సైనిక యూనిఫామ్ ఎవరైనా వేసుకోవచ్చా? సినిమాల్లో నటులు ఎలా ధరించగలుగుతున్నారు, చట్టాలు ఏం చెబుతున్నాయి?

    • రచయిత, పారా పద్దయ్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 6 నిమిషాలు

భారతీయ చిత్రాల్లో ఆర్మీ నేపథ్యంగా సాగే కథలు అనేకం కనిపిస్తాయి. 90ల చివరిలో వచ్చిన బాలీవుడ్ చిత్రం 'బోర్డర్‌'లో ప్రధాన పాత్రలు ఎక్కువ భాగం సైనిక దుస్తుల్లోనే కనిపిస్తాయి.

ఆ తర్వాత ఈ తరహా చిత్రాలకు కొంత గ్యాప్ వచ్చింది. 'యూరీ ది సర్జికల్ స్ట్రైక్' హిట్ కొట్టడంతో ఈ పరంపర మళ్లీ మొదలైంది.

కొన్ని వాస్తవ గాథల ఆధారంగా మరికొన్ని ఫిక్షనల్ క్యారెక్టర్లతో వెండితెరపైకి దూసుకొచ్చాయి. అలాగే ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ ఇతివృత్తంతో అనేక సినిమాలు, సిరీస్‌లు, డాక్యుమెంటరీలు వచ్చాయి.

ఈ తరహా సినిమాల్లో దేశభక్తి, త్యాగాలు, వీరోచిత పోరాటాలు, భావోద్వేగాలు, ఊహించని మలుపులు ఇలా సినిమాకు అవసరమైన కీలక రసాలను ఈ కథల్లో ఇమిడ్చే అవకాశం ఉండటం మరొక సానుకూల అంశం.

అయితే సినిమాలు, సిరీస్‌లలో స్టార్లు ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ యూనిఫామ్‌ వేసుకోవడం కనిపిస్తుంది. అసలు ఇది చట్టబద్దమేనా? త్రివిధ దళాలకు చెందిన యూనిఫామ్ విషయంలో చట్టాలు ఏం చెబుతున్నాయి?

నిబంధనలు ఏం చెబుతున్నాయి?

సినిమాల్లో వివిధ పాత్రధారులు సైనిక దుస్తులు ధరించడంపై చట్టపరంగా పూర్తిగా నిషేధం లేదు.

అయితే మిలిటరీ యూనిఫాం వేసుకున్నప్పుడు కొన్ని నియమాలను పాటించాలని చట్టం చెబుతోంది.

ఇండియన్ పీనల్ కోడ్‌1860లో ప్రత్యేకించి సెక్షన్ 140 సాయుధ బలగాల డ్రెస్ కోడ్ గురించి సూచిస్తోంది.

ప్రస్తుతం భారతీయ న్యాయ సంహిత 2023లో సెక్షన్ 168గా ఉంది.

దీని ప్రకారం సాధారణ వ్యక్తులు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ యూనిఫాం, యూనిఫాం మీద ఉండే చిహ్నాలు, అధికారిక హోదాలకు సంబంధించిన గుర్తులను అమర్చిన డ్రస్ వేసుకుని ఇతరులను నమ్మించేందుకు ప్రయత్నించడం నేరం.

అలాగే వాళ్లు ఇలాంటి డ్రెస్ వేసుకుని నిషేధిత స్థలాలు, సైనిక ప్రాంతాల్లోకి అక్రమంగా ప్రవేశించడం కూడా చట్ట విరుద్ధం.

ఇలాంటి నేరాలకు పాల్పడ్డవారికి మూడు నెలల జైలుశిక్ష లేదా 500 రూపాయల జరిమానా లేదా రెండూ కలిపి విధించవచ్చని సెక్షన్ 140 చెబుతోంది.

యూనిఫామ్ మీద చిహ్నాలు వాడవచ్చా?

1923 నాటి అధికార రహస్యాల చట్టంలోని సెక్షన్ 6.. ఎవరైనా చట్టపరంగా అనుమతి లేకుండా ఎయిర్‌ఫోర్స్, నేవీ, ఆర్మీ, పోలీస్ లేదా ఇతర అధికారిక యూనిఫాం లేదా దానిని పోలిన డ్రెస్‌ను మోసగించే ఉద్దేశంతో ధరించడాన్ని నిషేధిస్తుంది.

ఇలా చేసినందుకు గరిష్ఠంగా మూడేళ్లు జైలుశిక్ష పడుతుందని చట్టం చెబుతోంది.

ప్రభుత్వ చిహ్నాలు, బిరుదులు, రాజ చిహ్నాలు, పతకాలు, బ్యాడ్జ్‌లు ఇంకా ఇలాంటి వాటిని వ్యాపార లేదా వృత్తిపరమైన ప్రయోజనాల కోసం ఉపయోగించడాన్ని ది ఎంబ్లమ్స్ అండ్ నేమ్స్ ( ప్రివెన్షన్ ఆఫ్ ఇంప్రాపర్ యూజ్) యాక్ట్ 1950 నియంత్రిస్తోంది.

ఇందులో సినిమాల గురించి ప్రస్తావించకున్నా, సినిమా నిర్మించే సమయంలో నిర్మాణ సంస్థలు, బ్యాడ్జ్‌లు, చిహ్నాల నకళ్ల విషయంలో జాగ్రత్త వహించాలి.

సినిమాల్లో ఆర్మీ యూనిఫాం విషయంలో ఎలాంటి తప్పులు జరక్కుండా చూసేందుకు ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుంది.

చట్ట పరిధిని ఉల్లంఘించనంత వరకు సినిమాలలో ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ యూనిఫామ్ ఉపయోగించవచ్చు.

రక్షణ శాఖ మార్గదర్శకాలు

ఆర్మీ నేపథ్యంతో నిర్మించే సినిమాల విషయంలో కథ, కథనాలు, మిలటరీ డ్రెస్ కోడ్, చిహ్నాల విషయంలో చట్టానికి లోబడి ఉండాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.

సాయుధ బలగాలు కథాంశంగా సినిమా నిర్మించేటప్పుడు లొకేషన్లు, అనుమతుల విషయంలో రక్షణ శాఖ, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన హెడ్ క్వార్టర్స్ తమ గైడ్‌లైన్స్‌కు లోబడి సాయం అందిస్తాయి.

ఈ అనుమతుల జారీ ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది.

చిత్ర నిర్మాణానికి ముందు: నిర్మాణ సంస్థలు, నిర్మాతలు తమ చిత్ర కథ, స్క్రిప్టు, అఫిడవిట్, నష్టపరిహార పత్రం, బ్యాంక్ గ్యారెంటీతో అడిషినల్ ఇన్ఫర్మేషన్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్‌ లేదా సమాన హోదా ఉన్న మీడియా విభాగాన్ని సంప్రదించాలి.

చిత్రీకరణ ప్రారంభానికి ముందు అనుమతి తీసుకోవాలి.

నిర్మాణానంతర పరిశీలన: ఆర్మీ కథతో నిర్మించిన సినిమా లేదా సిరీస్‌ను రక్షణ మంత్రిత్వ శాఖ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ చూస్తాయి.

సినిమాలో అనుచిత దృశ్యాలు, సాయుధ దళాల ప్రతిష్ఠను దెబ్బ తీసేలా లేదా కించపరిచేలా ఉన్న దృశ్యాలను తొలగించాలి.

అధికారులు సూచించిన మేరకు మార్పులు చేయాలి.

ఫైనల్ క్లియరెన్స్: సినిమా విడుదలకు ముందు రక్షణ శాఖ లేదా సర్వీస్ ఆఫీస్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, నో డిమాండ్ సర్టిఫికెట్ (ఆర్థిక లావాదేవీలకు సంబంధించినది) తప్పనిసరిగా తీసుకోవాలి.

స్పష్టమైన ముందస్తు రాత పూర్వక అనుమతి లేకుండా ఫుటేజ్‌ను వాణిజ్యపరంగా ఉపయోగించకూడదు.

ఆర్మీ నేపథ్యంతో తీసే సినిమా, డాక్యుమెంటరీ, వెబ్ సిరీస్ ప్రసారానికి ముందు నిర్మాతలు ప్రసారానికి ముందు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పొందాలని 2020 జులైలో రక్షణ శాఖ సూచనలు జారీ చేసింది.

కొన్ని వెబ్ సిరీస్‌లలో సైనిక సిబ్బంది, వారి యూనిఫామ్‌లను వక్రీకరించి చిత్రీకరించడంపై ఫిర్యాదులు రావడంతో ఈ నిబంధన అమల్లోకి తెచ్చారు.

సైనిక దుస్తులలో నటులు నటించే టెలివిజన్ కంటెంట్, ప్రకటనలకు కూడా ఇది వర్తిస్తుంది.

భారత సైన్యం చిహ్నాల నమూనా ప్రతిరూపాలను వాడేటప్పుడు కచ్చితంగా అనుమతి తీసుకోవాలి.

సినీ పరిశ్రమ ఏం చేస్తోంది?

సినిమా నిర్మాణంలో కచ్చితత్వం, ప్రామాణికతను నిర్ధరించుకోవడానికి ప్రధాన చిత్ర నిర్మాణ సంస్థలు సాయుధ బలగాలను తరచుగా సంప్రదిస్తుంటాయి.

పాక్ భూభాగంలో సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యం ఆధారంగా రూపొందిన "యూరీ: ది సర్జికల్ స్ట్రైక్స్" లాంటి చిత్రాలు ఎన్ఓసీ ప్రక్రియతో పాటు ఆర్మీ నుంచి పరికరాలు, సాంకేతిక సలహాలు సహా అధికారిక మద్దతు తీసుకున్నాయి.

2021 జనవరి నుంచి 2022 జనవరి మధ్య కాలంలో ఇండియన్ ఆర్మీ 9 సినిమాలు, ఏడు డాక్యుమెంటరీలు లేదా టీవీ సిరీస్‌లకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ మంజూరు చేసింది.

జాతీయ భద్రత, క్రమశిక్షణ, సాయుధ బలగాలను కించపరిచడం లాంటి కారణాలతో ఒక ప్రతిపాదనను తిరస్కరించింది.

యూనిఫామ్, సాయుధ బలగాల గౌరవాన్ని కాపాడటం ఎంత ముఖ్యమో రక్షణ శాఖ ఆదేశాలు సూచిస్తున్నాయి.

వాణిజ్య ప్రకటనల కోసం, రక్షణ శాఖ నుండి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరాన్ని అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పునరుద్ఘాటించింది.

సైన్యంలో పని చేస్తున్న, చేసినవారు నటించాలనుకుంటే తప్పనిసరిగా ప్రత్యేక అనుమతులు పొందాలి.

సైన్యంపై సినిమా తీయడం అంత తేలికైన విషయం కాదని నటుడు, దర్శకుడు పర్హాన్ అక్తర్ గతంలో చెప్పినట్లు హిందూస్తాన్ టైమ్స్ కథనంలో పేర్కొంది.

"కొన్ని సినిమాలకు సైన్యం ఆశీస్సులు అవసరం. మీరు వారిని సంప్రదించినప్పుడు, వారు ప్రశ్నలు అడుగుతారు. మీ దగ్గర సమాధానాలు సిద్ధంగా ఉండాలి. మీరు ఆ సినిమాను ఎందుకు తీయాలనుకుంటున్నారో వారికి వివరించి చెప్పాలి" అని ఆయన అన్నారు.

"తెరపై యూనిఫాం ధరించడం గర్వకారణం, అది కేవలం నటన అని మీలో కొంత భాగానికి తెలిసినప్పటికీ. కానీ, ఆ యూనిఫాం ధరించడం మీలో ఏదో ఒక అనుభూతిని కలిగిస్తుంది. ఒక బాధ్యతా భావం కలుగుతుంది, దానిని ధరించినందుకు మీరు గౌరవంగా భావిస్తారు. ఆ యూనిఫాం మీ బాడీ లాంగ్వేజ్‌ను, మీరు నిలబడే, ప్రవర్తించే విధానాన్ని మారుస్తుంది. అది అద్భుతం" అని యూనిఫాం గురించి ఫర్హాన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

"యూనిఫాం వేషం కాదు"

సినిమాల్లో ఆర్మీ యూనిఫాం ధరించడంపై నిబంధనలు, నియమావళి ఉన్నప్పటికీ అప్పుడప్పుడూ తప్పులు జరుగుతున్నాయి.

శామ్ బహూదూర్ చిత్రంలో విక్కీ కౌశల్ వేసుకున్న డ్రస్‌ మీద శ్యామ్ మానెక్ షా ర్యాంక్ బ్యాడ్జ్ తప్పుగా ఉన్నాయని ఆర్మీ వెటరన్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ హస్నైన్ (రిటైర్డ్) ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

"శామ్ గూర్ఖా. ఆయన ఎప్పుడూ ఇత్తడి బ్యాడ్జీలు ధరించలేదు. నల్ల బ్యాడ్జీలే ధరించేవారు" అని అందులో రాశారు.

2016లో వచ్చిన బాలీవుడ్ చిత్రం 'రుస్తుం'లో కూడా నేవీ యూనిఫాం విషయంలో చాలా విషయాలు తప్పుగా చూపించారు.

ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ 1950ల నాటి నౌకాదళ అధికారి కమాండర్ కె.ఎం. నానావతి పాత్రలో నటించినప్పటికీ, ఆయన యూనిఫాంపై ఉన్న పతకాలు 2016లో ఉన్నట్లుగా ఉన్నాయి.

ఇలాంటి తప్పులు అనేక సినిమాల్లో ఉన్నాయి.

చిన్న చిన్న పొరపాట్లను విస్మరించవచ్చు కానీ, చాలా మంది చిత్రనిర్మాతలు పతకాలను, బ్యాడ్జీలను పూర్తిగా కలగలిపి, యూనిఫామ్‌ను అపహాస్యం చేయడం విచారకరమని మాజీ సైనికులు చెబుతున్నారు.

"ఆర్మీ యూనిఫాం సాధారణ దుస్తుల లాంటివి కాదు. సైనికులు తమ వాళ్లను వదిలేసి ప్రాణాలను లెక్క చేయకుండా సరిహద్దుల్లో కాపలా కాస్తారు. అలాంటి యూనిఫాంను గౌరవించాలి" అని ఇండియన్ ఆర్మీలో ఆర్టిలరీ విభాగంలో పని చేస్తున్న ఓ అధికారి బీబీసీతో చెప్పారు. ఆయన తన పేరు చెప్పేందుకు నిరాకరించారు.

"సైనిక యూనిఫాం వేషం కాదు, అది గౌరవం, త్యాగం, రాజ్యాంగ విధికి ప్రతీక. దానిని దుర్వినియోగం చేయడం సాయుధ దళాలను అవమానించడమే" అని మాజీ సైనికుడు గన్నవరపు కోటేశ్వరరావు చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)