‘లెక్కలేనన్ని వజ్రాలు వెలుగులు విరజిమ్ముతుండేవి'.. సోమనాథ్ ఆలయం గురించి చరిత్రకారులు ఏం రాశారు?

    • రచయిత, త్రిభువన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 7 నిమిషాలు

గుజరాత్‌లోని ప్రభాస్ పాటన్‌లో ఉన్న సోమనాథ్ ఆలయంలో మే 11న జరిగిన సోమనాథ్ అమృత్ మహోత్సవ్‌లో ప్రధానమంత్రి మోదీ పాల్గొన్నారు.

సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ జరిగి 75ఏళ్లు పూర్తైన సందర్భంగా మోదీ ఆలయంలో మహా పూజ, కుంభాభిషేకం నిర్వహించారు.

భారత దేశపు అచంచల విశ్వాసానికి, నాగరికత కొనసాగింపుకు సోమనాథ్ ఆలయం ప్రతీక అని మోదీ అభివర్ణించారు.

సోమనాథ్ ఆలయ చరిత్ర కేవలం విధ్వంసానికి సంబంధించినది మాత్రమే కాదని, అది విధ్వంసానంతర పునర్నిర్మాణం, పునరుజ్జీవనం పొందే భారతీయ చైతన్యపు ఇతిహాస గాథ అని మోదీ అన్నారు.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ చొరవతో పునర్‌ నిర్మితమైన సోమనాథ ఆలయాన్ని 1951 మే 11న అప్పటి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు.

సోమనాథ్ ఆలయం "సంపన్నమైనది, ఊహించలేనిది, సాటిలేనిదని" భారతీయ చరిత్రకారులే కాకుండా అరబ్ చరిత్రకారులు కూడా అభివర్ణించారు.

"ఓడరేవు కావడం వల్లనే సోమనాథ్‌కు అంత గుర్తింపు వచ్చింది. తూర్పు ఆఫ్రికా, చైనాతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి వాణిజ్యనౌకలు ఇక్కడ లంగరు వేస్తాయి" అని ప్రసిద్ధ చరిత్రకారుడు అల్ బిరూనీ 'తహఖీక్ - ఏ- హింద్' గ్రంథంలో రాశారు.

ప్రముఖ నవలా రచయిత చతుర్సేన్ శాస్త్రి తను రచించిన 'సోమనాథ్ మహాలయ’ పుస్తకంలో ‘‘కీర్తిప్రతిష్ఠలతో విరాజిల్లిన సోమనాథుని మహా ఆలయ అలౌకిక వైభవం ఉత్తరాన బదరీకాశ్రమం నుంచి దక్షిణాన సేతుబంధ రామేశ్వరం వరకు, కన్యాకుమారి నుంచి బెంగాల్ వరకు ప్రసిద్ధి చెందింది" అని రాశారు.

‘‘ఆలయ ప్రాంగణంలోని రంగమండపం 600 స్తంభాలపై నిలిచి ఉండేది. అందులోంచి ఏకకాలంలో పదివేలమందికిపైగా సోమనాథుడిని దర్శించుకునేవారు’’ ప్రఖ్యాత చరిత్రకారిణి రోమిల్లా థాపర్ తన "సోమనాథ్: ది మెనీ వాయిసెస్ ఆఫ్ హిస్టరీ" అనే గ్రంథంలో రాశారు.

చుట్టూ చీకటి ఆవరించిన మండపంలో జ్యోతిర్లింగం ఉండేది. కానీ ‘‘అక్కడున్న లెక్కలేనన్ని స్వచ్ఛమైన విలువైన వజ్రాలు, రత్నాలు వెలుగులు విరజిమ్మతుండేవి’’అని ప్రఖ్యాత పర్షియన్ చరిత్రకారుడు ఫిరిష్టా తన 'తారిఖ్-ఎ-ఫిరిష్టా'లో రాశారు.

‘‘సోమనాథ్‌లోని జ్యోతిర్లింగం ఐదు గజాల ఎత్తు ఉండేది. ఒక చిన్న బంగారు నిచ్చెన ఎక్కి లింగానికి అభిషేకం, అలంకరణ చేసేవారు. ఇక్కడ 200 మణుగులు( ఒక మణుగుకి 40 కేజీలు) బరువున్న బంగారు గొలుసు ఉండేది. దానికి గంటలు కట్టి ఉండేవి. పూజారులు రాకపోకలు సాగించినప్పుడు అవి మోగేవని’’ థాపర్ రాశారు.

అక్కడ ఒకప్పుడు పెద్ద జాతర జరిగేది

ప్రతీ ఏటా శ్రావణ పౌర్ణమి, శివరాత్రి, సూర్యచంద్ర గ్రహణాల రోజున మహాలయలో పెద్ద జాతర జరిగేది. ఈ జాతరకు హిమాలయాల నుంచి శ్రీలంక దాకా యాత్రికులు వచ్చేవారు. జాతరలో 5 నుంచి 7 లక్షల మంది పాల్గొనేవారని చరిత్రకారుడు చతుర్సేన్ రాశారు.

మరో చరిత్రకారుడు ఫిరిష్తా రాసిన దాని ప్రకారం సోమనాథ్ వైభవం గురించి విన్న గజినీ మహమూద్ దాన్ని దోచుకోవడానికి 30వేల మంది సైనికులతో బయల్దేరాడు. 20వేల ఒంటెలు నెలల తరబడి తినేందుకు అవసరమైన ధాన్యం, నీటిని తీసుకొచ్చాడు.

సోమనాథ్ చరిత్ర నిరంతరాయంగా ఒకేలా కొనసాగలేదని రోమిల్లా థాపర్ తన "సోమనాథ్: ది మెనీ వాయిసెస్ ఆఫ్ హిస్టరీ" పుస్తకంలో రాశారు.

ఈ ఆలయాన్ని అనేక సార్లు ధ్వంసం చేశారు. ధ్వంసమైన ప్రతీసారి తిరిగి నిర్మించారు. పునర్నిర్మించిన ప్రతీసారి దాని ఆర్థం మారుతూ వచ్చింది.

భారత చరిత్రలో దేవాలయాల విధ్వంసం కేవలం మత విద్వేషానికి మాత్రమే కాకుండా అధికార ప్రదర్శన, దోపిడీ, ఆధిపత్యంతో ముడిపడి ఉంది.

సోమనాథ్ కేవలం హిందువుల గుర్తింపుపై గాయం లేదా ఇస్లామిక్ దండయాత్రకు చిహ్నం మాత్రమే కాదని, ఆ రెండింటి కంటే చాలా సంక్లిష్టమైన చారిత్రక ప్రదేశమని థాపర్, ఇంకా మరి కొందరు చరిత్రకారులు నమ్ముతారు.

సంక్లిష్ట చారిత్రక ప్రదేశం

"మొహమ్మద్ గజనీకి మత విశ్వాసాల కంటే పోరాటాల మీదనే ఎక్కువ ఆసక్తి ఉంది. ఇతర విజేతల మాదిరిగానే ఆయన కూడా తన దండయాత్రల కోసం మతం పేరు ఉపయోగించుకున్నాడు. మతాన్ని దుర్వినియోగం చేశాడు" అని మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1942 నుంచి 1945 మధ్య అహ్మద్ నగర్ జైలులో ఉన్నప్పుడు రాసిన ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ పుస్తకంలో రాశారు.

గజనీకి భారత్ అనేది సంపద, వస్తువులను దోచుకునే ప్రదేశం మాత్రమే. ఆయన భారత్‌లో సైన్యాన్ని ఏర్పాటు చేసి తన ప్రసిద్ధ సేనాపతులలో ఒకరు, హిందువు అయిన తిలక్‌ అధీనంలో ఉంచారని నెహ్రూ తన పుస్తకంలో వివరించారు.

సోమనాథ్ నిజానికి 'ఒకే కథ' కాదు. అది 'అనేక స్వరాల' సమాహారం. సంస్కృత శాసనాలు, పర్షియన్ చరిత్ర, జైన గ్రంథాలు, వలసవాద పత్రాలు, ఆధునిక జాతీయవాద కథనాలు. ఇలా ప్రతీ శకం సోమనాథ్‌ను తన శైలిలో వ్యాఖ్యానించింది.

మేథోపరమైన చర్చలతో పాటు హిందీ సాహిత్యం కూడా సోమనాథ్‌ను భావోద్వేగ, జాతీయవాద చిహ్నంగా తీర్చిదిద్దింది.

ఆచార్య చతుర్సేన్ రచించిన సోమనాథ్ మహాలయ, కన్హయ్యలాల్ మాణిక్‌లాల్ మున్షీ రచించిన ‘‘జై సోమనాథ్’’ నవలలు స్వాతంత్య్రానికి ముందు, తర్వాత భారత్‌లో ప్రజాదరణ పొందాయి.

"జై సోమనాథ్" నవలలో మున్షీ ఈ ఆలయం "జాతీయ ఆత్మగౌరవ" పునరుజ్జీవానికి ప్రతీకగా అభివర్ణించారు.

సోమనాథ్ మహాలయ.. చరిత్రకు- ఊహకు మధ్య వారధిగా నిలుస్తుంది. ఇక్కడ విధ్వంసం కేవలం రాళ్లమీదే కాదు, నాగరికత చైతన్యం మీద కూడా జరిగింది.

ఈ నవలలు సోమనాథ్‌ను ప్రజల మనస్సులలో ఒక భావోద్వేగ గాథగా మార్చాయి. తర్వాతి కాలంలో ఆ గాథ రాజకీయ వ్యవహారాల్లో భాగంగా మారింది.

"పౌరోహిత్యం, విగ్రహారాధన అన్నింటినీ సర్వనాశనం చేశాయి. రాజు, ఆయన సైన్యం గజనీని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, పురోహితులు ఇది అష్టమ చంద్రుడు అని, దాడికి సరైన సమయం కాదని చెప్పారు" అని దయానంద సరస్వతి 'సత్యార్థ ప్రకాశిక' గ్రంథంలోని పదకొండో అధ్యాయంలో రాశారు.

సోమనాథ్ దోపిడీకి గురైన విషయంలో గజనీ కంటే మూఢ నమ్మకాలనే దయానంద సరస్వతి ఎక్కువగా నిందించారు. ఆక్రమణదారులను ఎదుర్కోవడానికి ఆ కాలంలో సైనిక పరాక్రమంపై దృష్టి పెట్టకుండా, ఆలయాలలో పూజలు చేయడమే దేశ పతనానికి దారి తీసిందని ఆయన ఆరోపించారు.

సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం

సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణంలో అత్యంత కీలకమైన అధ్యాయం స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగింది. ఇక్కడే చారిత్రక సత్యాలు, రాజకీయాలు ఘర్షణ పడ్డాయి.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నాటి కేంద్ర హోంమంత్రి వల్లబ్‌భాయ్ పటేల్, గుజరాత్ నాయకులు సోమనాథ్ పునర్నిర్మాణం సాంస్కృతిక, ఆత్మ విశ్వాస పునరుద్దరణకు ప్రతీకగా నిలుస్తుందని భావించారు.

అయితే వారి ఆలోచనకు విరుద్ధంగా, మహాత్మా గాంధీ సలహా మేరకు ప్రధానమంత్రి నెహ్రూ ట్రస్ట్ ద్వారా దీనిని పూర్తి చేయాలనే ఆలోచనకు మద్దతిచ్చారు. ఇక్కడి వరకు ఎలాంటి వివాదం లేదు.

అయితే దేశ విభజన గాయం నుంచి కోలుకుంటున్న సమయంలో ప్రభుత్వం మతపరమైన కట్టడాలకు దూరంగా ఉండాలని నెహ్రూ తన లేఖలు, అధికారిక సందేశాలలో పదే పదే వ్యక్తం చేశారు.

ప్రజా ధనాన్ని, ప్రభుత్వ చిహ్నాలను ఉపయోగించడాన్ని నెహ్రూ వ్యతిరేకించారని చరిత్రకారులు, రికార్డులు చెబుతున్నాయి.

భారత్ లౌకిక, గణతంత్ర రాజ్యంగా రూపు దిద్దుకుంటోందని ప్రభుత్వ నిధులతో ఆలయాల నిర్మాణం ప్రమాదకరమైన సంప్రదాయానికి దారి తీయవచ్చని ఆయన వాదించారు.

1951లో సోమనాథ్ ఆలయ ప్రారంభోత్సవానికి నాటి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ హాజరు కావడం వివాదంగా మారింది. దీనిని నెహ్రూ స్పష్టంగా వ్యతిరేకించారు. అయితే రాజేంద్ర ప్రసాద్ అది తన వ్యక్తిగత విశ్వాసం, సాంస్కృతిక వారసత్వానికి చెందిన విషయమని చెప్పారు.

నెహ్రూ లౌకికవాద ఆందోళనలు, పటేల్, రాజేంద్ర ప్రసాద్ సాంస్కృతిక పునరుద్దరణకు మధ్య చెలరేగిన ఘర్షణ భారత రాజకీయ చరిత్రలో నిశ్శబ్ద అధ్యాయంగా నిలిచింది.

ఈ సమస్య తెరపైకి వచ్చినప్పుడల్లా ఒక పక్షాన్ని జాతీయ వాది అని మరో పక్షాన్ని దేశ వ్యతిరేకి అని చెబుతుంటారు. అయితే చరిత్ర అటువంటి సూటి విభజనను అనుమతించదు.

బ్రిటిష్ చరిత్రకారులేం చెప్పారు?

బ్రిటిష్ పాలకులు సోమనాథ్ విషయంలో ఓ భిన్నమైన కథనాన్ని, భాషను సృష్టించారు.

సోమనాథ్ ఆలయ విధ్వంసం, గజినీ క్రూరత్వాన్ని సమాజంలో బలంగా నాటడం వెనుక అప్పటి బ్రిటిష్ వలసవాద రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయని, ఇది కేవలం చరిత్ర మాత్రమే కాదని, రాజకీయ ఎత్తుగడని అమెరికన్ చరిత్రకారుడు రిచర్డ్ ఎం. ఈటన్ వాదన.

బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ ఎలెన్ బరో 1842లో ఓ ఆసక్తికర విషయాన్ని తెరపైకి తెచ్చారు. గజినీ నుంచి కొన్ని ద్వారాలను తీసుకువచ్చి అవి సోమనాథ్ ఆలయ తలుపులని ప్రకటించారు. ఆ ద్వారాలను తిరిగి భారత్‌కు తీసుకురావడం అంటే 800 ఏళ్ల కిందట జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడమేనని ఆయన చెప్పారు.

ఎలెన్‌బరో చేసిన ఈ ప్రకటనతో సోమనాథ్ ఆలయం ఒక్కసారిగా భారత్‌కు ‘జాతీయ అవమానానికి’ ప్రతీకగా మారగా, గజినీని నాగరికతలకు శత్రువుగా చిత్రీకరించారంటారు ఈటన్.

ఈ ప్రచారం ఎంత శక్తిమంతంగా పనిచేసిందంటే భారత్, పాకిస్తాన్ రెండూ కూడా ఈ కథనాన్ని తమ రాజకీయ అవసరాలకు అనుగుణంగా వాడుకున్నాయని ఈటన్ చెప్పారు .

సోమనాథ్ అంశం కేవలం 1026లో జరిగిన దండయాత్రకు మాత్రమే పరిమితం కాలేదు. ఇది 19, 20 శతాబ్దాల్లో రాజకీయంగా ఎలా గుర్తుపెట్టుకోవాలో నిర్ణయించే ఒక సాధనంగా మారింది. సోమనాథ్ ఆలయ ద్వారాలు భారత రాజకీయాల్లో పదేపదే గుర్తుకు వచ్చే ఓ అంశంగా మారిపోయింది.

గజినీ క్రీస్తుశకం 1026లో ఆలయ ద్వారాలను తనతోపాటు తీసుకువెళ్లినప్పుడు అది కేవలం చెక్క తలుపులను తీసుకువెళ్లడమే కాదు ఓ నాగరికతను అవమానించిన ప్రతిధ్వనిని కూడా తీసుకువెళ్లారు. మళ్లీ 800 ఏళ్ల తరువాత 1842లో అఫ్గన్ యుద్ధంలో గెలిచిన బ్రిటిష్ సైన్యం ఆ ద్వారాలను తిరిగి తెచ్చింది.

గవర్నర్-జనరల్ లార్డ్ ఎల్లెన్‌బరో దీనిని చాలా నాటకీయంగా,సెంటిమెంట్‌తో కూడిన విజయంగా ప్రపంచానికి చూపించారు.

ఎలెన్‌బరో చేసిన ఈ నాటకీయ చర్యకు లండన్‌లోని బ్రిటిష్ పాలకులు ఆయన్ని మందలించారు. 1843లో థామస్ మెకాలే చేసిన ప్రసంగంలో (స్పీచెస్ బై లార్డ్ మెకాలే - జీఎం యంగ్) ‘‘హిందూ సంప్రదాయాలను ఒక సాదాసీదా జానపద కథలాగా, ఇస్లాంను మనకు తెలిసిన మరొక మతంలా చూశారు’’ అని ఆక్షేపించారు.

ప్రజలు తమ జ్ఞాపకాలలో దేనిని గుర్తుంచుకోవాలి, దేన్ని మరిచిపోవాలో నిర్ణయించాలని చూసిన బ్రిటిష్ వారి వలసవాద మనస్తత్వానికి 'ది రిటర్న్ ఆఫ్ ది సోమనాథ్ గేట్స్’ ఓ నిదర్శనంగా నిలిచిపోయింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)