‘‘ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా మాట్లాడుకుని తనపై తానే దాడి చేయించుకున్నారు’’-పాస్టర్ అభినయ్ దర్శన్‌‌పై దాడి గురించి పోలీసులు ఇంకా ఏం చెప్పారు?

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

పాస్టర్ అభినవ్ దర్శన్‌పై నిజంగా దాడి జరగలేదని, అది ప్లాన్ చేసిన డ్రామా అని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ చెప్పారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసులో… భరోసా పార్టీ అధ్యక్షుడు, పాస్టర్, సినీ నటుడు అభినయ్ దర్శన్‌తో పాటు ఆయనకు సహకరించిన వారిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

అయితే, అభినయ్ దర్శన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వీడియోలు కనిపించాయి. దీంతో మీడియా, సోషల్ మీడియాలో ఈ దాడి వార్తలే కనిపించాయి.

ఆ వీడియోలలో అభినయ్ దర్శన్‌ను కొందరు కారులో నుంచి లాగి, తోటల్లోకి తీసుకెళ్లి దాడి చేసినట్లు దృశ్యాలు కనిపించాయి. తనని కాపాడాలంటూ దర్శన్ వేడుకుంటున్న ఆడియో కూడా అందులో వినిపించింది.

దాడి తర్వాత ఆయన్ను వెతుక్కుంటూ వచ్చిన అనుచరులు, ఆయన్ను గుర్తించి ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కారు ఎక్కిస్తున్న దృశ్యాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే అల్లూరి జిల్లా పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అభినయ్ దర్శన్‌పై దాడి చేసినవారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఇదే సమయంలో అభినయ్ దర్శన్ చింతపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి విశాఖ కేజీహెచ్‌కు మారారు. అక్కడ చికిత్స పొందుతూ, తనపై రాజకీయపరమైన దాడి జరిగిందంటూ మీడియాకు ఇంటర్వూలు ఇచ్చారు.

ఇంకోవైపు ఆయనకు అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా కొందరు మీడియాలో ఇంటర్వ్యూలు, సోషల్ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి.

అభినయ్ దర్శన్‌పై దాడి నాటకం: ఎస్పీ

ఈ దాడి వ్యవహారంపై దర్యాప్తు చేసిన పోలీసులు, చివరకు ఇది డ్రామా అని తేల్చారు. ఈ విషయాన్ని అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ మీడియాకు వివరించారు. ఆయన చెప్పిన వివరాలు ప్రకారం...

‘‘గూడెంకొత్తవీధి మండలం నీరుతోటపాలెంలో జరిగినట్లు ప్రచారంలో కనిపించిన దాడి ఘటన ముందస్తుగా వేసుకున్న నాటకంలో భాగమని దర్యాప్తులో తేలింది.

క్రైమ్ నంబర్ 25/2026గా కేసు నమోదైంది.

మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం, మత భావాలను దెబ్బతీయడం, పబ్లిక్ మిష్చీఫ్ తదితర సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా దారా అభినయ్ దర్శన్‌ కాగా, కిరణ్ జార్జ్, బెన్‌హర్, భాను ప్రసాద్ తదితరులు సహ నిందితులు.

వీరు స్థానికంగా కొందరిని ప్రలోభపెట్టి, డబ్బులు ఇచ్చి దాడి నాటకం ఆడారు.

దాడి ఘటనను ముందుగానే ప్లాన్ చేసి, వీడియోలు రికార్డు చేసి, తరువాత వాటిని సోషల్ మీడియా ద్వారా వైరల్ చేశారు. దీని ద్వారా ప్రజల్లో భయం, మత ఉద్రిక్తతలు సృష్టించడం, రాజకీయంగా సానుభూతి పొందడం లక్ష్యమై ఉండవచ్చు.

అభినయ్ దర్శన్ భరోసా పార్టీ పేరుతో రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తూ… ముఖ్యంగా క్రైస్తవ, మైనారిటీ వర్గాలను సమీకరించే ప్రయత్నాలు చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సమావేశాలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు.

ఇక అభినయ్ దర్శన్‌పై గతంలో కూడా విజయనగరం, కడప జిల్లాల్లో బెదిరింపులు, వరకట్న వేధింపులకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి.

ఈ ఘటనలో మరికొందరి పాత్ర, ఆర్థిక సహాయం, కుట్ర కోణాలలో దర్యాప్తు కొనసాగుతోంది’’ అని ఎస్పీ తెలిపారు.

అభినయ్ ఏం చెప్పారంటే...

క్రైస్తవ మతప్రచారకుడు, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా చెప్పుకుంటున్న అభినయ్ దర్శన్‌ గత కొంతకాలంగా ఏజెన్సీ ప్రాంతంలో, ముఖ్యంగా పాడేరు, అరకు నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తున్నారు.

ఈ క్రమంలో చింతపల్లి మండలం నీరుతోటపాలెం సమీపంలో తనపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని ఆయన ఆరోపించారు. ఆయనతో బీబీసీ మాట్లాడింది.

ఆయన చెప్పిన వివరాల ప్రకారం…

"సోమవారం చింతపల్లి మండలంలో పాదయాత్ర చేస్తున్నాను. నా వెంట ఉండే వాహనానికి కొంతకాలంగా రిపేర్లు ఉన్నాయి. పాదయాత్రకు విరామమిచ్చి, దానికి రిపేరు చేయించడానికి తీసుకెళ్తున్న సమయంలో, నీరుతోటపాలెం సమీపంలోని కోటకొండ మలుపు వద్ద బైక్‌లపై వచ్చిన కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు."

"మొదట కోడిగుడ్లు విసిరారు. తర్వాత రాళ్లతో కొట్టారు. కాసేపు తర్వాత ఏదో ద్రవం చల్లారు. ఐదుగురు వచ్చారు. ఒకతను రోడ్డుపై ఉన్నాడు. మిగతా నలుగురు నన్ను కొట్టుకుంటూ ఈడ్చుకుని తోటల్లోకి తీసుకెళ్లారు. వచ్చిన వారి వయసు 20కి అటుఇటుగా ఉన్నట్లుగా ఉంది. ముఖాలకు మాస్క్ వేసుకున్నారు. ఇద్దరు నా రెండు చేతులు పట్టుకుని బీరు బాటిల్స్ పగలగొట్టి ముందు తొడ మీద పొడిచారు. తర్వాత ఎక్కడపడితే అక్కడ పొడిచారు."

"నన్ను తీవ్రంగా గాయపర్చి అక్కడే వదిలి వెళ్లిపోయారు. నా అనుచరులు, స్థానికులు గమనించి వెంటనే నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. దాడి సమయంలో మతపరమైన ('జై శ్రీరామ్') నినాదాలు చేశారు."

"నాపై రాజకీయపరంగానే దాడి చేసి, దానిని మతపరమైన ఘటనగా చూపించే కుట్ర జరిగి ఉండొచ్చు."

ఎవరీ అభినయ్ దర్శన్?

అభినయ్ దర్శన్ తనను తాను పాస్టర్‌, సామాజిక కార్యకర్త, రాజకీయ నాయకుడిగా పరిచయం చేసుకుంటున్నారు.

"భరోసా" అనే రాజకీయ పార్టీని స్థాపించినట్లు చెప్పారు. అలాగే "సిటిజన్ ప్రొటెక్షన్ ఫోర్స్" అనే సంస్థతో కూడా అనుబంధం ఉన్నట్లు తెలిపారు.

తాను గతంలో కొన్ని సినిమాల్లో నటించానని బీబీసీకి చెప్పారు.

"పదమూడేళ్ల నుంచి నేను సినిమాల్లో నటించాను. "మిస్డ్ కాల్", "పోకిరి పోలీస్", "బీటెక్ లవ్" అనే సినిమాల్లో హీరోగా నటించాను" అని చెప్పారు.

తన స్వస్థలం వైఎస్సార్ కడప జిల్లా అని, అక్కడ "అభినయ్ దర్శన్ ఫౌండేషన్" ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అలాగే 2024 జనవరి నుంచి యూట్యూబ్ చానెల్‌ను కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

‘దాడి చేసినవారిని శిక్షించాలి’

రాజకీయ ప్రస్థానంలో భాగంగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏజెన్సీ ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్నానని అభినయ్ దర్శన్ చెప్పారు.

పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నానని అన్నారు. ఈ నేపథ్యంలో గత నాలుగైదు రోజులుగా తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని కూడా చెప్పారు.

"నాతో ఫోన్‌లో గుంటూరు, విజయవాడ యాసలో మాట్లాడారు. కానీ తమది విజయనగరం అని చెప్పారు. వరుసగా గత నాలుగు రోజులుగా రెండుసార్లు కాల్స్ వచ్చాయి. అయినా వాటిని పట్టించుకోకుండా పాదయాత్ర కొనసాగించాను" అని తెలిపారు.

అయితే ఈ బెదిరింపులపై తాను పోలీసులకు ఫిర్యాదు చేయలేదని కూడా దర్శన్ వెల్లడించారు.

ఇప్పుడు తనపై జరిగింది రాజకీయపరమైన దాడే అని దర్శన్ ఆరోపించారు.

"బెదిరింపు కాల్స్ వస్తున్నప్పుడే పాదయాత్ర ఆపి, ఇంటికి వచ్చేయమని చెప్పాను. కానీ అతను వినలేదు. పాస్టరుగా, పొలిటిషియన్‌గా ప్రజల మధ్య తిరుగుతున్న ఆయనపై దాడి చేయడం బాధగా ఉంది. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి" అని అభినయ్ దర్శన్ భార్య సుష్మా దర్శన్ మీడియాతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు.

సోషల్ మీడియాతో గుట్టు రట్టు: పోలీసులు

అభినయ్ దర్శన్ సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలించిన తర్వాత, ఆయనతో పాటు మరో ఇద్దరు నిందితులను ప్రశ్నించామని పోలీసులు తెలిపారు.

"అభినయ్‌ దర్శన్‌ జీకే వీధికి చెందిన వసంత్‌కుమార్‌ అనే గిరిజన యువకుడిని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా సంప్రదించి, తనపై హత్యాయత్నం చేసినట్లు నటించాలని, అందుకు డబ్బులిస్తానని వాయిస్‌ మెసేజ్‌లు పంపారు. ఆ తర్వాత సోమవారం కుట్రను అమలు చేశారు. దాడిలో తనకు గాయాలైనట్లు ఆయన నటించారు" అని పోలీసులు చెప్పారు.

అదే సమయంలో వసంత్‌కుమార్‌ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

‘‘ఈ కేసులో స్పెషల్ టీమ్స్ క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేపట్టాయి. ఈ క్రమంలోనే అభినయ్‌ దర్శన్ ఉపయోగించిన సామాజిక మాధ్యమాలు, ముఖ్యంగా ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను క్షుణ్నంగా పరిశీలించాం’ అని ఎస్పీ అమిత్ బర్దార్ చెప్పారు.

ఈ హత్యాయత్నం నాటకమని ఆధారాలు లభ్యమయ్యాయని, అభినయ్‌కు మరో ఆరుగురు వ్యక్తులు సహకరించినట్లు గుర్తించామని ఆయన తెలిపారు.

నిందితులను కోర్టులో హాజరుపర్చినట్లు, పాడేరు నియోజకవర్గంలోని సున్నిత ప్రాంతాల్లో భద్రత పెంచినట్లు వెల్లడించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)