అమెరికా కొత్త సుంకాలు: చైనా, ఇండియాలపై ఎంత శాతం?

అమెరికా సుంకాలు, భారత్, చైనా, యూరోపియన్ యూనియన్, కెనడా, స్టాక్ మార్కెట్లు
ఫొటో క్యాప్షన్, ట్రంప్ తన వాణిజ్య భాగస్వాములపై రెండోసారి ​​భారీ సుంకాలు విధించారు.
    • రచయిత, జోనాధన్ జోసెఫ్స్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య యుద్ధానికి తెరలేపారు.

భారత్, చైనా,ఈయూ దేశాలు సహా 14 వాణిజ్య భాగస్వామ్య దేశాలపై కొత్త దిగుమతి సుంకాలను ప్రకటించారు.

గతంలో ట్రంప్ విధించిన సుంకాలు చట్టవిరుద్ధమని అమెరికా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

దీంతో చట్టపరమైన అధికారాలను ఉపయోగించి వైట్ హౌస్ తాజా నిర్ణయం తీసుకుంది.

అయితే ప్రకటించిన గరిష్ఠ సుంకాల కంటే వాస్తవంగా వసూలు చేసే సుంకాలు తక్కువగా ఉంటాయని వాణిజ్య నిపుణులు విశ్లేషిస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అమెరికా సుంకాలు, భారత్, చైనా, యూరోపియన్ యూనియన్, కెనడా, స్టాక్ మార్కెట్లు

ఏ దేశంపై ఎంత సుంకం?

వివిధ దేశాలు, ఉత్పత్తులను బట్టి వేర్వేరు స్థాయిల్లో ఈ టారిఫ్‌లను ఖరారు చేశారు. 2027 జనవరి నుంచి ఇవి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

  • చైనా: అత్యధికంగా 40 శాతం వరకు
  • వియత్నాం: 35 శాతం వరకు
  • భారత్, థాయ్‌లాండ్ సహా మరికొన్ని దేశాలు: 25 శాతం వరకు
  • జపాన్, ఇతర దేశాలు: 20 శాతం వరకు
  • జాబితాలోని మొత్తం 14 ఆర్థిక వ్యవస్థలు: చైనా, యూరోపియన్ యూనియన్, సింగపూర్, స్విట్జర్లాండ్, ఇండోనేషియా, మలేషియా, కంబోడియా, థాయ్‌లాండ్, దక్షిణ కొరియా, వియత్నాం, తైవాన్, బంగ్లాదేశ్, జపాన్, భారత్.
  • మినహాయింపు: బ్రిటన్, కెనడా దేశాలు ఈ తాజా జాబితాలో లేవు.
అమెరికా సుంకాలు, భారత్, చైనా, యూరోపియన్ యూనియన్, కెనడా, స్టాక్ మార్కెట్లు
ఫొటో క్యాప్షన్, ట్రంప్ గతంలో విధించిన సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది.

ట్రంప్ ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది?

"దశాబ్దాలుగా ఇతర దేశాలు అనుసరిస్తున్న అన్యాయమైన వాణిజ్య విధానాల వల్ల అమెరికా తయారీ రంగం దెబ్బతింది" అని అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రీర్ ఆరోపించారు.

తయారీ రంగాన్ని లక్ష్యంగా చేసుకోవడం, కార్మికుల వేతనాలను అణచివేయడం, ప్రభుత్వ రాయితీలు ఇవ్వడం వంటి చర్యల వల్ల ప్రపంచ మార్కెట్‌లో 'అదనపు ఉత్పత్తి సామర్థ్యం' ఏర్పడిందని, ఇది అమెరికా కార్మికులకు నష్టం కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు.

దీనిని సరిదిద్ది, అమెరికాలో ఉద్యోగాలను సృష్టించడానికే ట్రంప్ ఈ చర్యలు చేపట్టారని వివరించారు.

25 శాతం, 40 శాతం అని భారీ అంకెలు అనిపిస్తున్నా, వాస్తవంగా పడే భారం చాలా తక్కువగా ఉంటుందని వాణిజ్య నిపుణులు చెబుతున్నారు.

గత ఏడాది కాలంలో ఆయా దేశాలతో అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కుదుర్చుకున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు, సుంకాలపై విధించిన గరిష్ఠ పరిమితులు ఇందుకు కారణం.

ఉదాహరణకు యూరోపియన్ యూనియన్‌పై సుంకాలు గత ఏడాది స్కాట్లాండ్‌లో ట్రంప్, ఉర్సులా వాన్ డెర్ లేయెన్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం 15 శాతానికే పరిమితం కానున్నాయి.

"కొన్ని దేశాలపై ప్రస్తుత సుంకాలకు అదనంగా కొద్ది శాతం మాత్రమే పెరిగే అవకాశం ఉంది" అని జేమీసన్ గ్రీర్ స్వయంగా సీఎన్‌బీసీ ఛానెల్‌కు తెలిపారు.

అంతేకాకుండా, ఈ సుంకాలను విదేశీ కంపెనీలు కాకుండా, ఆ వస్తువులను దిగుమతి చేసుకునే అమెరికా కంపెనీలే చెల్లించాల్సి ఉంటుంది.

అమెరికా సుంకాలు, భారత్, చైనా, యూరోపియన్ యూనియన్, కెనడా, స్టాక్ మార్కెట్లు
ఫొటో క్యాప్షన్, 2025 జూలైలో స్కాట్లాండ్‌లోని టర్న్‌బెర్రీలో యూఎస్ ఈయూ మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది.

యూరోపియన్ యూనియన్, చైనా ఘాటు స్పందన

అమెరికా కొత్త టారిఫ్‌లపై యురోపియన్ కమిషన్ స్పందించింది. "యూరప్ అదనపు ఉత్పత్తికి కేంద్రమనే వాదనను మేము పూర్తిగా తిరస్కరిస్తున్నాము. నిజానికి ఆ సమస్య వల్ల మేమే ఎక్కువగా నష్టపోతున్నాము" అని బీబీసీకి తెలిపింది. ప్రభుత్వ ప్రోత్సాహంతో జరుగుతున్న అధిక ఉత్పత్తిపై అమెరికాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని సుంకాల మినహాయింపులపై చర్చలు కొనసాగిస్తామని ఈయూ స్పష్టం చేసింది.

మరోవైపు, ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మళ్లీ రాజుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

గతేడాది దక్షిణ కొరియాలో ట్రంప్, జిన్ పింగ్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం గడువు 2027 జనవరి 10న ముగియనుంది.

డిసెంబర్‌లో మయామిలో జరగనున్న ట్రంప్-జిన్ పింగ్ భేటీలో పైచేయి సాధించేందుకే అమెరికా ఈ టారిఫ్ అస్త్రాన్ని ప్రయోగించిందని భావిస్తున్నారు.

టెక్ రంగానికి కీలకమైన 'రేర్ ఎర్త్' ఖనిజాల సరఫరాను చైనా పెంచాలని, అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కువగా కొనాలని వాషింగ్టన్ ఒత్తిడి తెస్తోంది.

అయితే, వాణిజ్య యుద్ధాలు ఎవరికీ మేలు చేయవని, చర్చలే పరిష్కారమని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది.

అమెరికా సుంకాలు, భారత్, చైనా, యూరోపియన్ యూనియన్, కెనడా, స్టాక్ మార్కెట్లు
ఫొటో క్యాప్షన్, ఇటీవల అమెరికా, కెనడా ఒకదానిపై ఒకటి భారీ సుంకాలను విధించుకున్నాయి.

కెనడా ఎందుకు లేదు?

ట్రంప్ తరచూ విమర్శించే కెనడా ఈ జాబితాలో లేకపోవడం చర్చనీయాంశమైంది. అయితే దీనిని కెనడాకు ఇచ్చిన 'క్లీన్ చిట్'గా భావించకూడదని ప్రస్తుతం అత్యంత తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన దేశాలపైనే దృష్టి సారించామని అమెరికా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

గతంలోనే కెనడా స్టీల్, కార్లు, అల్యూమినియంపై అమెరికా 50 శాతం వరకు సుంకాలు విధించగా కెనడా కూడా ప్రతిసుంకాలు విధించింది.

అమెరికా-మెక్సికో-కెనడా ఒప్పందం కింద చాలా వరకు వాణిజ్యం ఇప్పటికీ సుంకాల రహితంగానే సాగుతోంది.

అమెరికా సుంకాలు, భారత్, చైనా, యూరోపియన్ యూనియన్, కెనడా, స్టాక్ మార్కెట్లు
ఫొటో క్యాప్షన్, 14 దేశాల మీద సుంకాలు విధిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అమెరికన్ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి.

అమెరికా రాజకీయాలు, మార్కెట్లపై ప్రభావం

ఇటీవలి మధ్యంతర ఎన్నికల్లో టారిఫ్‌ల వల్ల పెరిగిన ధరలపై అమెరికా ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, ట్రంప్ వెనక్కి తగ్గలేదు.

గతంలో మాదిరిగా 'లిబరేషన్ డే' అంటూ రోజ్ గార్డెన్‌లో భారీ హంగామా చేయకుండానే ఈసారి నిశ్శబ్దంగా ఈ ప్రకటన చేశారు.

ఏఐ రంగంపై ఆందోళనలతో ఇప్పటికే ఒడిదుడుకుల్లో ఉన్న స్టాక్ మార్కెట్లు ఈ వార్తతో మరింత కుదేలయ్యే ప్రమాదం ఉంది.

2027 జనవరిలో కొత్త కాంగ్రెస్ సమావేశమైనప్పుడు అధ్యక్షుడి టారిఫ్ అధికారాలకు కళ్లెం వేసేందుకు డెమోక్రాట్లతో కలిసి రిపబ్లికన్లు కూడా గళమెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)