తెలంగాణ: కాళోజీ యూనివర్సిటీలో నకిలీ సర్టిఫికెట్లతో అడ్మిషన్లంటూ వివాదం, అసలేం జరిగింది?

వైద్య విద్య

వరంగల్ జిల్లాలోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్జాన విశ్వవిద్యాలయంలో నకిలీ సర్టిఫికెట్ల ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

'స్థానికత' కు సంబంధించి కొందరు విద్యార్థులు సమర్పించిన సర్టిఫికెట్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.

వారికి సీట్లు నిరాకరిస్తున్నట్లుగా యూనివర్సిటీ ప్రకటించింది.

అయితే, కొన్ని మీడియాల్లో వచ్చినట్లుగా అవి నకిలీ సర్టిఫికెట్లు కావని, స్థానికత విషయంలో వివాదం కారణంగా సర్టిఫికెట్లు సమర్పించిన విద్యార్థులకు సీట్లు నిరాకరించామని యూనివర్సిటీ స్పష్టం చేసింది.

వైద్య విద్యలో ప్రవేశాలు జరుగుతున్న తరుణంలో ‘నకిలీ’ సర్టిఫికెట్లు సమర్పించారంటూ ఆరోపణలు రావడం తెలంగాణలో కలకలం రేపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

37 మంది విద్యార్థుల గుర్తింపు

కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్జాన విశ్వవిద్యాలయం 2026-27 సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు కౌన్సిలింగ్ నిర్వహిస్తోంది.

ఈ సందర్భంగా రిజర్వేషన్ కేటగిరీకి చెందిన విద్యార్థులు ఆదాయ, కుల, స్థానికత తదితర ధ్రువీకరణపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.

మొత్తం విద్యార్ధులతో 37 మంది విద్యార్థుల సర్టిఫికెట్లు స్థానికత అర్హతకు సరిపోవడం లేదని, అందువల్ల వారిని ఎస్టీ కేటగిరీ కింద గుర్తించలేమని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్జాన విశ్వవిద్యాలయం ప్రకటించింది.

విద్యార్థుల జాబితాతో యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో ప్రచురించింది. ఈ మేరకు విద్యార్థుల వివరాలతో సెప్టెంబరు 26న యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆదేశాలు జారీ చేశారు.

ఈ వ్యవహారం తర్వాత విద్యార్థులు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించారంటూ ఆరోపణలు సోషల్ మీడియాలో కనిపించాయి.

అయితే, యూనివర్సిటీ అధికారులు ఈ విషయంలో స్పష్టత ఇచ్చారు. విద్యార్థులు సమర్పించిన సర్టిఫికెట్లు నకిలీవి కాదని, స్థానికత విషయంలో వివాదం కారణంగా వారిని ఎస్టీగా కాకుండా ఓపెన్ కేటగిరీ విద్యార్థులుగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ రమేశ్ రెడ్డి బీబీసీతో చెప్పారు.

''కుల ధ్రువీకరణ విషయంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కోలా ఉంటుంది. ఒకచోట ఎస్సీ అయితే మరొక రాష్ట్రంలో బీసీ కావొచ్చు. ఒక రాష్ట్రంలో ఎస్టీ కేటగిరీలో ఉంటే మరొక రాష్ట్రంలో ఇతర కులాల్లో ఉండవచ్చు. అలా ఎస్టీ కేటగిరీకి సంబంధించి 37 మంది విద్యార్థుల విషయంలో తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకున్నాం'' అని చెప్పారు

విద్యార్థుల తల్లిదండ్రుల స్థానికత విషయంలో గిరిజన సంక్షేమ శాఖ ఇచ్చిన నివేదికను బట్టి విద్యార్థులు సమర్పించిన సర్టిఫికెట్లు చెల్లవని, వారిని ఓపెన్ కేటగిరీ విద్యార్థులుగా పరిగణిస్తున్నట్లుగా నిర్ణయం తీసుకున్నామని వివరించారు.

కాళోజీ యూనివర్సిటీ
ఫొటో క్యాప్షన్, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సస్ (ఫైల్ ఫోటో)

గతంలోనూ ప్రవేశాలు రద్దు చేసిన యూనివర్సిటీ

విద్యార్థులు తెలంగాణలో పుట్టి పెరిగి, చదువు పూర్తి చేసినప్పటికీ, తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో ఆ విద్యార్థులకు రిజర్వేషన్ కేటగిరీలో సీట్లు కేటాయించడం కుదరదని యూనివర్సిటీ స్పష్టం చేసింది.

ఈ మేరకు తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నట్లుగా యూనివర్సిటీ ప్రకటించింది.

ఇదే విధంగా సెప్టెంబరు 3వ తేదీన కూడా 13 మంది విద్యార్థులకు ఎస్టీ రిజిర్వేషన్ కేటగిరీలో ప్రవేశాలు నిరాకరించింది కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్జాన విశ్వవిద్యాలయం.

ఇదే విషయంలో 2023లోనూ ఏడుగురు ఏపీ ప్రాంత విద్యార్థులకు సంబంధించి 'స్థానికత' విషయంలో వివాదం కావడంతో ప్రవేశాలు రద్దు చేసింది యూనివర్సిటీ.

తెలంగాణ హైకోర్టు
ఫొటో క్యాప్షన్, తల్లిదండ్రుల మూలాలు ఇతర రాష్ట్రాల్లో ఉంటే, విద్యార్థులు తెలంగాణలో ఉన్నప్పటికీ ప్రయోజనాలు పొందలేరని యూనివర్సిటీ రాసిన లేఖకు గిరిజన సంక్షేమ శాఖ సమాధానమిచ్చింది.

తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఏం చెప్పిందంటే..

తెలంగాణ హైకోర్టు స్థానికత విషయంలో 2024లో ఇచ్చిన ఆదేశాలను గిరిజన సంక్షేమ శాఖ ప్రస్తావించింది.

ఎవరైనా విద్యార్థి తల్లిదండ్రుల మూలాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర లేదా ఇతర రాష్ట్రాల్లో ఉండి, 2014 కంటే ముందు ఉద్యోగం, విద్యావసరాల నిమిత్తం తెలంగాణకు వచ్చి ఉంటే ఆ కారణంతో తెలంగాణను ''స్టేట్ ఆఫ్ ఆరిజిన్'' కింద పరిగణించడానికి వీలుండదని హైకోర్టు గతంలో స్పష్టం చేసిందని గిరిజన సంక్షేమ శాఖ సెప్టెంబరు 22న ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

''తెలంగాణ హైకోర్టు 2025 ఫిబ్రవరి 10న ఇచ్చిన ఆదేశాల్లో ‘స్టేట్ ఆఫ్ ఆరిజిన్’ గురించి చెప్పింది.

పునర్విభజన చట్టం కింద ఏర్పడిన రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీలు ఆ కేటగిరీ కింద ప్రయోజనాలు పొందేందుకు వీలుండదు. వారు వలస వచ్చిన రాష్ట్రంలో కాకుండా వారి మూలాలు ఉన్న రాష్ట్రంలోనే రిజర్వేషన్ ప్రయోజనాలు పొందేందుకు వీలుంటుంది'' అని హైకోర్టు ఆదేశాలను గిరిజన సంక్షేమ శాఖ స్పష్టం చేసింది.

దీని ఆధారంగా తల్లిదండ్రుల మూలాలు (స్టేట్ ఆఫ్ ఆరిజిన్) ఇతర రాష్ట్రాల్లో ఉంటే, విద్యార్థులు తెలంగాణలో ఉన్నప్పటికీ ప్రయోజనాలు పొందలేరని యూనివర్సిటీ రాసిన లేఖకు గిరిజన సంక్షేమ శాఖ బదులిచ్చింది.

ప్రతీకాత్మక చిత్రం

సీట్ల కేటాయింపు, రద్దు

ఇలా ప్రవేశం పొందడానికి ప్రయత్నించిన 37 మంది విద్యార్థులలో మొదటి, రెండో విడతలో ప్రవేశాలు పొందిన 9 మంది విద్యార్థుల ప్రవేశాలు రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది.

వీరంతా కాళోజీ యూనివర్సిటీ పరిధిలోని వివిధ కళాశాలల్లో సీట్లు పొందినట్లుగా యూనివర్సిటీ గుర్తించింది.

''సీట్లు పొందిన వారి ప్రవేశాలు రద్దు చేస్తున్నాం. ఆ సీట్లను తర్వాత దశలోని కౌన్సిలింగ్‌లో భర్తీ చేస్తాం'' అని ప్రకటించింది యూనివర్సిటీ.

విద్యార్థులను ఓపెన్ కేటగిరీ కింద గుర్తిస్తున్నట్లుగా ప్రకటించింది.

పేరు రాయకుండా ఉండాలనే షరతుపై ఓ విద్యార్థిని బీబీసీతో మాట్లాడింది.

''నేను ఎస్టీ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్నాను. ఆ మేరకు రెవెన్యూ శాఖాధికారులు కూడా నాకు కుల ధ్రువీకరణపత్రం ఇచ్చారు. నేను పుట్టింది, పెరిగింది, చదువుకుంది.. అన్నీ తెలంగాణలోనే. మా తల్లిదండ్రులు కూడా ఎన్నో ఏళ్ల కిందట ఇక్కడికి వచ్చారు. కానీ, మా తల్లిదండ్రుల జననం ఏపీలో ఉందని, మమ్మల్ని ప్రవేశాలకు దూరం చేయడం ఎంతవరకు సమంజసం..? స్థానికత విషయంలో సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది'' అని సదరు విద్యార్థిని బీబీసీకి చెప్పారు.

మరో విద్యార్థి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

అయితే, ప్రవేశాలు రద్దు చేసిన విద్యార్థులలో ఏడుగురు విద్యార్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వారికి తిరిగి ప్రవేశాలు కల్పించాలని హైకోర్టు స్పష్టం చేసింది.

''హైకోర్టు ఆదేశాల మేరకు విద్యార్థులకు తిరిగి ప్రవేశాలు కల్పిస్తాం'' అని యూనివర్సిటీ ఇంచార్జ్ వైస్ చాన్సలర్ రమేశ్ రెడ్డి బీబీసీతో చెప్పారు.

సుప్రీంకోర్టు

స్థానికతపై సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే..

తెలంగాణలో వైద్య విద్య ప్రవేశాల్లో స్థానిక కోటాకు అర్హత పొందాలంటే, అర్హత పరీక్షకు సంబంధించిన విద్యా సంవత్సరంతో ముగిసే నాలుగు వరుస విద్యా సంవత్సరాలు తెలంగాణలో చదివి ఉండాలన్న నిబంధనను పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు ఈ ఏడాది సెప్టెంబరు 28న స్పష్టం చేసింది.

ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో తెలంగాణలో స్థానిక కోటా కింద అర్హత సాధించాలంటే 9 నుంచి 12వ తరగతి (ఇంటర్ రెండో సంవత్సరం) వరకు వరుసగా రాష్ట్రంలో చదివి ఉండాలని 2017లో తెలంగాణ ప్రభుత్వం జీవో నం.33 జారీ చేసింది.

తెలంగాణలో జన్మించినా లేదా ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలంగాణలో చదివి, ఇంటర్ వేరొక రాష్ట్రంలో చదివితే స్థానికత పోతోందని కొందరు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.

దీనిపై విద్యార్థులు మొదట తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, వారి పిటిషన్‌ను న్యాయస్థానం విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్థించింది.

అనంతరం విద్యార్ధులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను సమర్థించింది.

''రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ఎలాంటి ప్రత్యేక వెసులుబాటు కల్పించలేం'' అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)