ఆమె మెదడులో 38 పురుగులు.. 'పందిమాంసం' తినడం వల్లే కావొచ్చంటున్న వైద్యులు

భారత్, యూకే, వ్యాధులు, పందిమాంసం, పరిశుభ్రత
ఫొటో క్యాప్షన్, లోరీ డెన్మాన్
    • రచయిత, నికోలా బ్రైన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

టాయ్‌లెట్‌కు వెళ్లినప్పుడు మీటరు పొడవున్న టేప్‌వార్మ్(పేగు పురుగు - ఏలిక పాము వంటిది) కనిపించడంతో ఏదో జరిగిందని మొదటిసారి లోరీ డెన్మాన్‌కు అర్ధమైంది.

''అది చూడడానికి చాలా అసహ్యంగా, చిన్న చిన్న గీతలతో ఉన్న సెల్లోటేప్‌లా అనిపించింది'' అని 42 ఏళ్ల లోరీ తెలిపారు.

న్యూరోసిస్టిసెర్కోసిస్ అనే వ్యాధికి అది తొలి లక్షణం. దీనివల్ల లోరీ మెదడులో 38 పరాన్నజీవులు చేరాయి. వాటివల్ల ఆమెకు తలనొప్పి, మూర్చ, సైకోసిస్(మానసిక భ్రాంతి)వంటివి వచ్చాయి.

యూకేలో ఏడాదిలో ఇలా మెదడుకు సంబంధించిన వ్యాధి గుర్తించడం అరుదు. అలాంటి వారిలో లోరీ ఒకరు. పందిమాంసంలోని టేప్‌వార్మ్ లార్వా వల్ల ఇది సంక్రమిస్తుంది.

తన ఆరోగ్యం కుదుటపడేందుకు ఏళ్ల సమయం పట్టింది. ఆ తర్వాత, తనకు ఎదురైన అనుభవాలతో ఇతరులకు అవగాహన కల్పించాలని లోరీ నిర్ణయించుకున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
భారత్, యూకే, వ్యాధులు, పందిమాంసం, పరిశుభ్రత

ఫొటో సోర్స్, Lowri Denman

ఫొటో క్యాప్షన్, 2007లో భారత్‌లో పర్యటించడం చాలా బాగుందని లోరీ చెప్పారు.

మెదడులోకి పరాన్నజీవులు చేరినట్టు ఎలా తెలిసింది?

మీడియా రంగంలో పనిచేసే లోరీ 2007లో దాదాపు మూడు నెలల పర్యటన కోసం భారత్‌కు వచ్చారు. భారత్‌లోనే ఆమెకు ఈ వ్యాధి సోకి ఉంటుందని ఆమె డాక్టర్, అంటువ్యాధుల నిపుణులు డాక్టర్ బ్రెండన్ హేలీ భావిస్తున్నారు.

ఈ పర్యటనలో మాంసం తినకూడదని లోరీ నిర్ణయించుకున్నారు. ఫుడ్ పాయిజన్ వంటివి కాకుండా ఉండడం కోసం ఆమె ఇలా అనుకున్నారు. కానీ, టేప్‌వార్మ్ గుడ్లు ఉన్న పందిమాంసాన్ని ఆమె అనుకోకుండా తినుండొచ్చన్నది డాక్టర్ హేలీ భావన.

ఓ రెస్టారెంట్‌లో టాయ్‌లెట్‌కు వెళ్లినప్పుడు 2010లో లోరీకి టేప్‌వార్మ్ కనిపించింది. వెంటనే ఫ్లష్ చేశారు.

తర్వాత, ఆమె తమ కుటుంబ వైద్యుణ్ని కలిశారు. మలం పరీక్షల్లో సాధారణ ఫలితాలే వచ్చాయి. ఆమెకు అంతా బాగానే ఉన్నట్టు అనిపించింది. జీవితం ఎప్పటిలానే సాగిపోయింది.

కానీ, ఏడాదిలోపే ఆమెకు భయంకరంగా తలనొప్పి రావడం మొదలైంది.

2011లో మొదటిసారి ఆమెకు మూర్ఛ వచ్చింది.

''నోట్లో నుంచి మాటలు రావడం కూడా కష్టమైంది. తర్వాత నాకు ఏం జరిగిందో తెలియదు. మెలకువ వచ్చేసరికి అంబులెన్స్‌లో ఉన్నాను. ఇదెలా జరిగింది, ఎందుకు జరిగిందో నాకు అర్ధం కాలేదు'' అని లోరీ గుర్తుచేసుకున్నారు.

ఆమెను ఆస్పత్రిలో చేర్చి సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ తీశారు. ఫలితాల కోసం మళ్లీ రావాలని డాక్టర్లు చెప్పారు.

''నీ స్కాన్‌లను పరిశీలించిన తర్వాత నీ మెదడులో 38 పరాన్నజీవులున్నట్టు (పారాసైట్స్) గుర్తించామని డాక్టర్ చెప్పారు. నేను, మా అమ్మ ఇద్దరం షాకయ్యాం. ఏం జరుగుతోందో అర్ధం కాలేదు'' అని లోరీ చెప్పారు.

భారత్, యూకే, వ్యాధులు, పందిమాంసం, పరిశుభ్రత

ఫొటో సోర్స్, Lowri Denman

ఫొటో క్యాప్షన్, న్యూరోసిస్టిసెర్కోసిస్ యూకేలో చాలా అరుదైన వ్యాధని వైద్యులు చెప్పారు.

‘బాగున్నట్టు ఉంటూనే కుప్పకూలిపోవడం’

మొదట దీన్ని పిల్లుల మలం ద్వారా వ్యాపించే టాక్సోప్లాస్మోసిస్ అనుకున్నారు. దీని బారినపడ్డ పిల్లుల మలం ద్వారా ఇది వ్యాపిస్తుంది.

ఏడాది క్రితం కనిపించిన టేప్‌వార్మ్‌కు, మూర్ఛలకు సంబంధముందా అని లోరీ తల్లి అడిగారు.

తదనంతర పరీక్షల తర్వాత, లోరీకి న్యూరోసిస్టిసెర్కోసిస్ సంక్రమించినట్టు నిర్ధరించారు.

పచ్చిది లేదా సరిగ్గా ఉడకని పందిమాంసం, టేప్‌వార్మ్ గుడ్లు ఉన్న కలుషిత నీటిని తాగడం, లేదా పరిశుభ్రంగా లేకపోవడం వంటివల్ల మనుషులకు ఈ వ్యాధి సోకుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

యూకేలో ఈ వ్యాధి చాలా అరుదు. ఇలాంటి వ్యాధులు ప్రబలంగా ఉన్న ప్రాంతాలకు వెళ్లొచ్చిన వారిలోనే దాదాపుగా ఈ వ్యాధి కనిపిస్తుంటుంది.

''ఆ సమయంలో నా ముందు అనేక ప్రశ్నలున్నాయి. నా ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఏం చేయాలి? ఏం జరగనుంది? దీన్ని నేనెలా ఎదుర్కోవాలి? ఏం మందులు వాడాలి? నేను తిరిగి ఉద్యోగం చేయగలనా? వంటి అనేక ప్రశ్నలు అప్పుడు నా ముందున్నాయి'' అని లోరీ తెలిపారు.

లోరీ రెండువారాల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. పరాన్నజీవులను చంపే మందులు, స్టెరాయిడ్లు వంటివి ఆమెకు వాడారు.

ఆ చికిత్సతో ఫలితం ఉన్నట్టు కనిపించింది.

చాలా ఏళ్లపాటు ఆమె ఆరోగ్యంగా ఉన్నారు. తన సోదరితో కలిసి న్యూజీలాండ్ వెళ్లారు. బ్రిస్టల్ వెళ్లారు. సర్కస్ తరగతులకు హాజరయ్యారు. హాఫ్ మారథాన్స్‌లో పాల్గొన్నారు.

కానీ, తర్వాత ఓ రోజు విధుల్లో ఉండగా కుప్పకూలిపోయారు.

భారత్, యూకే, వ్యాధులు, పందిమాంసం, పరిశుభ్రత

ఫొటో సోర్స్, Lowri Denman

ఫొటో క్యాప్షన్, ఏం జరిగినప్పటికీ, భారత పర్యటనలో చూసిన ప్రకృతి అందాలు, అక్కడి ప్రజలు, సంస్కృతి జీవితాంతం తన జ్ఞాపకాల్లో ఉంటాయని లోరీ చెప్పారు.

శారీరక, మానసిక సమస్యలు

లోరీ మెదడులోని పరాన్నజీవుల చుట్టూ పెద్దగా వాపు వచ్చిందని స్కానింగ్‌లో తేలింది.

అలా కుప్పకూలిన తర్వాత ఆమె గందరగోళానికి గరయ్యారు. శరీరం మొద్దుబారడం, సూదులతో గుచ్చినట్టుగా అనిపించడం వంటివి జరిగాయి.

తర్వాత, లోరీ ఉద్యోగం మానేశారు. తండ్రితో కలిసి కార్మార్థెన్‌‌కు మారారు.

స్టెరాయిడ్లు ఇస్తుండడంతో ఆమె రూపం మారిపోయింది. జీవితం కుంచించుకుపోయినట్లు అనిపించింది. మానసిక ఆరోగ్యం బాగా దెబ్బతింది. ఆమె నిరాశకు గురయ్యారు.

''భయాందోళన, ఇతరులపై అనుమానాలు, మానసిక భ్రమలు మొదలయ్యాయి. యాంగ్జైటీ ఎక్కువైంది. పానిక్ ఎటాక్స్ వచ్చాయి. న్యూరోసైకియాట్రిక్ ఆస్పత్రిలో ఆరువారాల పాటు చికిత్స పొందాను. నా కుటుంబం కూడా చాలా కలవరపడింది. స్నేహితులు వచ్చి భయంకరమైన స్థితిలో ఉన్న నన్ను పరామర్శించారు'' అని లోరీ గుర్తుచేసుకున్నారు.

లోరీని పరామర్శించడానికి వచ్చిన వారిలో ఇరవై ఏళ్లుగా ఆమెకు స్నేహితురాలైన నికోలా బ్రైన్ ఒకరు.

అప్పటికి లోరీని చూసి ఓ నెలమాత్రమే గడిచింది. కానీ, నెలరోజుల్లోనే లోరీ అలా మారిపోవడం చూసి నికోలా షాక్‌కు గురయ్యారు.

''నేను గదిలోకి వెళ్లగానే ఆమె చిన్నపిల్లలా ప్రవర్తిస్తున్నారు. నేల మీద పాకడం, కర్టెన్ వెనక దాక్కోవడం, ఐదేళ్ల పిల్లలా తండ్రి ఒడిలో కూర్చోవడం వంటివి చేస్తున్నారు" అని నికోలా అన్నారు.

తిరిగి వెళ్లేటప్పుడు లోరీ నన్ను దూషిస్తూ, ఇంకెప్పుడూ రావొద్దని అన్నట్లు నికోలా చెప్పారు.

"ఆ తర్వాత లోరీ నాకో మెసేజ్ పంపారు. 'నన్ను చూడడానికి వచ్చినందుకు కృతజ్ఞతలు. ఈ రాత్రి నువ్వు నన్ను వార్తల్లో చూస్తావు. పోలీసులు నన్ను వెతుకుతున్నారు' అని ఆ మెసేజ్‌లో ఉంది."

"అప్పుడు నా మనసులో మెదిలిన ఆలోచన ఏంటంటే.. లోరీకి ఇలా అయిందేంటి? ఇక జీవితంలో మనం పాత లోరీని తిరిగి చూడగలమా?'' అని అప్పటి పరిస్థితులను నికోలా వివరించారు.

భారత్, యూకే, వ్యాధులు, పందిమాంసం, పరిశుభ్రత

ఫొటో సోర్స్, Nicola Brown

ఫొటో క్యాప్షన్, ఆస్పత్రిలో లోరీని చూసి ఆశ్చర్యపోయానని నికోలా చెప్పారు.

‘అత్యంత అరుదైన కేసు’

అప్పటి నుంచి పూర్తిగా కోలుకుని లోరీ మునపటిలా ఆరోగ్యంగా తయారయ్యేందుకు చాలా సమయం పట్టింది.

ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత కూడా ఆమె పరిస్థితి మెరుగుపడలేదు. తిరిగి తన తండ్రితో కలిసే ఉండసాగారు.

''నేను నేనుగా లేను. నన్ను నేను గుర్తుపట్టలేకపోయాను. నా రూపం పూర్తిగా మారిపోయింది. బయటకు వెళ్లాలనిపించేది కాదు'' అని లోరీ చెప్పారు.

ఆ తర్వాత లోరీ కార్‌మార్థెన్‌లో ఆర్ట్ ఫౌండేషన్ కోర్సు పూర్తి చేశారు. 2018 నాటికి ఆమె తిరిగి ధైర్యం పుంజుకున్నారు. కార్డిఫ్‌కు తిరిగి వెళ్లారు. ఇంటీరియర్ డిజైన్ డిగ్రీ పూర్తి చేశారు.

2022లో తిరిగి ఉద్యోగంలో చేరారు.

తన కెరీర్‌లో లోరీ వంటి కేసును చూడలేదని ఆమె కన్సల్టెంట్ డాక్టర్ హేలీ చెప్పారు.

ఇలాంటి లక్షణాలతో ఇన్నేళ్ల పాటు కొనసాగిన కేసును మళ్లీ చూడలేదని ఆయన అన్నారు.

యూకే, అమెరికాలోని ప్రముఖ వైద్యనిపుణుల్లో కూడా లోరీ కేసు చర్చనీయాంశంగా మారిందని అన్నారు.

''నా మొత్తం కెరీర్‌లో మళ్లీ ఇలాంటి కేసు చూసే అవకాశం ఉంటుందని నేను అనుకోవడం లేదు. అంటువ్యాధుల నిపుణులు దేశంలో చాలా మంది ఉన్నారు. వాళ్లలో ఒక్కరు కూడా ఇలాంటి కేసును చూడలేదంటే ఇదెంత అరుదైనదో అర్ధం చేసుకోవచ్చు'' అని హేలీ చెప్పారు.

ఏళ్ల పాటు అనేక ఆరోగ్య సమస్యలు వచ్చిన తర్వాత లోరీ మెదడులోని పరాన్నజీవులు కాల్సిఫైడ్(గట్టిపడి, సున్నంలా)అయ్యాయి.

''నా మెదడు నుంచి వాటిని బయటకు తీయడానికి ఎలాంటి సర్జరీ చేయలేదు. అవి క్రమంగా చనిపోయి గట్టిపడ్డాయి. ఇప్పుడలాగే ఉన్నాయి'' అని లోరీ చెప్పారు.

పరాన్నజీవుల గుడ్లను చంపే చికిత్స లోరీకి అందించామని, ఇప్పుడామె ప్రమాదకర దశ దాటారని డాక్టర్ హేలీ చెప్పారు.

2017 తర్వాత ఆమెకు మూర్ఛలు రాలేదు. కానీ, ఆమె జీవితాంతం మూర్ఛ వ్యాధికి మందులు వాడాల్సి ఉంటుంది.

లోరీ ప్రస్తుతం కార్డిఫ్‌లో ఉంటున్నారు.

''నేను జీవితంలో ముందుకు సాగాలనుకుంటున్నా. ఈ వ్యాధి పట్ల అవగాహన పెంచి, నా అనుభవాన్ని సానుకూల ప్రయోజనం కోసం ఉపయోగించాలనుకుంటున్నా. జీవితంలో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. నేను ఆరోగ్యంగా తిరిగి ఫిట్‌గా జీవించగలగడం నాకు సంతోషంగా ఉంది. ఈ జీవితాన్ని ఎప్పటికీ నేను చిన్న విషయంగా తీసుకోను'' అని లోరీ తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)