You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలంగాణ: కవిత పార్టీ పేరు వారంలోపే ఎందుకు మారింది?
- రచయిత, బళ్ళ సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 6 నిమిషాలు
కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసిన కొత్త పార్టీ పేరు విషయంలో కాస్త గందరగోళం ఏర్పడింది.
ముందుగా తమ పార్టీ పేరు 'తెలంగాణ రాష్ట్ర సేన' అని చెప్పడం, తరువాత అది 'తెలంగాణ రక్షణ సేన'గా మారడంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ కూడా జరిగింది. దీనిపై కొందరు వ్యంగ్యంగా కూడా స్పందించారు.
ఏప్రిల్ 25న హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సభలో కొత్త పార్టీ పేరు ప్రకటించారు కవిత. ఆ సమయంలో వేదికపై ఆమె 'టీఆర్ఎస్' అని గట్టి స్వరంతో చెప్పారు.
ఆమె వెనుక ఉండి నినాదాలు చేసిన వ్యక్తి 'తెలంగాణ రాష్ట్ర సేన', 'జై తెలంగాణ రాష్ట్ర సేన' అని ప్రకటించారు. తరువాత కవిత కూడా 'తెలంగాణ రాష్ట్ర సేన' అన్నారు.
ఆ తరువాత కవిత కార్యాలయం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పార్టీ పేరు 'తెలంగాణ రాష్ట్ర సేన' అని రాశారు.
సోషల్ మీడియాలో, సభ లైవ్ స్ట్రీమింగ్‌లో చూపించిన జెండాలో 'తెలంగాణ రాష్ట్ర సేన' అని పెద్దగాను, ఆ అక్షరాల కింద 'అసోసియేషన్' అని కాస్త చిన్నగాను రాశారు.
అయితే, పేరును ధ్రువీకరిస్తూ ఎన్నికల సంఘం లేఖ అందిందన్న ప్రకటన తరువాత మాత్రం పార్టీ పేరు మారింది.
దీంతో 'పేరు ఎందుకు మారింది?' అనే చర్చ మొదలైంది. దాని చుట్టూ రకరకాల వ్యాఖ్యానాలు వచ్చాయి.
ఇంతకీ పార్టీ పేరు ఎందుకు మారింది?
పేరులో గందరగోళం ఉందన్న వాదనను 'తెలంగాణ రక్షణ సేన' పార్టీ తిరస్కరించింది. తాము అసలు 'రాష్ట్ర సేన' అనే పేరు అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదని ఆ పార్టీ అంటోంది.
మొత్తంగా పార్టీ పేరు ఎలా వచ్చిందో బీబీసీకి వివరించారు ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు రంగు నవీన్ ఆచారి.
ఇదంతా ఒక వ్యూహం ప్రకారం చేసిందే అంటోంది ఆ పార్టీ.
"కొత్త పార్టీకి రెండు పేర్ల కోసం మేం తీవ్రంగా ప్రయత్నం చేశాం. ఒకటి 'తెలంగాణ ప్రజా జాగృతి', మరొకటి 'తెలంగాణ జాగృతి'. అయితే నిబంధనల ప్రకారం ఐదు పేర్లు ఇవ్వాలి కాబట్టి, మొదట ఈ రెండు పేర్లూ పెట్టి, మూడో పేరుగా 'తెలంగాణ రక్షణ సేన' అని పెట్టాం" అని నవీన్ ఆచారి చెప్పారు.
"ఆ ప్రక్రియ ఆలస్యం అవుతోందని దిల్లీ హైకోర్టులో పిటిషన్ కూడా వేశాం. కానీ, విచిత్రంగా మాకు మూడో పేరు ఖరారైనట్లు ఏప్రిల్ 24న ఎన్నికల సంఘం నుంచి ముందస్తు సమాచారం అందింది" అని ఆయన వివరించారు.
"పార్టీ ప్రకటనకు మేం ఎంచుకున్న ముహూర్త సమయానికి లేఖ మాత్రం అందలేదు. దీంతో ప్రారంభోత్సవం నాడు ముహూర్త సమయంలో 'టీఆర్ఎస్' అనే పొడి అక్షరాలను మాత్రమే కవితగారు తన నోటి వెంట ప్రకటించారు" అని బీబీసీతో నవీన్ ఆచారీ అన్నారు.
'టీఆర్ఎస్' కోసం ప్రయత్నాలు
కవిత కొత్త పార్టీ కోసం ప్రతిపాదించిన పేర్లు:
- తెలంగాణ ప్రజా జాగృతి
- తెలంగాణ జాగృతి
- తెలంగాణ రక్షణ సేన
- తెలంగాణ రాష్ట్ర జాగృతి
- తెలంగాణ ప్రజాశక్తి
"మాకు టీఆర్ఎస్ అనే పేరు వస్తోందని ముందుగా అనధికారిక సమాచారం అందింది. అయితే ఎన్నికల సంఘం నుంచి రాతపూర్వకంగా రాకముందే, ఇలా ప్రకటించడం సరికాదు కాబట్టి కేవలం 'టీఆర్ఎస్' అనే ఇంగ్లిష్ అక్షరాలను మాత్రమే జెండాపై పెట్టి, కవితగారు కూడా వాటినే ప్రకటించారు" అని నవీన్ ఆచారి బీబీసీతో అన్నారు.
"అయితే 'టీఆర్ఎస్'కి పూర్తి వర్షన్ ఇవ్వకపోతే గందరగోళం వస్తుంది. అలాగని ఎన్నికల సంఘం నుంచి లేఖ రాలేదు. లేఖ లేకుండా పేరు ప్రకటిస్తే ఎన్నికల సంఘంతో ఇబ్బంది. అలాగని ఏ పేరూ ప్రకటించకుండా ఉండకుండా, మధ్యే మార్గంగా 'తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్' అనే పేరును అక్కడ వాడాం. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిందే తప్ప గందరగోళం కాదు. మీరు గమనిస్తే.. మేం ఎన్నికల సంఘానికి పంపిన లేఖ లెటర్ హెడ్ కూడా 'ప్రజా జాగృతి' అనే ఉంటుంది" అని ఆయన తెలిపారు.
నిజానికి తాము 'టీఆర్ఎస్' పేరు కోరలేదని, 'జాగృతి' పేరుకే తొలి ప్రాధాన్యం ఇచ్చామని ఆ పార్టీ నాయకులు బీబీసీకి చెప్పారు.
''అప్లికేషన్‌లో మూడో పేరుగా పెట్టిన 'తెలంగాణ రక్షణ సేన' (టీఆర్ఎస్)కు ఎన్నికల సంఘం ఆమోదముద్ర వేసింది.. విధి కల్వకుంట్ల కవిత వైపు నిలిచి 'టీఆర్ఎస్' పేరును ఆమెకు వచ్చేలా చేసిందని హర్షం వ్యక్తం చేస్తున్న 'తెలంగాణ రక్షణ సేన' నాయకులు'' అంటూ ఆ పార్టీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
నిజానికి కవిత పార్టీ కార్యాలయానికి ఏప్రిల్ 28న ఎన్నికల సంఘం లేఖ అందింది. నిబంధనల ప్రకారం, పత్రికల్లో ప్రకటనలు ఇచ్చిన తరువాత ఏప్రిల్ 30న మీడియాకు పార్టీ పేరు గురించిన వార్త అందించింది 'టీఆర్ఎస్' కార్యాలయం.
కవిత తీవ్ర వ్యాఖ్యలపై విమర్శలు
శనివారం (ఏప్రిల్ 25) కవిత పార్టీ ప్రారంభోపన్యాసంలో పార్టీ జెండాతో పాటు అజెండా ప్రకటించారు. వివిధ రంగాల్లో పార్టీ వైఖరి చెప్పారు.
''టీఆర్ఎస్‌తో ప్రజలకు అమ్మనై పాలన అందిస్తాను. కర్కోటక నియంత ప్రభుత్వాన్ని తరిమేసేందుకు పాంచజన్యం పూరిస్తున్నాను. కేసీఆర్ ఆత్మలేని మరబొమ్మ. ఆయన గుంటనక్కలు, తోడేళ్ల చేతిలో బందీ అయ్యాడు. ఉచిత విద్య, ఉచిత వైద్యం, వ్యవసాయం, ఉపాధి, సామాజిక న్యాయం ఇరుసుగా మా పార్టీ పని చేస్తుంది. తెలంగాణకు ఏమైనా జరిగితే ప్రాణం పెట్టి పనిచేసే పార్టీ కావాలి'' అని కవిత మాట్లాడారు.
అయితే కేసీఆర్‌పై 'ఆనాటి కేసీఆర్, నేటి కేసీఆర్ వేరు' అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.
''ఆనాటి కేసీఆర్ చేనేత కార్మికులు చనిపోతే భిక్షాటన చేసి సాయం చేశారు. కానీ మారిన, మరమనిషి కేసీఆర్ ఇప్పుడు ప్రజలు కష్టాల్లో ఉన్నా బయటకు రావటం లేదు. ఇళ్లు కూల్చేస్తుంటే 'అయ్యా కేసీఆర్' అని ప్రజలు పిలుస్తుంటే కూడా సార్ బయటకు రావటం లేదు. ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా ఆ సార్ బయటకు రారు. ఎందుకంటే ఆయన ఆత్మలేని మర బొమ్మ" అంటూ కవిత చేసిన వ్యాఖ్యల మీద రాజకీయంగా దుమారం చెలరేగింది.
"అధికారం వచ్చిన తర్వాత ప్రేమ, మమకారం పోయిందా? అవినీతి గురించి చెబితే నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. గుంటనక్కలు, తోడేళ్ల చేతుల్లో కేసీఆర్ బందీ అయ్యారు'' అంటూ వ్యాఖ్యానించారు కవిత. రాష్ట్రంలో ఏదో పొడిచేసినట్లు పంజాబ్, గుజరాత్, బిహార్ వెళ్లి జాతీయ పార్టీ పెట్టాలని చూశారని ఎద్దేవా చేశారు.
దీనిపై బీఆర్ఎస్ పార్టీ స్పందించింది.
టీఆర్ఎస్ పేరుతో ఒక కొత్త పార్టీ వచ్చిందని రిపోర్టర్లు ప్రశ్నించినప్పుడు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు స్పందించారు.
''అదేమంత పెద్ద విషయం కాదు. పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి. వచ్చాయి పోయాయి. 25 ఏళ్లు పూర్తి చేసుకున్న పార్టీ మాది. దేశంలో అలా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న పార్టీలను వేళ్లపై లెక్కించవచ్చు. ఇది పట్టించుకోదగ్గ వ్యవహారం కాదు'' అన్నారు కేటీఆర్.
మర మనిషి ఆరోపణల గురించి ప్రశ్నించినప్పుడు ''కేసీఆర్ గురించి రోజూ చాలా మంది మాట్లాడుతుంటారు. అన్నిటి మీదా స్పందించాలంటే.. మాకు పని చాలా ఉంది. చాలా మంది చాలా మాట్లాడుతుంటారు. పట్టించుకోవాల్సిన అవసరం లేదు'' అని ఆయన వ్యాఖ్యానించారు.
కవిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు.
''కవిత పార్టీ పెద్ద జోక్. కూతురికి తండ్రి అంటే ప్రేమ ఉండాలి. తండ్రికి కూతురు అంటే ప్రేమ. కేసీఆర్ ఒక ఉద్యమకారుడు. తెలంగాణ ఏర్పాటులో కృషి చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని స్వయంగా కూతురు అలా మాట్లాడితే.. మొదటి సమావేశంలోనే తప్పు చేసింది" అని అన్నారు.
"తెలంగాణ ప్రజలంతా ఆలోచించుకుంటారు.. తండ్రిని గౌరవించని మనిషి ప్రజలకు తల్లి ఎట్లయితుంది అని. నేను బాధతో చెబుతున్నాను. కవిత తప్పు మాట్లాడింది. అన్నపై కోపం ఉండొచ్చు, అధికారం కావాలని ఉండొచ్చు. కానీ దానికోసం తండ్రినే ఏదో అంటే ఎవరు నమ్ముతారు?'' అని అన్నారు రాజగోపాల్ రెడ్డి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)