ఐఫోన్ సహా యాపిల్ ఉత్పత్తుల ధరలు భారీగా పెరగనున్నాయా, కంపెనీ సీఈవో ఏమన్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆస్మండ్ చియా
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
మెమొరీ చిప్స్ ధరలు పెరగడంతో యాపిల్ ఉత్పత్తుల ధరల పెంపుపై యోచిస్తున్నట్లు కంపెనీ సీఈఓ టిమ్ కుక్ చెప్పారు.
త్వరలో సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకోనున్న టిమ్ కుక్ 'వాల్ స్ట్రీట్ జర్నల్'తో మాట్లాడుతూ, మెమొరీ చిప్స్ సంక్షోభం మరింత క్లిష్టంగా మారడంతో ధరల పెంపు తప్పడం లేదని పేర్కొన్నారు.
అయితే, ఏయే ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి, ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయనే విషయాలను ఆయన వెల్లడించలేదు. దీంతో, ఈ సెప్టెంబర్‌లో మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశమున్న ఐఫోన్ 18 ధర కూడా పెరుగుతుందా లేదా అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు.
స్మార్ట్‌ఫోన్ల తయారీలో మెమొరీ చిప్స్ అత్యంత కీలకమైనవి. అయితే, ఇటీవలి కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగానికి డిమాండ్ భారీగా పెరగడంతో ఈ చిప్స్ ధరలు అమాంతం పెరిగాయి.
"కంపెనీపై పడుతున్న ఈ అదనపు భారాన్ని వినియోగదారులపై వేయకుండా ఉండటానికి అన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నాం. కానీ, పరిస్థితి ఇక కొనసాగించలేని స్థాయికి చేరింది" అని టిమ్ కుక్ 'వాల్ స్ట్రీట్ జర్నల్'తో చెప్పారు.

"ఒకవైపు మార్కెట్లో యాపిల్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంటే.. మరోవైపు చిప్స్ సరఫరా తగ్గింది. ఇదే తరుణంలో చిప్స్ తయారీ సంస్థలు రేట్లను పెంచేస్తున్నాయి" అన్నారు టిమ్ కుక్.
యాపిల్‌లో 15 ఏళ్ల ప్రస్థానం తర్వాత ఈ సెప్టెంబర్‌లో టిమ్ కుక్ స్థానంలో జాన్ టెర్నస్ కొత్త సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు.
సాధారణంగా కంప్యూటర్ భాగాలలో అత్యంత చౌకైనదిగా భావించే ర్యామ్ ధర.. అక్టోబర్ 2025తో పోలిస్తే ఇప్పుడు రెండింతలకు పైగా పెరిగింది.

ఫొటో సోర్స్, Getty Images
ఎంత పెరగొచ్చు?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిమాండ్‌తో పాటు, ఇరాన్ యుద్ధం కూడా ఈ సంక్షోభాన్ని మరింత పెంచింది. సెమీకండక్టర్ల తయారీలో అత్యంత కీలకమైన హీలియం గ్యాస్ సరఫరాకు ఈ యుద్ధం వల్ల తీవ్ర ఆటంకం కలిగింది. ఇది కంప్యూటర్ చిప్స్ ధరలు మరింత పెరగడానికి కారణమైంది.
పరిశోధనా సంస్థ 'ఓమ్డియా' రిపోర్ట్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ల సగటు అమ్మకపు ధర 2026లో దాదాపు 20 శాతం పెరిగి, రికార్డు స్థాయికి చేరే అవకాశం ఉంది.
కొత్త ఏఐ ఫీచర్లకు సపోర్ట్ చేసేలా యాపిల్ తన ఫోన్ల స్పెసిఫికేషన్లను అప్‌గ్రేడ్ చేయనుండటంతో.. రాబోయే కొత్త మోడళ్ల ధరలు ఐఫోన్ 17 సిరీస్ కంటే దాదాపు 150 డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ. 14,138) వరకు పెరిగే అవకాశం ఉందని ఓమ్డియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్ విశ్లేషకులు చివ్ లీ జువాన్ బీబీసీకి తెలిపారు.
మార్కెట్లో పెరుగుతున్న ఖర్చుల నుంచి తమ లాభాలను కాపాడుకోవడానికి.. చాలా వరకు స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు ఇప్పటికే ధరలను పెంచడం, ఆఫర్లను తగ్గించడం లేదా ఫోన్ ఫీచర్లలో కోతలు విధించడం వంటివి చేస్తున్నాయని ఆయన తెలిపారు.
"ఇది తాత్కాలికంగా పెరిగిన ధర కాదు.. ఇకపై స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఈ స్థాయి ధరలే ఉంటాయి" అని జువాన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
చిప్స్ తయారీ కంపెనీలు ఏమంటున్నాయి?
చిప్స్ మార్కెట్లో నెలకొన్న ఈ క్లిష్ట పరిస్థితులను ఇతర అంతర్జాతీయ సాంకేతిక సంస్థలు సైతం ప్రస్తావిస్తున్నాయి.
ద్రవ్యోల్బణం కారణంగా తమ ఖర్చులు పెరిగాయని, కాబట్టి ధరల పెంపును తోసిపుచ్చలేమని తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ(టీఎస్ఎంసీ) ఈ నెలలో బీబీసీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపింది.
యాపిల్, ఎన్విడియా, ఏఎండీ వంటి ప్రముఖ కంపెనీలు డిజైన్ చేసే అత్యంత అత్యాధునిక చిప్స్‌ను ఈ టీఎస్ఎంసీనే తయారు చేస్తుంది.
చిప్స్ కొరత వల్ల ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరుగుతాయని అంచనా వేస్తున్నట్లు శామ్‌సంగ్ కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలోనే తెలిపింది.
ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో వస్తున్న నిరంతర మార్పుల వల్ల సోనీ కంపెనీ గత ఏప్రిల్‌లోనే తమ ప్లేస్టేషన్ 5 కన్సోల్ ధరలను యూకేలో 90 పౌండ్లు, అమెరికాలో 100 డాలర్ల చొప్పున పెంచేసింది. మార్కెట్ పరిస్థితుల్లో వచ్చిన మార్పుల కారణంగా సెప్టెంబర్ నుంచి తమ 'స్విచ్ 2' ధరను పెంచనున్నట్లు నింటెండో సంస్థ కూడా ఆ తర్వాత ప్రకటించింది.
మరోవైపు, గత సెప్టెంబర్‌లో లాంచ్ అయిన ఐఫోన్ 17 సిరీస్‌కు మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా చైనాలో పెరిగిన డిమాండ్ కారణంగా.. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2026 మొదటి మూడు నెలల్లో యాపిల్ ఉత్పత్తుల అమ్మకాలు 17 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
అయినప్పటికీ, కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో తన 'మ్యాక్ మిని' కాంపాక్ట్ కంప్యూటర్లలో బేసిక్ మోడల్‌ను నిలిపివేసి.. దాని ప్రారంభ ధరను దాదాపు 200 డాలర్లు (సుమారు రూ. 18,850) పెంచింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























