‘మ్యాస్ట్రో’ ఇళయరాజా: క్యాసెట్ల కాలం నుంచి నేటి రీమిక్స్‌ల వరకు.. తరగని క్రేజ్

ఫొటో సోర్స్, Ananda Vikatan
- రచయిత, అన్బరసన్ ఎతిరాజన్
- హోదా, గ్లోబల్ అఫైర్స్ కరెస్పాండెంట్
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
ఇళయరాజా అభిమానులు ఆయనను ఆదరంగా 'మ్యాస్ట్రో' అని పిలుచుకుంటారు.
ఇళయరాజా సంగీత ప్రస్థానం మొదలై 50 ఏళ్లు దాటినా, నేటికీ ఆయన స్వరాలు దేశవ్యాప్తంగా ఇళ్లలో, కచేరీ హాళ్లలో, సినిమా థియేటర్లలో మారుమోగుతూనే ఉన్నాయి.
తమిళుడైన ఈ 83 ఏళ్ల ఈ స్వరకర్త (కంపోజర్) ఇప్పటివరకు తొమ్మిది భాషల్లో వెయ్యి కంటే ఎక్కువ సినిమాలకు సంగీతం అందించారు. భారతీయ చలనచిత్ర చరిత్రలో ఇది ఒక అరుదైన ఘనత.
1976లో వచ్చిన 'అన్నకిళి' సినిమాతో ఆయన తమిళ సినిమా సంగీత స్వరూపాన్నే మార్చేశారు. ఆ తర్వాత దేశంలోనే అత్యంత ప్రభావవంతమైన స్వరకర్తలలో ఒకరిగా ఎదిగారు.
సంగీత ప్రపంచంలోకి ఇళయరాజా రాక ఒక కీలక మలుపు అని ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు టీఎం కృష్ణ అన్నారు. పూర్తిగా భిన్నమైన సామాజిక వాతావరణం నుంచి వచ్చిన ఒక వ్యక్తి.. సరికొత్త ధ్వని ప్రపంచాన్ని సృష్టించి సంగీత ప్రపంచంలో ఒక గొప్ప మార్పును తీసుకొచ్చారని ఇళయరాజాను ఉద్దేశించి కృష్ణ వ్యాఖ్యానించారు.

భారతీయ సినిమాలో ప్లే బ్యాక్ సింగింగ్ (నేపథ్య గానం) చాలా ముఖ్యమైనది.
గాయకులు పాడిన పాటలకు తెరపై నటీనటులు పెదవులు కదుపుతారు. సాధారణంగా స్వరకర్తలే సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (నేపథ్య సంగీతం) కూడా అందిస్తారు.
ఇళయరాజా రాకముందు, సినిమాల్లో సంగీతం ఎక్కువగా భారతీయ శాస్త్రీయ సంగీతం చుట్టూనే తిరిగేది. పాశ్చాత్య సింఫనీల ప్రభావం అరుదుగా ఉండేది.
సంగీత శైలిలో విప్లవం
ఇళయరాజా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ సంగీత సంప్రదాయాలను తన పాటల్లో ఉపయోగించుకున్నారని కృష్ణ చెప్పారు.
'వేర్వేరు రకాల సంగీతాలను (మ్యూజిక్ జాన్రాలను ) కలిపి, వాటిని ఒకదానితో ఒకటి అద్భుతంగా సింక్ చేస్తూ సరికొత్త సంగీతాన్ని వినిపించడంమే ఇళయరాజాలోని అసలైన ప్రతిభ'' అని ఆయన ప్రశంసించారు.
'అన్నకిళి' విజయం తర్వాత, ఇళయరాజా వివిధ భాషల్లో ఎన్నో సూపర్ హిట్లు అందించారు. వాటిలో పదినారు వయదినిలే, ఓలంగళ్, సద్మా, గీతాంజలి, చిన్న గౌండర్, నాయకన్ వంటి సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. తమిళనాడు జానపద, గ్రామీణ గాథల ఆధారంగా ఆయన 8,000లకు పైగా సినీ పాటలను స్వరపరిచారు.
గత ఏడాది, లండన్‌కు చెందిన ప్రసిద్ధ 'రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా'తో కలిసి వెస్ట్రన్ క్లాసికల్ సింఫనీని స్వరపరిచి, ప్రదర్శించిన తొలి భారతీయుడిగా ఆయన కొత్త రికార్డు నెలకొల్పారు. ''ప్రపంచ సంగీత చరిత్రలో ఇదొక మైలురాయి''గా రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా అభివర్ణించింది.

ఫొటో సోర్స్, Stills Ravi
కష్టాల నుంచి శిఖరాగ్రానికి..
తమిళనాడులోని పణ్నైపురంలో 1943 జూన్‌లో జన్మించిన ఇళయరాజా అసలు పేరు ఆర్. జ్ఞానదేశికన్. ఆయన తండ్రి యాలకుల తోట సూపర్ వైజర్‌గా పనిచేసేవారు. తండ్రి పాడే జానపద పాటలను వింటూ ఇళయరాజా పెరిగారు. ఆయనకు ఏడేళ్ల వయసున్నప్పుడే తండ్రి హఠాత్తుగా మరణించారు.
'మా నాన్న చనిపోయాక మా అమ్మ చిన్నతాయమ్మాళ్ ఇంట్లో అందరినీ చూసుకున్నారు. మేం చాలా కష్టాలు అనుభవించాం' అని పాత రోజులను గుర్తుచేసుకున్నారు ఇళయరాజా తమ్ముడు గంగై అమరన్. ఆయన కూడా ప్రముఖ సంగీత దర్శకుడు.
పేద, సామాజికంగా వెనుకబడిన కుటుంబంలో పుట్టడం వల్ల ఇళయరాజాకు పైకి రావడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి. కానీ, సంగీతం ఎప్పుడూ ఆయన వెన్నెంటే ఉంది. ఇళయరాజా పెద్దన్నయ్య, గాయకుడు-నాటక రచయిత అయిన పావలార్ వరదరాజన్, 1950లలో కమ్యూనిస్ట్ పార్టీ కార్యక్రమాలలో ప్రదర్శనలు ఇచ్చేవారు. ఆ కాలంలో ఆ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీకి మంచి పట్టు ఉండేది.
''మేం మా అన్నయ్యతో కలిసి ఊరూరూ తిరిగేవాళ్లం. అలా జానపద, పల్లెటూరి బాణీలను ఒంటపట్టించుకున్నాం'' అని అమరన్ చెప్పారు.
ఒకసారి ఒక ప్రోగ్రామ్‌కు ముందు వరదరాజన్ ఆరోగ్యం బాలేకపోవడంతో, వారి తల్లి ఇళయరాజాను వాళ్లన్నయ్య స్థానంలో వేదికపైకి పంపారు. అది ఇళయరాజా ఇచ్చిన మొదటి బహిరంగ ప్రదర్శన.

ఫొటో సోర్స్, Stills Ravi
మద్రాస్ ప్రయాణం, రాత్రింబవళ్లు పని
ఆర్థిక ఇబ్బందుల వల్ల 14 ఏళ్లకే ఇళయరాజా చదువు ఆపేయాల్సి వచ్చింది. సినిమాల్లో అవకాశం కోసం 1968లో తన సోదరులతో కలిసి మద్రాస్ (ఇప్పుడు చెన్నై) చేరుకున్నారు. బస్సు చార్జీలు మిగుల్చుకోవడానికి కిలోమీటర్ల కొద్దీ నడవడం, ఎన్నో రోజులు ఆకలితోనే పడుకోవడం వంటి ఆనాటి కష్టాలను ఆయన తర్వాత గుర్తు చేసుకున్నారు. ధన్‌రాజ్ మాస్టర్ దగ్గర ఆయన పాశ్చాత్య సంగీతం నేర్చుకుంటూ గిటార్, పియానోపై పట్టు సాధించారు. అలాగే, బాక్, బెతోవెన్, మోజార్ట్, షూబర్ట్ వంటి ప్రపంచ ప్రసిద్ధ సంగీతకారుల శైలిని ఔపోసన పట్టారు.
'ఇది దేవుడిచ్చిన వరం. సంగీత వాయిద్యాలను నేర్చుకోవడం, వాటిపై పట్టు సాధించడం ఆయనకు పుట్టుకతోనే వచ్చాయి'' అని అమరన్ అన్నారు.
ఇళయరాజా 1969లో ప్రముఖ సంగీత దర్శకుడు జీకే వెంకటేశ్ వద్ద అసిస్టెంట్‌గా చేరారు.
''జీకే వెంకటేశ్ గారు నా గురువు. ఆర్కెస్ట్రా స్కోర్లు రాసేలా ఆయనే నన్ను ప్రోత్సహించారు'' అని ఇళయరాజా ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.
అలా ఆయన గిటారిస్ట్‌గా మారి, సొంతంగా ట్యూన్లు కట్టడం మొదలుపెట్టారు.
మద్రాస్‌కు వెళ్లిన తొలినాళ్లలో ఆయన దినచర్య చాలా బిజీగా ఉండేది. తెల్లవారకముందే మ్యూజిక్ క్లాసులు, రోజంతా రికార్డింగ్ సెషన్లు, అర్ధరాత్రి వేళకు ఇంటికి చేరుకోవడం అలా ఉండేది.
జీకే వెంకటేశ్‌తోపాటు మరికొందరి దగ్గర దాదాపు 200కు పైగా సినిమాలకు పనిచేసి తన నైపుణ్యాన్ని పెంచుకోవడమే కాకుండా సినీ పరిశ్రమలో పరిచయాలను ఏర్పరచుకున్నారు.

ఫొటో సోర్స్, Ananda Vikatan
'ఇళయరాజా'గా మారిన రాజా
'అన్నకిళి' సినిమా రచయిత, పాటల రచయిత అయిన పంచు అరుణాచలం కారణంగా ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చిందని, జీవితం మలుపు తిరిగిందని అమరన్ గుర్తు చేసుకున్నారు.
'మా సినిమా బృందానికి నీ ప్రతిభ చూపించమంటూ ఇళయరాజాను టీమ్ ముందుకు తీసుకొచ్చారు అరుణాచలం. ఆ గదిలో ఎలాంటి వాయిద్యం లేదు. అప్పుడు ఇళయరాజా ఒక బల్లను డ్రమ్స్‌లా వాడుతూ లయబద్ధంగా కొడుతూ పాట పాడారు. ఆ పాట వినగానే నిర్మాత ఫ్లాట్ అయిపోయారు' అని అమరన్ వివరించారు.
అప్పటివరకు అందరూ 'రాజా' అని పిలిచేవారు. అరుణాచలం ఆ పేరును మార్చి 'ఇళయరాజా' అని కొత్తపేరు పెట్టారు. ఇళయ అంటే తమిళంలో చిన్న అర్థం. ఇళయరాజా అంటే చిన్నరాజు.
అన్నకిళి సినిమా హిట్ కావడంతో ఇళయరాజా పేరు మారుమోగిపోవడమే కాకుండా అవకాశాలు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి.
1970ల చివరలో, 1980లలో దేశంలో ప్రజలు సంగీతం వినే విధానమే మారిపోయింది. అంతకుముందు వరకు పాటలను కేవలం రేడియోల్లోనో, కమ్యూనిటీ హాళ్లలోని వినైల్ రికార్డుల ద్వారా వినేవారు.
''ఆడియో క్యాసెట్లు, తక్కువ ధరకు దొరికే మ్యూజిక్ సిస్టమ్స్ మార్కెట్లోకి రావడంతో ప్రజలు తమకు నచ్చినప్పుడు, నచ్చినన్నిసార్లు పాటలు వినే అవకాశం లభించింది. టెక్నాలజీ మారుతున్న సరైన సమయంలో ఇళయరాజా, మ్యూజిక్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు'' అని మ్యూజిక్ క్రిటిక్ షాజీ చెన్ అన్నారు.
తక్కువ కాలంలోనే ఇళయరాజా, సౌత్ ఇండియన్ సినిమాలో అత్యధిక డిమాండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్‌గా మారిపోయారు. థియేటర్లలో స్క్రీన్‌పై ఆయన పేరు పడగానే ప్రేక్షకులు పేపర్లు చల్లడం, ఈలలు వేయడం, చప్పట్లు కొడుతూ గోల చేయడం మొదలుపెట్టేవారు. ఆయన పాటల కోసమే చాలామంది సినిమాలను పదేపదే చూసేవారు. కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు ఒకే ఏడాదిలో 50 కంటే ఎక్కువ సినిమాలకు సంగీతం అందించారు. ఎన్నో సినిమాలు కేవలం ఆయన సంగీతం వల్లే థియేటర్లలో 100 రోజులకు పైగా ఆడాయి.
''సినిమాలోని భావోద్వేగాలను, థీమ్స్‌ను ఆయన బాగా అర్థం చేసుకుంటారు. ఆ భావోద్వేగాలను తన సంగీతం ద్వారా బయటకు తెస్తారు. అందుకే ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్స్ అంత స్పెషల్‌గా నిలిచాయి'' అని మ్యూజిక్ క్రిటిక్ సువాంశు ఖురానా అన్నారు.

ఫొటో సోర్స్, Ananda Vikatan
సంగీత ప్రయోగాలు-అంతర్జాతీయ గుర్తింపు
ఆయన అద్భుతమైన కంపోజిషన్లలో 1991లో వచ్చిన ‘దళపతి’ సినిమాలోని 'రక్కమ్మా కైయా తట్టు' పాట ఒకటి. మహాభారతం ఆధారంగా తెరకెక్కిన ఈ గ్యాంగ్‌స్టర్ సినిమాలోని ఈ పాటలో తమిళ జానపదం, కర్ణాటక సంగీతం, వెస్ట్రన్ క్లాసికల్ ఫ్యూగ్, పోల్కా వంటి విభిన్న సంగీత శైలులను ఆయన అద్భుతంగా మిక్స్ చేశారు.
2002లో బీబీసీ వరల్డ్ సర్వీస్ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఒక సర్వేలో, ఈ పాట ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాలుగో పాటగా నిలిచింది.
సంగీతంలో నిరంతరం ప్రయోగాలు చేసే ఇళయరాజా.. కర్ణాటక రాగాలు, భారతీయ జానపద బాణీలు, షూబర్ట్ లేదా మోజార్ట్ వంటి వెస్ట్రన్ సంగీతాన్ని కూడా ఒకే పాటలో మిక్స్ చేయగలరు.
ఇటీవల చెన్నైలో జరిగిన తన 'వేలియంట్' సింఫనీ ప్రదర్శనలో ఆయన ఒక ఆసక్తికర విషయం చెప్పారు. 1979 నాటి తమిళ చిత్రం 'పుదియ వార్పుగళ్' లోని 'ఇదయం పోగుదే' పాటలో షూబర్ట్ రాసిన 'అన్‌ఫినిష్డ్ సింఫొనీ'ని ఎలా ఉపయోగించారో ఇళయరాజా వివరించారు.
''అవి రెండు వేర్వేరు సంస్కృతులకు చెందిన సంగీత శైలులు. కానీ, అవి వేర్వేరు కాదని, అంతా ఒకటేనని నిరూపించడానికి ఆ ప్రయత్నం చేశాను" అని ఆయన చెప్పారు.
వారసత్వం - సామాజిక మార్పు
1990ల ప్రారంభంలో ఏఆర్ రెహమాన్ వచ్చే వరకు తమిళ సినిమా మ్యూజిక్ ఇండస్ట్రీని ఇళయరాజా ఏలారు.
నిజానికి రెహమాన్ కంపోజర్ కావడానికి ముందు చాలా ఏళ్లపాటు ఇళయరాజా ఆర్కెస్ట్రాలో కీబోర్డ్ ప్లేయర్‌గా పనిచేశారు.
'ఇళయరాజా గారితో కలిసి పనిచేయడం ఒక స్కూల్లో చదువుకోవడం వంటిది. ఆయన జీవితమే నాకు పెద్ద ప్రేరణ' అని 2019లో ఒక కార్యక్రమంలో రెహమాన్ అన్నారు.
రెహమాన్ హవా మొదలైన తర్వాత కూడా ఇళయరాజా క్రేజ్ తగ్గలేదు. ఆయన నిళల్‌కూతు, విరుమాండి, చీనీ కమ్ వంటి చిత్రాలతో హిట్లు కొడుతూనే వచ్చారు. ప్రాచీన తమిళ సాహిత్యం, 'తిరువాసగం' వంటి భక్తి రచనల ఆధారంగా ఆయన ప్రైవేట్ ఆల్బమ్‌లను కూడా రూపొందించారు.
2018లో, భారతదేశపు రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్నారు.
83 ఏళ్ల వయసులోనూ...
ఇళయరాజా 83 ఏళ్ల వయసులో కూడా ఇప్పటికీ కొన్ని సినిమాలకు సంగీతం అందిస్తూనే ఉన్నారు. ఇటీవల చెన్నై, బెంగళూరులలో తన 'వేలియంట్ సింఫనీ'ని ప్రదర్శించిన ఆయన, ప్రపంచవ్యాప్తంగా మ్యూజిక్ టూర్లు చేస్తూ బిజీగా గడుపుతున్నారు.
నేటి తరం వారు కూడా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, వైరల్ రీమిక్స్‌ల ద్వారా ఇళయరాజా సంగీతాన్ని కొత్తగా ఆస్వాదిస్తున్నారు.
అనుమతి లేకుండా తన సంగీతాన్ని ఉపయోగించడం, రాయల్టీల విషయమై ఆయన చేస్తున్న చట్టపరమైన పోరాటాల వల్ల కూడా ఇటీవలి కాలంలో ఆయన వార్తల్లో నిలిచారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































