అంతర్వేది తీరానికి చేరిన భారీ ఓడకు ఏమైంది? ఒడ్డుకు సమీపంలో ఎలా చిక్కుకుంది? అందులో ఏం ఉంది

అంతర్వేది బీచ్‌కు కొద్ది దూరంలోనే ఆగిపోయిన ఒక పెద్ద షిప్ ఒకటి కనిపిస్తోంది.
బీచ్ నుంచి కుడివైపునకు కిలోమీటరు దూరం వెళితే.. అక్కడికి సమీపంలోనే షిప్ సముద్రంలో ఆగి ఉంది.
అక్కడికి వెళ్లేందుకు పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదు. అయినప్పటికీ పెద్దసంఖ్యలో ప్రజలు వస్తుండటంతో వారిని అదుపు చేసేందుకు అక్కడ ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు కష్టపడాల్సి వస్తోంది.
రెండు రోజులుగా అంతర్వేది వద్దకు షిప్ వచ్చిందన్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
దీంతో అంతర్వేది, సఖినేటిపల్లి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ద్విచక్రవాహనాలు, కార్లలో వస్తున్నారు.

విశాఖ నుంచి సింగపూర్ వెళ్తుండగా..
ఇంతకీ షిప్ అక్కడకు ఎందుకు వచ్చిందనేది ఇండియన్ కోస్ట్ గార్డ్, ఏపీ ప్రభుత్వం వివరాలు తెలిపింది.
అర్నబ్ తుపాను అక్టోబరు 27 రాత్రి నుంచి అక్టోబరు 28వ తేదీ ఉదయం మధ్య యానాం-నరసాపురం సమీపంలో తీరం దాటినట్లుగా భారత వాతావరణ శాఖ ప్రకటించింది.
ఆ సమయంలో గంటకు 125-150 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచాయని తెలిపింది.
తుపాను సమయంలోనే విశాఖపట్నం నుంచి మర్చంట్ షిప్ ఒకటి సింగపూర్‌కు బయల్దేరింది.
మార్షల్ ఐల్యాండ్‌కు చెందిన ఈ ఓడ పేరు సిగ్మా పెరల్గా ఇండియన్ కోస్ట్ గార్డు తెలిపింది.

20 మందిని రక్షించామన్న ఇండియన్ కోస్టు గార్డు
ఇది విశాఖపట్నం నుంచి సింగపూర్ వెళ్తుండగా అర్నబ్ తుపాను సమయంలో సాంకేతిక లోపం తలెత్తి సముద్రంలో చిక్కుకుంది.
అంతర్వేది బీచ్ సమీపంలోనే తీరానికి కొన్ని మీటర్ల దూరం వరకు వచ్చి ఆగిపోయింది.
అంతర్వేది తీరానికి బుధవారం షిప్ రావడం గమనించినట్లుగా స్థానికులు చెబుతున్నారు.
''మేం గతంలో ఎన్నడూ షిప్ వచ్చి అంతర్వేది వద్ద ఆగడం చూడలేదు. ఎక్కడో సముద్రంలో దూరం నుంచి ఓడలు వెళ్తుండేవి. అవి కూడా ఎక్కువగా కనిపించేవి కావు. చేపల వేటకు పడవలో సముద్రంలోకి వెళ్లినప్పుడు ఓడలు కనిపించేవి'' అని సఖినేటిపల్లి రామేశ్వరానికి చెందిన ఆశబాబు బీబీసీతో చెప్పారు.

అంతర్వేది వద్ద తీరం సమీపానికి వచ్చిన ఓడ 'మర్చంట్ షిప్' గా ఇండియన్ కోస్టు గార్డు పేర్కొంది. అంటే, ఇది కార్గో రవాణా చేసే ఓడ.
షిప్లో 20 మంది సిబ్బంది ఉండగా గురువారం వారందర్ని హెలికాప్టర్ సాయంతో రక్షించినట్లుగా ఇండియన్ కోస్టు గార్డు ప్రకటించింది.
బీబీసీ అక్కడికి వెళ్లినప్పుడు రెండు హెలీకాప్టర్లలో ఇండియన్ కోస్టు గార్డు సిబ్బంది, అధికారుల తరఫున రెస్య్కూ ఆపరేషన్ నడుస్తోంది.
షిప్‌లోని సిబ్బందిని ఇండియన్ కోస్టు గార్డుకు చెందిన 'సుజయ్' ఓడ ద్వారా సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్లుగా అధికారులు చెప్పారు.
షిప్‌లోని వారిని రక్షిస్తున్న సహాయక చర్యల వీడియోను ఎక్స్‌లో ఇండియన్ కోస్టు గార్డు షేర్ చేసింది.

ఇంతకీ ఈ ఓడ వివరాలేంటి..
షిప్లో ఏదైనా 'కార్గో' ఉందా.. లేదా.. అన్న విషయాన్ని ఇండియన్ కోస్టు గార్డు లేదా ఏపీ ప్రభుత్వం ప్రకటించలేదు.
ఇది విశాఖపట్నం నుంచి సింగపూర్ వెళ్తున్నట్లుగా చెప్పింది.
ఇండియన్ కోస్టు గార్డు, ఏపీ ప్రభుత్వం చెప్పిన వివరాల ప్రకారం, ఇది పయనీర్ మెరైన్ కంపెనీకి చెందిన ఓడ.
ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం గ్రీస్‌లోని ఏథెన్స్ నగరంలో ఉంది. ఇది యూఎస్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ సాయంతో 2013లో ఏర్పాటైనట్లుగా కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం తెలుస్తోంది.
మొత్తం దాదాపు 6.26లక్షల టన్నుల సామర్థ్యంతో కూడిన 14 భారీ ఓడలను నిర్వహిస్తోంది.
వ్యవసాయ ఉత్పత్తులు, నిర్మాణ రంగ సామాగ్రి, మినరల్స్, మెటల్స్ వంటివి రవాణా చేస్తుంటుంది.
ప్రస్తుతం అంతర్వేది వద్ద ఆగిపోయిన ఓడ 179.9 మీటర్ల పొడవు, 28.4 మీటర్ల వెడల్పుతో ఉందని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
రవాణా పరంగా సుమారు 32,688 టన్నుల పూర్తి సామర్థ్యం ఉండగా, 20,809 టన్నుల గ్రాస్ సామర్థ్యం కలిగి ఉన్నట్లుగా ప్రభుత్వం చెప్పింది. దీన్ని 2010లో తయారు చేశారు.
అయితే, ఈ ఓడను తిరిగి ఎప్పుడు తరలిస్తారనేది అటు కంపెనీ నుంచి గానీ, ఏపీ ప్రభుత్వం నుంచి అధికారిక సమాచారం లేదు.
''కంపెనీ ప్రతినిధులు, ఇండియన్ కోస్టు గార్డు అధికారులతో మాట్లాడుతున్నాం. మరమ్మతులు ఎప్పటికల్లా పూర్తి చేస్తారు. ఎప్పుడు తిరిగి బయల్దేరుతుందో అనేది సమాచారం ఇంకా అందలేదు. ప్రభుత్వం తరఫున అవసరమైన సాయం అందిస్తాం.'' అని ఏపీకి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు బీబీసీతో చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























