ఇజ్రాయెల్ ఎన్నికలు: నెతన్యాహు కూటమి ముందంజ.. కానీ, ఇంకా దక్కని పూర్తి మెజారిటీ

ఫొటో సోర్స్, Alexi J. Rosenfeld/Getty Images
- రచయిత, డేవిడ్ గ్రిటెన్, గాబ్రియేలా పోమెరోయ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
ఇజ్రాయెల్ సార్వత్రిక ఎన్నికల ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన ప్రత్యర్థి మాజీ సైన్యాధిపతి గాడి ఐజెన్కోట్పై ఆధిక్యంలో ఉన్నట్టు చూపిస్తున్నాయి. అయితే, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన పూర్తి మెజారిటీకి ఆయన ఇంకా దూరంగానే ఉన్నారు.
ఇప్పటి వరకు 85 శాతం ఓట్లు లెక్కించగా, 120 స్థానాలున్న పార్లమెంట్లో నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్ పార్టీతోపాటు దాని రైట్‌వింగ్, అతి సంప్రదాయ యూదు మిత్రపక్షాలు 53 సీట్లు గెలుచుకునే దిశగా ఉన్నాయి. మరోవైపు, గాడి ఐజెన్కోట్ నేతృత్వంలోని యషార్ పార్టీ, దానికి మద్దతుగా ఉన్న మరో మూడు యూదు ప్రతిపక్షాలు కలిపి 48 సీట్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామంటూ ఇరువురు నేతలు ప్రకటించారు.
అరబ్ పార్టీల నేతృత్వంలోని కూటములు 19 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం ఏర్పాటులో అవి కీలక పాత్ర పోషించే కింగ్ మేకర్లుగా మారవచ్చు. అయితే, యూదు పార్టీల్లో ఒక పార్టీ మినహా మిగిలిన అన్నీ అరబ్ పార్టీలతో కలిసి పని చేయబోమని ఇప్పటికే స్పష్టం చేశాయి.
సైనికులు, దౌత్యవేత్తలు, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల తదితర వర్గాలకు చెందిన సుమారు 4.3 లక్షల నుంచి 4.8 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇంకా లెక్కించాల్సి ఉంది. అందువల్ల తుది ఎన్నికల ఫలితాలు వెలువడటానికి మరో ఒకటి లేదా రెండు రోజులు పట్టే అవకాశం ఉంది.

ఎవరికీ మెజార్టీ రాకపోతే మళ్లీ ఎన్నికలే
ఈ ఫలితాలు అధికారికంగా ధ్రువీకరించిన తర్వాత, ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ అన్ని రాజకీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతారు. అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేయగల నాయకుడిని ఆహ్వానిస్తారు. ఈ ప్రక్రియ పూర్తవ్వడానికి కొన్ని వారాలు పట్టే అవకాశం ఉంది.
ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రయత్నాలు విఫలమైతే, ఇజ్రాయెల్‌లో మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.
జెరూసలేంలోని తన అధికారిక నివాసంలో జరిగిన సమావేశంలో, అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ మంగళవారం జరిగిన ఎన్నికల్లో నమోదైన 77.7 శాతం ఓటింగ్‌ను ప్రశంసించారు. ఇది గత రెండు దశాబ్దాలకుపైగా కాలంలో ఇజ్రాయెల్‌లో నమోదైన అత్యధిక ఓటింగ్ శాతంగా నిలిచింది.

ఫొటో సోర్స్, EPA
వచ్చే వారం పూర్తి ఫలితాలు
"ఇది ఇజ్రాయెల్ సమాజానికి గర్వకారణం. ఇజ్రాయెల్‌లో ప్రజాస్వామ్యం పట్ల ప్రజలకు ఎంతటి బలమైన ఆకాంక్ష ఉందో ఈ ఎన్నికలు స్పష్టంగా చూపించాయి" అని ఆయన అన్నారు.
అధికారిక ఎన్నికల ఫలితాలు వచ్చే వారం అందుతాయని తాను భావిస్తున్నానని, ఆ తర్వాత అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు ప్రారంభిస్తానని హెర్జోగ్ తెలిపారు.
"ఖచ్చితంగా, మరోసారి ఎన్నికలు జరగకుండా ఉండే ప్రయత్నం చేయాలి. అందుకే ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ అలాంటి విశాల దృక్పథంతో, సహకార భావనతో వస్తారని ఆశిస్తున్నా" అని ఆయన అన్నారు.
ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ, ఆయన ప్రధాన ప్రత్యర్థి ఇద్దరూ తమకే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారు.
"ప్రజలు మార్పుకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు" అని ప్రారంభ ఎగ్జిట్ పోల్స్‌ను ఉటంకిస్తూ ప్రతిపక్ష కూటమి నేత గాడి ఐజెన్కోట్ పేర్కొన్నారు.
ఇజ్రాయెల్‌కు చెందిన మూడు ప్రధాన టెలివిజన్ ప్రసార సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, గాడి ఐజెన్కోట్ నేతృత్వంలోని "చేంజ్ బ్లాక్" కూటమి ఇజ్రాయెల్ పార్లమెంట్లో 52 నుంచి 53 సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్టు అంచనా వేశాయి. అదే సమయంలో, బెంజమిన్ నెతన్యాహూ నేతృత్వంలోని కూటమికి సుమారు 50 సీట్లు లభించే అవకాశం ఉందని అవి సూచించాయి.
"విఫలమైన కూటమి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. ప్రజలు ఇచ్చిన తీర్పు జియోనిస్టు ప్రభుత్వ ఏర్పాటుకు దారి తీసేలా నా మిత్రపక్షాలతో కలిసి పని చేస్తాను" అని టెల్ అవివ్‌లోని యుషార్ పార్టీ ఎన్నికల ప్రధాన కార్యాలయంలో మద్దతుదారులను ఉద్దేశించి ఐజెన్కోట్ అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
అంచనాలను సవరించిన సంస్థలు
తర్వాత, టెలివిజన్ ప్రసార సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను సవరించాయి. వాటిలో 2 సంస్థలు ఇరు కూటములకు 51 సీట్లతో సమాన స్థాయిలో నిలుస్తాయని అంచనా వేయగా, మరో సంస్థ నెతన్యాహూ కూటమికి మూడు సీట్ల స్వల్ప ఆధిక్యం లభిస్తుందని తెలిపింది.
ఆ తర్వాత జెరూసలేంలోని లికుడ్ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న నెతన్యాహూ, తమ కూటమి "భారీ మెజారిటీ" సాధించిందని ప్రకటించారు.
"మేం ఖచ్చితంగా బలమైన రైట్ వింగ్ జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. జియోనిజం వ్యతిరేక అరబ్ పార్టీల మద్దతుపై ఆధారపడే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇజ్రాయెల్ భద్రతను ప్రమాదంలో పెట్టడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు" అని నెతన్యాహూ అన్నారు.
బుధవారం కొనసాగిన ఓట్ల లెక్కింపులో, నెతన్యాహూ కూటమి ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి మెరుగైన ఫలితాలు సాధించినట్టు తేలింది. ఆ కూటమి 53 సీట్లు గెలుచుకునే దిశగా సాగుతున్నప్పటికీ గత పార్లమెంట్లో గెలిచిన సీట్లతో పోలిస్తే ఇది 15 సీట్లు తక్కువ.
దాడులు, యుద్ధాల తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు
హమాస్ దాడులు, గాజా, లెబనాన్, ఇరాన్‌తో జరిగిన యుద్ధాల తర్వాత ఇజ్రాయెల్‌లో నిర్వహించిన తొలి సాధారణ ఎన్నికలు ఇవే.
ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఈ ఎన్నికలను దేశ చరిత్రలో అత్యంత కీలకమైన ఎన్నికల్లో ఒకటిగా భావించారు. ఎందుకంటే ఇవి కేవలం దేశానికి నాయకత్వం వహించబోయే వారిని మాత్రమే కాకుండా, ఇజ్రాయెల్ ప్రస్తుతం అనుసరిస్తున్న కఠిన వైఖరి, మత జాతీయవాద దిశలోనే కొనసాగుతుందా లేదా అనే విషయాన్ని కూడా నిర్ణయించే ఎన్నికలు.
ప్రధానంగా 2023 అక్టోబర్ 7 దాడులకు దారి తీసిన భద్రతా వైఫల్యాలకు బాధ్యత ఎవరిది, ప్రాంతీయ యుద్ధాలను ప్రభుత్వం నిర్వహించిన తీరు, అతి సంప్రదాయ యూదు పురుషులను సైన్యంలోకి తప్పనిసరిగా చేర్చే అంశం, న్యాయవ్యవస్థ సంస్కరణలు, అంతర్జాతీయ వేదికపై ఇజ్రాయెల్ స్థానం వంటి కీలక విషయాలే ఈ ఎన్నికల్లో చర్చకు వచ్చాయి.
ఇజ్రాయెల్‌లోని రెండు అరబ్ పార్టీలైన యునైటెడ్ అరబ్ లిస్ట్, జాయింట్ లిస్ట్ ఈ ఎన్నికల్లో తమ సీట్ల సంఖ్యను దాదాపు రెట్టింపు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అరబ్ ఇజ్రాయెలీ ఓటర్లలో ఓటింగ్ శాతం భారీగా పెరగడం దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఇజ్రాయెల్ జనాభాలో అరబ్‌లు సుమారు ఐదో వంతు మంది ఉంటారు. వీరిలో చాలా మంది తమను ఇజ్రాయెల్‌కు చెందిన పాలస్తీనా పౌరులుగా భావిస్తారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























