You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆమె ఇంటి కింద 40వేల శవాలు.. ఆరా తీస్తే ఏం తెలిసిందంటే?
- రచయిత, జులియా డియాస్ కార్నెయిరో
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
మెర్సెడ్ గైమారయేస్ దోస్ అంజోస్ అనే ముగ్గురు పిల్లల తల్లి ఆతృతగా చూస్తుండగా బిల్డర్లు ఆమె ఇంటి విస్తరణ పనులు మొదలుపెట్టారు.
అది 1866నాటి ఇల్లు. ఆరేళ్లపాటు పొదుపు చేసుకున్న మొత్తంతో ఆమె ఆ ఇంటి విస్తరణ పనులు మొదలుపెట్టారు. ఆ ఇల్లు రియో డి జనరీ పోర్ట్ ప్రాంతంలో ఉంది. 1996 జనవరి 8న ఆ పనులు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం మెర్సెడ్ గైమారయేస్ ఇందు కోసం ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్నారు.
కానీ కొన్ని గంటల్లోనే ఇంటి విస్తరణ పనుల్లో అనూహ్యంగా ఎముకలు బయటపడ్డాయి.
ఇంటి నిర్మాణ పనులు చేసేవారు మొదట అవి జంతువుల ఎముకలు అయ్యుంటాయని భావించారు. కానీ మెర్సెడ్‌కు ఎందుకో అలా అనిపించలేదు. శిథిలాలను జాగ్రత్తగా పరిశీలిస్తుండగా పెద్దవాళ్ల పళ్ల వరుస కనిపించింది. 'ఇది కుక్కది కాదు..మనిషిది' అని నేను బిల్డర్‌కు చెప్పాను. వెంటనే ఆయన జీసస్‌ను తలచుకున్నారు'' అని మెర్సెడ్ బీబీసీ న్యూస్ బ్రెజిల్‌కు చెప్పారు.
‘ఆ అజ్ఞాత స్థలం ఇదే’
కాసేపటి తర్వాత మెర్సెడ్‌కు ఓ చిన్న పళ్ల సెట్ కనిపించింది.
'''ఇవి చిన్న పిల్లలవి' అని నేను చెప్పగానే ఆయన ఏడవడం మొదలుపెట్టారు. అందరూ నిశ్చెష్టులయ్యారు''
''మరిన్ని ఎముకల అవశేషాలు కనిపించాయి. వాటిలో చాలా వరకు పగిలిపోయి ఉన్నాయి'' అని మెర్సెడ్ తెలిపారు.
వాటన్నింటినీ వేర్వేరు బాక్సుల్లో చేర్చారు మెర్సెడ్. తర్వాత అనేక ఊహాగానాలు వ్యాపించాయి.
''మేం వెయ్యి రకాల ఆలోచనలు చేశాం. ఇంటి పాత యజమానులు జనాలను చంపి ఇక్కడ పాతిపెట్టి ఉంటారా లేక ఎవరన్నా సీరియల్ కిల్లర్ ఈ హత్యలు చేశారా'' వంటి ఆలోచనలు చేశాం. కానీ సమాధానాలు వెంటనే లభించాయి. ఆ ఇంటికి పొరుగునే ఉండే వ్యక్తి, ఆ ప్రాంతం చరిత్ర బాగా తెలిసిన వ్యక్తి ఒకరు పాత మ్యాప్‌తో అక్కడికి వచ్చారు.
''ఆయన నా వైపు చూసి నువ్వు శ్మశానంపైన నివసిస్తున్నావు. బానిసలుగా తీసుకొచ్చిన ప్రజలను ఇక్కడ పూడ్చిపెట్టేవారు'' అన్నారు.
అప్పుడు మెర్సెడ్‌కు ఓ విషయం తెలిసింది. న్యూ బ్లాక్స్ (కొత్త నల్లజాతి వ్యక్తులు)ను 1770 నుంచి 1830 మధ్య ఓ చోట పూడ్చిపెట్టారని, కానీ అదెక్కడో ఎవరికీ తెలియదని ఆమె విన్నారు. 40వేల మందిని అక్కడ పూడ్చిపెట్టినట్టు ఆమె అంచనా. ఆ స్థలం తన ఇంటికిందే ఉందని ఇప్పుడామెకు అర్ధమైంది.
చరిత్రకారులకు చాలా కాలం ఆ స్థలం సంగతి తెలుసు. చర్చి రికార్డుల్లో కూడా ఉంది. కానీ నగరం విస్తరించేకొద్దీ ఆ స్థలం మరుగునపడిపోయింది. దాని సంగతి అందరూ మర్చిపోయారు.
బ్రెజిల్‌కు కొత్తగా బానిసలుగా తీసుకొచ్చిన ఆఫ్రికన్లను ''న్యూ బ్లాక్స్'' అని పిలిచేవారు. వారిలో చాలా మంది అప్పటికి పోర్చుగీస్ మాట్లాడేవారు కాదు.
‘9 లక్షల మంది ఆఫ్రికన్లను బానిసలుగా మార్చి..’
''నా ఇంటి కింద బ్లాక్ హోలోకాస్ట్ ఒకటి కనిపించింది'' అని మెర్సెడ్ చెప్పారు. తన సొంత ఇంటి నేల కింద అప్పుడే రూపుదిద్దుకున్న చిన్నారుల పళ్లు సహా ఎముకలను గుర్తించిన తర్వాత కలిగిన షాక్‌ను గుర్తుచేసుకుంటూ ఆమె ఈ మాటలు చెప్పారు.
''మాకు ఈ విషయం అసలు తెలియదు. ఇది ఒకప్పుడు మనుషులను అమ్మి, పాతిపెట్టిన స్థలమని మాకెవరూ చెప్పలేదు. చరిత్ర మరుగునపడిపోయింది'' అని ఆమె అన్నారు.
దగ్గరలో వలోంగో వార్ఫ్ అనే ఓడరేవు ఉండేది. ఆఫ్రికన్లను బానిసలుగా తీసుకొచ్చిన నౌకలు అక్కడికే వచ్చేవి. 18వశతాబ్దం చివరి నుంచి 1831లో ఇది పూర్తయ్యేవరకు 9లక్షలమంది ఆఫ్రికన్లను బ్రెజిల్‌కు మానవ అక్రమ రవాణా చేశారని యునెస్కో తెలిపింది.
బ్రెజిల్‌లోని ఇతర నగరాల కన్నా రియో డి జనీరోకు ఎక్కువమంది బానిసలను తీసుకొచ్చారు. మూడు శతాబ్దాలకు పైబడిన కాలంలో దాదాపు 48లక్షలమంది ఆఫ్రికన్లను బలవంతంగా బ్రెజిల్‌కు తరలించారు. అమెరికా ఖండంలో మిగిలిన దేశాలకన్నా ఎక్కువగా ఇక్కడకు బానిసలను తరలించారని అమెరికాలోని హార్వర్డ్ యూనివర్శిటీకి చెందిన ట్రాన్స్-అట్లాంటిక్ స్లేవ్ ట్రేడ్ డేటాబేస్ తెలిపింది.
అక్కడకు రాకముందే దాదాపు 3లక్షలమంది మరణించారని అమెరికాకు చెందిన ఎమోరీ యూనివర్శిటీ తెలిపింది.
వ్యాధుల బారిన పడడం, తీవ్ర అలసట, నీరసం వంటివాటితో గోడౌన్లకు చేరుకున్న వెంటనే కొందరు చనిపోయేవారు వారిని గోడౌన్లలో బంధించేవారు. బానిసలుగా అమ్మేవరకు అక్కడే ఉంచేవారు. చనిపోయినవారిని శ్మశానానికి తీసుకెళ్లేవారు. ఇప్పుడాశ్మశానం మెర్స్‌డ్ ఇంటి కిందే ఉంది.
చారిత్రక సంపద
బానిసత్వాన్ని 1888లో చివరిగా రద్దు చేసిన పాశ్చాత్య దేశం బ్రెజిల్.
దశాబ్దాలు గడిచినా ఈ చీకటి చరిత్ర గురించి కొంత మందికే తెలుసు. 1990ల్లో మెర్సెడ్‌కు ఇది కనిపించేనాటికి ఈ ప్రాంతం గురించి విద్యావేత్తలు తప్ప ఎవరికీ పెద్దగా తెలియదు.
కానీ 2011 తర్వాత మార్పు రావడం మొదలయింది. ఒలింపిక్స్ కోసం వలోంగో వార్ఫ్‌ను తిరిగి అభివృద్ధి చేస్తున్నప్పుడు అనేక విషయాలు బయటికొచ్చాయి. తర్వాత అది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఈ ప్రాంతం చరిత్రపై ప్రపంచం దృష్టి పడింది.
తన ఇంటి ప్రాంగణంలో చారిత్రక నిధి ఉందని మెర్స్‌డ్‌కు తెలుసు. కానీ దాంతో ఏం చేయాలో తెలియదు.
మొదట్లో అప్పుడప్పుడు మాత్రమే ఆమె ఆ ఇంటిని తెరిచేవారు. నల్లజాతి ఆత్మగౌరవ దినోత్సవం, బానిసత్వ నిర్మూలన దినోత్సవం వంటి సెలవు రోజుల్లోనే తెరిచేవారు.
''అది చాలా కష్టమైన విషయం. శ్మశానాన్ని చూడాలని ఎవరనుకుంటారు? ? అని ఆమె అన్నారు. నెమ్మదిగా అందరికీ ఆసక్తి పెరిగింది. అదే సమయంలో ఈ స్థలాన్ని పరిరక్షించాలని మానవ హక్కుల కార్యకర్తలు కోరసాగారు.
ఇతరులతో కలిసి 2005లో మెర్సెడ్ ప్రెటోస్ నొవోస్ (ఐపీఎన్ – బ్రెజిల్‌కు కొత్తగా తీసుకొచ్చిన ఆఫ్రికన్లు) పరిశోధన, స్మృతి సంస్థను నెలకొల్పారు.
ఆ ప్రాంతం క్రమంగా స్మారక కేంద్రంగా మారింది. చెత్తతో నిండిన ప్రాంతం శాశ్వత ఎగ్జిబిషన్‌తో స్మారక కేంద్రమైంది. ఒకప్పుడు స్విమ్మింగ్‌పూల్ ఏర్పాటుచేయాలనుకున్న ప్రాంతంలో కేఫ్, చిన్న షాప్, అట్లాంటిక్ బానిసల వ్యాపారం, ఆఫ్రికన్ల ప్రవాస చరిత్రపై ప్రత్యేక లైబ్రరీ ఏర్పాటయ్యాయి.
నేలలో అమర్చిన అద్దం ప్యానెల్ నుంచి కిందకు చూస్తే ఎర్ర మట్టిలో కూరుకుపోయి ఉన్న లేక్కలేనన్ని ఎముకలు కనిపిస్తాయి.
నాడు శ్మశానం.. నేడు స్మారక కేంద్రం
దాన్ని శ్మశానంగా చెప్పడం సరైనది కాదని మెర్సెడ్ అంటారు.
''ఇవి మృతదేహాలను విసిరేసిన గుంతలు'' అని ఆమె అన్నారు. ''వాసన వస్తున్నాయని కొన్ని మృతదేహానలు కాల్చేసేవారు. ఒక మృతదేహంపై మరొకటి విసిరేయడంతో కింద ఉన్న మృతదేహాలు నుజ్జునుజ్జయ్యేవి'' అని ఆమె అన్నారు.
ఇది రహస్యంగా చేసిన పని కాదని చర్చి రికార్డులు ధ్రువీకరిస్తున్నాయి. చాలా మంది పేరు తెలియకుండా చనిపోయినప్పటికీ మరణాలను అధికారికంగా నమోదు చేసేవారు. తేదీలు, షిప్పులు, వాళ్లేప్రాంతం నుంచి వచ్చారు వంటి వివరాల ఆధారంగా మాత్రమే గుర్తించేవారు. ఎవరివన్నా పేర్లు కనిపించాయంటే అవి బానిసల యజమానుల పేర్లు మాత్రమే.
''నాలుగు ఇళ్ల అడుగున ఈ శ్మశానం ఉంది. అంగోలా, కాంగో, మొజాంబిక్యూకు చెందిన చిన్నారులు, పిల్లలు, యువత, గర్భిణులు వాళ్లల్లో ఉన్నారు'' అని మెర్సెడ్ చెప్పారు.
స్మారక కేంద్రం పక్కనే ఉన్న అదే ఇంట్లో ఇప్పుడు 69ఏళ్ల వయసులో మెర్సెడ్ నివసిస్తున్నారు.
''నేల తవ్వితే ఎముకలే కనిపిస్తాయి'' అని ఆమె అన్నారు.
దాదాపు మూడులక్షలమంది ఈ ప్రాంతాన్ని సందర్శించి ఉంటారని అంచనా. ఇంకా వేలాదిమంది ఆఫ్రికన్ హెరిటేజ్ సర్క్యూట్ అనే చారిత్రక ప్రాంతాన్ని గైడ్‌లతో కలిసి సందర్శిస్తున్నారు.
ఈ సంస్థ 21వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పక్కన కొత్త సాంస్కృతిక కేంద్రం ప్రారంభించారు.
కవుల సమావేశాలు, సాంబా కళారూపాలు, కళాప్రదర్శనలు, వర్క్‌షాపులు, పుస్తకాల ఆవిష్కరణలు, పిల్లలకు రీడింగ్ క్లబ్స్ వంటివి నిర్వహిస్తామని మెర్సెడ్ చెప్పారు. స్కూళ్లు జరిగే సమయంలో ఇలాంటి కార్యక్రమాలు ఇప్పటికే జరుగుతున్నాయని కానీ ఐపీఎన్‌లో అందుకు స్థలం సరిపోవడం లేదని అన్నారు.
భవనం రెండో అంతస్తు పునర్ నిర్మాణానికి ఇప్పుడామె నిధులు సేకరిస్తున్నారు. సాయం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరినీ అడుగుతున్నామన్నారు.
ఆమె పని పూర్తవడానికి ఇంకా చాలా సమయముంది.
''ఇది చాలా సున్నితమైన విషయం. ఒక్కరోజు దీని గురించి మాట్లాడకపోయినా ప్రజలు దీన్ని మర్చిపోవడం మొదలవుతుంది'' అని మెర్సెడ్ అన్నారు.
''ఇది సాధారణమైన చోటు కాదు. ప్రత్యేకమైన స్థలం''
''తమను మర్చిపోకుండా చూడమని ఆఫ్రికా ప్రజలు నన్ను అడిగినట్టు నాకనిపిస్తుంటుంది'' అని మెర్సెడ్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)