You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కోడి కాళ్లు తినొచ్చా? ఏమేం పోషకాలు ఉంటాయి
- రచయిత, సిరాజ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 6 నిమిషాలు
చికెన్ కొనడానికి షాప్‌కి వెళ్లినప్పుడు సాధారణంగా లివర్ వద్దు, చికెన్ మెడ భాగం వద్దు, లేదా లెగ్ పీస్ కావాలి, బ్రెస్ట్ పార్ట్ కావాలి అని అడుగుతుంటారు కొందరు.
కానీ కోడి కాళ్లను తినడం కూడా అవసరమేనా అని ఆలోచించి ఉండకపోవచ్చు. కోడి ఈకలు, చర్మం లాగే కాళ్లు కూడా వ్యర్థమని చాలామంది అనుకుంటారు.
అయితే, సింగపూర్‌లో కోడి కాళ్ల ధర కిలోగ్రాముకు 3.70 సింగపుర్ డాలర్లు (సుమారు రూ. 277.5). అలాగే దక్షిణ ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలు, మెక్సికోలో కోడి మాంసం కంటే చికెన్ కాళ్ల ధర ఎక్కువగా ఉంటుంది.
ప్రపంచవ్యాప్తంగా కోడి కాళ్లకు భారీ డిమాండ్ ఉంది. వియత్నాం, చైనా, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాలు ఆహార అవసరాల కోసం పెద్ద మొత్తంలో కోడి కాళ్లను దిగుమతి చేసుకుంటాయి. 2022లో చైనాకు సుమారు 1,33,700 టన్నుల కోడి కాళ్లను అమెరికా ఎగుమతి చేసింది .
వ్యర్థాలుగా భావించి పారేసే కోడి కాళ్లకు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ఇంత విలువ ఎందుకు ఉంది? వాటిలో ఉన్న పోషక విలువలు ఏమిటి?
పోషకాలు
అనేక దేశాల్లో కోడి కాళ్లను వ్యర్థంగా పరిగణించినప్పటికీ, ముఖ్యమైన పోషకాలు, ప్రయోజనకరమైన ఆరోగ్య గుణాలు వాటిలో ఉన్నాయని అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్‌కు చెందిన ఒక పరిశోధన వ్యాసం తెలిపింది.
ప్రపంచంలోనే అతిపెద్ద బ్రాయిలర్ కోళ్ల పరిశ్రమ అమెరికాలో ఉంది.
అక్కడి ఉత్పత్తిలో సుమారు 15% ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది. ఈ ఎగుమతుల్లో చికెన్ కాళ్లు ముఖ్యమైనవి.
"చికెన్ కాళ్ల రుచి దాదాపు 'చికెన్ వింగ్స్' లాగే ఉంటుంది. ఇందులో మాంసం తక్కువగా ఉంటుంది, కానీ రుచిగా ఉంటుంది. చైనా, దక్షిణ ఆఫ్రికా, పోర్చుగల్ వంటి దేశాల్లో చాలా సాధారణంగా తింటారు. దీన్ని కేవలం 20 నిమిషాల్లోనే వండేయొచ్చు" అని ఇంగ్లండ్‌కు చెందిన ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు ఆండ్రోస్ టౌన్‌సెండ్ బీబీసీతో అన్నారు.
కోడి కాళ్లు చర్మం, ఎముకలు, కండరాలతో నిర్మితమై ఉంటాయి. వాటి నిర్మాణంలో సుమారు 30-35% కొల్లాజెన్ ఉంటుందని ఒక అధ్యయనం పేర్కొంది.
కోడి కాళ్లలో కేలరీలు, ప్రోటీన్, కొవ్వు, కార్బోహైడ్రేట్లు, అలాగే కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ ఎ, ఫోలేట్ (విటమిన్ బి9) వంటి పోషకాలు కూడా ఉంటాయి.
"కోడి కాళ్లలోని మొత్తం ప్రోటీన్‌లో దాదాపు 70% కొల్లాజెన్ ఉంటుంది" అని చెన్నైకి చెందిన క్లినికల్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ శ్రీ విద్య అంటున్నారు. కొల్లాజెన్ అనేది మానవ శరీరంలో సమృద్ధిగా లభించే ఒక ప్రోటీన్.
ఇది ముఖ్యంగా ఈ భాగాల్లో ఉంటుంది:
- చర్మం
- ఎముకలు
- ఎముకను, కండరాలను కలిపి ఉంచే స్నాయువులు
- కార్టిలేజ్(మృదులాస్థి)
- లిగమెంట్స్(ఎముకను, ఎముకను కలిపి ఉంచే స్నాయువులు)
అయితే వయస్సు పెరుగుతున్న కొద్దీ, శరీరంలో సహజంగా కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గిపోతుంది.
"కోడి కాళ్లలో ఉన్న కొల్లాజెన్‌ను మన శరీరం సులభంగా గ్రహిస్తుంది. చర్మం, ఎముకల ఆరోగ్యానికి కొల్లాజెన్ చాలా ముఖ్యం" అని డాక్టర్ శ్రీ విద్య అన్నారు.
"వయసు పెరిగే కొద్దీ శరీరం కొల్లాజెన్‌ను తక్కువగా ఉత్పత్తి చేస్తుంది, దీనివల్ల చర్మం పొడిబారతుంది, ముడతలు పడుతుంది. ఇది కీళ్ళు, ఎముకల ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది" అని ఆమె వివరించారు.
కోడి కాళ్లలో సమృద్ధిగా ఉండే కొల్లాజెన్, జెెలటిన్‌వంటివి చర్మం, కీళ్లు, పేగుల ఆరోగ్యానికి ఉపయోగకరమని ఆమె పేర్కొన్నారు.
కీళ్లవాతం ఉన్న వ్యక్తులపై నిర్వహించిన అధ్యయనాల సమీక్షలో కొల్లాజెన్ తీసుకోవడంతో కీళ్ల బిగుతు తగ్గినట్లు గుర్తించారు.
"కోడి కాళ్లలోని ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు కండరాల, జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడతాయి" అని శ్రీ విద్య చెప్పారు.
ఎలా తినాలి?
"కోడి కాళ్లపై మట్టి, విసర్జన అవశేషాలు, ఫారమ్‌లోని ఇతర మలినాలు ఉండే అవకాశం ఉంది. సరిగా శుభ్రం చేయకుండా తింటే బ్యాక్టీరియా సంక్రమణ ప్రమాదం పెరుగుతుంది" అని డాక్టర్ శ్రీ విద్య హెచ్చరిస్తున్నారు.
"బాగా కడగడమే కాకుండా, పై చర్మాన్ని తీసివేసి, సరైన ఉష్ణోగ్రత వద్ద ఉడికించడం కూడా ముఖ్యం. సరిగ్గా ఉడకని కోడి కాళ్లలో సాల్మొనెల్లా, క్యాంపిలోబాక్టర్ వంటి బ్యాక్టీరియా ఉండవచ్చు" అని ఆమె అన్నారు.
గొర్రె, మేక కాళ్లలాగే కోడి కాళ్ళను కూడా సూప్‌లా తీసుకుంటే మంచిదని ఇండోనేసియా ప్రభుత్వ ఐపీపీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ ఓనో సుపర్నో తన వ్యాసంలో రాశారు.
"కోడి కాళ్లలోని కొల్లాజెన్, జెలటిన్ శరీరం సులభంగా గ్రహించేలా వండాలి కాబట్టి, వాటిని సూప్‌గా తయారు చేయడం ఉత్తమం. కూర లేదా గ్రేవీ రూపంలో కూడా తీసుకోవచ్చు. కానీ వేయించి తినొద్దు" అని డాక్టర్ శ్రీ విద్య సూచిస్తున్నారు.
"వేయించిన కోడి కాళ్లు ఆరోగ్యానికి మంచివి కావు. వాటిలో సంతృప్త కొవ్వు, ట్రాన్స్ ఫ్యాట్స్, సోడియం అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి మంచివి కావు. గుండెకు ప్రమాదకరం కావచ్చు" అని ఆమె అన్నారు.
కోడి మాంసమా? కోడి కాళ్లా?
"కోడి మాంసంతో పోలిస్తే కోడి కాళ్ళలో సాధారణంగా ప్రోటీన్ తక్కువగా ఉంటుంది. కానీ వాటిలో కేలరీలు, కొవ్వు ఎక్కువగా ఉంటాయి. ఇది గుర్తుంచుకోవాలి" అని ఈరోడ్‌కు చెందిన డైటీషియన్ డాక్టర్ అరుణ్ కుమార్ అంటున్నారు.
"ఉదాహరణకు 100 గ్రాముల చికెన్ బ్రెస్ట్‌లో 160 కేలరీలు, 25 నుంచి 27 గ్రాముల ప్రోటీన్, 3 నుంచి 5 గ్రాముల కొవ్వు ఉంటాయి. కానీ 100 గ్రాముల చికెన్ లెగ్స్‌లో 200 నుంచి 220 కేలరీలు, 15-17 గ్రాముల ప్రోటీన్, 14 నుంచి 15 గ్రాముల కొవ్వు ఉంటాయి" అని ఆయన పేర్కొన్నారు.
కోడి కాళ్లలో కొల్లాజెన్, జెలటిన్‌తో పాటు గ్లైసిన్, ప్రోలిన్ వంటి అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయని, కోడి లేదా మాంసంలోని ఇతర భాగాలతో పోలిస్తే ఇవే కోడి కాళ్లను ప్రత్యేకంగా నిలుపుతాయని అరుణ్‌కుమార్ అంటున్నారు.
"కానీ ఈ కొల్లాజెన్ మన శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే కొల్లాజెన్‌కు ప్రత్యామ్నాయం కాదు. అంటే కోడి కాళ్ల నుంచి లభించే కొల్లాజెన్ నేరుగా మన పాదాలకు లేదా కీళ్లకు వెళ్లదు. మనం తినే అన్నిరకాల ప్రోటీన్లు జీర్ణాశయంలో అమైనో ఆమ్లాలుగా మారి, రక్తంలో కలుస్తాయి. తర్వాత ఆ అమైనో ఆమ్లాలను ఉపయోగించి మన శరీరం కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేస్తుంది" అని ఆయన అన్నారు.
కేవలం కొల్లాజెన్ మాత్రమే కాకుండా, మంచి ప్రోటీన్ ఆహారాన్ని కూడా తీసుకోవాలని అరుణ్‌కుమార్ సూచిస్తున్నారు.
"మన శరీరంలోని కొల్లాజన్ బలపడాలంటే కేవలం మేక కాళ్ల సూప్ లేదా కోడి కాళ్ల సూప్ మాత్రమే సరిపోవు. దీనికి విటమిన్ సి, జింక్ అధికంగా ఉండే ఆహారాలు, ప్రోటీన్లు, వ్యాయామం అవసరం" అని అరుణ్ కుమార్ సలహా ఇస్తున్నారు.
కోడి కాళ్లతో పాటు కోడి మాంసం, బీఫ్, చేప చర్మం, చేప తల, గుడ్డు తెల్లసొనలో కూడా కొల్లాజన్ ఉంటుంది. అలాగే కోడి మెడ, కార్టిలేజ్ భాగాల్లో కూడా సహజ కొల్లాజన్ లభిస్తుంది.
"కోడి కాళ్లలో ఉండే ఫోలేట్ (విటమిన్ బి9) గర్భిణులలో పిండం అభివృద్ధికి సహాయపడుతుంది. పరిమిత మోతాదులో తీసుకోవడం చాలా ముఖ్యం" అని డాక్టర్ శ్రీవిద్య అంటున్నారు.
"ఒక వ్యక్తి 100 నుంచి 150 గ్రాముల వరకు, అంటే 4–5 కోడి కాళ్లతో తయారు చేసిన సూప్ లేదా గ్రేవీని తీసుకోవచ్చు" అని ఆమె చెప్పారు.
"ఇది అందరికీ వర్తిస్తుంది. పిల్లలకు ఇచ్చేటప్పుడు బాగా నమిలి తినమని చెప్పాలి. పళ్ళు రాని పిల్లలకు, పళ్ళు లేని పెద్దలకు, మింగడంలో ఇబ్బంది ఉన్నవారికి దీనిని ఇవ్వకపోవడమే మంచిది. ఇది గొంతులో ఇరుక్కుపోయి ఊపిరాడకుండా చేసే ప్రమాదం ఉంది. ఇందులో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవావి" అని శ్రీ విద్య అన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)