త్విషా శర్మ: ఓ తెలుగు సినిమా హీరోయిన్, మిస్ పుణె, మోడల్... పెళ్లయిన 5 నెలల్లోనే అత్తగారింట్లో ఎలా చనిపోయారు? పోలీసులు ఏం చెబుతున్నారు?

త్విషా శర్మ

ఫొటో సోర్స్, Twisha's family

    • రచయిత, విష్ణుకాంత్ తివారీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

(కథలోని కొన్ని వివరాలు కలవరపెట్టేవిగా ఉండవచ్చు).

‘ఇది కచ్చితంగా ఆత్మహత్యే, హత్య కాదు’ అని త్విషా మరణంపై భోపాల్ పోలిస్ కమిషనర్ సంజయ్ సింగ్ స్పష్టం చేశారు.

మే 12వ తేదీ రాత్రి కటారా హిల్స్‌లోని ఆమె ఇంట్లో త్విషా మృతదేహం లభ్యమైంది. ఆమె హత్యకు గురైందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా, ఆమె అత్తమామలు మాత్రం ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు.

త్విషా భర్త సమర్థ్ సింగ్, ఆమె అత్త, రిటైర్డ్ జడ్జ్ గిరిబాల సింగ్‌లపై వరకట్నం వేధింపుల ఆరోపణల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ కేసును విచారిస్తోంది.

అత్తమామలు, భర్త సమర్థ్ సింగ్ తనను వేధిస్తున్నారని వాట్సాప్ చాట్స్‌లో త్విషా తన కుటుంబానికి పలుమార్లు చెప్పారు. మరణానికి కారణం ‘ఊపిరాడకపోవడం’ అని పోస్ట్‌మార్టం నివేదిక పేర్కొంది. మరణానికి ముందు తగిలిన అనేక గాయాల గురించి కూడా అందులో ప్రస్తావించింది. ఈ విషయాన్ని త్విషా కుటుంబం ప్రశ్నిస్తూనే ఉంది. అయితే ఆమె అత్తమామలు ఈ ఆరోపణలన్నింటినీ ఖండించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఇప్పటి వరకు పోలీసులు ఏం చెప్పారు?

బీబీసీతో మాట్లాడిన భోపాల్ పోలీస్ కమిషనర్ సంజయ్ కుమార్, "ఇది స్పష్టంగా ఆత్మహత్య, హత్య కాదు" అని అన్నారు.

అయితే, ఆమె అత్తమామలు ఆరోపించినట్లుగా, పోస్ట్‌మార్టం నివేదికలోగానీ, దర్యాప్తులోగానీ ఇప్పటి వరకు మాదకద్రవ్యాల వినియోగానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు వెల్లడి కాలేదని కూడా కమిషనర్ తెలిపారు.

‘త్విషా శర్మ ఊపిరాడక చనిపోయింది’ అని తెలిపే పోస్ట్‌మార్టం నివేదికను బీబీసీ చూసింది.

శరీరంలోని కొన్ని భాగాలపై గాయాలున్నాయని కూడా నివేదిక పేర్కొంది. అంటే మరణానికి ముందు జరిగిన గాయాలు. వీటిలో ఎడమ చేతిపై నీలిరంగు గుర్తులు, మణికట్టు, చేయి దగ్గర ఎర్రటి కమిలిన గాయాలు ఉన్నాయి.

ఊపిరాడకపోవడాన్ని ఆత్మహత్యగా పరిగణించినప్పటికీ, త్విషా పోస్ట్‌మార్టం నివేదికలో ఈ విషయం స్పష్టంగా లేదు. ఆమె మరణానికి ముందు ఏదైనా పెనుగులాట లేదా ఘర్షణలో పాల్గొన్నదా లేదా అన్నది కూడా అందులో చెప్పలేదు.

దీనిగురించి భోపాల్ కమిషనర్‌ను అడిగినప్పుడు, ‘‘మా దర్యాప్తు, ఇప్పటి వరకు అందిన పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా ఇది ఆత్మహత్య’’ అని చెప్పారు.

అనుమానాలేంటి?

ఊపిరాడకపోవడానికి, లేదా ఆత్మహత్య చేసుకోవడానికి ఉపయోగించారని చెబుతున్న సామాగ్రిని కూడా పోస్ట్‌మార్టం రిపోర్టు బృందానికి అందుబాటులో ఉంచలేదు.

ఈ కేసులో ఇది అతిపెద్ద వివాదాల్లో ఒకటిగా మారింది. ఫోరెన్సిక్ సాక్ష్యాల మేనేజ్‌మెంట్, దర్యాప్తు విషయంలో నిర్లక్ష్యం జరిగిందని త్విషా కుటుంబం ఆరోపించింది.

ఆత్మహత్య చేసుకోవడానికి ఉపయోగించినట్లు చెబుతున్న సామాగ్రిని చూపలేదన్న విషయాన్ని భోపాల్ పోలీస్ కమిషనర్ సంజయ్ కుమార్ కూడా అంగీకరించారు. ఈ లోపంపై ప్రత్యేక దర్యాప్తు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

పోస్ట్‌మార్టం నివేదికలో పేర్కొన్న గాయాలు అనేక అనుమానాలు కలిగిస్తున్నాయని, అందుకే దిల్లీలోని ఎయిమ్స్‌లో స్వతంత్రంగా రెండో పోస్ట్‌మార్టం నిర్వహించాలని త్విషా కుటుంబం డిమాండ్ చేస్తోంది.

‘‘ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని దాచిపెట్టాలని చూస్తున్నారు. మృతదేహంపై గాయాలు ఉన్నాయని పోస్టుమార్టం రిపోర్టులో ఉంది. మరి ఆ గాయాలు ఎలా అయ్యాయి? ఇది ఆత్మహత్యా లేక బలవంతపు మరణమా అన్నది కూడా రిపోర్టులో చెప్పలేదు. అందుకే అన్ని కోణాల్లో దర్యాప్తు జరపడానికి వీలుగా రీపోస్ట్‌మార్టం కోసం కోరుతున్నాం’’ అని త్విషా తండ్రి నవనిధి శర్మ బీబీసీతో అన్నారు.

"కుటుంబ సభ్యులు రీపోస్ట్‌మార్టం కోరితే, వారు కోర్టు నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది" అని భోపాల్ పోలీస్ కమిషనర్ అంతకు ముందు విలేఖరులతో అన్నారు. ఈ నిర్ణయాన్ని పోలీసులు తీసుకోలేరని ఆయన వెల్లడించారు.

వరకట్నం, రిటైర్డ్ జడ్జ్, గృహహింస, అత్తింటి వేధింపులు

ఫొటో సోర్స్, Twisha's family

మరిణించిన 8 రోజుల తర్వాత కూడా ఎయిమ్స్‌లోనే మృతదేహం

ఈ కేసులో గిరిబాల సింగ్‌కు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయగా, సమర్థ్ సింగ్ బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.

"సంబంధిత పక్షాలు (త్విషా అత్తమామలు) చట్టం, విధివిధానాల గురించి అవగాహన ఉన్నవారైనా, సంఘటన జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వలేదు" ఏసీపీ రజనీశ్ కశ్యప్ కౌల్ అన్నారు.

ఘటన జరిగిన ఎనిమిది రోజులు కాగా, త్విషా భర్త సమర్థ్ సింగ్ పరారీలోనే ఉన్నారు. నిందితుడిని పట్టుకోవడానికి పలు బృందాలు పనిచేస్తున్నాయని, రూ.10,000 రివార్డు కూడా ప్రకటించామని పోలీస్ కమిషనర్ సంజయ్ కుమార్ తెలిపారు.

వరకట్నం, రిటైర్డ్ జడ్జ్, గృహహింస, అత్తింటి వేధింపులు

ఫొటో సోర్స్, Photo credit Twisha's family

ఫొటో క్యాప్షన్, తమ కుమార్తెను వేధింపులకు గురిచేసి హత్యచేశారని త్విషా తండ్రి ఆరోపించారు.

‘మేం చాలా పెద్ద వ్యవస్థతో పోరాడుతున్నాం’

త్విషా శర్మ మృతి తర్వాత, ఆమె తండ్రి నవనిధి శర్మ చేసిన ఈ ఆరోపణ ఇప్పుడీ కేసులో ప్రధానాంశంగా మారింది.

త్విషా తండ్రి నవ్‌నిధి శర్మ, ఆమె సోదరుడు మేజర్ హర్షిత్ శర్మ 'ఇది ఆత్మహత్య కేసు కాదు, హత్య' అని ఆరోపిస్తున్నారు.

"నిందితులు పలుకుబడి ఉన్న వ్యక్తులని, వారు సాక్ష్యాలను తారుమారు చేయగలరని పోలీసులే కోర్టులో చెప్పారు. మరి అలాంటప్పుడు వారికి అసలు బెయిల్ ఎలా లభించింది?" అని బీబీసీతో మాట్లాడుతూ నవ్‌నిధి శర్మ ప్రశ్నించారు.

నిందితుల కుటుంబానికి న్యాయవ్యవస్థ, లోకాయుక్త, వైద్య రంగాలలో పలుకుబడి ఉందని ఆయన ఆరోపించారు.

"మేము ఒక పెద్ద వ్యవస్థతో పోరాడుతున్నాం. మా అమ్మాయి చాలా ప్రతిభావంతురాలు. పెళ్ళయినప్పటి నుంచి అత్తమామలు ఆమెనెప్పుడూ వేధిస్తూనే ఉన్నారు..." అని నవ్‌నిధిశర్మ అన్నారు.

ఘటన జరిగిన తర్వాత సాక్ష్యాలను తారుమారు చేశారని ఆయన ఆరోపిస్తున్నారు.

త్విషాకు సీపీఆర్ చేయడానికి ప్రయత్నించారని వాళ్ల అత్త చెబుతున్నారు. నా కూతురు రెండో అంతస్తులో ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. మరి ఆమెను కిందకు తీసుకువచ్చి కెమెరా ముందు సీపీఆర్ చేయడంలో అర్థం ఏంటి?"

ఇంటి దగ్గర పోలీస్ పోస్ట్ ఉన్నప్పటికీ, పోలీసులకు వెంటనే ఎందుకు సమాచారం ఇవ్వలేదు?'' అని నవ్‌నిధి శర్మ ప్రశ్నించారు.

"వాళ్లందరికీ చట్టం గురించి తెలుసు. ఇలాంటి సందర్భంలో వెంటనే పోలీసులను పిలవాలని వాళ్లకు తెలియదా? వాళ్ల ఇంటికి కొన్ని మీటర్ల దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉంది. కానీ ఆ సమయంలో పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. వీళ్లే దాచడానికి ప్రయత్నిస్తున్నారు?" అని అడిగారు.

సోదరుడు మేజర్ హర్షిత్ శర్మ ఏమంటున్నారు?

"మేం ఇక్కడి ప్రొసీజర్ గురించి ప్రశ్నించడానికి వచ్చాం. పోలీసులకు మొదట ఫోన్ చేసింది మేమే. వాళ్లు కాదు. త్విషాను కాపాడాలనే ఆతృతలో మిగిలిన విషయాలు పట్టించుకోలేదని వాళ్లు చెబుతున్నారు. అయితే ఓ వీడియోలో గిరిబాల సింగ్ చాలా ప్రశాంతంగా మెట్లు ఎక్కి దిగడం స్పష్టంగా కనిపిస్తోంది. న్యాయ ప్రక్రియకు సంబంధించిన పూర్తి సమాచారం ఆమెకు తెలుసు. ఆమె పోలీసులకు ఫోన్ చేసి ఉండొచ్చు. ఆమె పోలీసులకు ఎందుకు ఫోన్ చేయలేదు?" అని త్విషా సోదరుడు మేజర్ హర్షిత్ శర్మ ప్రశ్నించారు.

''ఇక్కడకు వచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేయించడానికి మాకు మూడు రోజులు పట్టింది. మే 15వ తేదీ తెల్లవారుజామున 2:30 గంటలకు మా ఎఫ్ఐఆర్ నమోదైంది. అంతకు ముందే వాళ్లు ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు.

ఆమె 63 ఏళ్ల గౌరవనీయమైన మహిళ అని, ఎవరికీ ప్రమాదకారి కాదనే కారణాలతో బెయిల్ ఇచ్చారు. ఇది సరైనది కాదు. ఆమె చేసే పనులకు ఇది పూర్తి భిన్నంగా ఉంది" అని హర్షిత్ శర్మ అన్నారు.

'ప్రమాదకారి కాదు' అని భావించే ఒక మహిళ కోర్టు ఆవరణలో నా 61 ఏళ్ల తండ్రిని బెదిరించడానికి మనుషులను పంపిస్తున్నారు. 'ప్రమాదకారి కాదు' అని భావించే మహిళ మా కుటుంబాన్ని కొట్టించేందుకు 30మందిని పంపిస్తున్నానని బెదిరిస్తున్నారు'' అని హర్షిత్ శర్మ ఆరోపించారు.

"చనిపోయిన నా సోదరి గురించి అలాంటి వ్యాఖ్యలు చేయడానికి ఆమెకు ఎవరు హక్కు ఇచ్చారు? సమర్థ్ సింగ్ ఎక్కడ ఉన్నారని ఎవరూ ఎందుకు అడగడం లేదు? ఆయన ఎందుకు పరారయ్యారు? రెండో పోస్ట్‌మార్టమ్ ఎందుకు చేయడం లేదు?" అని హర్షిత్ శర్మ ప్రశ్నించారు.

వరకట్నం, రిటైర్డ్ జడ్జ్, గృహహింస, అత్తింటి వేధింపులు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, త్విషా మానసిక సమస్యలతో బాధపడుతున్నారని అత్త గిరిబాలా సింగ్ ఆరోపించారు.

గిరిబాలా సింగ్ ఏం చెప్పారు?

త్విషా తల్లిదండ్రులు చేసిన ఆరోపణలను విశ్రాంత న్యాయమూర్తి గిరిబాలా సింగ్ కోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌లో ఖండించారు.

త్విషా, సమర్థ్ సింగ్‌లు తమ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్నారని, తమ కుటుంబాల మధ్య చాలా తేడాలున్నప్పటికీ ఈ సంబంధాన్ని తాము అంగీకరించామని ఆయన అన్నారు.

"త్విషా మానసిక, ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు" అని గిరిబాల సింగ్ పేర్కొన్నారు.

త్విషా అత్తమామలు పలుకుబడి ఉపయోగిస్తున్నారని, ఒత్తిడి తెస్తున్నారని ఆమె తల్లిదండ్రులు చేసిన ఆరోపణలను గిరిబాలా సింగ్ తోసిపుచ్చారు. తనకు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌కు ఆమె న్యాయ నేపథ్యంతో ఎలాంటి సంబంధం లేదని అన్నారు.

వరకట్నం, రిటైర్డ్ జడ్జ్, గృహహింస, అత్తింటి వేధింపులు

ఫొటో సోర్స్, Photo credit Twisha's family

ఫొటో క్యాప్షన్, త్విషా, సమర్థ్‌సింగ్ డేటింగ్ యాప్‌లో కలుసుకున్నారు.

అసలేం జరిగింది?

త్విషా శర్మ స్వస్థలం నోయిడా. ఆమె 2024లో ఒక డేటింగ్ యాప్ ద్వారా భోపాల్‌లో న్యాయవాది సమర్థ్ సింగ్‌ను కలిశారు. 2025 డిసెంబరులో వాళ్లిద్దరూ పెళ్లిచేసుకున్నారు.

పెళ్లి జరిగిన వెంటనే త్విషాకు, ఆమె అత్తమామలకు మధ్య గొడవలు మొదలయ్యాయని ఎఫ్‌ఐఆర్‌లో ఉంది.

పెళ్లి సమయంలో కట్నం ఇచ్చినా, ఆ పెళ్లి తమ 'స్థాయికి' తగినది కాదని తమను అస్తమానం ఎగతాళి చేసేవారని త్విషా కుటుంబం ఆరోపిస్తోంది.

పెళ్లి తర్వాత త్విషాకు చిన్న చిన్న ఖర్చుల కోసం కూడా డబ్బులు ఇచ్చేవాళ్లుకాదని, త్విషాకు కావాల్సిన డబ్బు ఆన్‌లైన్‌లో పంపేవారమని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

2026 ఏప్రిల్‌లో త్విషా గర్భందాల్చారు. ఆమె భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాల సింగ్ ఆమె క్యారెక్టర్‌పై అనుమానాలు వ్యక్తంచేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఒత్తిడి చేసి మే నెల మొదటి వారంలో త్విషాను బలవంతంగా అబార్షన్ చేయించుకునేలా చేశారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

కుటుంబ సభ్యుల కథనం ప్రకారం మే 12వ తేదీ రాత్రి దాదాపు 9:41 గంటల సమయంలో త్విషా తన తండ్రికి వాట్సాప్ కాల్ చేశారు.

త్విషా మాట్లాడుతుండగా వెనుక నుంచి ఆమె భర్త సమర్థ్ సింగ్ గొంతు వినిపించిందని, వెంటనే ఫోన్ కట్ అయిపోయిందని ఆమె తండ్రి నవ్‌నిధి శర్మ చెప్పారు.

ఆ తర్వాత దాదాపు 20 నిమిషాల పాటు నిరంతరాయంగా ఫోన్ చేస్తున్నా ఎవరూ సమాధానం ఇవ్వలేదని, కాసేపటి తర్వాత గిరిబాలా సింగ్ ఫోన్ తీసుకుని "ఆమె ఇక లేరు" అని అన్నారని నవ్‌నిధి శర్మ తెలిపారు.

త్విషాను ఆసుపత్రికి తరలించగా అక్కడ ఆమె మరణించారని వైద్యులు చెప్పినట్టు పోలీసులు తెలిపారు.

ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.

సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.