పిల్లల ఫోన్లలో నగ్న చిత్రాలు రాకుండా నిషేధించాలని యాపిల్, గూగుల్ సంస్థలకు సూచించిన బ్రిటన్ ప్రభుత్వం

కీర్ స్టార్మర్, పిల్లలు, సోషల్ మీడియా, నిషేధం, నగ్న చిత్రాలు, షబానా మహ్మూద్, ఆపిల్, గూగుల్, టెక్ కంపెనీలు, బ్రిటన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జోయీ క్లైన్‌‌‌మెన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

పద్దెనిమిదేళ్ల లోపు పిల్లలు స్మార్ట్‌ఫోన్లు, ఇతర డిజిటల్ పరికరాల్లో నగ్న చిత్రాలను చూడకుండా యాపిల్, గూగుల్ వంటి టెక్ కంపెనీలు చర్యలు తీసుకోవాలని బ్రిటన్ ప్రభుత్వం ఇటీవల కోరింది.

పిల్లలు తమ ఫోన్లు ఇతర పరికరాలతో లైంగిక (సెక్సువల్లీ ఎక్స్‌ప్లిసిట్) చిత్రాలను తీయడం, పంపించడం లేదా చూడడం వంటివి జరగకుండా ఇప్పటికే అందుబాటులో ఉన్న భద్రత ఫీచర్లను యాక్టివేట్ చేయాలని లేదా తమ ఆపరేటింగ్ సిస్టమ్‌లను అప్డేట్ చేయాలని బ్రిటన్ ప్రధానమంత్రి సర్ కీర్ స్టార్మర్ టెక్ సంస్థలకు సూచించారు.

లండన్ టెక్ వీక్ కార్యక్రమంలో ప్రసంగించిన స్టార్మర్ "ఇదేమి అసాధ్యమైన సవాలు కాదు. ఇవి ప్రపంచంలోనే సాంకేతికంగా అత్యంత వినూత్నమైన సంస్థలు. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనగల సామర్థ్యం వీటికి ఉందని నేను నమ్ముతున్నాను" అని అన్నారు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ సంస్థలు మూడు నెలలలోపు స్వచ్ఛందంగా ఈ చర్యలను అమలు చేయకపోతే, వాటిని తప్పనిసరి చేసేలా చట్టాలను తీసుకురానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

అలాంటి చట్టాల కింద నిబంధనలు పాటించని సంస్థలపై జరిమానాలు విధించడం వంటివి ఉంటాయని ప్రభుత్వం తెలిపింది.

కీర్ స్టార్మర్, పిల్లలు, సోషల్ మీడియా, నిషేధం, నగ్న చిత్రాలు, షబానా మహ్మూద్, ఆపిల్, గూగుల్, టెక్ కంపెనీలు, బ్రిటన్

ఫొటో సోర్స్, Getty Images

ఈ మార్పులు బ్రిటన్‌లో ఇప్పటికే వినియోగంలో ఉన్న స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లలో మాత్రమే కాకుండా కొత్తగా విక్రయించే పరికరాలకు కూడా వర్తించాలని స్టార్మర్ చెప్పారు.

"ఆపరేటింగ్ సిస్టమ్‌లను అందించే సంస్థలతో పాటు రిటైలర్లు వంటి ఇతర భాగస్వాములకూ ఈ చట్టాలు వర్తించవచ్చు. అయితే తమ వయసు ధ్రువీకరించుకున్న పెద్దల యాజమాన్యంలో ఉన్న పరికరాల వినియోగంపై ఇవి ప్రభావం చూపవు" అని ఆయన వివరించారు.

దీనిపై స్పందించిన గూగుల్ ప్రతినిధి, "పిల్లల ఆన్‌లైన్ భద్రత విషయంలో మేం పూర్తిగా కట్టుబడి ఉన్నాం" అని తెలిపారు.

"హానికరమైన కంటెంట్ షేరింగ్‌ను నిరోధిస్తూ, యువతకు సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని కల్పించేలా వారి గోప్యతను కాపాడే సమర్థ పరిష్కారాలను కనుగొనేందుకు యూకే భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నాం" అని ఆయన చెప్పారు.

యాపిల్ ఇప్పటికే యూకేలోని తన వినియోగదారుల వయసును ధ్రువీకరించే వ్యవస్థను అమలు చేసింది. అలాగే ఐమెసేజ్ సహా తన ప్లాట్‌ఫామ్‌లలో నగ్న చిత్రాలను నిరోధించే సేవలను అందిస్తోంది.

కీర్ స్టార్మర్, పిల్లలు, సోషల్ మీడియా, నిషేధం, నగ్న చిత్రాలు, షబానా మహ్మూద్, ఆపిల్, గూగుల్, టెక్ కంపెనీలు, బ్రిటన్

ఫొటో సోర్స్, Getty Images

పిల్లల ఆన్‌లైన్ భద్రత కోసం యూకే ఇప్పటికే పలు చట్టాలను అమలు చేసింది.

వాటిలో ముఖ్యమైనది 'ఆన్‌లైన్ సేఫ్టీ యాక్ట్'. ఆన్‌లైన్ వేదికలు తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు, బాధ్యతలను నిర్దేశించే ఈ చట్టాన్ని మీడియా నియంత్రణ సంస్థ ఆఫ్‌కామ్ అమలు చేస్తూ పర్యవేక్షిస్తోంది.

అయితే ఆన్‌లైన్ గ్రూమింగ్ వంటి వాటిపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో, పిల్లలు నగ్న చిత్రాలను చూడడం, షేర్ చేయడాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ‘చైల్డ్ సేఫ్టీ కేంపెయినర్స్’ కోరుతున్నారు.

బ్రిటన్ ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 2024లో నమోదైన ఆన్‌లైన్ చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ రిపోర్ట్స్‌లో 91 శాతం కేసుల్లో పిల్లలే స్వయంగా సృష్టించిన కంటెంట్ ఉంది. ప్రస్తుతం సగటున 13 ఏళ్ల వయస్సుకే అశ్లీల కంటెంట్‌ను చూసే పరిస్థితి ఏర్పడిందని ప్రభుత్వం పేర్కొంది.

ఈ ప్రకటన వెలువడిన సమయంలోనే, పిల్లల సోషల్ మీడియా వినియోగంపై కఠిన ఆంక్షలను ప్రకటించేందుకు స్టార్మర్ సిద్ధమవుతున్నట్లు కథనాలు వచ్చాయి.

కీర్ స్టార్మర్, పిల్లలు, సోషల్ మీడియా, నిషేధం, నగ్న చిత్రాలు, షబానా మహ్మూద్, ఆపిల్, గూగుల్, టెక్ కంపెనీలు, బ్రిటన్

ఫొటో సోర్స్, Getty Images

హోం సెక్రటరీ షబానా మహ్మూద్ మాట్లాడుతూ "పిల్లలు నగ్న చిత్రాలను తీయడం, షేర్ చేయడం, చూడడం అసాధ్యమయ్యేలా చర్యలు తీసుకోవడం టెక్ కంపెనీల నైతిక బాధ్యత. అవి ముందుకు రాకపోతే మేం చట్టాలు తీసుకొస్తాం" అని హెచ్చరించారు.

సాంకేతిక శాఖ మంత్రి లిజ్ కెన్డల్ మాట్లాడుతూ, "ప్రతి చిన్నారి కోసం, ప్రతి డివైస్‌లో ఈ రక్షణ వ్యవస్థలు డిఫాల్ట్‌గా ఆన్‌లో ఉండాలి. సరైన చర్య తీసుకుంటామని నిరూపించేందుకు కంపెనీలకు మేం మూడు నెలల గడువు ఇస్తున్నాం" అని చెప్పారు.

మోలీ రోజ్ ఫౌండేషన్ ప్రధాన అధికారి ఆండీ బరోస్ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ "పిల్లల రక్షణ దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు" అని వ్యాఖ్యానించారు.

అయితే ఈ ప్రకటనతో పాటు యువతకు సోషల్ మీడియాపై నిషేధం విధించే అవకాశంపై ప్రభుత్వం చేసిన ప్రచారాన్ని ఆయన విమర్శించారు.

"తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం తొందరపాటు ప్రకటనలు చేయడం కంటే, నిపుణుల అభిప్రాయాలు, అందుబాటులో ఉన్న ఆధారాలను ప్రభుత్వం అత్యవసరంగా పరిగణనలోకి తీసుకోవాలి. లేనిపక్షంలో ఈ చర్యలు త్వరలోనే విఫలమై, నివారించగలిగే ప్రమాదాలు బాధ్యత నుంచి టెక్ సంస్థలు తప్పించుకునే పరిస్థితి కొనసాగుతుంది" అని ఆయన అన్నారు.

దేశవ్యాప్తంగా నిర్వహించిన చర్చల అనంతరం, 16 ఏళ్లలోపు పిల్లల సోషల్ మీడియా వినియోగంపై ఆంక్షల దిశగా యూకే మరింత ముందుకు సాగుతోంది. వయోపరిమితుల నుంచి అడిక్టివ్ ప్లాట్‌ఫామ్ ఫీచర్లపై నిషేధాల వరకు వివిధ చర్యలను మంత్రులు పరిశీలిస్తున్నారు.

బిగ్ బ్రదర్ వాచ్ డైరెక్టర్ సిల్కీ కార్లో మాట్లాడుతూ "పిల్లలను ఆన్‌లైన్‌లో రక్షించడం అత్యవసరం. అయితే ఈ ప్రతిపాదనలు ఆన్‌లైన్ ప్రమాదాల మూల కారణాలను పరిష్కరించడంలో విఫలమయ్యేలా ఉన్నాయి" అని అన్నారు.

"సాధారణంగా చెప్పాలంటే, ఇంటర్నెట్ వినియోగానికి గుర్తింపు పత్రాల తనిఖీలను తప్పనిసరి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఒక ప్రజాస్వామ్య దేశంలో కేవలం ఆన్‌లైన్‌లోకి వెళ్లడానికే ఎవరూ తమ పాస్‌పోర్ట్ చూపించాల్సిన అవసరం ఉండకూడదు" అని ఆమె వ్యాఖ్యానించారు.

అయితే పిల్లల సంక్షేమ సంస్థ ఎన్‌ఎస్‌పీసీసీ ప్రధాన అధికారి క్రిస్ షెర్వుడ్ ఈ ప్రకటనకు బలమైన మద్దతు ప్రకటిస్తూ "బిగ్ టెక్‌కు సమయం ముగిసింది" అన్నారు.

"యువత భద్రత కోసం కీలకమైన ఈ మార్పులు త్వరగా అమలులోకి వచ్చేలా సంస్థలను జవాబుదారులుగా నిలబెట్టడంపై ఇప్పుడు ప్రభుత్వం దృష్టి సారించాలి" అని ఆయన పేర్కొన్నారు.

ఈ ఏడాది ప్రారంభంలో హోం ఆఫీస్‌లో భద్రతా వ్యవహారాల మంత్రిగా ఉన్న లేబర్ పార్టీ ఎంపీ జెస్ ఫిలిప్స్ రాజీనామా చేశారు. పిల్లలు తమ నగ్న చిత్రాలను తీయకుండా నిరోధించే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ, దానికి సంబంధించిన చట్టపరమైన చర్యలను అమలు చేసే విషయంలో సర్ కీర్ స్టార్మర్ నెమ్మదిగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)