‘కచ్చితంగా చనిపోవాలనుకుంటే నేనిచ్చేది వాడు’- అంటూ ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారికి ఆన్లైన్లో విషాన్ని అమ్మిన వ్యక్తి కోర్టులో ఏం చెప్పారు?

ఫొటో సోర్స్, PA Media
- రచయిత, సీన్ డిల్లో , క్రిస్టినా మెక్ సోర్లే , ఒలివియా ఐర్లండ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
ఆన్లైన్లో విష రసాయనాలను అమ్మి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వారికి సహకరించిన వ్యక్తి, తనపై వచ్చిన 14 అభియోగాలను అంగీకరించారు.
60 ఏళ్ల కెన్నెత్ లా తాను నేరం చేసినట్లు శుక్రవారం కెనడాలోని ఒంటారియో కోర్టులో ఒప్పుకున్నారు.
ప్రాసిక్యూటర్లతో కుదిరిన ఒప్పందంలో భాగంగా నేరాన్ని అంగీకరిస్తే ఆయన మీదున్న తీవ్ర హత్యాభియోగాలను ఉపసంహరించుకుంటామని చెప్పారు.
ఈ మాజీ షెఫ్ 40 దేశాల్లో ఆన్లైన్ ద్వారా ఆత్మహత్య వేదికల్లో పరిచయాలు పెంచుకుని 1200 మందికి విషపూరితమైన పదార్ధాలను విక్రయించారు.
ఇందులో 400 మంది బ్రిటన్‌కు చెందినవారే.


ఫొటో సోర్స్, Getty Images
కెనడాకు చెందిన బాధితుల విషయంలోనే కెన్నెత్ మీద అభియోగాలు నమోదయ్యాయి. అయితే బ్రిటన్‌కు చెందిన 79 మంది ఆత్మహత్యల విషయంలో కెన్నెత్మీద అభియోగాలు మోపలేదంటూ ప్రాసిక్యూటర్లపై బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ 79 మంది కూడా కెన్నెత్ లా సరఫరా చేసిన ఉత్పత్తుల వల్లే మరణించారని అధికారులు తెలిపారు.
బ్రిటిషర్ల మరణాలను కూడా పరిగణనలోకి తీసుకుని కెన్నెత్‌కు శిక్ష విధించాలనే ప్రాతిపదికన కెనడియన్ అటార్నీ, డిఫెన్స్ న్యాయవాదుల మధ్య కుదిరిన ఒప్పందాన్ని తాము అంగీకరించినట్లు కెనడియన్ అటార్నీ విభాగం తెలిపింది.
కెనడాలో ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు రుజువైన తర్వాత కెన్నెత్ బ్రిటన్‌లో అభియోగాలను ఎదుర్కొనేందుకు ఆయన్ను బ్రిటన్ పంపించడం కుదరదంటూ కెనడియన్ అటార్నీ రాసిన లేఖను బీబీసీ చూసింది.
కెనడియన్ విచారణ ప్రక్రియలో యూకే బాధితులను చేర్చడం న్యాయం సాధించడానికి "అత్యంత వేగమైన, ఉత్తమ మార్గం" అని కెనడా ప్రాసిక్యూటర్ ఆండ్రూ హడ్సన్ అన్నారు.
కెన్నెత్‌ను బ్రిటన్‌కు అప్పగించడం చాలా కష్టమని, అలాంటిది వీలైనప్పటికీ అందుకు చాలాకాలం పడుతుందని హడ్సన్ చెప్పారు.
ఒక నేరానికి సంబంధించి ఒక వ్యక్తికి ఏక కాలంలో రెండు శిక్షలు విధించకూడదనే విధానం కింద బ్రిటన్‌లో అతని మీద విచారణను నిలిపివేసే అవకాశం ఉందని అన్నారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
ఒంటారియోకు చెందిన 19 ఏళ్ల అస్టిన్ ప్రొస్సెర్ బ్లేక్ 2023 మార్చ్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. అది కూడా కెన్నెత్ ఇచ్చిన రసాయన పదార్ధాలతోనే.
"చాలా ఆనందంగా ఉండేవాడు. చాలామంచి వ్యక్తి. ఎప్పుడూ బలహీనుల పక్షాన నిలబడాలని, వేధింపులు ఎదుర్కొంటున్న పిల్లలకు అండగా నిలవాలని భావించేవాడు" అని బ్లేక్ తల్లి కిమ్ ప్రొస్సెర్ తన కుమారుడి గురంచి బీబీసీతో అన్నారు.
కోవిడ్ మహమ్మారి తర్వాత ప్రొస్సెర్ బ్లేక్ మానసిక ఆరోగ్యం దెబ్బతింది. టొరంటోలో ఏడాది పాటు కాలేజ్‌లో చదివిన తర్వాత చదువు మానేసి ఇంటికి వచ్చారు. అప్పటి నుంచి ఆయన ఆందోళన చెందుతూనే ఉన్నాడని బ్లేక్ తల్లి చెప్పారు.
"నా కొడుకును కోల్పోయిన బాధ నుంచి నేను ఎన్నటికీ కోలుకోలేను. ఎవరో ఒకరిని జైల్లో పెట్టినంత మాత్రాన అది పోయేది కాదు. మరొకరు బాధ పడటం వల్ల నాకు ఉపశమనం లభించదు" అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, David Parfett
కెన్నెత్ ఆన్లైన్లో అమ్మిన విష రసాయనాలను తన 22 ఏళ్ల కుమారుడు థామస్ కొనుగోలు చేసినట్లు బ్రిటన్‌కు చెందిన డేవిడ్ పర్ఫెట్ చెప్పారు.
"టామ్ ఫుట్‌బాల్‌ను విపరీతంగా అభిమానించేవాడు. బాగా ఆడేవాడు కూడా. 2026 ప్రపంచ కప్ పోటీలను అతనితో కలిసి చూసే అవకాశాన్ని కోల్పోయా" అని అన్నారు.
టామ్ 50 పౌండ్లు చెల్లించి ఆ విష రసాయనం తీసుకున్నారు. 2021లో ఆయన మృతదేహం ఓ హోటల్లో కనిపించింది.
కెన్నెత్ నేరాన్ని అంగీకరించడం మంచిదని పర్ఫెట్ అన్నారు.
"అతని (కెన్నెత్ లా) మీద ఇక్కడ (బ్రిటన్‌లో) విచారణ జరగాలని నేను కోరుకుంటాను. నా కుమారుడి మరణానికి సంబంధించి కోర్టులో న్యాయవాదులు అడిగే ప్రశ్నలకు అతను చెప్పే సమాధానాలు వినాలని కోరుకుంటాను" అని పర్ఫెట్ బీబీసీతో అన్నారు.
ఈ మరణాలపై బహిరంగ విచారణ చేపట్టాలని ఆయన బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరారు. "నివారించదగిన, అనవసరమైన ఆత్మహత్యల్ని ఆపేందుకు అధికారులు ప్రయత్నించాలని, దురదృష్టత్తువశాత్తూ కొన్ని కుటుంబాలు ఆప్తుల్ని కోల్పోయి బాధపడటాన్ని ఆపాలి" అని ఆయన విజ్ఞప్తి చేశారు.
"ఇక్కడ ప్రాణనష్టం నిర్ఘాంత పరిచేలా ఉంది. పిల్లలతో సహా అనేక మంది చనిపోయారు. అయినప్పటికీ దాన్ని అర్థం చేసుకోవడంలో ఎలాంటి సమన్వయం కనిపించడం లేదు" అని పర్ఫెట్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘ఈ కేసులో ఆప్తుల్ని కోల్పోయిన వారి స్నేహితులు, బంధువులకు మా సానుభూతి’’ అని హోమ్ శాఖ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
"బ్రిటన్‌లోకి ప్రవేశించే హానికారక పదార్ధాలను గుర్తించి అడ్డుకునేందుకు మేము అధికారులతో కలిసి పని చేస్తున్నాం" అని ఆ ప్రకటనలో పేర్కొంది.
కెన్నెత్‌ను 2023 మేలో అరెస్ట్ చేశారు. బ్రిటన్, అమెరికా, ఇటలీ సహా దాదాపు డజను దేశాలలోని 11 విభాగాలకు చెందిన అధికారులు ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్నారు.
యువకులకు విషం అమ్ముతున్నాడని ఆయనపై టైమ్స్ పత్రిక పరిశోధనాత్మక కథనం ప్రచురించింది. ఈ కథనం రాసిన జర్నలిస్ట్ కెన్నెత్‌కు తనను తాను కస్టమర్‌గా పరిచయం చేసుకున్నారు. కథనం ప్రచురితమైన తర్వాత అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
"కచ్చితంగా చనిపోయేందుకు" తన ఉత్పత్తులు ఎలా వాడాలనే దానిపై కెన్నెత్ ఆ జర్నలిస్ట్‌కు వివరించారు.
ఆత్మహత్య చేసుకునేవారికి తన ఉత్పత్తుల్ని అమ్మేందుకు కెన్నెత్ అనేక వెబ్సైట్లు నిర్వహించినట్లు కెనడియన్ డిటెక్టివ్లు 2023లో బీబీసీతో చెప్పారు.
ఆత్మహత్యకు సాయం చేసినట్లుగా తేలితే కెనడా చట్టాల ప్రకారం 14 ఏళ్ల జైలుశిక్ష పడుతుంది.
ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి. సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























