భారత్: ఎన్నికల్లో 'సంక్షేమ మంత్రం' ప్రభావం తగ్గుతోందా? స్టాలిన్, మమత, విజయన్‌ ప్రభుత్వాల ఓటమి ఏం చెబుతోంది?

    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 8 నిమిషాలు

భారత్‌లో సంక్షేమ రాజకీయాలు కూలిపోవడం లేదు కానీ, వాటి ఎన్నికల ఆకర్షణ మసకబారుతోంది.

దశాబ్ధ కాలంగా భారత రాజకీయాల్లో నగదు బదిలీలు, రాయితీలో కూడిన సేవలు, మహిళలు కేంద్రంగా రూపొందించిన పథకాలు సర్వ సాధారణ అంశంగా ఉంటూ వస్తున్నాయి.

తగినన్ని ఉద్యోగాల కల్పనలో విఫలమవుతున్న వృద్ధి నమూనా ప్రభావాన్ని తగ్గించేందుకు సంక్షేమ పథకాలు ప్రత్యామ్నాయంగా మారాయి.

పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలు ఇప్పుడు ఫించన్లు, నగదు బదిలీలు, ఉచిత లేదా తగ్గింపు ధరలకు విద్యుత్ సరఫరా, చౌక ఆహార ధాన్యాలు, మహిళలు, స్వయం సహాయక బృందాలకు మద్దతు, నిరుద్యోగ భృతి వంటి వ్యక్తిగత ప్రయోజనాల ఆధారిత హామీలిస్తున్నాయి.

ప్రాంతీయ పార్టీల మధ్య ఆధిపత్యం కోసం పోటీగా మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు అన్ని పక్షాల ఏకాభిప్రాయంగా స్థిరపడింది.

తమిళనాడులో డీఎంకే, పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, అస్సాంలో బీజేపీ సంక్షేమ పథకాలు అందించాలా వద్దా అనే దాన్ని పక్కన పెట్టి ఎంత మొత్తంలో అందించాలనే దాని గురించే ఎన్నికల్లో పోటీ పడ్డాయి.

అయితే అధికారాన్ని కాపాడుకోవడానికి కేవలం విస్తృత సంక్షేమ పథకాలు మాత్రమే సరిపోవని ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు సూచిస్తున్నాయి.

ఆ ముగ్గురు ఎందుకు ఓడిపోయారు?

సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ తమిళనాడులో డీఎంకే అధికారాన్ని కోల్పోయింది.

ఎన్నికల్లో ప్రత్యర్థుల మీద ఆధిపత్యం సాధించడానికి మహిళలే కేంద్రంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ తృణమూల్ కాంగ్రెస్ మూడు పర్యాయాల తర్వాత ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది.

కేరళలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వానికి విస్తృతమైన సంక్షేమ రికార్డు ఉన్నప్పటికీ కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఈసారి అధికారంలోకి వచ్చింది.

తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో ఓడిపోయిన ముగ్గురు ముఖ్యమంత్రులు సంక్షేమవాద నాయకులుగా గుర్తింపు పొందినవారే.

"సంక్షేమ పథకాలే గెలిపించాయి లేదా పథకాలు అమలు చేసినా గెలవలేదనే సులభమైన ద్వంద్వ వైఖరిని మనం వదులుకోవాలి" అని పొలిటికల్ సైంటిస్ట్ భాను జోషి చెప్పారు.

"సంక్షేమం అనేది ఇప్పటికే భారత రాజకీయాల్లో ఉంది. దాన్ని దాటి పార్టీలు ఏం చేస్తాయన్నదే ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తుంది. ఓటర్లు దీన్ని చాలాకాలం కిందటే అవగాహన చేసుకున్నారు. పోటీ ఆకాశాన్ని తాకుతుంటే విశ్లేషకులు ఇంకా నేల గురించే వాదిస్తున్నారు" అని భాను జోషి అన్నారు.

రాజకీయ కూటముల చుట్టూ అల్లుకుని ఉన్న సంక్షేమవాదాన్ని ఇకపై వేరు చేసి చూడలేమని ఆయన అంటున్నారు.

మహిళలే కేంద్రంగా పథకాల రూపకల్పన

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహంలో భాగమైన సంక్షేమ పథకాల పంపిణీ, మహిళా ఓటర్లు, ముస్లింల ఏకీకరణ, హిందువుల మద్దతు వంటి అంశాల్లో 'సమతుల్యత' దెబ్బ తిని ఉండవచ్చని, దీనివల్ల ఆ పార్టీ ఓడిపోయి ఉండవచ్చని భాను జోషి అన్నారు.

పశ్చిమబెంగాల్ పొరుగునే ఉన్న అస్సాంలో బీజేపీ ఎదుగుదల కేవలం మతపరమైన ప్రసంగాలపైనే కాకుండా సంక్షేమ పథకాలు, మహిళా స్వయం సహాయక బృందాలు, రోడ్లు, ప్రభుత్వ సంస్థలు, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పాలనా సామర్థ్యంపైనా ఆధారపడిందని జోషి అభిప్రాయపడ్డారు.

విస్తరిస్తున్న సంక్షేమ వ్యవస్థలో మహిళలు కేంద్ర బిందువులుగా మారారు. ఇంటి ఖర్చులను నిర్వహించడంతో పాటు పురుషుల కంటే ఎక్కువగా ఓటు వేసే నిర్ణయాత్మకశక్తిగా మహిళలు నిలిచారు.

సంక్షేమ పథకాల అమలు వల్ల ఎదురవుతున్న రాజకీయ, ఆర్థిక సవాళ్లు కూడా పెద్దవే అనడంలో సందేహం లేదు.

భారత్‌లో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం 2వేలకు పైగా నగదు బదిలీ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి.

ఒక్క 2025-26లోనే రాష్ట్రాలు కేవలం నగదు బదిలీ స్కీముల కోసం 1.72 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ తాజా ఆర్థిక సర్వే చెబుతోంది.

ఇందులో ఎక్కువ భాగం మహిళలకే చెందనున్నాయి. మూడేళ్లలోనే ఇలాంటి పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రాల సంఖ్య ఐదు రెట్లకు పైగా పెరిగిందని సర్వే చెబుతోంది.

పథకాల అమలుకు అప్పులు

ఈ రాష్ట్రాల్లో కొన్ని రెవెన్యూ లోటును ఎదుర్కొంటున్నాయి.

కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నగదు బదిలీ ద్వారా అందిస్తున్న నిధులు గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు సగం రోజులు ఇంటి ఖర్చులకు సరిపోతున్నాయి.

రోజు కూలీలుగా పని చేసే మహిళలు, స్వయం ఉపాధి పొందుతున్న వారి విషయంలో వారి సంపాదనలో ఈ పథకాల వాటా గణనీయంగా ఉంది.

అయినప్పటికీ ఈ సర్వే సంతోషించదగిన అంశంలా కాకుండా ఒక హెచ్చరికలా అనిపిస్తోంది.

భారతదేశంలోని రాష్ట్రాల్లో రోడ్లు, స్కూళ్లు, ఆరోగ్య కేంద్రాలు, ఉద్యోగ కల్పనపై ఖర్చును తగ్గిస్తూ, నగదు బదిలీ స్కీములకు అవసరమైన నిధులకోసం అప్పులు చేస్తున్నట్లు ఎకనమిక్ సర్వే చెబుతోంది.

రాష్ట్ర ఆదాయంలో 60శాతానికి పైగా జీతాలు, పెన్షన్లు, సబ్సిడీలు, వడ్డీ చెల్లింపులకే ఖర్చవుతున్నప్పుడు, సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేసే ప్రతి అదనపు రూపాయి దీర్ఘకాలిక వృద్ధికి ఉపాధి కల్పనకు అవసరమైన పెట్టుబడులకు ఆటంకంగా మారుతోంది.

ప్రజలకు స్కీములిచ్చి ఓట్లు తీసుకునే ధోరణి రాజకీయ చర్చను ప్రభావితం చేయడం మొదలైంది.

"ఎన్నికల్లో గెలవడానకి కేవలం సంక్షేమం మాత్రమే సరిపోదని మనం చూస్తూనే ఉన్నాం" అని లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌లో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ లూయిస్ టిల్లిన్ చెప్పారు.

"దాని ప్రభావం స్వల్పమే. సంక్షేమ పథకాలే ఎన్నికల్లో గెలుపును అందించడం చాలా అరుదుగా జరుగుతుంది" అని ఆయన అన్నారు.

పథకాల ప్రకటనలో పార్టీల పోటాపోటీ

పార్టీల మధ్య సంక్షేమ పథకాల పోటీ పెరగడమే దీనికి కారణమని టిల్లిన్ అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం ప్రతి ప్రధాన పార్టీ కూడా నగదు బదిలీ స్కీములు, సబ్సిడీలు, ఉచిత సేవలను అందిస్తామని చెబుతూ ఎన్నికల సమయంలో ప్రత్యర్థుల మీద పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తోంది.

"దీని వల్ల సంక్షేమం విషయంలో పార్టీల మధ్య తేడాను గుర్తించడం ఓటర్లకు కష్టంగా మారుతోంది. అలాగే పార్టీలు కూడా సంక్షేమ పథకాలను పక్కన పెట్టలేకపోతున్నాయి" అని ఆమె అన్నారు.

ప్రభుత్వం త్వరలో విడుదల చేయనున్న ఒక సర్వేలో ఉన్న డేటా ప్రకారం సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో ఎక్కువమంది డీబీటీ స్కీముల కంటే మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం అధికంగా ఖర్చు చేసేందుకు ఇష్టపడినట్లు టిల్లిన్ గుర్తించారు.

వీరిలో ఎక్కువమంది బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికి ఓటు వేసినవాళ్లు.

సంక్షేమంపై రాజకీయ దృక్పథానికి లబ్ధిదారులు దానిని అర్థం చేసుకునే విధానానికి మధ్య అంతరం పెరుగుతోందని ఈ పరిశోధన సూచిస్తోంది.

ఓటర్లు సంక్షేమాన్ని కోరుకోవచ్చు. కానీ తర్వాత వారు ఉద్యోగాలు, మంచి జీతాలు, రవాణా సౌకర్యాలు, తమ ఆకాంక్షలు నెరవేరాలని కోరుకుంటారు.

"ప్రజలు లబ్ధిదారులుగా ఉండాలని అనుకోరు" అని టిల్లిన్ అంటున్నారు.

అభివృద్ధి మీద ఖర్చు పెట్టేదెప్పుడు?

ఈ మార్పు సంక్షేమ రాజకీయ స్వరూపాన్ని మార్చివేసింది.

"భారత్‌లో సంక్షేమ పథకాల పంపిణీ చాలా వరకు పైనుంచి కిందికి, పెత్తందారీ పద్ధతిలో కొనసాగుతోంది. రాజకీయ నాయకుడు ప్రజల సొమ్మును పంచేసి ఆ ఘనతను తనకే ఆపాదించుకుంటాడు. ఇది ప్రజల హక్కు అని కాకుండా బహుమతుల రాజకీయంగా మారింది" అని టిల్లిన్ అన్నారు.

సంక్షేమ పథకాలను తామే ప్రజలకు అందిస్తున్నట్లుగా నాయకులు ప్రమోట్ చేసుకుంటారు. దీనిని " టెక్నో ప్యాట్రిమోనియలిజం" అని అంటారని బ్రౌన్ విశ్వవిద్యాలయంలో సీనియర్ విజిటింగ్ ఫెలో యామినీ అయ్యర్ చెప్పారు

ప్రజల్లో అనేకమంది ఉద్యోగాలు, రవాణా, ఆర్థిక ఆత్మగౌరవం లాంటి శాశ్వతమైన వాటిని కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. లబ్ధిదారుల్లో ఎక్కువగా ఉన్న మహిళల్లోనూ ఈ మార్పు ప్రతిఫలిస్తోంది.

"నగదు బదిలీ పథకాలు ఎన్నికల్లో గెలుపు అందిస్తాయని మీడియా ప్రచారం చేసింది. అయితే దీనికి కారణం ఏంటి, అసలు ఈ రెంటికీ సంబంధం ఉందా లేదా అని ఎన్నికలను అధ్యయనం చేసే పొలిటికల్ సైంటిస్టులు పట్టించుకోవడం లేదు" అని లండన్‌లోని కింగ్స్ కాలేజీలో న్యాయ, సామాజిక న్యాయ ప్రొఫెసర్ ప్రభా కోటీశ్వరన్ అన్నారు.

కోటీశ్వరన్ భారత్‌లోని పలు రాష్ట్రాల్లో మహిళా లబ్ధిదారులపై పరిశోధన చేశారు.

ఒక ప్రాజెక్ట్‌లో భాగంగా ఆమె, ఆమె తోటి పరిశోధకులు అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటకలో నగదు బదిలీ పథకాలను ప్రవేశపెట్టిన ఏడాది తర్వాత మహిళలతో మాట్లాడారు.

"ఈ రాష్ట్రాలన్నింటిలోనూ అత్యధిక మహిళలు నగదు బదిలీ స్కీముల కోసమని అధికార పార్టీకి ఓటు వేయలేదని చెప్పారు" అని కోటీశ్వరన్ అన్నారు.

ప్రజలేం కోరుకుంటున్నారు?

పొలిటికల్ స్ట్రాటజిస్టులు తరచుగా ఊహించే సంక్షేమ నమూనా కంటే రాజకీయంగా మరింత పరిణతి చెందిన విషయం ఉందని క్షేత్ర స్థాయిలో చేసిన పరిశోధన సూచిస్తోంది.

మహిళలు సంక్షేమాన్ని ఓట్ల కోసం ఇచ్చిపుచ్చుకునే బహుమతిగా కాకుండా, ప్రభుత్వాల వైఫల్యానికి పరిహారంగా చూస్తున్నారని ఆమె చెబుతున్నారు.

ప్రభుత్వాలు ఈ పథకాలను ఎంతకాలం కొనసాగించగలవని కొంతమంది ప్రశ్నించారు. నగదు బదిలీ స్కీముల కంటే ధరలు తగ్గించడం లేదా ఉద్యోగాల కల్పన ముఖ్యమనేది మరికొందరి వాదన.

"మహిళలు ప్రధానంగా జీవన వ్యయం, తమకు, చదువుకున్న పిల్లలకు గ్రామీణ ప్రాంతాల్లో మంచి ఉద్యోగాలు, తమిళనాడులో అప్పులు, మద్యపానంవంటి రాష్ట్రానికి చెందిన సమస్యల విషయంలో ఎక్కువ ఆందోళనగా ఉన్నారు" అని కోటీశ్వరన్ అన్నారు.

భారత ఎన్నికల రాజకీయాలకు మహిళలు కేంద్ర బిందువులుగా మారడంతో సంక్షేమం ఎప్పటికీ రాజకీయంగా ముఖ్యమైన అంశమే.

మహిళలకు నేరుగా నగదు బదిలీ స్కీమ్ అనేది ఒకప్పుడు అసాధారణమైన ఆలోచన. 2021 నుంచి అన్ని పార్టీలకు అది సార్వత్రిక ప్రచార వాగ్దానంగా మారింది.

"మహిళల కోణం నుంచి చూస్తే ఇది సానుకూల పరిణామమే. అయితే ఇది కొత్త తరంలోనైనా హక్కుల సంరక్షణకు పునాది వేయాలి" అని కోటిశ్వరన్ అన్నారు.

అన్నిపార్టీలకూ సంక్షేమ పథకాలు సర్వసాధారణం అవుతున్న కొద్దీ ఓటర్ల విధేయతను కాపాడుకోవడానికి ఇకపై అదొక్కటే సరిపోకపోవచ్చు.

"సంక్షేమ పథకాల్ని ఆపేసినందుకు ఒక పార్టీకి శిక్ష పడవచ్చు. అయితే సంక్షేమం అందించిన పార్టీలన్నింటికీ ప్రతిఫలం లభిస్తోందా అన్నదే అసలైన ప్రశ్న" అని టిల్లిన్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)