నీట్ పేపర్ లీక్: ఎవరెవరు అరెస్టయ్యారు? సీబీఐ ఆరోపణలేమిటి

నీట్, ఎన్టీఏ, మెడిసన్, యువత

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, బీబీసీ మరాఠీ
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

నీట్ పేపర్ లీక్ కేసులో మనీషా మాండ్రే అనే నిందితురాలిని పుణెలో సీబీఐ అరెస్టు చేసింది. ఈ పేపర్ లీక్ కేసులో ఇప్పటివరకు మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేశారు.

నీట్ యూజీ - 2026 నిర్వహణ ప్రక్రియలో మనీషా మాండ్రే భాగమయ్యారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆమెను నిపుణురాలిగా నియమించింది.

ఆమెకు బోటనీ, జువాలజీ ప్రశ్నాపత్రాల పూర్తి యాక్సెస్ ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

ఆమె పుణెలోని ఒక కాలేజ్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

మనీషా మాండ్రే నుంచి గానీ, ఆమె న్యాయవాదుల నుంచిగానీ ఈ కేసుపై ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. స్పందన వచ్చిన తర్వాత అప్‌డేట్ చేస్తాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

మనీషా మాండ్రే ఎవరు?

లాతూర్‌కు చెందిన పీవీ కులకర్ణిని కూడా పుణెలో అరెస్టు చేశారు.

పేపర్ లీక్ కేసులో కులకర్ణి 'మాస్టర్‌మైండ్' అని సీబీఐ ఆరోపించింది.

విచారణ అనంతరం పుణెలో పీవీ కులకర్ణిని అరెస్టు చేసినట్టు సీబీఐ ప్రకటించింది.

మనీషా మాండ్రే పుణెలోని ఒక కాలేజ్‌లో బోటనీ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్‌.

ఈ కేసులో మనీషా మాండ్రే పేరు బయటకు వచ్చిన తర్వాత, క్షుణ్ణంగా దర్యాప్తు జరిపిన అనంతరం సీబీఐ ఆమెను దిల్లీలో అరెస్టు చేసింది.

పుణెలో నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న కొందరు విద్యార్థులను మనీషా వాఘ్మారే ద్వారా తీసుకొచ్చి ఏప్రిల్‌లో మనీషా మాండ్రే తన ఇంట్లో ప్రత్యేక కోచింగ్ క్లాసులు నిర్వహించారు.

మే 14న మనీషా వాఘ్మారేను అరెస్టు చేశారు.

తన ఇంట్లో నిర్వహించిన క్లాసుల్లో మనీషా మాండ్రే బోటనీ, జువాలజీకి సంబంధించిన అనేక ప్రశ్నలు, వాటికి సంబంధించిన సమాచారం విద్యార్థులకు అందించారని ఆరోపణలున్నాయి.

ఈ ప్రశ్నలను వారి నోట్‌బుక్‌లలో రాసుకోవాలని, టెస్టు పుస్తకాల్లో కూడా గుర్తులు పెట్టుకోవాలని సూచించారని చెబుతున్నారు.

ఈ ప్రశ్నల్లో చాలా వరకు మే 3న జరిగిన నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రంలోని ప్రశ్నలను పోలి ఉన్నట్టు దర్యాప్తులో వెల్లడయింది.

నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ ఆరు చోట్ల దాడులు చేసి పలు కీలక పత్రాలు, ల్యాప్‌టాప్‌లు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకుంది.

ఈ కేసులో ఇప్పటివరకు దిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, అహిల్యానగర్‌లలో మొత్తం తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేశారు.

వారిలో ఐదుగురిని కోర్టులో హాజరుపరిచగా కోర్టు ఏడు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగించింది.

నీట్, ఎన్టీఏ, మెడిసన్, యువత

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈ ఏడాది 22లక్షలమంది నీట్ రాశారు.

కాలేజ్ ప్రిన్సిపాల్ ఏం చెప్పారు?

మనీషా మాండ్రే ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ నివేదిత ఎక్బోటే ఈ విషయం తనకు మీడియా ద్వారానే తెలిసిందని ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపారు.

"సీనియర్ ప్రొఫెసర్ మనీషా మాండ్రేను సీబీఐ అరెస్టు చేసినట్టు మాకు తెలిసింది. ఆమె గత 24 ఏళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నారు. గోప్యతా నిబంధనల కింద ఎన్టీఏతో అనుబంధంగా పనిచేస్తున్నారు'' అని ఆమె అన్నారు.

సర్వీస్ రికార్డు ప్రకారం మనీషా మాండ్రే ఏడు నెలల తర్వాత పదవీ విరమణ చేయనున్నారని ప్రిన్సిపల్ తెలిపారు.

"ఎన్టీఏ, నీట్ పరీక్ష, ప్రశ్నాపత్రాల తయారీ ప్రక్రియ గురించి మాకు ఎలాంటి సమాచారం లేదు. సంబంధిత అధికారుల నుంచి అధికారిక సమాచారం అందిన తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం" అని నివేదిత ఎక్బోటే చెప్పారు.

ప్రభుత్వ ఆమోదం తర్వాత నీట్ 2026 రీ ఎగ్జామ్‌ను జూన్ 21న నిర్వహించాలని ఎన్టీఏ నిర్ణయించింది.

నీట్, ఎన్టీఏ, మెడిసన్, యువత

ఫొటో సోర్స్, PRAVEEN THACKREY

ఫొటో క్యాప్షన్, శుభమ్ ఖైర్నార్‌ను నాసిక్‌లో అరెస్టు చేశారు.

శుభమ్ ఖైర్నార్

పేపర్ లీక్ కేసులో సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడానికి కేవలం ఒక రోజు ముందు ఒక పేరు బయటకు వచ్చి మహారాష్ట్రలో కలకలం రేగింది.

నాసిక్‌కు చెందిన 30 ఏళ్ల శుభమ్ ఖైర్నార్ పేరు బయటకు వచ్చింది.

నాసిక్‌లోని ఒక టెలిగ్రామ్ గ్రూపులో నీట్ పరీక్ష ప్రశ్నపత్రం పంపినట్టు నాసిక్ పోలీసులకు సమాచారం అందింది.

ఈ సమాచారం ఆధారంగా నాసిక్ పోలీసులు 2026 మే 12న శుభమ్‌ను అరెస్టు చేసి సీబీఐకి అప్పగించారు.

ధనంజయ్ లోఖండే నుంచి అందుకున్న ప్రశ్నపత్రం పీడీఎఫ్‌ను శుభమ్ ఏప్రిల్ 29న యశ్ యాదవ్‌కు ఇచ్చారని సీబీఐ తెలిపింది.

ఈ పేపర్‌ను మంగీలాల్ ఖాటిక్, వికాస్ బివాల్, దినేశ్ బివాల్‌లకు కూడా శుభమ్ ఇచ్చారని పేర్కొంది.

శుభమ్ ఖైర్నార్ నాసిక్‌లో ఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నిర్వహిస్తుండేవారు.

శుభమ్ మెడిసన్ మూడో సంవత్సరం చదువుతున్నారని, నాసిక్‌లో ప్రాక్టీస్ కూడా చేస్తున్నారని ఆయన తండ్రి చెప్పారు.

శుభమ్ నిజంగా మెడిసన్ చదువుతున్నారా లేక డాక్టర్‌గా చెప్పుకుంటున్నారా అన్నది తెలుసుకోవడానికి బీబీసీ ప్రయత్నించింది.

"శుభమ్ కాలేజ్‌లో అడ్మిషన్ తీసుకున్నారు గానీ ఒక్క సంవత్సరం కూడా పూర్తి చేయలేదు" అని సీహోర్‌లోని సత్యసాయి యూనివర్శిటీ యాజమాన్యం బీబీసీకి తెలిపింది.

నీట్, ఎన్టీఏ, మెడిసన్, యువత

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, పీవీ కులకర్ణి

పీవీ కులకర్ణి

విచారణ అనంతరం ఈ నెల 15న ప్రహ్లాద్ విఠల్‌రావు కులకర్ణి అలియాస్ పీవీ కులకర్ణిని సీబీఐ పుణెలో అరెస్టు చేసింది.

ఈ కేసులో పీవీ కులకర్ణిని మాస్టర్ మైండ్‌గా సీబీఐ పేర్కొంది.

లాతూర్‌కు చెందిన పీవీ కులకర్ణి అక్కడే ఉన్న దయానంద్ కాలేజ్‌లో కెమిస్ట్రీ బోధించేవారు.

27 ఏళ్ల సర్వీసు తర్వాత 2022లో పదవీ విరమణ చేసి ఆ తర్వాత పుణెలో స్థిరపడ్డారు.

రిటైర్మెంట్ తర్వాత పీవీ కులకర్ణికి కాలేజ్‌తో ఎలాంటి సంబంధాలు లేవని ప్రిన్సిపల్ సిద్ధేశ్వర్ బెలాలె అన్నారు.

పదవీ విరమణ తర్వాత పీవీ కులకర్ణి లాతూర్‌లో సొంతంగా కోచింగ్ క్లాసులు ప్రారంభించారు.

నీట్, జేఈఈ, జేఈఈ మెయిన్, ఎంహెచ్‌టి-సెట్ వంటి పోటీ పరీక్షల కోసం మాక్ టెస్టులు, ప్రశ్నాపత్రాలు, గైడెన్స్ అందించే పూణేకు చెందిన ఒక సంస్థతో కూడా ఆయనకు అనుబంధం ఉన్నట్టు సమాచారం.

ఏప్రిల్ చివరి వారంలో పుణెలోని ఆయన ఇంట్లో కొంతమంది విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ సెషన్‌లు నిర్వహించారని సీబీఐ తెలిపింది.

అంతేకాకుండా డబ్బులు తీసుకుని కొంతమంది విద్యార్థులకు కులకర్ణి గెస్ పేపర్లు ఇచ్చారని స్థానికంగా ఫిర్యాదులు వచ్చాయి.

లాతూర్‌లోని ఆయన కోచింగ్ సంస్థలను, సంబంధిత టీచర్లను సీబీఐ ప్రశ్నించింది.

''పీవీ కులకర్ణి ఎన్‌టీఏ తరఫున ప్రశ్నాపత్రాల తయారీ ప్రక్రియలో భాగమయ్యారు. ఆ ప్రశ్నపత్రాలు ఆయన వద్దే ఉన్నాయి. నా క్లయింట్ (పీవీ కులకర్ణి) తయారుచేసిన ప్రశ్నాపత్రాలను ఎన్‌టీఏ తీసుకుందో లేదో నాకు తెలియదు. చాలా మంది ఉపాధ్యాయులు ప్రశ్నపత్రాలను తయారుచేస్తారు. నా క్లయింట్‌ను ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్టు చేశారు" అని ఆయన తరఫు లాయర్ చెప్పారు.

నీట్, ఎన్టీఏ, మెడిసన్, యువత

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, మనీషా వాఘ్మారేకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని ఆమె తరఫు న్యాయవాదులు అంటున్నారు.

మనీషా వాఘ్మారే

మనీషా వాఘ్మారే ఈ నెల 14న అరెస్టు అయ్యారు.

మనీషా వాఘ్మారేకు పీవీ కులకర్ణితో సంబంధాలు ఉన్నాయని సీబీఐ చెబుతోంది.

మనీషా మాండ్రే ద్వారా మనీషా వాఘ్మారేకు పీవీ కులకర్ణి పరిచయమయ్యారని సీబీఐ పేర్కొంది.

తమ క్లయింట్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ప్రత్యక్ష సాక్ష్యం లభించలేదని మనీషా వాఘ్మారే న్యాయవాదులు వాదించారు.

ధనంజయ్ లోఖండేతో సంప్రదింపులు జరిపినందుకే ఆమెపై ఆరోపణలు వచ్చాయి.

ధనంజయ్ లోఖండే

నీట్ పేపర్ లీక్ కేసులో బయటకు వచ్చిన మరో పేరు ధనంజయ్ లోఖండే. ఆయన్ను అహిల్యానగర్ జిల్లాలో సీబీఐ అరెస్టు చేసింది.

శుభమ్, ధనంజయ్‌కు ఒకరితో ఒకరికి పరిచయం ఉంది.

మనీషా వాఘ్మారే దగ్గర నీట్ ప్రశ్నాపత్రాన్ని పొందిన ధనంజయ్ లోఖండే వాటిని శుభమ్ ఖైర్నార్‌కు ఇచ్చారన్నది ఆరోపణ.

ధనంజయ్ లోఖండే నుంచి అందిన పత్రాలను శుభమ్ ఇతరులకు ఇచ్చారని సీబీఐ పేర్కొంది.

మంగీలాల్ బివాల్

జైపూర్‌లోని జంవారామ్‌గఢ్‌కు చెందిన మంగీలాల్ బివాల్‌ను లీకైన ప్రశ్నపత్రాన్ని సంపాదించి, పంపిణీ చేశారన్న ఆరోపణలపై అరెస్టు చేశారు.

మంగీలాల్ బివాల్ కొడుకు వికాస్ బివాల్ సవాయి మాధోపూర్‌లోని వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నారు.

హర్యానాకు చెందిన యశ్ యాదవ్ ద్వారా మంగీలాల్ బివాల్ నీట్ 2025 పరీక్ష పత్రాన్ని కొనుగోలు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఇదే పరీక్షలో మంగీలాల్ బివాల్ కుటుంబానికి చెందిన ఐదుగురు పిల్లలు ఎంపికయ్యారు.

నీట్, ఎన్టీఏ, మెడిసన్, యువత

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నీట్ రీ ఎగ్జామ్ జూన్ 21న జరగనుంది.

వికాస్ బివాల్, దినేశ్ బివాల్

దినేశ్ బివాల్ మంగిలాల్ బివాల్ సోదరుడు. దినేశ్ బివాల్ జైపుర్‌లో అరెస్టు అయ్యారు. ఈ పేపర్ లీక్ వెనుక ఉన్న ఆర్థిక లావాదేవీలతో ఆయనకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.

యశ్ యాదవ్

గురుగ్రామ్‌కు చెందిన యశ్ యాదవ్ కూడా నీట్-యూజీ పేపర్ లీక్ కేసులో అరెస్టయ్యారు. ఆయన ఉత్తరకాశీలో బీఏఎంఎస్ (బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ) చదువుతున్నారు. ఈ కేసులో యశ్ యాదవ్‌తో పాటు మరికొంత మందిని కూడా సీబీఐ బృందం అరెస్టు చేసింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)