దోమలపై యుద్ధానికి రంగంలోకి సైన్యం, మిలటరీ డ్రోన్లు.. శ్రీలంకలో ఏం జరుగుతోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కెల్లీ ఎన్‌జీ, సంపత్ దిశనాయకే
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
శ్రీలంకలో గత పదేళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఈ ఏడాది డెంగీ కేసులు నమోదవుతున్నాయి.
దేశంలోని భవనాల పైకప్పులపై నిల్వ ఉన్న నీరు, అలాగే దోమలు పెరిగే ఇతర ప్రాంతాలను గుర్తించేందుకు ప్రభుత్వం సైనిక డ్రోన్లను వినియోగిస్తోంది.
కేవలం ఈ ఏడాదిలో డెంగీ వైరస్ కారణంగా శ్రీలంకలో 56 మంది మరణించగా, 77 వేల మందికిపైగా వైరస్ బారిన పడ్డారు. ఇందులో పావు వంతుకుపైగా కేసులు జులై నెలలోనే నమోదయ్యాయి.
దోమల ద్వారా మనుషులకు వ్యాపించే డెంగీ జ్వరం అనేది సాధారణంగా ఉష్ణమండల ప్రాంతాల్లో కనిపించే అనారోగ్య సమస్య.
అయితే ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఈ వ్యాధిని వ్యాప్తి చేసే దోమలు ఇప్పుడు యూరప్, మధ్యధరా ప్రాంతాలతో పాటు కొత్త ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న వివరాల ప్రకారం.. 2000 సంవత్సరం నుంచి 2024 మధ్య ప్రపంచవ్యాప్తంగా డెంగీ కేసులు 5 లక్షల నుంచి1.44 కోట్లకు పెరిగాయి.
డెంగీ వైరస్ సోకిన ఏడిస్ దోమలు మనుషుల్ని కుట్టినప్పుడు డెంగీ జ్వరం వస్తుంది.
బకెట్లు, పూల కుండీలు, పూల కుండీల కింద ఉండే ప్లేట్లలో నిల్వ ఉండే నీటిలో ఈ దోమలు వృద్ధి చెందుతాయి. ఇవి ప్రధానంగా పగటి వేళల్లో చురుకుగా ఉంటాయి. సాధారణంగా సూర్యోదయం, సూర్యాస్తమ సమయాల్లో ఇవి మనుషులను ఎక్కువగా కుడతాయి.
డెంగీ బారిన పడిన చాలామందిలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. లక్షణాలు కనిపించిన వారిలో సాధారణంగా అధిక జ్వరం, తలనొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, వికారం, చర్మంపై దద్దుర్లు కనిపిస్తాయి. ఇవి వారం నుంచి రెండు వారాల్లో తగ్గిపోతాయి.


ఫొటో సోర్స్, Getty Images
అయితే తీవ్రమైన సందర్భాల్లో ఇంటర్నల్ బ్లీడింగ్‌కి, మరణానికి కూడా దారితీయచ్చు.
రెండోసారి డెంగీ సోకిన వారికి ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
డెంగీ వైరస్‌లో నాలుగు వేరియంట్లు ఉన్నాయి. ఒక వేరియంట్ డెంగీ సోకి, దాన్నుంచి కోలుకున్నా ఆ వేరియంట్‌తో పోరాడేందుకు మాత్రమే రోగనిరోధక శక్తి లభిస్తుందని శ్రీలంక జాతీయ డెంగీ నియంత్రణ విభాగం డైరెక్టర్ కపిల కన్నంగర తెలిపారు.
"ఆ ఇమ్యూనిటీ మిగిలిన వేరియంట్లపై పనిచేయదు. అంటే ఒక వేరియంట్ వల్ల డెంగీ సోకిన వ్యక్తికి, మరో వేరియంట్‌ను మోసుకెళ్లే దోమ కుడితే మళ్లీ డెంగీ వచ్చే అవకాశం ఉంటుంది" అని చెప్పారు.
"దీంతో వారికి మరింత తీవ్రమైన ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది" అని ఆయన బీబీసీ సింహళతో అన్నారు.
అన్ని డెంగీ వేరియంట్లపై పనిచేసే ఏకైక టీకా అందుబాటులో లేకపోవడంతో, పారాసిటమాల్ వంటి మందులతో నొప్పిని నియంత్రించడంపైనే చికిత్స ప్రధానంగా ఆధారపడుతుంది. తీవ్రమైన లక్షణాలు కనిపించే రోగులను ఆసుపత్రిలో చేర్చి జాగ్రత్తగా పర్యవేక్షించాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, AFP via Getty Images
శ్రీలంకలో పరిస్థితి ఎలా ఉంది?
నిరుడు డిసెంబర్‌లో శ్రీలంకను కుదిపేసిన తుపాను కారణంగా పేరుకుపోయిన శిథిలాలు దోమల వృద్ధి చెందేందుకు కేంద్రాలుగా మారడంతో డెంగీ కేసులు పెరిగాయని ఆ దేశ ఆరోగ్య అధికారులు చెబుతున్నారు.
ఇళ్ల పైకప్పులు, పాఠశాలలు, నిర్మాణ ప్రదేశాలను డ్రోన్లతో పరిశీలించేందుకు ప్రభుత్వం సైన్యానికి బాధ్యతలు అప్పగించింది. అలాగే ఇళ్ల దగ్గర ప్రత్యక్ష తనిఖీలు నిర్వహించేందుకు పోలీసులను కూడా నియమించింది.
ఈ నెలలో ఇప్పటివరకు దాదాపు 11 వేల దోమల బ్రీడింగ్ సైట్‌లను తొలగించారు. అలాగే అలాంటి ప్రదేశాలు ఉన్న 4 వేలకుపైగా భవనాలపై జరిమానాలు విధించారు.
దేశవ్యాప్తంగా డెంగీ కేసులు నమోదవుతున్నప్పటికీ, రాజధాని కొలంబో వంటి పట్టణ ప్రాంతాల్లో ఇవి మరింత ఎక్కువగా నమోదవుతున్నాయి.
వ్యాప్తిని ఎదుర్కొనేందుకు ఆసుపత్రులు అదనపు పడకలను ఏర్పాటు చేశాయి. పని వేళలను కూడా పొడిగించాయి. ప్రజారోగ్య సిబ్బంది తమ సామర్థ్యానికి మించి పనిచేస్తున్నారని జాతీయ డెంగీ నియంత్రణ విభాగానికి చెందిన కన్నంగర రాయిటర్స్ వార్తాసంస్థకు తెలిపారు.
"రోగుల సంఖ్య ఎక్కువగా ఉంది. తీవ్రమైన కేసుల సంఖ్య కూడా అధికంగానే ఉంది" అని ఆయన చెప్పారు. నమోదైన కేసుల్లో సుమారు 75 శాతం తీవ్రమైన డెంగీ వేరియంట్‌తో సంబంధం ఉన్నవేనని తెలిపారు.
ఆసుపత్రుల్లో సామర్థ్యం పరిమితంగా ఉండటంతో, స్వల్ప లక్షణాలు ఉన్న రోగులు ఇంట్లోనే విశ్రాంతి తీసుకొని కోలుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
డెంగీ టీకాను అందుబాటులోకి తెచ్చే అంశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే వైరస్‌కు నాలుగు వేర్వేరు వేరియంట్లు ఉండటంతో అలాంటి టీకాను అభివృద్ధి చేయడం కష్టమని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
శ్రీలంకలో డెంగీ విజృంభించడం ఇది తొలిసారి కాదు.
2017లో భారీ రుతుపవన వర్షాల నేపథ్యంలో డెంగీ వ్యాప్తి చెందగా, ఆ ఏడాది 450 మంది మరణించారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచవ్యాప్తంగా డెంగీ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి?
డెంగీ సాధారణంగా ఉష్ణమండల, ఉపఉష్ణమండల ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అక్కడ ఉండే అధిక ఉష్ణోగ్రతలు, తేమ, ఏడిస్ దోమల పెరుగుదలకు అనుకూలంగా ఉంటాయి.
దక్షిణాసియా, ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికా, కరీబియన్ ప్రాంతాల్లో డెంగీ హాట్‌స్పాట్‌లు ఎక్కువగా ఉన్నాయి.
అయితే ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో ఈ వ్యాధిని వ్యాప్తి చేసే దోమలు యూరప్, మధ్యధరా ప్రాంతాల వంటి కొత్త ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నాయి.
ఉష్ణమండల ప్రాంతాల్లో ఎక్కువకాలం కొనసాగే, అధిక వర్షాల కారణంగా ఈ దోమలకు సంతానోత్పత్తికి మరింత సమయం లభిస్తోంది.
గత 50 ఏళ్లలో డెంగీ కేసుల సంఖ్య 30 రెట్లు పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రపంచ ఆరోగ్యానికి అత్యంత తీవ్రమైన పది ముప్పుల్లో డెంగీ ఒకటని ఆ సంస్థ గుర్తించింది.
ప్రస్తుతం ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది డెంగీ బారిన పడే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు.
పూలకుండీల కింద ఉండే ప్లేట్లలోని నీటిని తొలగించడం, ఉపయోగించని బకెట్లను బోర్లించడం, గట్టిపడిన మట్టిని పగలగొట్టడం వంటి చర్యల ద్వారా నిల్వ నీటిని తొలగిస్తే డెంగీ వ్యాప్తిని అడ్డుకోవచ్చు.
దోమల ద్వారా వ్యాపించే డెంగీ వంటి వ్యాధులను నియంత్రించేందుకు కొన్ని ప్రభుత్వాలు వోల్బాకియా అనే సహజసిద్ధమైన బ్యాక్టీరియాను కూడా వినియోగిస్తున్నాయి. ప్రపంచంలోని దాదాపు సగం కీటక జాతుల్లో ఈ బ్యాక్టీరియా సహజంగా ఉంటుంది.
ఈ బ్యాక్టీరియా దోమలను చంపకుండా, వైరస్‌ను వ్యాప్తి చేసే వాటి సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































