పాములకు పాలు తాగించడం వాటి ప్రాణాలకు ప్రమాదకరమా, బలవంతంగా తాగిస్తే వాటి శరీరంలో ఏం జరుగుతుంది?

ఫొటో సోర్స్, Nitin Kanotra/Hindustan Times via Getty Images
- రచయిత, కె. శుభగుణం
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
భారతీయ సమాజంలో నాగుపాముకు ఆధ్యాత్మికంగా కీలకమైన స్థానం ఉంది. నాగుపాములు పాలు తాగుతున్నట్లు అప్పుడప్పుడు రిపోర్టులు రావడం కూడా చూస్తుంటాం.
పూజా ప్రాంతాలుగా ఉపయోగించే పాముల పుట్టలలో పాములకు పాలు పోయడం వంటి వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌లో దర్శనమిస్తుంటాయి.
అయితే, దీనివల్ల పాములపై ప్రతికూల ప్రభావం పడొచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భారత్‌లో వివిధ సందర్భాల్లో చాలాకాలం పాటు ఆకలితో అలమటించిన, డీహైడ్రేషన్‌కు గురైన పాములను స్నేక్ రెస్క్యూవర్లు రక్షించారని భారత్‌లో రాష్ట్ర అటవీ అధికారులతో పనిచేసే వన్యప్రాణుల సంరక్షణ సంస్థ వైల్‌లైఫ్ ఎస్ఓఎస్ తెలిపింది.
2018లో ఉత్తరప్రదేశ్ అటవీ విభాగం సహకారంతో కలిసి ఈ సంస్థ 57 నాగుపాములతో సహా 74 పాములను రక్షించింది.

ఈ సంస్థ చెబుతున్న ప్రకారం.. ఆహారం, నీరు లభించని ప్రాంతంలో ఆకలితో అలమటిస్తున్న పాములు, డీహైడ్రేషన్‌ను తగ్గించుకోవడానికి చివరి ప్రయత్నంగా పాలు లేదా అందుబాటులో ఉన్న ఇతర ఏదైనా లిక్విడ్‌ను తాగుతుండొచ్చని తెలిసింది.
ఒకవేళ పాము పాలు తాగితే, అది సహజంగానే పాలు తాగాలనుకుంటుందని అర్థం కాదని, బదులుగా అది విపరీతమైన దాహంతో ఇలా చేసి ఉండొచ్చని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.
అయితే, పాములకు బలవంతంగా పాలు తాగించడం వల్ల, అవి అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటాయని చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Vishal Bhatnagar/NurPhoto via Getty Images
పాములకు పాలిచ్చే అలవాటు
హిందూమతంలో నాగ పంచమి రోజు పాములకు పాలను నైవేద్యంగా సమర్పిస్తుంటారు. దీనికి కారణాల్లో ఒకటి.. పాములను శివుడికి ప్రతీకగా చూస్తారు.
ఈ నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని, పాములను ఆడించే కొన్ని తెగలవారు, వాటిని పట్టుకుని బంధించిన ప్రజల ముందు ప్రదర్శించడం, అవి పాలు తాగడాన్ని ఒక అద్భుతంగా చూపించడం అలవాటుగా చేసుకున్నారని మదురైకి చెందిన పాముల సంరక్షణ నిపుణులు శాంసన్ కృపాకరన్ చెప్పారు.
సరీసృపాలకు, పాలకు మధ్యనున్న సాంస్కృతిక సంబంధం భారత్‌కే ప్రత్యేకమైంది కాదని తెలిసింది. జూన్ 2017లో 'ఆంత్రోపోజూలజీ' జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనంలో ఈ నమ్మకాల గురించి పరిశీలించారు జానపద పరిశోధకుడు (ఫోల్క్‌లోరిస్ట్) డేవిడ్ ఎర్మాగోరా.
పాలిచ్చే తల్లుల నుంచి పాములు, ఇతర సరీసృపాలు పాలను దొంగిలిస్తున్నట్లు యూరేసియా వ్యాప్తంగా ఉన్న కథలను ఎర్మాగోరా గుర్తించారు. అయితే, సరీసృపాలకు పాలు అంటే ఇష్టమనే చెప్పే వాదనను ఆయన "జీవశాస్త్రపరంగా అసంభవం'' గా వర్ణించారు.
ఈ కథల వల్లే ఉత్తర అమెరికాలో కనిపించే హాని చేయని పాముకు 'మిల్క్ స్నేక్' అనే పేరు పెట్టారు.
ఈ పాములు ఆవుల నుంచి పాలు పితికేందుకు కొట్టాలలోకి వస్తాయనే తప్పుడు నమ్మకం వల్లే వీటికి ఆ పేరు వచ్చిందని స్మిత్సోనియన్ నేషనల్ జూలాజికల్ పార్క్ అండ్ కన్జర్వేషన్ ఇన్‌స్టిట్యూట్ వివరించింది.

పాములు ఏం తింటాయి?
మాంసాహారులుగా, పాముల తినే ఆహారంలో ఎలుకలు, వోల్స్ వంటి కొరికే జంతువులు, పక్షులు, గుడ్లు, కప్పలు, చేపలు, బల్లులు, ఇతర సరీసృపాలు ఉన్నాయి.
వాటి దవడ వ్యవస్థలు, జీర్ణాశయం, ప్రేగులు సాధారణంగా ఎరను పూర్తిగా పట్టుకుని, మింగడానికి, జీర్ణం చేసుకునేందుకు అనువుగా ఉన్నాయి.
పాల ఉత్పత్తులను ఆహారంగా స్వీకరించేలా వాటి శరీర నిర్మాణం పరిణామం చెందలేదు.
2017 ఆగస్టులో పరిశోధకుడు జున్‌చెంగ్ దువాన్, ఆయన టీమ్ జర్నల్ గిగాసైన్స్‌లో ఒక అధ్యయనాన్ని ప్రచురించింది.
దీనిలో ఎరను మింగిన తర్వాత కొండచిలువల శరీర భాగాలలో ఏ మార్పులు వస్తాయో పరిశీలించింది.
''ఆహారం తీసుకోవడం, కడుపులో ఆమ్లం ఉత్పత్తి, ప్రొటీన్‌ను జీర్ణం చేసే పెప్సిన్ ఎంజైమ్‌లు పేగులలో పోషకాల శోషణను వేగవంతం చేస్తాయి'' అని వారు కనుగొన్నారు.
'' ఆహారం తిన్న తర్వాత పలు పెప్సినోజెన్ సంబంధిత జన్యువులు పెరుగుతాయి. ఇది పెద్ద మొత్తంలో, పూర్తిగా మింగేసిన (మొత్తంగా మింగేసిన), మాంసకృత్తులు సమృద్ధిగా ఉండే ఆహారాన్ని విచ్ఛిన్నం చేసి జీర్ణం చేసుకోవడానికి వీలుగా ఉన్న వాటి ప్రత్యేకమైన జీర్ణవ్యవస్థను ప్రతిబింబిస్తుంది" అని ఆ అధ్యయనం పేర్కొంది.
కానీ, దీనికి భిన్నంగా ''నీరు, లాక్టోజ్, ప్రొటీన్లు, కొవ్వు, ఖనిజాలు ఉన్న పాలను క్షీరదాలు ఇస్తాయి. ఇది కేవలం సాధారణ నీరు కాదు. డీహైడ్రేషన్‌తో బాధపడే పాములు వీటిని తాగితే.. డీహైడ్రేషన్ నుంచి బయటపడేందుకు వాటికి ఉపయోగపడే ద్రవం లేదా సహజ ఆహార పదార్థం ఇది కాదు'' అని యూనివర్సిటీ స్నేక్‌బైట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫౌండర్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎన్.ఎస్ మనోజ్ అన్నారు.

ఫొటో సోర్స్, SHAMMI MEHRA/AFP via Getty Images
పాములకు బలవంతంగా పాలు తాగించడం వల్ల కలిగే ప్రమాదం ఏంటి?
పాలు తాగడం వల్ల పాములకు కలిగే ప్రధాన ప్రమాదం శ్వాసకోశ సమస్యలే అని నిపుణులు చెప్పారు.
''నోటి గుండా ద్రవాలు ఇచ్చేటప్పుడు ముఖ్యంగా ఆ సరీసృపాలు బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు వాయుమార్గం మూసుకుపోయి, వాంతులు చేసుకునే ప్రమాదం ఉంది'' అని పశువైద్యులకు మార్గనిర్దేశం చేసే మెడికల్ గైడ్ 'ది మెర్క్ వెటర్నరీ మాన్యువల్ ఆఫ్ రెప్టైల్స్'' హెచ్చరిస్తోంది.
ఈ మాన్యువల్ ప్రకారం.. పాముల నోట్లోకి బలవంతంగా పాలు పోయడం వల్ల వాటి శ్వాస నాళం దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే, శ్వాసకు అడ్డంకి కావొచ్చు. శ్వాసకోశ వ్యవస్థలో వాపు లేదా ఇన్‌ఫెక్షన్‌కు దారితీయొచ్చు.
అలాగే, ''అప్పటికే అనారోగ్యంతో, బలహీనంగా ఉన్నప్పుడు సరీసృపాలకు బలవంతంగా ద్రవాలు ఇస్తే అవి వాంతులు చేసుకోవచ్చు. అటువంటి వాంతులు డీహైడ్రేషన్‌కు, ద్రవాలు ఊపిరితిత్తులలోకి ప్రవేశించడానికి దారితీస్తాయి" అని 'మెర్క్ రెప్టైల్ కేర్ మాన్యువల్' గైడ్‌లైన్స్ పేర్కొంటున్నాయి.
''పాములను బలవంతంగా ఒత్తిడికి గురి చేసి, అవి బలహీనమైన పరిస్థితిలో ఉన్నప్పుడు పాలు పోస్తుంటారు. దీంతో పాములు కూడా డీహైడ్రేషన్ నుంచి బయటపడేందుకు వాటి ముందున్న అందుబాటులోని ద్రవాన్ని వెంటనే తాగేందుకు ప్రయత్నిస్తాయి. అప్పుడు, ఆహార నాళంలోకి వెళ్లడానికి బదులుగా, ఈ ఫ్లూయడ్ నేరుగా శ్వాసకోశ నాళంలోకి వెళ్తుంది. దీనివల్ల, రెస్పిరేటరీ అరెస్ట్‌కు గురై, వాటి జీవితం ప్రమాదంలో పడుతుంది'' అని డాక్టర్ ఎన్.ఎస్ మనోజ్ హెచ్చరించారు.
''పాములు నోరు తెరిచినప్పుడు, దాని అడుగు భాగంలో ఒక రంధ్రం కనిపిస్తుంది. ఆ రంధ్రం వాటి శ్వాసనాళానికి (ట్రాకియాకు) అనుసంధానమై ఉంటుంది. ఇది వాటికి శ్వాస తీసుకోవడానికి సహాయపడుతుంది. ఈ స్థితిలో వాటికి బలవంతంగా పాలు తాగిస్తే, ఆ పాలు ఆ రంధ్రంలోకి ప్రవేశించి వాటి శ్వాసకు ఆటంకం కలిగిస్తాయి" అని మనోజ్ వివరించారు.
"పాములు డెయిరీ ప్రొడక్టులను జీర్ణించుకోలేవు. ఎందుకంటే, లాక్టోజ్ ఉన్న ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి అవసరమయ్యే లాక్టేజ్ ఎంజైమ్‌లు పాముల్లో ఉండవు. దీనివల్ల జీర్ణాశయ, పేగు సంబంధిత సమస్యలు వస్తాయి'' అని శాంసన్ కృపాకరన్ చెప్పారు.
పాము పాలు త్రాగడాన్ని ప్రజలు ఒక అద్భుతంగా చూడకూడదని లేదా దాన్ని ప్రోత్సహించకూడదని చెబుతూ.. " ఇది విపరీతమైన శ్రమ కారణంగా ఏర్పడిన దాహం, బలహీనత వలనే పాము అలా చేస్తుంది. నాగపంచమి వంటి సమయాల్లో ఇటువంటి చర్యలు పాములకు తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తాయి" అని డాక్టర్ మనోజ్ అన్నారు.
అటవీ శాఖ తీసుకున్న చర్యలతో దక్షిణాదిలో ఈ విధానం ప్రస్తుతం కొంత నియంత్రణలోకి వచ్చినప్పటికీ.. నాగపంచమి వంటి రోజుల్లో ఉత్తరాదిలో ఈ ఆచారం ఇప్పటికీ పాటిస్తున్నారని శాంసన్ చెప్పారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























