ఎగిరే కారును ప్రదర్శించిన ఎలాన్ మస్క్.. రోడ్డు మీదకు వచ్చే రోజెప్పుడు?

ఫ్లయింగ్ కారు, టెస్లా, మస్క్
ఫొటో క్యాప్షన్, టెక్సాస్‌లో టెస్లా ఎగిరే కారు డెమో
ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

అమెరికాలోని టెక్సస్‌లో టెస్లా కంపెనీ తన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు 'రోడ్‌స్టర్' కొత్త వెర్షన్‌ను పరిచయం చేసింది. దీనిని ఎగిరే కారుగా పిలుస్తున్నారు.

ఈ కారులో అమర్చిన థ్రస్టర్ల సహాయంతో ఇది నేల నుంచి పైకి లేచి గాల్లోకి వెళ్లగలదు. గాల్లోనే దిశను కూడా మార్చుకోగలదు.

"ఈ రాత్రి మీరు కొన్ని అద్భుతమైన విషయాలను చూడబోతున్నారు" అని కారు డెమోను ప్రదర్శిస్తూ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ అన్నారు.

తన మరో కంపెనీ స్పేస్‌ఎక్స్‌కు చెందిన ప్రాంగణంలో ఆయన ఈ కారును ప్రదర్శించారు.

ఈ మోడల్ అభివృద్ధిలో స్పేస్‌ఎక్స్‌ సహకరించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

రోడ్‌స్టర్ మోడల్‌ను కొత్త డిజైన్‌తో ఎగిరే కారుగా టెస్లా మార్చింది.

ఇది నిజమైన కారు అని, ఏఐ దృశ్యం కాదని నిరూపించడానికి ప్రేక్షకుల మధ్య కారు ప్రదర్శన జరగాలని మస్క్ అన్నారు.

మస్క్ చూపించిన రోడ్‌స్టర్‌ కారు డెమోలో కారు ఒక వంపు తిరిగిన ర్యాంప్‌పైకి ఎక్కి అక్కడినుంచి గాల్లోకి ఎగిరింది. గాల్లో గిరగిరా తిరిగి తర్వాత ఎయిర్ జెట్‌ల సహాయంతో కిందికి దిగింది.

ఫ్లయింగ్ కారు, టెస్లా, మస్క్
ఫొటో క్యాప్షన్, భవిష్యత్తులో ఎగిరే కార్లను చూడొచ్చని మస్క్ అన్నారు.

ఎగిరే కార్ల గురించి మస్క్ ఏమంటున్నారు?

"మనం రోడ్లపై ఎగిరే కార్లను సమీప భవిష్యత్తులో చూసే అవకాశం లేదు. దీనికి అనేక కారణాలున్నాయి" అని బీబీసీ టెక్నాలజీ ఎడిటర్ జో క్లైన్‌మాన్ అన్నారు.

ఫ్లయింగ్ కార్ డెమో వీడియోను ఎలాన్ మస్క్ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. "భవిష్యత్తులో నిజంగానే ఎగిరే కార్లు రాబోతున్నట్టు కనిపిస్తోంది" అని రాశారు.

స్పేస్‌ఎక్స్ అభివృద్ధి చేసిన కోల్డ్ గ్యాస్ థ్రస్టర్‌లను ఈ రెండు సీట్ల కారులో టెస్లా అమర్చింది. అయితే ఎగిరే సదుపాయాలన్న ఈ కారును రోడ్డపై నడపడానికి అనుమతి ఉందా, ఈ కారు అందుకు సిద్ధంగా ఉందా అనే దానిపై స్పష్టత లేదు.

డెమో సమయంలో రోడ్‌స్టర్ సెకండ్ జనరేషన్ కారు ఒక పెద్ద వంపు తిరిగిన ర్యాంప్‌పైకి వెళ్లి, అక్కడినుంచి గాల్లోకి ఎగిరి, గాల్లోనే పల్టీకొట్టి తిరిగి నేలపై సురక్షితంగా దిగింది.

కారు విజయవంతంగా ల్యాండ్ అయిన తర్వాత మస్క్, "ఇది పనిచేసింది" అని అన్నారు.

ఈ కారును రూపొందించడానికి టెస్లా, స్పేస్‌ఎక్స్ ఇంజనీర్లు కలిసి పనిచేశారని మస్క్ చెప్పారు.

ఫ్లయింగ్ కారు, టెస్లా, మస్క్
ఫొటో క్యాప్షన్, ఎగిరే కారులో థ్రస్టర్లు అమర్చారు.

కారు ఎలా ఎగురుతుందంటే...

ఈ కారును రోడ్డపై నడపడానికి వీలవుతుందా అని డెమో సమయంలో మస్క్‌ను అడగ్గా ఆయన నవ్వారు.

"అది మీ రోడ్డు ఎలా ఉంటుందనేదానిపై ఆధారపడి ఉంటుంది" అని అన్నారు.

ఈ కారును ఉపయోగించడానికి అనువుగా తయారుచేస్తామని చెప్పారు.

కారు పైకి లేవడానికి అత్యంత అధిక పీడనంతో పనిచేసే ప్రత్యేక ఎయిర్ ట్యాంక్‌ను ఉపయోగిస్తామని మస్క్ చెప్పారు.

గాలిలో ఉన్నప్పుడు కారు నియంత్రణకు ఆల్టిట్యూడ్ థ్రస్టర్‌లు, వెనుకభాగంలో ప్రధాన థ్రస్టర్‌లను అమర్చారు. ఇది రాకెట్‌లాగా గాల్లోకి ఎగరగలదు. గాల్లో విన్యాసాలు చేయగలదు.

రాకెట్లలో ఉపయోగించే వాటిని పోలిన థ్రస్టర్లను ఈ కారులో అమర్చారు. ఇది కేవలం 0.81 సెకన్లలోనే గంటకు 97 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.

ఇదే వేగంతో ప్రయాణించే సామర్థ్యంతో మార్కెట్లోకి వస్తే ప్రపంచంలోనే అత్యంత వేగంగా వేగాన్ని అందుకునే కారు ఇదే అవుతుంది.

అంతరిక్షంలో రాకెట్లు, ఉపగ్రహాల దిశను మార్చడానికి ఉపయోగించే కోల్డ్-గ్యాస్ థ్రస్టర్ టెక్నాలజీతో ఈ కారును రూపొందించారు.

ఈ విధానంలో అధిక పీడనంతో నింపిన గాలి లేదా వాయువును వేగంగా బయటకు పంపడం ద్వారా కారు అదనపు బలాన్ని పొంది పైకి లేవడానికి లేదా దిశను మార్చుకోడానికి వీలవుతుంది.

ఫ్లయింగ్ కారు, టెస్లా, మస్క్
ఫొటో క్యాప్షన్, డెమోలో ఎగిరేకారు గాల్లో పల్టీలు కొట్టింది.

‘ట్రాఫిక్‌లో ఎగిరిపోతే...’

ఈ కారు డెమో చూసిన తర్వాత సోషల్ మీడియాలో అనేక రకాలా ఊహాగానాలు వ్యక్తంచేస్తూ కామెంట్లు వస్తున్నాయి. ఈ కారు టోల్ బూత్ దగ్గరకు వచ్చినప్పుడు గాల్లోకి ఎగిరి టోల్ దాటిపోతే ఎలా ఉంటందోనని కామెంట్ చేస్తున్నారు.

రోడ్డు బాగాలేకపోయినా లేదా గుంతలు ఉన్నా కారును గాల్లోకి లేపి ముందుకు తీసుకెళ్లొచ్చని మరికొందరంటున్నారు.

ఒకే చోట ట్రాఫిక్‌లో చాలా వాహనాలు చిక్కుకుపోయిన చోట కారును గాల్లో ఎగిరించి ట్రాఫిక్‌ను దాటుకుని అవతలి వైపుకు తీసుకెళ్లవచ్చని కూడా కొందరు ఊహిస్తున్నారు.

అయితే ప్రస్తుతానికిది రోడ్‌స్టర్ కారు డెమో మాత్రమే. ఈ కారును ఏ ప్రత్యేక సాంకేతికతతో మార్కెట్‌లో విడుదల చేస్తారో, దానిని నడపడానికి రోడ్లు ఎలా ఉండాలో... ఎలాంటి నిబంధనలు, షరతులుఉంటాయో తెలియాలంటే ఇంకొంతకాలం వేచిచూడాల్సి ఉంటుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)