బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ గెలుపు, ఆయన ఏమన్నారంటే...

ప్రశాంత్ కిశోర్, బిహార్, ఉపఎన్నిక, దిల్లీ, నిరసనలు

ఫొటో సోర్స్, santosh Kumar/Hindustan Times via Getty Images

ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

బిహార్‌లోని బాంకిపూర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో జన్ సురాజ్ పార్టీకి చెందిన ప్రశాంత్ కిశోర్ విజయం సాధించారు.

ఎన్నికల కమిషన్‌ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌‌ ప్రకారం ఆయన తన సమీప ప్రత్యర్ధి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్‌పై 19,324 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.

ఆర్జేడీకి చెందిన రేఖా కుమారి మూడో స్థానంలో ఉన్నారు.

మధ్యప్రదేశ్‌లోని దతియా స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి అశుతోష్ తివారీ కాంగ్రెస్ అభ్యర్థి ఘన్‌శ్యామ్ సింగ్ చేతిలో ఓడిపోయారు. 6,016 ఓట్లతేడాతో ఘన్‌శ్యామ్ సింగ్ గెలుపొందారు.

గుజరాత్‌లోని మంజల్‌పూర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీకి చెందిన సతేంద్రభాయ్ పటేల్ (సతీశ్ పటేల్‌) గెలుపొందారు. కాంగ్రెస్‌కు చెందిన భిఖాభాయ్ రబారిపై 30,630 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

నితిన్ నబిన్‌ను బీజేపీ జాతీయ అధ్యక్షునిగా నియమించింది. రాజ్యసభకు ఎన్నికైన అనంతరం ఆయన బాంకిపూర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

దిల్లీలో దేశవ్యాప్తంగా యువత, విద్యార్థులు చేపట్టిన నిరసనల తర్వాత కొద్దికాలానికే ఈ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగాయి.

ఈ ఉప ఎన్నికలను ఆ నిరసనల ప్రభావానికి ప్రతిబింబంగా కూడా పరిగణిస్తున్నారు.

ప్రశాంత్ కిశోర్, బిహార్, ఉపఎన్నిక, దిల్లీ, నిరసనలు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ప్రశాంత్ కిశోర్ తొలిసారి ఎన్నికల్లో పోటీచేశారు.

బీజేపీ కేంద్ర నాయకత్వానికిి ఓ సందేశం - ప్రశాంత్ కిశోర్

బిహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధురి పాలనను ప్రజలు తిరస్కరించారనడానికి ఇది స్పష్టమైన నిదర్శనమని ప్రశాంత్ కిశోర్ అన్నారు.

బాంకిపూర్ ఉప‌ఎన్నికలో తన గెలుపు ఓ అసెంబ్లీ నియోజకవర్గంలో విజయంగా భావించకూడదని ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు. బిహార్ ముఖ్యమంత్రిగా మంచి వ్యక్తిని నియమించాలని ప్రజలు బీజేపీ కేంద్ర నాయకత్వానికి సందేశమిచ్చే ప్రయత్నంగా చూడాలని ప్రశాంత్ కిశోర్ మీడియాతో వ్యాఖ్యానించారు.

క్రిమినల్ రికార్డులున్నవారిని బిహార్ ప్రజలు ముఖ్యమంత్రిగా చూడాలనుకోవడం లేదని ఆయన అన్నారు. విద్య, యువతకు ఉపాధి కల్పించడంతో పాటు బిహార్ పిల్లలు ఉపాధి కోసం వలస వెళ్లాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చే మంచి ముఖ్యమంత్రిని ప్రజలు కోరుకుంటున్నారని ప్రశాంత్ కిశోర్ విశ్లేషించారు.

బీజేపీ కంచుకోటగా భావించే చోట ప్రశాంత్ కిశోర్ పోటీ

బాంకిపూర్ బీజేపీకి కంచుకోట. 1995నుంచి బీజేపీ ఖాతాలోనే ఉంది. నితిన్ నబిన్ అక్కడ వరుసగా ఐదుసార్లు గెలుపొందారు.

సాధారణంగా అసెంబ్లీ ఉప ఎన్నికలపై పెద్దగా ఉత్సాహం ఉండదు. కానీ ఈసారి జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ స్వయంగా ఎన్నికల బరిలోకి దిగడంతో చాలా మంది దాని ఫలితంపై ఆసక్తి చూపించారు.

మధ్యప్రదేశ్‌లోని దతియా నియోజకవర్గం నుంచి బీజేపీ నేత నరోత్తమ్ మిశ్రాకు టికెట్ నిరాకరించడం కూడా విస్తృతంగా చర్చనీయాంశమైంది. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం ఆయన మద్దతుదారుల్లో ఆగ్రహానికి దారితీసింది.

బాంకిపూర్ ఉప ఎన్నికలో 35శాతం ఓటింగ్ నమోదయింది. అంతకుముందు ఓటింగ్ శాతం 41.35శాతంగా ఉంది. ఆ సమయంలో ప్రస్తుత బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబిన్, ఆర్జేడీకి చెందిన రేఖా కుమారిని సుమారు 52,000 ఓట్ల తేడాతో ఓడించారు.

ఈ ఉపఎన్నికలో బీజేపీ నీరజ్ కుమార్‌ను, జన్ సురాజ్ పార్టీ ప్రశాంత్ కిశోర్‌ను, ఆర్జేడీ రేఖా కుమారిని బరిలోకి దింపగా ప్రశాంత్ కిశోర్ విజయం సాధించారు.

ప్రశాంత్ కిశోర్, బిహార్, ఉపఎన్నిక, దిల్లీ, నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

బిహార్‌లో మార్పు అనే భావనకు బలం - ప్రశాంత్ కిశోర్

జూలై 5న జరిగిన మీడియా సమావేశంలో, జన్ సురాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ భారతి, ప్రశాంత్ కిశోర్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంతో బాంకిపూర్‌లో పోటీ ఒక హై-ప్రొఫైల్ పోటీగా మారింది.

గతంలో 2025 నవంబర్‌లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో, జన్ సూరజ్ పార్టీ చాలా స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. కానీ ప్రశాంత్ కిశోర్ చివరి నిమిషంలో ఎన్నికల్లో పోటీ చేయడానికి నిరాకరించారు.

మిగిలిన సీట్లపై దృష్టి పెట్టడం ముఖ్యమని తమ పార్టీ నిర్ణయించిందని ఆయన చెప్పారు.

"బాంకిపూర్ ఉప ఎన్నికలో పోటీ చేయడాన్ని లక్ష్యం దిశగా ఒక అడుగుగా నేను భావిస్తున్నాను. 2025 నవంబర్‌లో వేలాది, లక్షలాది మంది ప్రజలు జన సురాజ్ ఆలోచనలు, ప్రయత్నాలతో మమేకమయ్యారు. మనం గెలిస్తే, అది ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయడమే కాకుండా, బిహార్‌లో మార్పు అనే భావనకు కొత్త బలాన్ని ఇస్తుంది" అని బాంకిపూర్ నుంచి తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన అనంతరం ప్రశాంత్ కిశోర్ అన్నారు.

2025 ఎన్నికలలో జన్ సూరజ్ పార్టీ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. 238 మంది అభ్యర్థులలో 236 మందికి డిపాజిట్లు కూడా దక్కలేదు.

చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ

బాంకిపూర్ స్థానానికి బీజేపీ అభ్యర్థి అయిన అభిషేక్ కుమార్ సిన్హా కుటుంబాన్ని కారణంగా చూపుతూ జూలై 10న చివరి నిమిషంలో తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు.

అంతకు కొన్ని గంటల ముందు వరకు బిహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధురి బాంకిపూర్‌లో అభిషేక్ కుమార్‌ కోసం ప్రచారం చేస్తుండగా ఆయన ఈ నిర్ణయం ప్రకటించారు. ఆ తర్వాత పార్టీ నీరజ్ కుమార్ సిన్హాను తమ అభ్యర్థిగా ప్రకటించింది. నీరజ్ 2006 నుంచి బీజేపీ సభ్యుడు. రెండుసార్లు మండల అధ్యక్షునిగా పనిచేశారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)