You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఎన్సీఆర్బీ డేటా : మానవ అక్రమ రవాణాలో తెలంగాణ టాప్.. ‘ఉద్యోగం, ఉపాధి, వైద్యం పేరుతో మహిళలకు ఎర’
లైంగిక దోపిడీనే లక్ష్యంగా జరుగుతున్న మహిళల అక్రమ రవాణాకు సంబంధించి దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) రిపోర్ట్ వెల్లడించింది. 2024లో రాష్ట్రవ్యాప్తంగా 423 కేసులు నమోదైనట్లు తెలిపింది.
వ్యభిచార కూపాల్లోకి దించేందుకు మహిళలను మాయమాటలతో తీసుకువచ్చి, బెదిరించి లైంగిక దోపిడీకి గురిచేస్తున్న ఘటనలు కొనసాగుతున్నాయని సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే, మానవ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు హైదరాబాద్ సిటీ కమిషనర్, డీజీ వీసీ సజ్జనార్ బీబీసీతో చెప్పారు.
ఏడాదిన్నర కిందట, ఒక మహిళను హైదరాబాద్ పోలీసులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు కలిసి వ్యభిచార కూపం నుంచి రక్షించారు.
ఆమెను బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా తీసుకువచ్చి, బెదిరించి, కొందరు వ్యభిచార కూపంలోకి దించారని గుర్తించారు.
బాధితురాలు తలసీమియా వ్యాధితో బాధపడుతుండటంతో, ఆ పరిస్థితిని ఆసరాగా చేసుకున్న దళారులు, తక్కువ ఖర్చుతో ఆమెకు మంచి వైద్యం అందుతుందని చెప్పి హైదరాబాద్ తీసుకువచ్చారు.
తల్లిదండ్రులకు భారం కాకూడదని భావించి, వారి మాటలు నమ్మి ఆమె హైదరాబాద్ తీసుకువచ్చి వ్యభిచారంలోకి దించారని పోలీసుల ముందు తనకు జరిగిన అన్యాయాన్ని ఆమె వెల్లడించారు.
ఆ తర్వాత బాధితురాలిని అధికారులు బంగ్లాదేశ్ పంపించారని సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్ చెప్పారు.
కేవలం ఇదొక్క ఘటనే కాదు .. దళారులు మాయమాటలతో ఎంతోమంది మహిళలను మాయమాటలతో తీసుకువచ్చి వ్యభిచార రొంపిలోకి దించుతున్నారు.
‘‘మహిళలకు మాయమాటలు చెప్పి, అక్రమంగా తీసుకువచ్చి, బెదిరించి, లైంగిక దోపిడీకి పాల్పడతున్నారని’’ సునీత కృష్ణన్ వివరించారు.
ఈ నేపథ్యంలో, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలతో తెలంగాణలో 'హ్యుమన్ ట్రాఫికింగ్' మరోసారి చర్చనీయాంశమైంది.
కమిషనర్ సజ్జనార్ బీబీసీతో మాట్లాడుతూ, ''మానవ అక్రమ రవాణా విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఎక్కువ కేసులు వస్తున్నాయంటే, దానికి తగ్గట్టుగా పోలీసులు సమర్థంగా కేసులు పెట్టి అడ్డుకుంటున్నారని కూడా చూడాలి'' అన్నారు.
తెలంగాణలోనే ఎక్కువగా కేసులు
ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం, దేశవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ (ఏహెచ్‌టీయూ) ఏర్పాటయ్యాయి.
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఉన్న సమాచారం మేరకు, భారత్‌లో 20 రాష్ట్రాల్లో 819 ఏహెచ్‌టీయూలు ఉన్నాయి.
మిగిలిన రాష్ట్రాల్లో ఈ యూనిట్లు అందుబాటులోకి రావాల్సి ఉంది.
ఈ విభాగాల సహకారంతో 2024లో 2,135 మానవ అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా తెలంగాణలోనే నమోదయ్యాయి.
''తెలంగాణలో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయంటే, దానర్థం ఇక్కడ ఎక్కువగా మానవ అక్రమ రవాణా జరుగుతుందని చెప్పలేం. ఇక్కడ పోలీసులు గట్టిగా పనిచేస్తూ కేసులు గుర్తిస్తున్నారని కూడా భావించవచ్చు'' అని సునీతా కృష్ణన్ బీబీసీతో చెప్పారు.
‘‘అయితే, పోలీసులు కేసులు పెట్టడమే కాకుండా, ఆ తర్వాత నిందితులకు శిక్ష పడే వరకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనేది సమీక్షించుకోవాలని’’ సునీతా కృష్ణన్ సూచించారు.
ఎంత మందిని కాపాడారు?
ఒడిశాలో 2024లో అత్యధికంగా 1,039 మంది బాధితులున్నట్లు కేసులు నమోదవగా 971 మందిని కాపాడినట్లు ఎన్సీఆర్బీ డేటా చెబుతోంది.
మహారాష్ట్రలో 892 మంది బాధితులకు గాను 885 మంది, తెలంగాణలో 814 మంది బాధితులకు గాను 812 మంది, బిహార్‌లో 639 మంది బాధితులకు గాను 639 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 313 మంది బాధితులకు గాను 313 మందిని కాపాడినట్లు లెక్కలు చెబుతున్నాయి.
భారత్‌లో మానవ అక్రమ రవాణా కేసుల్లో పట్టుకున్న బాధితుల్లో భారత పౌరులతో పాటు నేపాల్, బంగ్లాదేశీయులు కూడా ఉన్నారు.
త్రిపురలో అత్యధికంగా 232 మంది బంగ్లాదేశీయులను పట్టుకున్నట్లు ఎన్సీఆర్బీ డేటా చెబుతోంది.
'మహిళలే లక్ష్యంగా..'
మానవ అక్రమ రవాణాలో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు గణాంకాలు చూపుతున్నాయి. వ్యభిచారంలోకి దించేందుకు ఎక్కువగా మహిళలను అక్రమ రవాణా చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
మానవ అక్రమ రవాణా మూడు విధాలుగా జరుగుతున్నట్లు గుర్తించామని సామాజిక కార్యకర్త సునీత కృష్ణన్ వివరించారు.
''ఉద్యోగం, ఉపాధి ఆశ పెట్టి హైదరాబాద్ తీసుకువస్తున్నారు. బ్యూటీ పార్లర్ లేదా స్పాలో ఉద్యోగాలు అని చెప్పి నమ్మించి, వ్యభిచారంలోకి దింపుతున్నారు. ప్రేమ పేరుతో మాయ మాటలు చెప్పడం, ఊరి నుంచి లేదా తల్లిదండ్రుల నుంచి దూరంగా వెళ్లిపోదామని చెప్పి తీసుకువచ్చి, వ్యభిచారంలోకి దింపడం మరో కారణం. ఇదే కాకుండా పెళ్లి చేసుకుని కూడా మహిళలను విక్రయిస్తున్నారు'' అని చెప్పారు.
''ఎక్కువగా బంగ్లాదేశ్ నుంచి యువతులను తీసుకువస్తున్నట్లు మా పరిశీలనలో గుర్తించాం. ఇక్కడికి వచ్చాక దళారులు బ్లాక్ మెయిల్ చేయడం, తాము చెప్పినట్లు చేయకపోతే పాస్‌పోర్టు లేదనో, నకిలీ పాస్‌పోర్టు ఉందనో పోలీసులకు పట్టిస్తామని బెదిరించడం వంటివి చేస్తున్నారు'' అని ఆమె చెప్పారు.
కొందరిని వైద్య చికిత్సల కోసం తీసుకువచ్చి విక్రయిస్తున్నారని సునీత కృష్ణన్ వివరించారు.
మహిళల అక్రమ రవాణా విషయంలో వేరే రాష్ట్రాల నుంచి అయినా, వేరే దేశాల నుంచి అయినా సరే అడ్డుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ చెప్పారు.
''స్పందన పేరుతో ప్రత్యేక యూనిట్ ప్రారంభించాం. ఇందుకోసం ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. మహిళలను కాపాడుతున్నాం. అవసరమైన వైద్య సహాయం అందిస్తున్నాం, అప్పటికప్పుడు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నాం'' అని ఆయన చెప్పారు.
లైంగిక దోపిడీ బాధితులే ఎక్కువ
మానవ అక్రమ రవాణాకు సంబంధించి 2024లో భారత్‌లో 2,135 కేసులు నమోదవ్వగా, 6,018 మంది బాధితులను ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసులు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ సిబ్బంది గుర్తించారు. వీరిలో 5,839 మందిని రక్షించినట్లు ఎన్సీఆర్బీ డేటా చెబుతోంది.
అందులో వెట్టి చాకిరి కోసం 1,493 మందిని తరలిస్తున్నట్టు, 2,347 మందిని లైంగిక దోపిడీ చేసేందుకు, వ్యభిచార కూపంలోకి లాగేందుకు అక్రమ రవాణా చేస్తున్నట్లుగా గుర్తించారు. అలా వ్యభిచార కూపంలోకి తరలిస్తుండగా మహారాష్ట్రలో 829 మందిని, తెలంగాణలో 770 మందిని గుర్తించారు. పోర్నోగ్రఫీ, బిచ్చమెత్తించడం, మత్తు పదార్థాల రవాణా, అవయవాల దోపిడీ వంటి కారణాలతోనూ కేసులు నమోదయ్యాయి.
''కేసులు పెడుతున్నా సరే మళ్లీ మళ్లీ ఏటా మానవ అక్రమ రవాణా ఘటనలు బయటపడుతూనే ఉన్నాయి. కేసులు పెట్టడం ఒక్కటే కాదు, దానికి తగ్గట్టుగా చార్జిషీట్లు వేసి, నిందితులకు శిక్షలు పడేలా చేయాలి'' అని సునీత కృష్ణన్ అన్నారు.
శిక్షలు పడుతున్నది తక్కువే
2024లో భారత్‌లో నమోదైన 2,135 కేసుల్లో 1,823 కేసుల్లో చార్జిషీట్ దాఖలు చేసినట్లు ఎన్సీఆర్బీ గణాంకాలు చెబుతున్నాయి.
కానీ, కేవలం 43 కేసుల్లోనే నిందితులకు శిక్ష పడగా, 543 కేసులను కోర్టులు కొట్టివేశాయి. మరో 586 కేసులు విచారణ దశలో ఉన్నాయని రిపోర్ట్ స్పష్టం చేస్తోంది. అంటే కేవలం 7.3 శాతం కేసుల్లోనే శిక్షలు పడినట్లు తెలుస్తోంది.
''కేసుల నుంచి శిక్షల వరకు ఎప్పటికప్పుడు పోలీసులు అన్ని ఆధారాలు సేకరించి ముందుకు వెళుతున్నారు. శిక్షల రేటు తక్కువగా ఉందని కాదు, కేసులు పెట్టడం నుంచి శిక్షలు పడే వరకు చూస్తున్నాం'' అని చెప్పారు కమిషనర్ సజ్జనార్.
దేశంలో 2024లో మానవ అక్రమ రవాణా కేసుల్లో శిక్షలు ఇలా..
- అరెస్టయిన వ్యక్తులు – 5,904
- చార్జిషీట్లు – 4,695
- శిక్ష పడిన వ్యక్తులు – 110
- నిర్దోషులుగా విడుదలైనవారు – 1,558
అత్యధికంగా తెలంగాణలో 1,212 మందిని అరెస్టు చేసి, 1010 మందిపై పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయగా, కోర్టులో కేవలం ఆరుగురికే శిక్ష పడింది.
మహిళలపై నేరాలు ఇలా..
- భారత్‌లో 2024లో మహిళలపై నమోదైన మొత్తం నేరాలు - 4,41,534
- 2023లో నేరాల సంఖ్య (4,48,211)తో పోల్చితే 1.5 శాతం తగ్గుదల
2024లో నమోదైన కేసుల వివరాలు
- భర్త లేదా బంధువుల చేతుల్లోనే మహిళలకు వేధింపులు - 1,20,227 కేసులు (27.2 శాతం)
- కిడ్నాప్/అపహరణ – 67,829 (15.4 శాతం)
- పోక్సో – 67,809 (15.4 శాతం)
- మహిళల మర్యాదకు భంగం కలిగించే నేరాలు – 48,303 (10.9 శాతం).
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)