ఉత్తర కొరియా: 50 మీటర్ల ఈత కొలను, జారుడు బల్లలున్న ఆ విలాస నౌక ఎవరిది?

కిమ్ జోంగ్ ఉన్, ఉత్తర కొరియా, లగ్జరీ స్విమ్మింగ్ పూల్
ఫొటో క్యాప్షన్, నౌక డెక్‌పై 50 మీటర్ల పొడవైన స్విమ్మింగ్ పూల్ ఉంది
    • రచయిత, సోరమ్ చెయోన్, అఘ్నియా అడ్జ్‌కియా
    • హోదా, బీబీసీ కొరియన్, ఈస్ట్ ఆసియా విజువల్ జర్నలిజం
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

ఈ ఏడాది జులై నుంచి అక్టోబర్‌ మధ్య వరకు ఉత్తర కొరియాలోని వొన్సాన్‌ తీరంలో 80 మీటర్ల (263 అడుగుల) పొడవైన విలాసవంతమైన నౌక పలుమార్లు ఉపగ్రహ చిత్రాల్లో కనిపించింది.

ఆ నౌక డెక్‌పై ఉన్న 50 మీటర్ల పొడవైన స్విమ్మింగ్ పూల్ ప్రత్యేకంగా కనిపిస్తోంది. దానికి మరోవైపున వరుసగా నీటి జారుడు బల్లలు ఉన్నాయి.

మరమ్మతుల కేంద్రంలో నెలల తరబడి కదలకుండా ఉన్న ఈ నౌక, జులై ప్రారంభంలో కల్మా ద్వీపకల్పంగా పిలిచే తీరప్రాంత సమీప జలాల్లోకి చేరుకుంది.

ఈ ప్రాంతం సముద్ర తీర విహార కేంద్రంగా పేరొందిన వోన్సాన్‌కు సమీపంలో ఉంది. ఇక్కడ ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌, ఆయన కుటుంబం ఉపయోగించే విశాలమైన విల్లా ఉంది.

అయితే ఈ ప్రాంతంలో కదులుతూ కనిపించిన బారీ నౌక ఇదొక్కటే కాదు. బీబీసీ విశ్లేషించిన ఉపగ్రహ చిత్రాల్లో కిమ్‌ విల్లాకు సమీపంలో మరికొన్ని పెద్ద నౌకలు కూడా పలుమార్లు కనిపించాయి.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కిమ్ జోంగ్ ఉన్, ఉత్తర కొరియా, లగ్జరీ స్విమ్మింగ్ పూల్
ఫొటో క్యాప్షన్, 80 మీటర్ల పొడవున్న ఈ విలాసవంత నౌక డెక్‌పై 50 మీటర్ల పొడవైన ఈత కొలను ఉంది.

ఈ నౌకలను కిమ్‌, ఆయన కుటుంబ సభ్యులు ఉపయోగిస్తారనే విస్తృత అభిప్రాయం ఉంది. దేశ నాయకత్వంతో సంబంధం లేనివారు ఇంత పెద్ద నౌకలను సొంతం చేసుకోవడం లేదా స్వేచ్ఛగా ఉపయోగించడం కష్టమని ఉత్తర కొరియా మాజీ అధికారులు, ఆ దేశం నుంచి పారిపోయివచ్చినవారు, నిపుణులు చెబుతున్నారు.

"శీతాకాలంలో ఈ నౌకలను షిప్‌యార్డులో ఉంచేవారు. వేసవి రాగానే బయటకు తీసుకొచ్చి కిమ్‌ జోంగ్‌ ఉన్‌ విల్లా వద్దకు లేదా కల్మా ప్రాంతం వైపు తరలిస్తారు. అక్కడ ఈత, వినోద కార్యక్రమాల కోసం వాటిని ఉపయోగిస్తారు" అని రీ జోంగ్‌ హో తెలిపారు.

రీ గతంలో వర్కర్స్‌ పార్టీకి చెందిన ‘ఆఫీస్‌ 39’లో అధికారిగా పనిచేశారు. ఉత్తర కొరియా నాయకత్వం కోసం విదేశీ కరెన్సీని సమకూర్చడం, నిర్వహించడం లాంటి కార్యక్రమాల్లో ఈ విభాగం పాలుపంచుకుంటుందని భావిస్తున్నారు.

రహస్యంగా కార్యకలాపాలు నిర్వహించే ఉత్తర కొరియా నియంతృత్వ పాలనలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారి సంపద ఎంతన్నది అంచనా వేయడం ఎంత కష్టమో, ఆ దేశ ఆర్థిక గణాంకాలను కచ్చితంగా తెలుసుకోవడం కూడా అంతే కష్టం.

ఐక్యరాజ్యసమితితో పాటు ఇతర సంస్థలు అంచనాల ఆధారంగా ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో ఒకటిగా నిలుస్తున్న ఉత్తరకొరియా ప్రత్యేకంగా సైనిక వ్యయానికి భారీగా బడ్జెట్ కేటాయిస్తోంది. అందులో అంతర్జాతీయ ఆంక్షలకు గురైన అణ్వాయుధ కార్యక్రమం కూడా ఉంది.

ఉత్తర కొరియాలో అత్యధికులు "వ్యవస్థాగతంగా, విస్తృతంగా, తీవ్రంగా జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల" మధ్య జీవిస్తున్నారని 2025లో ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదిక తెలిపింది. ప్రజల జీవితాలపై ప్రభుత్వం పూర్తి నియంత్రణ కలిగి ఉండటం, బలవంతపు శ్రమ విస్తృతంగా కొనసాగడం, దీర్ఘకాలంగా వేధిస్తున్న ఆహార సమస్యలను ఈ నివేదిక ప్రస్తావించింది. ఆహార కొరత కారణంగా దేశంలో 40మందికి తగిన పోషకాహారం అందడం లేదని అంచనావేసింది.

అయితే, ఉత్తర కొరియా పాలకవర్గం విలాసవంతమైన జీవితం గడుపుతున్నారనేది తెలిసిన విషయమే.

50 , 55 , 60 , 80 మీటర్ల పొడవున్న నాలుగు నౌకలూ ఈ ఏడాది కిమ్‌ వోన్సాన్‌ విల్లా పరిసరాల్లో పలుమార్లు కనిపించాయి.
ఫొటో క్యాప్షన్, 50 , 55 , 60 , 80 మీటర్ల పొడవున్న నాలుగు నౌకలూ ఈ ఏడాది కిమ్‌ వోన్సాన్‌ విల్లా పరిసరాల్లో పలుమార్లు కనిపించాయి.

ఉపగ్రహ చిత్రాల్లో కనిపించిన నౌకల ధర ఎంతో తెలియదు.. అయితే, వీటితో పోల్చదగిన విలాసవంతమైన బోట్ల ధరలు కొన్ని 10 కోెట్ల డాలర్లకు పైగా ఉంటాయి. కానీ వీటితో పోలిస్తే చాలా చిన్నదైన 29 మీటర్ల ప్రిన్సెస్ యాట్ విలువల గతంలో సుమారు 7 మిలియన్ డాలర్లుగా అంచనా వేశారు.

నౌకలు ఉన్న ప్రదేశాలను బట్టి మాత్రమే కిమ్‌ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారో ఖచ్చితంగా నిర్థరించలేం. అయితే ఈ నౌకల కదలికలు, కిమ్‌ బహిరంగ కార్యక్రమాల్లో కనిపించని సమయాలతో సరిపోలుతున్నాయి. సాధారణంగా ప్రజలకు తెలియని కొన్ని కార్యకలాపాలను ఇవి చూపుతున్నాయి.

కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తన బాల్యంలో కొంతకాలం తల్లితో కలిసి వోన్సాన్‌లో గడిపినట్లు జీవిత చరిత్ర రచయితలు, నిఘా నివేదికలు చెబుతున్నాయి. ఆయన తండ్రి కిమ్‌ జోంగ్‌ ఇల్‌ పాలనా కాలం నుంచే ఈ నగరానికి కిమ్‌ కుటుంబంతో సంబంధం ఉందని ఒక నిపుణుడు బీబీసీకి తెలిపారు.

అప్పటి నాయకుడు కిమ్‌ జోంగ్‌ ఇల్‌ ఉపయోగించిన నివాసాలకు 1990ల నుంచి 2000ల ప్రారంభం వరకు 13 ఏళ్ల పాటు కాపలాగా పనిచేసి, ఉత్తర కొరియా నుంచి పారిపోయి వచ్చిన ఓ వ్యక్తి బీబీసీతో మాట్లాడారు. వోన్సాన్‌ పరిసరాల్లోని విల్లాలను ఉన్నత వర్గాలు విశ్రాంతి కోసం ఉపయోగించేవారని ఆయన చెప్పారు. వేసవి కాలంలో అక్కడ డజన్ల కొద్దీ పిల్లలు, యువకులు వాటర్‌ స్కీయింగ్‌ చేస్తుండటాన్ని తాను చూశానని గుర్తుచేసుకున్నారు.

కిమ్‌ సెలవులకు వెళ్లినట్లు ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా చాలా అరుదుగా వార్తలు ప్రచురిస్తుంది. అలాంటి పర్యటనలను కూడా అధికారిక తనిఖీలు లేదా మార్గదర్శకాలు ఇచ్చేందుకు చేసిన పర్యటనలుగా చూపిస్తుంది. అయితే బీబీసీతో మాట్లాడిన ఉత్తరకొరియా నుంచి పారిపోయి వచ్చిన వారికి కిమ్ కుటుంబం వోన్సాన్‌లో సెలవులు గడుపుతుందనే విషయం తెలిసినట్టు కనిపించింది. దీన్నిబట్టి కొంతమంది ఉత్తర కొరియన్లకు అయినా ఈ విషయం తెలిసి ఉండొచ్చని ఇది తెలుపుతోంది.

కిమ్ జోంగ్ ఉన్, ఉత్తర కొరియా, లగ్జరీ స్విమ్మింగ్ పూల్
ఫొటో క్యాప్షన్, ఉత్తర కొరియా ప్రజల్లో ఎక్కువమందికి సెలవుల్లో పర్యటనలకు వెళ్ళడం అరుదు.

వోన్సాన్‌లో ఎత్తైన హోటళ్లు, రెస్టారెంట్లు, దుకాణాలు, క్రీడా సదుపాయాలు, వాటర్‌ పార్కులు ఉన్నాయని, అక్కడ దాదాపు 20 వేల మంది సందర్శకులకు వసతి కల్పించే సామర్థ్యం ఉందని ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా చెబుతోంది.

2025 జులైలో ప్రారంభమైన వొన్సాన్‌ కల్మా రిసార్ట్‌ను సందర్శించిన కొద్దిమంది రష్యా పర్యాటకుల చిత్రాలను ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా, రష్యా వార్తా సంస్థలు ప్రచురించాయి. విదేశీ పర్యటులను ఆకర్షించేందుకు ఈ రిసార్ట్‌ను అభివృద్ధి చేసినప్పటికీ, స్థానిక పర్యాటకులకు కూడా అది అందుబాటులో ఉంది.

పేరు వెల్లడించని ఒక వ్యక్తిని ఉటంకిస్తూ దక్షిణ కొరియా వార్తా సంస్థ ప్రచురించిన కథనం మేరకు కొంతమంది స్థానికులకు సుమారు 100 డాలర్లకు నాలుగు రాత్రుల పర్యాటక ప్యాకేజీలను అందించారు. ఉత్తర కొరియాలోని అత్యధికులకు ఇది పెద్ద మొత్తమే. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం, 2024లో ఉత్తర కొరియా తలసరి జీడీపీ సుమారు 667 డాలర్లు మాత్రమే. అదే సమయంలో దక్షిణ కొరియా తలసరి జీడీపీ 36,227 డాలర్లుగా ఉంది.

ఉత్తర కొరియాలో అత్యధికులకు సెలవుల్లో పర్యటనలకు వెళ్ళడం అరుదు. అక్కడ మధ్యతరగతి వర్గం పెరుగుతున్నప్పటికీ, వారికి సెలవులను గడిపేందుకు ఎక్కువ సమయం దొరకకపోవచ్చు.

కార్మికులు, కార్యాలయ ఉద్యోగులు, సహకార వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసేవారికి చట్టప్రకారం ఏడాదికి 14 రోజుల సెలవులు పొందే హక్కు ఉందని, అయితే ఈ నిబంధనను చాలా అరుదుగా అమలు చేస్తారని ఉత్తర కొరియా నుంచి బయటపడినవారు బీబీసీకి తెలిపారు.

వరుసగా కొన్ని రోజులు సెలవు తీసుకుని ప్రయాణాలు చేయడం అక్కడ అసాధారణం. ప్రత్యేకంగా 'వేసవి సెలవులు' తీసుకోవడానికి బదులుగా, ప్రజలు సాధారణంగా వారాంతాల్లో చిన్న ప్రయాణాలకు లేదా జాతీయ సెలవు దినాల్లో విహారయాత్రలకు వెళ్తుంటారు.

సెలవులు మంజూరైనా ప్రయాణాలపై ఆంక్షలు ఉంటాయి. తమ నగరం లేదా కౌంటీ వెలుపలికి వెళ్లాలంటే అధికారుల అనుమతి తప్పనిసరి. స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్లగలగడం కూడా అక్కడ సెలవుల్లాగే ఒక లగ్జరీగా మారింది.

కిమ్ జోంగ్ ఉన్, ఉత్తర కొరియా, లగ్జరీ స్విమ్మింగ్ పూల్
ఫొటో క్యాప్షన్, 50 మీటర్ల నౌక పక్కన మరో నాలుగు చిన్న పడవలు ఉన్నట్లు ఉపగ్రహ చిత్రాల్లో కనిపించింది.

వోన్సాన్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో నాలుగు భారీ నౌకల కదలికలను బీబీసీ పరిశీలించింది.. వాటి పొడవులు సుమారు 50 , 55 , 60 , 80 మీటర్లుగా ఉన్నాయి. ఈ నాలుగు నౌకలూ ఈ ఏడాది కిమ్‌ వోన్సాన్‌ విల్లా పరిసరాల్లో పలుమార్లు కనిపించాయి.

వీటిలో అతిపెద్ద నౌక కదలికలు అత్యంత స్పష్టంగా కనిపించాయి. అది రేవు నుంచి బయలుదేరి కల్మా ద్వీపకల్పం సమీపంలోని జలాల్లోకి చేరింది. జులై నుంచి అది అక్కడే ఉంటోంది.

మిగతా రెండు నౌకలు, 50 మీటర్లు, 55 మీటర్ల పొడవున్నవి, ఆగస్టు చివరి వరకు వోన్సాన్‌కు సమీపంలోని తే, సిన్‌ దీవుల పరిసరాల్లో పలుమార్లు కనిపించాయి.

50 మీటర్ల నౌక పక్కన మరో నాలుగు చిన్న పడవలు ఉన్నట్లు ఉపగ్రహ చిత్రాల్లో కనిపించింది.

చిన్న పడవలు పెద్ద నౌకకు ప్రయాణికులు, ఇంధనం, ఇతర అవసరమైన సామగ్రిని చేరవేస్తున్నాయని ఉపగ్రహ చిత్రాల నిపుణుడు జియోంగ్‌ సియోంగ్‌ హక్‌ తెలిపారు. తే, సిన్‌ వంటి చిన్న దీవులు "ప్రజల దృష్టికి దూరంగా, గోప్యతను కాపాడుకోగల ఏకాంత సముద్రతీర విడిది ప్రాంతాలు"గా ఉపయోగపడతాయని ఆయన చెప్పారు.

60 మీటర్ల పొడవైన నౌక గత వారం వరకు కూడా కిమ్‌ వోన్సాన్‌ విల్లా సమీపంలో పలుమార్లు కనిపించింది.

ఈ నౌకలకు అధికారికంగా ఎవరు యజమానులన్న విషయాన్ని ఉత్తర కొరియా ఎప్పుడూ బహిరంగంగా వెల్లడించలేదు. అయితే, గతంలోని ఉపగ్రహ చిత్రాలను బీబీసీ విశ్లేషించగా, కిమ్‌ జోంగ్‌ ఇల్‌ పాలనలో ఉన్న 2002లో కూడా ఇవే ప్రత్యేక లక్షణాలు కలిగిన ఒక పెద్ద నౌక వోన్సాన్‌లో కనిపించింది.

ఉత్తర కొరియాను 2013లో సందర్శించిన మాజీ ఎన్‌బీఏ స్టార్‌ డెన్నిస్‌ రాడ్‌మన్‌ తన ఏడు రోజుల పర్యటనలో ఎక్కువ సమయం కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో కలిసి వోన్సాన్‌లో గడిపినట్లు 'ది సన్‌' పత్రికకు తెలిపారు. ఆ సమయంలో వారిద్దరూ జెట్‌ స్కీయింగ్‌, గుర్రపు స్వారీ చేశారు.

తాము ఉపయోగించిన 60 మీటర్ల నౌక ఒక ఫెర్రీకి, డిస్నీ బోటుకు మధ్యస్థంగా ఉండేదని కూడా ఆయన వివరించారు. అయితే, ఉపగ్రహ చిత్రాల్లో కనిపించిన 60 మీటర్ల నౌక అదేనా అన్నది స్పష్టంగా తెలియదు.

ఉత్తర కొరియాలోని అత్యధికులకు కిమ్‌ కుటుంబం, ఆ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచే వారు గడిపే జీవితం విలాసవంతమైనదిగానే కాకుండా ఊహించలేనిదిగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే,తన స్వప్రయోజనాలను పక్కనపెట్టే నిస్వార్థ నాయకుడిగా దేశమే ముందు అని చెప్పే ‘సుప్రీం లీడర్’ను చిత్రించడమే ప్రభుత్వ ప్రచార ప్రధాన ఉద్దేశం.

"నిజానికి కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ప్రజల నాయకుడిగా ఉండాలి. కానీ, సాధారణ ప్రజలు రోజుకు ఒక్క పూట భోజనం సంపాదించుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతుంటే, ఆయన వద్ద నాలుగు విలాసవంతమైన నౌకలు ఉన్నాయి" అని రి జోంగ్‌ హో అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)