బ్రిటన్: ఇక్కడి యువతలో సెక్స్కన్నా సెక్స్టింగ్, పోర్న్‌పై ఆసక్తి ఎక్కువ, పరిశోధనలో ఏం తేలిందంటే...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మిచెల్లె రాబర్ట్స్
- హోదా, డిజిటల్ హెల్త్ ఎడిటర్
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
గత తరాలతో పోలిస్తే బ్రిటన్‌లో ప్రజలు ముఖ్యంగా టీనేజర్లు, యువత తక్కువగా లేదా అసలు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం లేదని తేలింది. అయితే చాలామంది పోర్న్ చూస్తున్నారని, సెక్స్టింగ్ (లైంగికపరమైన సందేశాలు) చేస్తున్నారని, ఫోటోలు పంపుకుంటున్నారని ఒక ప్రధాన అధ్యయనంలో వెల్లడైంది.
ప్రజల లైంగిక జీవితాలపై నిర్వహించే నేషనల్ సర్వే ఆఫ్ సెక్సువల్ అటిట్యూడ్స్ అండ్ లైఫ్‌స్టైల్స్ (నాట్సల్) పరిశోధనలో ఆన్లైన్ లైంగిక ప్రవర్తనల గురించి ప్రశ్నించడం ఇదే తొలిసారి.
16 నుంచి 24 ఏళ్ల వయసున్న వారిలో సగంమంది గత ఏడాది కాలంలో తమ ఫోన్ ద్వారా లైంగికపరమైన ఫోటోలను పంపించారు లేదా అలాంటి ఫోటోలు వేరేవాళ్లనుంచి వాళ్లకొచ్చాయి.
అలాగే ప్రతి ఇద్దరు యువతుల్లో ఒకరు, ప్రతి పది మంది యువకుల్లో దాదాపు తొమ్మిది మంది పోర్నోగ్రఫీ చూశామని చెప్పారు.
అయితే ఈ వయసు వారిలో మూడోవంతుమంది ఇప్పటివరకు లైంగిక కలయికలో పాల్గొనలేదని తెలిపారు. 12 ఏళ్ల కిందట జరిగిన అధ్యయనంలో ఈ సంఖ్య ఐదో వంతుగా ఉంది.

45 ఏళ్లలోపు వాళ్లు కూడా గతంతో పోలిస్తే తక్కువగా సెక్స్‌లో పాల్గొంటున్నారట. ఈ వయసు వాళ్లు 1990లో వారానికి ఓసారి సెక్స్ చేసేవారు. అదే వయసున్నవారు ఇప్పుడు నెలకు రెండుసార్లు మాత్రమే లైంగిక సంబంధంలో పాల్గొంటున్నారు.
గత ఏడాది తాము పోర్న్ చూశామని మహిళల్లో మూడింట ఒకవంతు కంటే ఎక్కువ మంది (37 శాతం) చెప్పారు.
పురుషుల్లో ఈ సంఖ్య దాదాపు ప్రతి ఐదుగురిలో నలుగురు (81 శాతం)గా ఉంది.


ఫొటో సోర్స్, Getty Images
సెక్స్ తక్కువ, పోర్న్ ఎక్కువ?
16 నుంచి 24 ఏళ్ల వయసు వారిలో సగం మంది యువతులు, అత్యధిక సంఖ్యలో యువకులు (86 శాతం) పోర్న్ చూస్తున్నామని చెప్పారు.
ఇప్పటివరకు లైంగిక సంబంధంలో పాల్గొనని వారిలో పోర్న్ చూడటం, హస్తప్రయోగం చేసుకోవడం తక్కువగా ఉన్నట్టు అధ్యయనంలో తేలింది.
ఆన్లైన్ లైంగిక కార్యకలాపాలు లేదా సొంతంగా లైంగిక ఆనందం పొందడం ప్రత్యక్ష లైంగిక సంబంధానికి పూర్తిగా ప్రత్యామ్నాయంగా మారుతుందని భావించలేమని పరిశోధకులు అంటున్నారు. అయితే దీనిపై వారు కచ్చితమైన నిర్ధరణకు రాలేకపోతున్నారు.

ఏఐ (కృత్రిమ మేధస్సు) లేదా రొమాంటిక్ చాట్బాట్లతో వర్చువల్ సంబంధాల గురించి ఈ అధ్యయనంలో ప్రశ్నించలేదు. తదుపరి అధ్యయనంలో వాటిని తప్పనిసరిగా చేర్చాలని పరిశోధకులు చెబుతున్నారు.
"2022-24 మధ్య మేం ఈ అధ్యయనం కోసం క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరించినప్పుడు ఏఐతో ప్రేమ సంబంధాలు అనేవి సైన్స్ ఫిక్షన్ కథల్లో ఉండే అంశంలా అనిపించాయి'' అని నాట్సల్ పరిశోధనా బృందంలో ఒకరైన యూనివర్సిటీ కాలేజ్ లండన్‌కు చెందిన సోజిగ్ క్లిఫ్టన్ అన్నారు.
"మనుషుల లైంగిక ప్రవర్తనపై, వారి సంబంధాలపై ఏఐ చూపే ప్రభావాన్ని భవిష్యత్తులో పరిశీలించాల్సి రావచ్చు. ముఖ్యంగా ఏఐ కంపానియన్లకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది" అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సమ్మతిపై మరింతగా బహిరంగ చర్చ
లైంగిక సంబంధాలు తగ్గడానికి స్క్రీన్ ముందు ఎక్కువ సమయం గడపడమే కారణమని భావించడం సులభమే అయినప్పటికీ ముఖ్యంగా యువత విషయంలో దీనికి అనేక ఇతర కారణాలు కూడా ఉండొచ్చని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్‌కు చెందిన సహ పరిశోధకురాలు ప్రొఫెసర్ వెండీ మెక్‌డోవెల్ చెప్పారు.
ఉదాహరణకు, గత తరాలతో పోలిస్తే ఇప్పుడు యువత మద్యం తాగడం తగ్గించారు. అలాగే ఎక్కువ మంది తల్లిదండ్రులతో కలిసి ఇంట్లోనే ఉంటున్నారు.
మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతుండటం కూడా దీనికి ఒక కారణం కావచ్చు. ప్రజలు బయటకు వెళ్లకుండా అడ్డుకున్న కోవిడ్ మహమ్మారి కూడా దీనిపై ప్రభావం చూపి ఉండవచ్చు.

లైంగిక సంబంధానికి పరస్పర అంగీకారం అవసరమనే అంశంపై ఇప్పుడు మరింత బహిరంగంగా చర్చ జరుగుతోంది. దీనివల్ల లైంగిక సంబంధం పెట్టుకోవాలా వద్దా, ఎప్పుడు పెట్టుకోవాలి అనే విషయాలపై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ యువతలో పెరిగి ఉండొచ్చని ఆమె అన్నారు.
అయితే కొంతమంది తమ లైంగిక జీవితానికి సంబంధించిన విషయాల వల్ల మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
లైంగిక అనుభవాల్లో గతంలో ఇతరులు తమపై చేసిన కొన్ని పనుల గురించి ఇప్పటికీ బాధపడుతున్నామని ప్రతి ఏడుగురు మహిళల్లో ఒకరు (14 శాతం) చెప్పారు.
అదే విధంగా తమలోని కొన్ని లైంగిక ఆలోచనలు, కోరికల గురించి బిడియపడుతున్నామని ప్రతి ఏడుగురు పురుషుల్లో ఒకరు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
సెక్స్ కోసం వెయిటింగ్
నాట్సల్ ఈ నాలుగో సర్వే కొన్ని ట్రెండ్స్‌ను తెలియజేసినప్పటికీ వాటికి గల కారణాలను పూర్తిగా వివరించలేకపోయింది.
తొలిసారి లైంగిక సంబంధంలో పాల్గొనేటప్పుడు తొందరపడటమే యువతలో ఎక్కువమంది పశ్చాత్తాపానికి కారణమని 2010లో నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
కానీ ఇప్పుడు యువత లైంగిక సంబంధాల కోసం గతంతో పోలిస్తే ఎక్కువ కాలం వేచి చూస్తున్నట్టు కనిపిస్తోంది.
ప్రస్తుతం దాదాపు ఐదుగురు యువతుల్లో ఇద్దరు (38 శాతం), నలుగురు యువకుల్లో ఒకరి కంటే ఎక్కువ మంది (28 శాతం) ఇప్పటివరకు లైంగిక సంబంధంలో పాల్గొనలేదని చెప్పారు.
1990, 2000, 2010 సంవత్సరాల్లో నిర్వహించిన సర్వేల్లో ఈ సంఖ్య సుమారు ప్రతి ఐదుగురిలో ఒకరుగా ఉండేది.
లైంగిక సంబంధాల్లో పాల్గొంటున్న పెద్దల్లో కూడా చాలామంది గతంతో పోలిస్తే తక్కువగా పాల్గొంటున్నారు.
గతంలో సగటున వారానికి ఒకసారి సెక్స్ చేసేవారు. ఇప్పుడు అది రెండు వారాలకు ఒకసారి మాత్రమే ఉంటోంది.
‘ది లాన్సెట్’ జర్నల్‌లో ప్రచురితమైన తాజా ఫలితాలు బ్రిటన్‌లో ఎంపిక చేసిన 16 నుంచి 59 ఏళ్ల వయసున్న 6,700 మందిపై నిర్వహించిన సర్వే ఆధారంగా రూపొందించారు. ఈ అధ్యయనంలో వెల్లడైన అంశాలు:
- పెద్దల్లో నాలుగింట మూడు వంతులమంది గత ఏడాది కాలంలో లైంగిక సంబంధంలో పాల్గొన్నారు.
- ఒక వ్యక్తి జీవితకాలంలో లైంగిక భాగస్వాముల సగటు సంఖ్య ఐదు.
- మహిళలు సగటున నెలకు ఒకసారి, పురుషులు నెలకు రెండుసార్లు సెక్స్‌లో పాల్గొంటున్నారు.
- పురుషులు, మహిళలు ఇద్దరిలోనూ తమ లింగానికే చెందిన వారితో లైంగిక సంబంధాలు కలిగి ఉన్నామని చెప్పినవారి సంఖ్య పెరిగింది.
అయితే అది ఎంత మేరకు పెరిగిందో స్పష్టంగా తెలియదు.

ఫొటో సోర్స్, Getty Images
సురక్షితం కాని లైంగిక సంబంధం
బ్రిటన్‌లో చాలామంది ముఖ్యంగా యువత గర్భధారణకు, లైంగికంగా సంక్రమించే వ్యాధులకు దారితీసే రక్షణలేని లైంగిక సంబంధాల్లో పాల్గొంటున్నారని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.
యువతుల్లో గర్భనిరోధక మాత్రల వినియోగం కూడా తగ్గింది.
అయితే ఇప్పుడు ఎక్కువ మంది మహిళలు తమకు పిల్లలు వద్దని చెబుతున్నారు. 16 నుంచి 44 ఏళ్ల వయసున్న మహిళల్లో పిల్లలు వద్దనుకునేవారి సంఖ్య గత పదేళ్లలో రెట్టింపైంది. గతంలో ఇది 8 శాతం ఉండగా ఇప్పుడు 17 శాతానికి పెరిగింది.
"దీనికి కారణాలేమిటో అర్థం చేసుకోవడం అన్నది భవిష్యత్తు పరిశోధనలు, విధాన రూపకల్పనలో ప్రాధాన్యతగా ఉండాలి. ఆర్థిక అనిశ్చితి, వాతావరణ మార్పులపై ఆందోళన లేదా జీవిత ప్రాధాన్యతల్లో మార్పులు ఇందుకు కారణమా అనే విషయాలను పరిశీలించాలి. ఈ మార్పులు ఆరోగ్య సేవలు, సంరక్షణ సేవలు, కుటుంబ సంక్షేమ సేవల ప్రణాళికలపై ఎంతో ప్రభావం చూపుతాయి" అని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్‌కు చెందిన పరిశోధకురాలు డాక్టర్ లారా ఓక్లే అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























