పశ్చిమ బెంగాల్: శుభేందు అధికారి పీఏ హత్య, రాష్ట్రంలో పలుచోట్ల ఉద్రిక్తత

చదివే సమయం: 4 నిమిషాలు

బీజేపీ నేత, పశ్చిమ బెంగాల్‌ ప్రస్తుత ప్రతిపక్ష నేత శుభేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) చంద్రనాథ్ రథ్‌ను బుధవారం రాత్రి(మే 6) కాల్చి చంపారు.

ఈ సంఘటన రాజధాని కోల్‌కతా సమీపంలోని మధ్యమ్‌గ్రామ్‌లో జరిగింది.

వార్తా సంస్థలు విడుదల చేసిన వీడియోల్లో చంద్రనాథ్ రథ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆయన ప్రయాణిస్తున్నకారుపై అసెంబ్లీ పాస్ స్టిక్కర్ కూడా ఉంది.

చంద్రనాథ్ రథ్ హత్య 'పక్కా ప్లాన్ ప్రకారం చేశారు' అని బీజేపీ ఆరోపించింది. ఈ ఘటనను తృణమూల్ కాంగ్రెస్ ఖండించింది. సమగ్ర విచారణకు డిమాండ్ చేసింది.

ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

టీఎంసీ, బీజేపీ ఏం చెప్పాయి?

ఇటీవల జరిగిన ఎన్నికల్లో, భవానీపూర్ నియోజకవర్గంలో టీఎంసీ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీని శుభేందు అధికారి దాదాపు 15 వేల ఓట్ల తేడాతో ఓడించారు.

పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత హింసాత్మక ఘటనలు జరగవచ్చనే భయాలు నెలకొన్నాయి. విధ్వంసం, హింసకు సంబంధించి అనేక వార్తల నేపథ్యంలో బీజేపీ ఓ ప్రకటన చేసింది. తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు మారు వేషాలతో ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని, వీటిని సహించబోమని అందులో హెచ్చరించింది.

"ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించాం. నేరానికి ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నాం. అయితే దాని నంబర్ ప్లేట్ నకిలీది. సంఘటనా స్థలం నుంచి పేలని తూటాలను కూడా స్వాధీనం చేసుకున్నాం. ప్రత్యక్ష సాక్షులు, ఇప్పటివరకు సేకరించిన ఆధారాలను అనుసరించి దర్యాప్తు ముందుకు సాగుతోంది" అని రాష్ట్ర డీజీపీ సిద్ధ్ నాథ్ గుప్తా తెలిపారు.

‘పథకం ప్రకారం జరిగిన హత్య’

"ఇది పథకం ప్రకారం జరిగిన హత్య. డీజీపీ కూడా ఇదే విషయం చెప్పారు. రెండు మూడు రోజుల క్రితమే రెక్కీ జరిగింది" అని శుభేందు అధికారి ఆరోపించారు.

ఇది టీఎంసీ 15 ఏళ్ల అరాచక పాలన ఫలితమని ఆయన అన్నారు.

"మేమందరం తీవ్ర దుఃఖంలో ఉన్నాం. మాటలు రావడం లేదు. మా కేంద్ర నాయకత్వం ఈ ఘటనపై సమాచారం సేకరించింది. చంద్రనాథ్ రథ్ కుటుంబ సభ్యులతో, పోలీసులతో కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ మాట్లాడారు. ఈ విషయంలో పార్టీ మొత్తం ఏకతాటిపై ఉంది" అని శుభేందు అధికారి చెప్పారు.

అయితే, "మధ్యమ్‌గ్రామ్‌లో జరిగిన చంద్రనాథ్ రథ్ దారుణ హత్య, అలాగే ఎన్నికల అనంతర హింసాకాండలో బీజేపీ కార్యకర్తల చేతిలో ముగ్గురు టీఎంసీ కార్యకర్తల హత్యను మేం ఖండిస్తున్నాం" అని తృణమూల్ కాంగ్రెస్ ఒక ప్రకటన విడుదల చేసింది .

ఈ మొత్తం ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని తాము డిమాండ్ చేస్తున్నట్టు టీఎంసీ తెలిపింది.

"నిందితులను గుర్తించి, ఆలస్యం లేకుండా న్యాయస్థానం ముందు నిలబెట్టేందుకు వీలుగా. కోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరిపించాలని మేం డిమాండ్ చేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో హింసకు, రాజకీయ హత్యలకు తావు లేదు. దోషులను వీలైనంత త్వరగా చట్టం ముందు నిలబెట్టాలి" అని టీఎంసీ తన ప్రకటనలో పేర్కొంది.

ఎవరీ చంద్రనాథ్ రథ్?

పీటీఐ వార్తా సంస్థ కథనం ప్రకారం, తూర్పు మేదినీపూర్ జిల్లాలోని చాందీపూర్‌కు చెందిన 41 ఏళ్ల చంద్రనాథ్ రథ్ బీజేపీ నేత శుభేందు అధికారికి సన్నిహితులు. రాష్ట్ర రాజకీయాల్లో శుభేందు ఎదుగుదలకు ఆయనే కారణమని చెబుతారు.

ఎన్నో ఏళ్లుగా శుభేందు సన్నిహితవర్గంలో భాగమైనప్పటికీ ఆయన చాలావరకు తెరవెనుకే ఉండేవారు.

రామకృష్ణ మిషన్‌లో చదువుకున్న చంద్రనాథ్ రథ్ క్రియాశీల రాజకీయాల్లోకి రావడానికి ముందు, దాదాపు రెండు దశాబ్దాల పాటు భారత వైమానిక దళంలో పనిచేశారు.

వాయుసేన నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న తర్వాత ఆయన కొంతకాలం కార్పొరేట్ రంగంలో పనిచేశారు. అనంతరం క్రమంగా రాజకీయ సమన్వయం, పరిపాలనా బాధ్యతల వైపు మళ్లారు.

శుభేందు కుటుంబం లాగే చంద్రనాథ్ కుటుంబానికి కూడా గతంలో తృణమూల్ కాంగ్రెస్‌తో సంబంధం ఉంది.

చంద్రనాథ్ కుటుంబానికి, శుభేందుకు మధ్య రెండు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉందని, తూర్పు మేదినీపూర్‌లో టీఎంసీ విస్తరణ తొలినాళ్ల నుంచే ఈ సంబంధం ఉందని కుటుంబ పరిచయస్తులు తెలిపారు.

భవానీపూర్ ప్రచారంతో సహా పలు ఉత్కంఠభరిత రాజకీయ పోరాటాల సమయంలో ఆయన బీజేపీ కీలక బృందంలో కూడా భాగమయ్యారు.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రభుత్వంలో శుభేందు మరింత కీలకపాత్ర చేపడితే, చంద్రనాథ్‌కు కీలక పరిపాలనా బాధ్యతలు అప్పగించవచ్చని బీజేపీలోని కొన్ని వర్గాల్లో ఊహాగానాలు కూడా వినిపించాయి.

ఆయన హత్య రాష్ట్రంలో మరోసారి ఉద్రిక్తతను సృష్టించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.