కేరళలో ఎల్డీఎఫ్ ఓటమికి పినరయి విజయన్‌పై వ్యతిరేకతే కారణమా?

కేరళ, సీపీఎం, పినరయి విజయన్, కాంగ్రెస్

ఫొటో సోర్స్, Sivaram Venkitasubramanian/NurPhoto via Getty Images

ఫొటో క్యాప్షన్, పినరయి విజయన్ వైఖరిపై కొందరు విశ్లేషకులు విమర్శలు చేశారు(ప్రతీకాత్మక చిత్రం)
    • రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
    • హోదా, బీబీసీ కోసం
  • చదివే సమయం: 5 నిమిషాలు

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) నేతృత్వంలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఓటమి చాలా మందిని ఆశ్చర్యపరిచి ఉండవచ్చు. కానీ, ఆశ్చర్యకరంగా పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులపై ఈ ఫలితాల ప్రభావం పెద్దగా కనిపించడం లేదు.

భారత దేశంలో కమ్యూనిస్టు పార్టీలు అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కేరళ.

తమ పేర్లు వెల్లడించవద్దనే షరతుపై కొందరు పార్టీ కార్యకర్తలు బీబీసీతో మాట్లాడుతూ, "పార్టీ, ప్రభుత్వ పనితీరు పట్ల సంతోషంగా లేమంటూ చాలామంది పార్టీ మద్దతుదారులు, సానుభూతిపరులు పార్టీని వ్యతిరేకించారు" అని అన్నారు.

"ఇది మా ప్రభుత్వ సంక్షేమ పథకాలపై లేదా అభివృద్ధిపై వ్యతిరేకత కాదు. కానీ, మా పని విధానం ప్రజలకు నచ్చలేదని ఇప్పుడు మాకు అర్థమైంది" అని పార్టీ నాయకుడొకరు వ్యాఖ్యానించారు.

సీనియర్ రాజకీయ వ్యాఖ్యాతలు, విశ్లేషకులు కూడా ఈ విషయంపై బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

"ఇది ప్రభుత్వ వ్యతిరేకత కాదు. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై ఉన్న వ్యతిరేకత. అధికారం మొత్తం ఆయన చేతుల్లోనే కేంద్రీకృతమైంది. ఆయనే ప్రభుత్వం, ఆయనే పార్టీ, ఆయనే ఎల్డీఎఫ్" అని రాజకీయ వ్యాఖ్యాత, మాజీ విద్యావేత్త జె.ప్రభాష్ బీబీసీతో అన్నారు.

కేరళ సాహిత్య అకాడమీ అధిపతి కె.సచ్చిదానంద కొన్ని నెలల క్రితం చేసిన వ్యాఖ్యలను సీనియర్ రాజకీయ విశ్లేషకులు రాధాకృష్ణన్ ఉటంకించారు.

లెఫ్ట్ ఫ్రంట్ మద్దతుదారుడైన సచ్చిదానంద్ తాను ఎల్డీఎఫ్‌కు ఓటు వేయబోనని చెప్పడం ద్వారా కొద్దికాలం కిందట ఒక వివాదాన్ని సృష్టించారు.మూడోసారి ఎల్డీఎఫ్‌కు ఓటు వేయకపోవడం మంచిదని, లేదంటే పశ్చిమ బెంగాల్‌లో సీపీఎంకు జరిగినట్టుగా కేరళలో లెఫ్ట్ ఫ్రంట్‌ నాశనమవుతుందని సచ్చిదానంద హెచ్చరించారు.

కేరళ, సీపీఎం, పినరయి విజయన్, కాంగ్రెస్

సీపీఎంకు అన్ని సీట్లు ఎందుకు తగ్గాయి?

"ప్రభుత్వం చేసిన మంచి పనులకు విజయన్‌కు ఘనత దక్కాలి. అదే సమయంలో, ప్రతికూల విషయాలకు కూడా ఆయన బాధ్యత వహించాలి. ప్రతిపక్షం, మీడియా, సామాన్య ప్రజలపై ఆయన అప్రజాస్వామిక వైఖరి, విమర్శకుల పట్ల ఆయన అహంకారపూరిత ప్రవర్తన, పార్టీలో ప్రజాస్వామ్యం పూర్తిగా కొరవడటం వంటివి ప్రధాన సమస్యలు" అని రాధాకృష్ణన్ విశ్లేషించారు.

ఈ ఓటమి పార్టీకి పెద్ద ఎదురుదెబ్బని సీపీఎం కార్యదర్శి ఎం.వి.గోవిందన్ విలేఖరులతో అన్నారు. అయితే "ఎల్డీఎఫ్ ఈ ఓటమిని సమీక్షించి, అధ్యయనం చేస్తుంది, ఆ తర్వాత అవసరమైన సంస్కరణలు చేపడుతుంది. దీనికి ప్రజల మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నాం" అని ఆయన వ్యాఖ్యానించారు.

2021 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం గెలుచుకున్న 99 సీట్లతో పోలిస్తే, ఈసారి కేవలం 25 శాతం.. అంటే 26 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. మొత్తం 21 మంది మంత్రులలో 13 మంది ఓడిపోయారు. తొలిసారిగా 8 మంది పార్టీ ప్రముఖ నాయకులు రాజీనామా చేసి, తమ మాజీ సహచరులపై పోటీ చేశారు. వీరిలో కనీసం ముగ్గురు గెలుపొందారు.

కేరళ, సీపీఎం, పినరయి విజయన్, కాంగ్రెస్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, కాంగ్రెస్ నేత వీడీ సతీశన్

వీరిలో అత్యంత ప్రముఖుడు మాజీ మంత్రి జి.సుధాకరన్. ఆయన కాంగ్రెస్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 25,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వి.కుంజికృష్ణన్, టి.కె.గోవిందన్ కూడా కాంగ్రెస్ టిక్కెట్లపై భారీ మెజారిటీతో గెలిచారు. కొందరు బీజేపీలో కూడా చేరారు. కానీ, గెలవలేకపోయారు.

యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ 102 సీట్లు గెలుచుకోవడం అసాధారణం.

"సీపీఎంలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోవడం వల్లే ఇది జరిగింది. సాధారణంగా సీపీఎం అంతర్గత చర్చలకు అవకాశం కల్పిస్తుంది. కానీ, పినరయి విజయన్ అంతర్గత చర్చలను ప్రోత్సహించలేదు. గత ఐదేళ్లుగా పార్టీపై ప్రభుత్వ నియంత్రణ స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా పార్టీ మార్గదర్శకత్వంలో ప్రభుత్వం పనిచేస్తుంది" అని రాజకీయ విశ్లేషకులు ఎన్.పి.చెకుట్టి అన్నారు.

కేరళ, సీపీఎం, పినరయి విజయన్, కాంగ్రెస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 63 స్థానాలను గెలుచుకుంది.

విజయన్‌కు వ్యతిరేకంగా ప్రభావం చూపిన ఇతర అంశాలు

ఓట్ల లెక్కింపు సమయంలో విజయన్ స్వయంగా కొన్ని ఉత్కంఠభరిత క్షణాలను ఎదుర్కొన్నారు. ఆయన చివరకు 19,247 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2021లో, 50 వేల ఓట్లకు పైగా వచ్చిన మెజార్టీతో పోలిస్తే ఇది చాలా తక్కువ.

"ఒక రాజకీయ సంస్థ తనను తాను సంస్కరించుకునే సామర్థ్యాన్ని కోల్పోయినప్పుడు ఓటర్లు ఎన్నికల ద్వారా స్పందిస్తారు. ఈ రోజు కేరళలో కనిపిస్తున్నది వామపక్ష భావజాలాన్ని పూర్తిగా తిరస్కరించడం కాదు. కేంద్రీకృత నాయకత్వానికి, ముఖ్యంగా పినరయి విజయన్‌కు వ్యతిరేకంగా వేసిన ఓటు ఇది. వామపక్ష వ్యతిరేక మార్పు కంటే ఎక్కువగా నాయకత్వ వ్యతిరేక భావన" అని చెకుట్టి విశ్లేషించారు.

అయితే, రాధాకృష్ణన్ భిన్నమైన విశ్లేషణ చేశారు.

"ఈ రోజుల్లో టెలివిజన్, సోషల్ మీడియానే ప్రధాన చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి, మౌలిక సదుపాయాల పనులకు పెద్దగా ప్రాధాన్యత లభించడం లేదు. ప్రజలు అది ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నారు. కెమెరా ముందు మీరు ఎలా ప్రవర్తిస్తారు, ఇతరులతో ఎలా వ్యవహరిస్తారు అనేదే ఇప్పుడు ముఖ్యం" అని విశ్లేషించారు.

"నాకు తెలిసి పదేళ్లు చాలా సుదీర్ఘ కాలం. ఈ పదేళ్లలో, ప్రజలకు ఈ వ్యవహారశైలిపై అయిష్టత కలిగివుండొచ్చు. ఈ కారణాలన్నీ కలిసి ఒక రకమైన అలజడిని సృష్టించాయి" అని ఆయన అన్నారు.

కేరళ, సీపీఎం, పినరయి విజయన్, కాంగ్రెస్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, మైనార్టీలు ఎల్డీఎఫ్‌కు దూరమయ్యారని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

'మైనారిటీలు దూరం కావడం'

మైనారిటీ వర్గాల్లో కాంగ్రెస్ తన పట్టు పెంచుకునేందుకు దోహదపడిన మరో కారణాన్ని ప్రొఫెసర్ ప్రభాష్ ప్రస్తావించారు.

రాష్ట్ర జనాభాలో ముస్లింలు, క్రైస్తవులు సుమారు 46 శాతం ఉన్నారని, వీరిలోని ఒక వర్గం తమ ప్రయోజనాలకు సీపీఎం ప్రాధాన్యమిస్తుందని భావించి 2021 ఎన్నికల్లో ఆ పార్టీకి మద్దతు ఇచ్చిందని ఆయన అంటున్నారు.

"వెల్లాపల్లి నటేశన్ ఈజవ వర్గానికి చెందిన సంస్థ శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగమ్(ఎస్ఎన్‌డీపీ)కు నాయకత్వం వహిస్తున్నారు. ఆయన ముస్లింలకు వ్యతిరేకంగా పదేపదే తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రకటనల లక్ష్యం సీపీఎంకు హిందూ ఓట్లను సమీకరించడమే. హిందూత్వ రాజకీయాలపై సీపీఎం మెతక వైఖరి అవలంబించింది. దీనివల్ల ఎల్డీఎఫ్‌కు ముస్లింల మద్దతు తగ్గింది. అదే సమయంలో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో క్రైస్తవ మిషనరీలపై జరిగిన దాడులు క్రైస్తవ ఓట్లను కాంగ్రెస్ వైపు మళ్లించాయి. ఫలితంగా రెండు మైనారిటీ వర్గాలు ఏకమై కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచాయి."

"నటేశన్ ప్రకటనలను సీపీఎంలో ఎవరూ వ్యతిరేకించకపోవడం గమనార్హం. ఎందుకంటే, పినరయి విజయన్‌కు వెల్లాపల్లి నటేశన్ సన్నిహితుడని ప్రతి కార్యకర్తకూ తెలుసు" అని ఆయన విశ్లేషించారు.

మరోవైపు ప్రత్యర్థి పక్షం పూర్తి స్పష్టతతో ముందుకు సాగింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన వి.డి. సతీశన్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రమేష్ చెన్నితాల సమన్వయంతో పార్టీని క్షేత్రస్థాయి వరకూ తీసుకెళ్లారు.

రాష్ట్రం లౌకిక కూటమికి అనుకూలంగా ఓటు వేసింది.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు ఐక్యంగా కృషి చేసిందని ప్రొఫెసర్ ప్రభాష్ అభిప్రాయపడ్డారు. ఎందుకంటే, "ఇది పార్టీకి జీవన్మరణ సమస్య. ఒకవేళ వరుసగా మూడోసారి ప్రతిపక్షంలోనే ఉండాల్సి వస్తే.. పార్టీ తనను తాను రక్షించుకోవడం కష్టంగా ఉండేది" అని ఆయన అన్నారు.

సీపీఎం నేతలతోనూ మాట్లాడేందుకు ప్రయత్నించాం. కానీ, ఎవరూ అందుబాటులోకి రాలేదు. బీబీసీ పంపిన ప్రశ్నలకు వారు స్పందించిన వెంటనే ఈ కథనం అప్డేట్ అవుతుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)