You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బంగారం కొనొద్దని, కూరల్లో నూనె తక్కువగా వాడాలని ప్రధాని మోదీ ఎందుకన్నారు?
ఆదివారంనాడు తెలంగాణలో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశీ మారకద్రవ్యాన్ని పొదుపు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
దీనిని సాధించడానికి పలు మార్గాలను కూడా ఆయన వివరించారు.
హైదరాబాద్‌లో జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో ఆయన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తూ సికింద్రాబాద్‌లో బహిరంగ సభలో ప్రసంగించారు.
ఒక సంవత్సరం పాటు బంగారం కొనుగోలుకు దూరంగా ఉండాలని, అలాగే వంట నూనెల వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రధాని కోరారు.
అయితే, ప్రధాని మోదీ ప్రకటనను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి అత్యవసర చర్యలు తీసుకోవడానికి బదులు, భారాన్ని ప్రజలపైనే మోపుతున్నారని ప్రధానిపై కాంగ్రెస్ ఆరోపణలు చేసింది.
ప్రధాని ఏమన్నారంటే...
"ఒక పక్క యుద్ధం హోరెత్తుతోంది. మరోవైపు సప్లై చైన్‌లో అంతరం ఏర్పడింది. ఇది ప్రపంచం మొత్తంపై ప్రభావం చూపింది. భారతదేశంపై దీని ప్రభావం మరీ తీవ్రంగా ఉంది" అని ప్రధాని అన్నారు
‘‘భారతదేశంలో చమురు వనరులు ఎక్కువగా లేవు. మన అవసరాలకు కావలసిన పెట్రోల్, డీజిల్, గ్యాస్‌లను ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవలసి వస్తోంది. యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువుల ధరలు ఎన్నడూ లేనంత స్థాయికి చేరాయి. మన పొరుగుదేశాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో పత్రికలను చూస్తే అర్థమవుతుంది'' అని అన్నారు ప్రధాని.
‘‘యుద్ధం మొదలైన తర్వాత ఈ సంక్షోభం నుంచి దేశ పౌరులను కాపాడటానికి ప్రభుత్వం అవిశ్రాంతంగా ప్రయత్నిస్తోంది. ప్రజలపై అనవసర భారం పడకుండా చూసేందుకు, ఆ భారాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తోంది" అని మోదీ పేర్కొన్నారు.
"సప్లై చైన్ చుట్టూ నెలకొన్న సంక్షోభంఇలాగే కొనసాగితే, మనం ఎన్ని చర్యలు చేపట్టినా, ఇబ్బందులు పెరిగిపోతూనే ఉంటాయి. కాబట్టి, దేశాన్ని అన్నింటికంటే మిన్నగా భావిస్తూ, మనమందరం ఇప్పుడు ఏకతాటిపై నిలిచి, కలిసికట్టుగా పోరాడాలి. దేశభక్తి అంటే కేవలం దేశం కోసం ప్రాణాలర్పించడం మాత్రమే కాదు; దేశం కోసం జీవించడం, దేశంపట్ల మన విధులను నిర్వర్తించడం. అది కూడా దేశభక్తే అవుతుంది" అని అన్నారాయన.
"వంట నూనెల విషయంలోనూ పరిస్థితి ఇంచుమించు అలాగే ఉంది. వాటిని దిగుమతి చేసుకోవడానికి భారీ మొత్తంలో విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించాల్సి వస్తోంది. మన రోజువారీ వంటకాల్లో నూనె వినియోగాన్ని కాస్త తగ్గించుకున్నా మంచిదే. అది కూడా ఒక దేశభక్తి చర్యే అవుతుంది. ఇది దేశ ఖజానా ఆరోగ్యంతో పాటు, మన కుటుంబాల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది" అన్నారు ప్రధాని.
విదేశీ మారక ద్రవ్యాన్ని పొదుపు చేయడానికి అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకోవాలని ప్రధాని సూచించారు.
"బంగారం కొనడం విదేశీ మారక ద్రవ్యం భారీగా ఖర్చయ్యే మరొక రంగం. ఒకప్పుడు, క్లిష్ట సమయాల్లో దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రజలు తమ బంగారాన్ని విరాళంగా ఇచ్చిన సందర్భాలు ఉండేవి. ఇప్పుడు అటువంటి విరాళాల అవసరం లేకపోయినప్పటికీ, దేశ హితం కోసం మనం ఒక సంకల్పం చేసుకోవాలి. రాబోయే ఏడాదిపాటు, కుటుంబంలో ఎటువంటి శుభకార్యాలు, వేడుకలు ఉన్నా, మనం బంగారు ఆభరణాలను కొనవద్దని నిర్ణయించుకోవాలి" అన్నారు మోదీ.
''మన దేశభక్తిని నిరూపించుకునేందుకు విదేశీ మారక ద్రవ్యాన్ని పొదుపు చేయడం ఒక సవాల్. దాన్ని మనం స్వీకరించి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయాలి'' అన్నారాయన.
ప్రధాని వ్యాఖ్యలను ఖంచించిన కాంగ్రెస్
ఇరాన్-అమెరికా ఘర్షణ మొదలై నెలలు గడిచినా, భారతదేశ ఇంధన భద్రతను ఎలా మేనేజ్ చేయాలో ప్రధాని మోదీ ఇప్పటికీ గ్రహించలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ విమర్శించారు.
ప్రధానమంత్రి వ్యాఖ్యలపై ఎక్స్‌లో స్పందించిన ఆయన "ఈ ప్రపంచ సంక్షోభం నుండి మన ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి ఒక ఎమర్జెన్సీ ప్లాన్ ప్రకటించడానికి బదులుగా, ప్రధాని సామాన్య పౌరులను కష్టాలకు గురిచేయడం సిగ్గుచేటు, బాధ్యతారాహిత్యం, పూర్తిగా అనైతికం" అని వ్యాఖ్యానించారు.
"ఎన్నికలు, నీచ రాజకీయాలే ప్రధాని ఏకైక ప్రాధాన్యతగా మారినప్పుడు, దాని అంతిమ ఫలితం రాబోయే ఆర్థిక విపత్తు" అని ఆయన అన్నారు.
"మనకు తగినంత ఇంధన నిల్వలు ఉండేలా, మీ పేలవమైన ప్రణాళిక కారణంగా ఏ పౌరుడూ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవలసి రాకుండా చూసేందుకు ప్రధాని, ఆయన ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలను చేపట్టాలి" అని వేణుగోపాల్ డిమాండ్ చేశారు.
ధరలపై యుద్ధం ప్రభావం
అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య నెలకొన్న సంఘర్షణ నేపథ్యంలో, స్టాక్ మార్కెట్ నుంచి ముడి చమురు, బంగారం, వెండి, రూపాయి వరకు అన్ని రంగాలలో తీవ్రమైన అస్థిరత కనిపిస్తోంది.
2025లోనే బంగారం ధరలలో చరిత్రాత్మక పెరుగుదల కనిపించింది. బంగారం విలువ 60 శాతానికి పైగా పెరిగింది.
బంగారం ధరలలో ఈ పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నప్పటికీ, అవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి.
యుద్ధం కారణంగా ఏర్పడిన అస్థిర పరిస్థితులను తట్టుకునేందుకు పెట్టుబడిదారులు సంప్రదాయ ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి మొగ్గు చూపుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో అమెరికా డాలర్‌పై ఆధారపడటం తగ్గుతుండగా, బంగారంపై ఆధారపడటం పెరుగుతోంది.
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ విధానాల వల్ల స్టాక్ మార్కెట్ అనేక ఎదురుదెబ్బలు తిన్నది. ఫలితంగా, పెట్టుబడిదారులు ఇప్పుడు బంగారం, వెండి వంటి విలువైన లోహాలలోకి తమ పెట్టుబడులను మళ్లిస్తున్నారు.
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్టు చేయాలన్న అమెరికా నిర్ణయం తరువాత బంగారం ధరలు పెరిగాయి. అంతేకాకుండా, గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలన్న ఆలోచనను కూడా ట్రంప్ ముందుకు తెచ్చారు.
బంగారం ధరల పెరుగుదల వెనుక ఉన్న అత్యంత ముఖ్యమైన కారకాలలో మరొక అంశం కేంద్ర బ్యాంకుల భారీ కొనుగోళ్లు. ఈ ధోరణి 2022 నుండి క్రమంగా ఊపందుకుని, 2025లో మరింత వేగవంతమై, బంగారం ధరలను రికార్డు స్థాయికి చేర్చింది.
చైనా, పోలండ్, తుర్కియే, భారత్, కజకిస్తాన్ మొదలైన దేశాల కేంద్ర బ్యాంకులు తమ బంగారు నిల్వలను బాగాచుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అమెరికా డాలర్ ఆధిపత్యం క్షీణిస్తుండటమే ఈ చర్యలకు కారణం. ఈ మార్పు బంగారం ధరలపై కూడా స్పష్టమైన ప్రభావాన్ని చూపింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)