమూర్తి తీర్పు వింటున్నప్పుడు తనకు అక్కడే కూలిపోయినట్లు అనిపించిందని బాలిక తల్లి భాగస్వామి అన్నారు.
"బాధితులు బాధ పడుతుంటే, నేరస్తులు ఎలాంటి శిక్ష లేకుండా తప్పించుకుంటున్నారు" అని ఆయన అన్నారు.
ఇద్దరు బాలికలపై అత్యాచారానికి పాల్పడటం, అశ్లీల దృశ్యాల చిత్రీకరణ ఆరోపణల కింద 15 ఏళ్ల దోషుల్లో ఒకరికి 180 రోజుల కఠినమైన పర్యవేక్షణ, నిఘా కింద మూడేళ్ల యూత్ రిహాబిలిటేషన్ ఆర్డర్ (10 నుంచి 17 ఏళ్ల లోపు వారికి వేసేశిక్ష) విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.
మరో 15 ఏళ్ల బాలుడికి కూడా ఇలాంటి శిక్షే విధించింది న్యాయస్థానం. మూడు అత్యాచార ఆరోపణలు, నాలుగు అశ్లీల దృశ్యాల చిత్రీకరణ కింద అతనికి ఈ శిక్ష విధించారు.
2025 జనవరిలో జరిగిన అత్యాచార ఘటనలో మిగిలిన ఇద్దరు దోషులను ప్రోత్సహించిన 14 ఏళ్ల బాలుడికి 18 నెలల యూత్ రిహాబిలిటేషన్ ఆర్డర్ జారీ చేసింది.
ప్రభుత్వం ఏం చెబుతోంది?
ఈ కేసులో న్యాయం జరగలేదని రిఫార్మ్ యూకే ఎంపీ రాబర్ట్ జెన్‌రిక్ అన్నారు.
"న్యాయమూర్తి పెద్ద తప్పు చేశారని అనుకుంటే.. అది ఈ కేసులోనే అని నేను భావిస్తున్నా. అందుకు వారు బాధ్యత వహించాలి" అని ఆయన సండే విత్ లారా కూన్స్‌బర్గ్ కార్యక్రమంలో చెప్పారు.
కార్యక్రమం తర్వాత, జోన్స్, జెన్‌రిక్‌తో బాలిక కుటుంబ సభ్యులు వేర్వేరుగా భేటీ అయ్యారు.
ఈ కేసు తనను బాధించిందని కన్సర్వేటివ్ నాయకురాలు కెమీ బాడెనోచ్ అన్నారు. "ఏ నేరం కూడా ఇంత కంటే ఘోరంగా ఉండదు, అయినప్పటికీ కోర్టు విధించిన శిక్ష అసలు శిక్షే కాదు" అని ఆమె చెప్పారు.
ఈ కేసు విషయంలో తాను తీవ్రంగా కలత చెందుతున్నానని, బాధిత కుటుంబానికి అండగా నిలిచేందుకు తమ కార్యాలయం వారిని సంప్రదిస్తుందని ఇంగ్లండ్ చిల్డ్రన్స్ కమిషనర్ డేమ్ రాచెల్ డిసౌజా చెప్పారు.
"ఈ దేశంలో ఏ బాలిక/ యువతి కూడా తనకు అలా జరగవచ్చని, తనకు న్యాయం దక్కదని భావించకూడదు" అని రాచెల్ అన్నారు.
"ఈ భయంకరమైన కేసు వివరాలు తెలుసుకుని బాధ పడుతున్న వారిలో మేం కూడా ఉన్నాం. బాధితుల తరఫున ఉంటాం" అని ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు.
"న్యాయాధికారులు ఈ కేసును అత్యంత శ్రద్ధతో వేగంగా సమీక్షిస్తున్నారు" అని ప్రభుత్వం ప్రకటించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)