You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ప్రధాని మోదీని 'పాములు ఆడించే వ్యక్తి'గా చూపించిన నార్వే పత్రిక కార్టూన్, ఆ వ్యాసంలో ఇంకా ఏమేమి రాసింది?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్వే పర్యటన నిరంతరం చర్చల్లో నిలుస్తూనే ఉంది.
మొదట అక్కడొక మహిళా జర్నలిస్ట్ హేలే లింగ్ ఆయనను అడిగిన ప్రశ్న (దానికి ఆయన సమాధానం ఇవ్వలేదు) చర్చనీయాంశం అయ్యింది.
ఇప్పుడు నార్వేకు చెందిన ఒక వార్తాపత్రికలో పీఎం మోదీపై ప్రచురితమైన కార్టూన్ హెడ్‌లైన్స్‌లో నిలుస్తోంది.
ఈ కార్టూన్‌పై చర్చతో పాటు విమర్శలు కూడా వస్తున్నాయి.
ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా ఉన్న ఆ నార్వే పత్రిక పేరు 'ఆఫ్టెన్‌పోస్టెన్'. దీన్ని నార్వేలో అత్యంత పెద్ద, ప్రభావవంతమైన వార్తాపత్రికలలో ఒకటిగా పరిగణిస్తారు.
పీఎం మోదీ నార్వే పర్యటన సందర్భంగా 'ఆఫ్టెన్‌పోస్టెన్' ఒక కార్టూన్‌ను ప్రచురించింది.
అందులో ఆయనను 'పాములు ఆడించే వ్యక్తి'గా చూపిస్తూ, పెట్రోల్ పంప్ పైపును పాము లాగా చిత్రీకరించారు.
ఈ కార్టూన్ ఒక ఒపీనియన్ ఆర్టికల్‌తో పాటు ప్రచురితమైంది. అందులో పీఎం మోదీ గురించి 'ఒక తెలివైన, కాస్త విసుగు తెప్పించే మనిషి' అనే శీర్షిక పెట్టారు.
'ఇది జాతి వివక్ష '
'ఆఫ్టెన్‌పోస్టెన్' కార్టూన్‌పై ఆన్‌లైన్‌లో, ముఖ్యంగా భారతదేశంలో తీవ్ర స్పందనలు వ్యక్తమయ్యాయి.
చాలామంది యూజర్లు, విశ్లేషకులు దీనిని 'జాతివివక్ష'గా అభివర్ణించారు.
పాశ్చాత్య మీడియా భారతదేశాన్ని వెనుకబడిన దేశంగా చూపించడానికి చాలాకాలంగా ప్రయత్నిస్తున్న వలస రాజ్యాల కాలపు రోజులను ఇది గుర్తుకు తెస్తోందని వారు పేర్కొన్నారు.
సీనియర్ జర్నలిస్ట్ ఆదిత్య రాజ్‌కౌల్ సోషల్ మీడియా ''ఎక్స్''లో, ''ఇది షాకింగ్. జాతివివక్ష నిండినది. అవమానకరం. నార్వేకు చెందిన అతిపెద్ద బ్రాడ్‌షీట్ వార్తాపత్రిక 'ఆఫ్టెన్‌పోస్టెన్' భారత ప్రధానమంత్రిని ఒక పాములు ఆడించే వ్యక్తిగా చూపిస్తూ కార్టూన్‌ను ప్రచురించింది. దీనికి తోడు 'ఒక తెలివైన, కాస్త విసుగు తెప్పించే మనిషి' అనే హెడ్‌లైన్‌తో వచ్చింది. వారు భారతదేశం సాధిస్తున్న పురోగతిని, విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. విచారకరం" అని పేర్కొన్నారు.
"ఇది పూర్తిగా జాతివివక్షతో కూడినది. మరో అంశం ఏంటంటే, ఇందులోని వ్యంగ్యం. ప్రపంచం ఒకప్పుడు భారతదేశాన్ని పాముల ఆటలు చూపించేవారి భూమిగా చూసేదని ప్రధానమంత్రి మోదీ గతంలో తరచూ చెబుతుండేవారు. మరి ఇప్పుడు, ఆయన ఓస్లో పర్యటన సందర్భంగా, ఒక ప్రముఖ యూరోపియన్ వార్తాపత్రిక ఆయనను అదే రూపంలో చూపిస్తోంది'' అని @samjawed65 అనే యూజర్ 'ఎక్స్' హ్యాండిల్ నుంచి పోస్ట్ చేశారు.
'ద హిందూ' గ్రూప్‌కు చెందిన జర్నలిస్ట్, చైనా వ్యవహారాల నిపుణుడు అనంత్ కృష్ణన్ స్పందిస్తూ, "నేను పొరపాటున ఏదో ఒక చౌకబారు టాబ్లాయిడ్‌లో ఈ కార్టూన్ వచ్చిందనుకున్నా. కానీ, నార్వేలోనే అతిపెద్ద వార్తాపత్రిక, 'పేపర్ ఆఫ్ రికార్డ్' అని పిలిచే 'ఆఫ్టెన్‌పోస్టెన్'లో ప్రచురితమైంది. అత్యున్నత జర్నలిజం ప్రమాణాలు పాటిస్తుందనే ఆ పత్రిక ప్రతిష్ఠకు ఇదో మచ్ఛలాంటిది" అని రాశారు. జర్నలిస్ట్ శశాంక్ మట్టూ కూడా ఈ కార్టూన్‌పై విమర్శలు చేశారు.
'Carlwheless' అనే 'ఎక్స్' హ్యాండిల్ యూజర్ ‘‘ఇది జర్నలిజం ఎంతమాత్రం కాదు. వలసరాజ్యాల కాలం నాటి జాతివివక్షను ఒక అభిప్రాయంలా ప్రదర్శించడమే. భారతదేశ ఎదుగుదలను వారు తట్టుకోలేకపోతున్నారు. అందుకే వారి తాతముత్తాతలు ఉపయోగించిన పాత మూస పద్ధతులనే పునరావృతం చేస్తున్నారు. ప్రతిసారీ అసలు నిజం బయటపడుతూనే ఉంటుంది" అని రాశారు.
మోదీ గురించి వ్యాసంలో ఏం చెప్పారు?
ఫ్రాంక్ రోజెవిక్ అనే విశ్లేషకుడు పీఎం మోదీపై ఈ వ్యాసం రాశారు. దీనికి 'ఒక తెలివైన, కాస్త విసుగు తెప్పించే మనిషి' అనే శీర్షిక పెట్టారు.
'ఆఫ్టెన్‌పోస్టెన్'లో ప్రచురితమైన ఈ వ్యాసంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్వే పర్యటన, అలాగే ఆయన విదేశాంగ విధానంపై విశ్లేషణ చేశారు.
ఇందులో మోదీ విదేశాంగ విధానం చాలా ఆచరణాత్మకమైనదని రచయిత పేర్కొన్నారు. అంటే, ఆయన సిద్ధాంతాల కంటే జాతీయ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. పరస్పరం విభేదాలు ఉన్న దేశాలతో సైతం ఒకే సమయంలో మంచి సంబంధాలను కొనసాగించాలనుకునే నాయకుడిగా మోదీని ఇందులో అభివర్ణించారు.
మోదీ అనుసరిస్తున్న ఈ విధానాన్ని 'రియల్‌పాలిటిక్' అని ఈ వ్యాసంలో పేర్కొన్నారు. అంటే రాజకీయాల్లో ఆచరణాత్మక ప్రయోజనాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం.
భారతదేశాన్ని వ్యాపారం, సాంకేతికత, ఇంధనం, వ్యూహాత్మక రంగాలలో పలు దేశాలతో భాగస్వామ్యాన్ని పెంపొందించుకుంటున్న ఒక అభివృద్ధి చెందుతున్న ప్రపంచ శక్తిగా ఫ్రాంక్ రోజెవిక్ ఈ వ్యాసంలో పేర్కొన్నారు.
గ్రీన్ టెక్నాలజీ, డిజిటలైజేషన్, ఆర్కిటిక్ ప్రాంతానికి సంబంధించిన అవకాశాలు ఉన్నందున నార్డిక్ దేశాలు (ఉత్తర యూరప్‌లోని చల్లని వాతావరణం ఉండే దేశాలు... ఉదాహరణకు నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్‌లాండ్, ఐస్‌లాండ్) భారతదేశానికి చాలా కీలకమైనవని అందులో వివరించారు.
ముఖ్యంగా రష్యాతో సంబంధాల విషయంలో భారతదేశ విదేశాంగ విధానం పాశ్చాత్య దేశాలకు కొన్నిసార్లు అస్థిరంగా అనిపించవచ్చని కూడా ఈ వ్యాసంలో పేర్కొన్నారు.
దీనితో పాటు, పాశ్చాత్య దేశాలలో చర్చల్లో ఉండే భారతదేశంలోని ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛపై కొన్ని విమర్శలను కూడా ఈ వ్యాసంలో చేర్చారు.
మొత్తంగా చూస్తే, ఈ వ్యాసం తాలూకా ధోరణి చూస్తే, ఇది పూర్తిగా మద్దతు ఇచ్చేదిగాకానీ లేదా పూర్తిగా వ్యతిరేకించేదిగాకానీ లేదు. ఇది మోదీ విదేశాంగ విధానాన్ని ఒక వ్యూహాత్మక, ప్రయోజన ఆధారిత ప్రపంచ విధానంగా వివరించే ప్రయత్నం చేసింది.
చర్చనీయాంశమైన మోదీ నార్వే పర్యటన...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్వే పర్యటన బాగా చర్చనీయాంశమైంది.
ఆయన నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోర్‌తో సమావేశం ముగించుకుని వెళ్తున్న సమయంలో, అక్కడ జర్నలిస్ట్ హేలే లింగ్ ఆయనను ఒక ప్రశ్న అడిగారు. కానీ మోదీ అందుకు సమాధానం ఇవ్వకుండానే ముందుకు సాగిపోయారు.
సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియోలో, 'ప్రధానమంత్రి మోదీ, ప్రపంచంలోనే అత్యంత స్వేచ్ఛాయుతమైన ప్రెస్ అడిగే ప్రశ్నలకు మీరు ఎందుకు సమాధానం ఇవ్వరు?' అని హేలే లింగ్ అడగడం వినిపిస్తుంది.
ఆ తర్వాత ఆమె ఆ వీడియోను షేర్ చేస్తూ, 'భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నా ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. నిజానికి నేనేమీ ఆశించలేదు కూడా. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో నార్వే మొదటి స్థానంలో ఉంటే, భారతదేశం 157వ స్థానంలో ఉంది' అని రాశారు.
ఈ ఘటన తర్వాత రాహుల్ గాంధీ, మహువా మోయిత్రా సహా పలువురు ప్రతిపక్ష నాయకులు పీఎం మోదీని విమర్శించారు. ఆయన ప్రశ్నలను చూసి భయపడుతున్నారని ఆరోపించారు.
మరోవైపు, హేలే లింగ్ అడిగిన ప్రశ్నలను, చేసిన వ్యాఖ్యలను 'అర్థరహితమైనవి' అని భారతీయ జనతా పార్టీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ కొట్టిపారేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)