ఎన్నికల్లో పోటీ వయసు 21ఏళ్లకు తగ్గించాలా...రేవంత్ రెడ్డి ప్రతిపాదనకు కారణమేంటి?

ఫొటో సోర్స్, Telangana CMO
''అసెంబ్లీ, లోక్ సభకు పోటీ చేసే అభ్యర్థుల వయసు 25 నుంచి 21 సంవత్సరాలకు తగ్గించాలి. శాసనమండలి, రాజ్యసభకు పోటీచేసే వయసు 30 నుంచి 25కు తగ్గించాలి'' అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు.
యువతలో ఆలోచనల పరిపక్వత, అవగాహన స్థాయి ఎంతో పెరిగింది. అందుకే అసెంబ్లీ, లోక్ సభకు పోటీ చేసే వయసు 21కు తగ్గించాలి'' అని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు.
ఈ విషయంపై ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి తీర్మానం చేసి కేంద్రానికి పంపించనున్నట్టు మీడియా సమావేశంలో ప్రకటించారు.
దిల్లీలో జరిగిన యువత, విద్యార్థుల ఆందోళనల తర్వాత కేంద్ర వైఖరిలో మార్పు రావాల్సిన అవసరం ఉందనేది రేవంత్ రెడ్డి అభిప్రాయం.
ఎన్నికల్లో పోటీ విషయంలో కేంద్రం పునరాలోచన చేయాల్సిన సమయం వచ్చిందని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు.

‘రాజకీయాల్లో యువత ప్రాధాన్యం పెంచేలా చర్యలు’
''కేవలం వయసుతోనే అవగాహన వస్తుందని చెప్పడానికి లేదు. 18 ఏళ్లకు ఓటు హక్కు ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి 21ఏళ్లు అర్హతగా ఎందుకు ఉండకూడదు..?'' అని ప్రశ్నించారు రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ కె.నాగేశ్వర్.
అలాగే యువతకు రాజకీయాల్లో అవకాశం ఇవ్వాలనుకుంటే 21ఏళ్లు రావాల్సిన అవసరం లేదని, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కూడా వారికి అవకాశం ఇచ్చి చూడాలని యూత్ ఫర్ యాంటీ కరెప్షన్ ఫౌండర్ పల్నాటి రాజేందర్ బీబీసీతో చెప్పారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇటీవల దిల్లీలో యువత, విద్యార్థులు ఆందోళనలు జరిపారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా యువత, విద్యార్థులు సాధించిన విజయంగా కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకులు అభిజిత్ దీప్కే ప్రకటించారు.
రాజకీయాల్లో యువత ప్రాధాన్యం పెంచేలా ఎన్నికల్లో పోటీ చేసే వయసు తగ్గించాలన్నది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనగా కనిపిస్తోంది.
''ఐఏఎస్, ఐపీఎస్ సాధించడానికి 21 ఏళ్లు కనీస వయసు అర్హతగా ఉంది. అలాంటప్పుడు ఎమ్మెల్యే, ఎంపీ కావడానికి 25 ఏళ్లు ఉండాల్సిన అవసరం ఏముంది..?'' అని రేవంత్ రెడ్డి అంటున్నారు.
లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కలిసి తమ ప్రతిపాదనను వివరిస్తామన్నారు.
తమ పార్టీ ఎంపీలు లోక్ సభ, రాజ్యసభలో కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదా ప్రైవేటు మెంబర్ బిల్లు పెట్టేందుకు ప్రయత్నిస్తారని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘యూనివర్శిటీలు, కాలేజీలు వేదికగా మారాలి’
రేవంత్ రెడ్డి ప్రతిపాదనపై సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి.లక్ష్మీ నారాయణ బీబీసీతో మాట్లాడారు.
''యువత రాజకీయాల్లో రావడానికి విద్యార్థి రాజకీయాలు ఎంతో కీలకం. యూనివర్సిటీ, కాలేజీ స్థాయిలో ఎన్నికల వ్యవస్థ అన్నిచోట్ల తిరిగి తీసుకురావాలి. యువత రాజకీయాలలో రావాలనే ఆలోచనకు యూనివర్సిటీలు, కాలేజీలు ఒక వేదికగా మారాలి.
అక్కడి నుంచి డాక్టర్లు, ఇంజినీర్లతోపాటు లీడర్లు పుట్టుకురావాలి. అప్పుడే చట్టసభలకు ఎన్నికల్లో పోటీ చేసే వయసు తగ్గించినా యువతకు అవకాశాలు లభించే అవకాశం ఉంది'' అని అభిప్రాయపడ్డారు.
అలా కాకపోతే వయసు తగ్గించినా కుటుంబ లేదా వారసత్వ రాజకీయాలకే పరిమితం అయ్యే అవకాశాలున్నాయని లక్ష్మీనారాయణ అన్నారు.
అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) నివేదిక.. లోక్‌సభలో ఏఏ వయసు ఎంపీలు ఎంతమంది ఉన్నారనేది పేర్కొంది.
ప్రస్తుత 18వ లోక్‌సభకు ఎన్నికైన ఎంపీల సగటు వయసు 56 ఏళ్లని ఏడీఆర్ తెలిపింది.
ఈ సగటు వయసు 2019లో 55 సంవత్సరాలుగా ఉండగా ఇప్పుడు ఒక సంవత్సరం పెరిగిందని నివేదిక స్పష్టం చేసింది.
ప్రస్తుత లోక్ సభకు ఎన్నికైన ఎంపీలలో 25మంది 35 సంవత్సరాలలోపు వారు ఉన్నారని, 2019లో ఈ సంఖ్య 21గానే ఉందని ఏడీఆర్ చెప్పింది.
2024లో ఎన్నికైన ఎంపీలలో 280 మంది 55 ఏళ్లకుపైబడిన వారు కాగా, 381 మంది 50 ఏళ్లకుపైబడిన వారు ఉన్నారని నివేదిక చెప్పింది.
అలాగే నివేదిక ప్రకారం 215 మంది 61 ఏళ్లు పైబడిన వారు కాగా 263 మంది 25-55 ఏళ్ల మధ్య ఉన్నవారు, 104 మంది 45 ఏళ్లలోపు వారు ఉన్నారు.
మరోవైపు 1951-52లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికైన ఎంపీల సగటు వయసు 46.5 ఏళ్లు కాగా, 1998 ఎన్నికల్లో ఎన్నికైన ఎంపీల సగటు వయసు 46.4గా ఉందని ఏడీఆర్ నివేదిక చెప్పింది.
లోక్‌సభకు ఎన్నికయ్యే సభ్యుల కనీస వయసు 25 ఏళ్లుగా ఉండాలి. ప్రస్తుత లోక్‌సభలో 25 ఏళ్ల వయసులో ఎన్నికైన ఎంపీలు కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు.
వీరిలో ఇద్దరు(ప్రియా సరోజ్-మచలీషహర్, పుష్పేంద్ర సరోజ్- కౌశంబి) సమాజ్ వాదీ పార్టీ నుంచి ఎన్నికవ్వగా, మరొకరు(శాంభవి – సమస్తిపుర్) ఎల్జేపీ(రామ్ విలాస్) పార్టీ నుంచి ఎన్నికయ్యారు.
ఏడీఆర్ నివేదిక ప్రకారం కాంగ్రెస్ నుంచి అధికంగా ఆరుగురు 35 సంవత్సరాలలోపు వయసున్న ఎంపీలు ప్రస్తుత లోక్ సభకు ఎన్నికయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
‘కుటుంబ రాజకీయాలు పోవాలి’
ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబ రాజకీయాలు పోతేనే కొత్తగా యువతకు అవకాశాలు దక్కుతాయని ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు.
చట్టసభలకు పోటీ చేసే అర్హత వయసు 21 ఏళ్లకు తగ్గిస్తే ఎన్ని అవకాశాలు వస్తాయో గమనించడం కాకుండా ముందుగా అవకాశం ఇచ్చి చూడాలని ఆయన అన్నారు.
ఒక మేయర్ పదవికి 21 ఏళ్లు ఉన్నప్పుడు ఎమ్మెల్యే, ఎంపీల వయసు 21 తగ్గించాలనడంలో తప్పు లేదన్నారు.
''రాజకీయాల్లో మార్పు రావాలి. ముందుగా పోటీకి అవకాశం కల్పిస్తే సహజంగానే ప్రాతినిధ్యం పెరిగే అవకాశం ఉంది'' అని అన్నారు.
అయితే దేశంలో చాలా మంది యువత వారి వారి పరిమితుల్లో సామాజిక సేవ చేసే వాళ్లు ఉన్నారని, పార్టీలు ఆ సేవా గుణాన్ని చూసి అవకాశం ఇచ్చిన దాఖలాలు దాదాపు లేనవి పల్నాటి రాజేంద్ర అన్నారు.
''చట్టసభలకు ఎన్నికవ్వడానికి 21 సంవత్సరాల వారికి అవకాశం వచ్చినా, నేతల వారసత్వాన్ని ముందుకుతీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయాల్లోకి వచ్చే సేవ చేద్దామనే యువతకు మాత్రం అవకాశాలు అందని ద్రాక్షగానే మిగిలిపోతాయి. రాజకీయం అనేది నాయకులకు వారసత్వంగా మారిపోయింది. ముందుగా ఈ వైఖరి మారాలి'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, X
స్థానిక సంస్థల్లో 21 ఏళ్లు చాలు
ఎమ్మెల్యే, లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యేందుకు భారత్‌లో కనీస అర్హత వయసు 25 ఏళ్లుగా ఉంది. రాష్ట్రాల శాసనమండలి, రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు మాత్రం కనీస వయసు అర్హత 30 ఏళ్లు.
అయితే పంచాయతీలు, జిల్లా పరిషత్, మున్సిపాలిటీలు వంటి స్థానిక సంస్థల్లో పోటీ చేసే వయసు మాత్రం 21గా ఉంది.
1992లో చేసిన 74 రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీ, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో వార్డు సభ్యుడు, ప్రాదేశిక సభ్యుడు, కౌన్సిలర్, కార్పొరేటర్‌గా పోటీ చేసేందుకు అర్హత వయసును 25 నుంచి 21కు తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 243వి ప్రకారం స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థి వయసు 25 సంవత్సరాల కంటే తక్కువగా ఉందనే కారణంతో తిరస్కరించకూడదు. 21 సంవత్సరాలు వయసు వచ్చి ఉంటే సరిపోతుంది.
ఈ కోవలోనే 2020లో కేరళలోని తిరువనంతపురం కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో సీపీఎం తరఫున 21ఏళ్లకే ఒకరు మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు.
అలాగే కేరళలోని కొట్టాయం జిల్లాలో పాలా మున్సిపాలిటీ ఛైర్ పర్సన్‌గా 21 ఏళ్లకే దియా బీను నిరుడు డిసెంబరులో బాధ్యతలు చేపట్టారు. అయితే, ఈ ఏడాది జులై 21న జరిగిన అవిశ్వాస తీర్మానంలో ఓడిపోవడంతో పదవిని కోల్పోయారు.

ఫొటో సోర్స్, Getty Images
18 ఏళ్లకే ఓటు హక్కు
భారత్ లో రాజ్యాంగం ప్రకారం 1980 దశకం చివరి వరకు ఎన్నికల్లో ఓటు వేసేందుకు 21 ఏళ్ల వయసు నిబంధన ఉండేది.
వయసును 18 ఏళ్లకు తగ్గించాలని 1970, 80వ దశకంలో విద్యార్థులు, యువత ఉద్యమాలు చేపట్టారు.
ఆ తర్వాత 1988లో 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పిస్తూ భారత ప్రభుత్వం 61వ రాజ్యాంగ సవరణ చేసింది.
ఆర్టికల్ 326 ప్రకారం 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించింది. ఈ ఆర్టికల్ మేరకు వయసు అర్హత ప్రకారం, 18 ఏళ్లు నిండినవారు ఓటు వేసేందుకు అర్హులవుతారు. ప్రధాని రాజీవ్ గాంధీ హయాంలో రాజ్యాంగ సవరణ జరిగింది.
''ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హత 18 ఏళ్లుగా ఉంది. స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు అర్హత 21 ఏళ్లుగా ఉంది. ఎమ్మెల్యే, ఎంపీగా మాత్రం 25 ఏళ్లు అనేది ఇక అక్కర్లేదు.
యువతలో ఆలోచనల పరిపక్వత, అవగాహన స్థాయి ఎంతో పెరిగింది. అందుకే అసెంబ్లీ, లోక్ సభకు పోటీ చేసే వయసు 21కు తగ్గించాలి'' అని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

























