తమిళనాడు: ఏమిటీ ‘ఏఐ పుస్తకాల కుంభకోణం’, ఎలా బయటపడింది?

 పెరియార్ అరివులగం గ్రంథాలయం ఆరోపణలకు కేంద్రంగా ఉంది
ఫొటో క్యాప్షన్, కొత్తగా ప్రారంభించిన పెరియార్ అరివులగం గ్రంథాలయం ఆరోపణలకు కేంద్రంగా ఉంది
    • రచయిత, జేవియర్ సెల్వకుమార్, యాజినియన్
    • హోదా, బీబీసీ తమిళ్
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

తమిళనాడులోని కోయంబత్తూరులో ఇటీవల ప్రారంభమైన పెరియార్ అరివులగం లైబ్రరీ కృత్రిమ మేధ సాయంతో రూపొందాయని అనుమానిస్తున్న వందలాది పుస్తకాలను కొనుగోలు చేసిందనే ఆరోపణలపై విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది.

ఈ గ్రంథాలయంలో తప్పుడు సమాచారంతో కూడిన పుస్తకాలు , రచయితల వివరాలపై అనుమానాలు రేకెత్తుతున్నాయంటూ తమిళ నవలా రచయిత పెరుమాళ్ మురుగన్ ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ వివాదం మొదలైంది.

ఈ పుస్తకాల కొనుగోళ్లపై విచారణ జరపాలని, వాటిని సరఫరా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ప్రచురణ సంస్థకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని మద్రాస్ హైకోర్టు తమిళనాడు అవినీతి నిరోధక సంస్థను ఆదేశించింది.

ఈ పుస్తకాలను కొనుగోలు చేసింది డీఎంకే నేతృత్వంలోని గత ప్రభుత్వమేనని ప్రస్తుత ప్రభుత్వం ఆరోపించింది. కానీ ఈ ఆరోపణలను డీఎంకే ఖండించింది.

ఈ ఆరోపణలను "భారత్‌లో తొలి ఏఐ కుంభకోణం"గా పరిగణించాల్సి రావచ్చని తమిళనాడు పాఠశాల విద్యాశాఖ మంత్రి ఏ. రాజ్‌మోహన్ అన్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ గ్రంథాలయాల్లో జరిగిన పుస్తకాల కొనుగోళ్లను కూడా విచారణ పరిధిలోకి తీసుకువస్తామని ఆయన చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ప్రచురణ రంగంలో ఏఐ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఈ కేసు విస్తృత ప్రశ్నలను లేవనెత్తింది. ఏఐ సాధనాలతో తక్కువ ఖర్చు, తక్కువ సమయంలో పూర్తి పుస్తకాలను రూపొందించవచ్చు. అయితే, అవి తప్పుడు సమాచారాన్ని, కల్పిత ఆధారాలను కూడా సృష్టించే అవకాశం ఉంది.

ఏఐతో రూపొందించిన కంటెంట్‌ విస్తరిస్తున్న కొద్దీ పుస్తకాల ప్రామాణికతను పరిశీలించడంలో గ్రంథాలయాలు, ప్రచురణ సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లను కూడా ఈ వివాదం వెలుగులోకి తెచ్చింది.

సుమారు రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన పెరియార్‌ అరివులగం గ్రంథాలయం చుట్టూ ఈ వివాదం కేంద్రీకృతమైంది. సామాజిక సంస్కర్త పెరియార్‌ ఈవీ రామసామి పేరు మీద నిర్మించిన ఈ గ్రంథాలయాన్ని తమిళనాడు సీఎం సి. జోసెఫ్‌ విజయ్‌ అక్టోబర్‌ 16న ప్రారంభించారు.

రచయిత
ఫొటో క్యాప్షన్, రచయిత పెరుమాళ్ మురుగున్

ఎలా బయటకు వచ్చింది?

అంతర్జాతీయ గుర్తింపు పొందిన పైర్‌, వన్‌ పార్ట్‌ ఉమెన్‌ నవలల రచయిత పెరుమాళ్‌ మురుగన్ గత నెలలో ఈ గ్రంథాలయాన్ని సందర్శించిన తర్వాత అనుమానాలు వ్యక్తం చేశారు.

ఓ ఆన్‌లైన్‌ పత్రికలో రాసిన వ్యాసంలో, గ్రంథాలయంలోని తమిళ పుస్తకాల విభాగంలో దాదాపు 1,800 పుస్తకాలను అగల్‌ విలక్కు పతిప్పగం అనే అంతగా పేరు లేని ప్రచురణ సంస్థ సరఫరా చేసిందని ఆరోపించారు.

ఆ పుస్తకాల్లో చాలా వాటిపై తమకు తెలియని రచయితల పేర్లు ఉన్నాయని, ధరలు అసాధారణంగా ఎక్కువగా ఉన్నాయని, వాటికి కేటాయించిన అంతర్జాతీయ ప్రామాణిక పుస్తక సంఖ్యలు కూడా అనుమానాస్పదంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

ఈ వివాదంలో ప్రస్తావనకు వచ్చిన పుస్తకాల్లో ఒకటైన నాలడియార్‌ వాజ్విన్‌ వళికాట్టి పుస్తకానికి 300 పేజీలకు గానూ రూ.1,445 ధరగా నిర్ణయించినట్లు సమాచారం.

నాలడియార్‌ను తమిళ కవి, తత్వవేత్తగా ఆ పుస్తకంలో పేర్కొన్నారు. అయితే నాలడియార్‌ అంటే నీతి, నైతిక విలువల గురించి వివరించే నాలుగు పంక్తుల చొప్పున ఉన్న 400 పద్యాలతో ఉన్న ఓ ప్రాచీన తమిళ గ్రంథం.

మరో పుస్తకంలో ప్రాచీన తమిళ కావ్యం మదురై కాంచి రచయిత పేరును తప్పుగా పేర్కొన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే వివాదాస్పద పుస్తకాల్లో దేనినైనా ఏఐ సాయంతో రూపొందించారా లేదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

అగల్‌ విలక్కు పతిప్పగం పుస్తకాలను లైబ్రరీలో భద్రపరిచారు
ఫొటో క్యాప్షన్, పెరియార్ లైబ్రరీలోని పుస్తకాలు

మదురైలోని మరో ప్రభుత్వ గ్రంథాలయంలో లభించిన పుస్తకంపైనా ప్రశ్నలు తలెత్తాయి. ప్రముఖ ఆర్థికవేత్త జీన్‌ డ్రెజ్‌ రచయితగా పేర్కొన్న ఆ పుస్తకం పేరు డెమోక్రసీ అండ్‌ పీపుల్స్‌ రైట్స్‌ ఇన్‌ ద కాంటెంపరరీ వరల్డ్. దీనిని ఫీనిక్స్‌ పబ్లిషింగ్‌ హౌస్‌ ప్రచురించింది.

బీబీసీ తమిళ్‌ పంపిన ప్రశ్నలకు డ్రెజ్‌ స్పందించలేదు. అయితే ఈ వారం ప్రారంభంలో ది హిందూ పత్రికతో మాట్లాడుతూ, ఆ పుస్తకాన్ని తాను రాయలేదని చెప్పారు. తన అనుమతి లేకుండానే పుస్తకానికి తన పేరును ఉపయోగించి ఉండవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

బీబీసీ తమిళ్‌ బృందం చెన్నైలో అగల్‌ విలక్కు, ఈ వివాదంలో పేరొచ్చిన మరో ప్రచురణ సంస్థ ఫీనిక్స్‌ పబ్లిషింగ్‌ హౌస్‌ చిరునామాలను సందర్శించింది. అయితే అక్కడ ఆ సంస్థలు ఉన్నట్లు సూచించే ఎలాంటి బోర్డులు లేదా గుర్తులు కనిపించలేదు.

ఆ చిరునామాలో అగల్‌ విలక్కు సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోందని అక్కడి ఓ మహిళ ధ్రువీకరించారు. ఆ సంస్థ యజమాని మోహన్‌ను బీబీసీ సంప్రదించగా, ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉందంటూ మాట్లాడటానికి నిరాకరించారు.

ఈ వివాదంతో ప్రభుత్వ గ్రంథాలయాల కోసం పుస్తకాలను ఎంపిక చేసిన విధానంపై రచయితలు, విద్యావేత్తలు, ప్రచురణకర్తలు ప్రశ్నలు లేవనెత్తారు.

ఈ వ్యవహారంపై స్వతంత్ర విచారణ జరపాలని, పుస్తకాల కొనుగోలుకు సంబంధించిన రికార్డులను బహిర్గతం చేయాలని, తమిళనాడు అంతటా గ్రంథాలయాల్లోని పుస్తకాల సేకరణను తనిఖీ చేయాలని డిమాండ్ చేస్తూ 160 మందికి పైగా రచయితలు, పరిశోధకులు, కళాకారులు, ప్రచురణకర్తలు ఓ సంయుక్త ప్రకటనపై సంతకాలు చేశారు.

విచారణలో ప్రజాధనం దుర్వినియోగమైనట్లు తేలితే, ఆ మొత్తాన్ని తిరిగి రాబట్టాలని కూడా వారు కోరారు.

నిపుణుల కమిటీలు, ధరలపై చర్చలు, వివిధ స్థాయుల్లో సమీక్షలు జరిగిన తర్వాత కూడా వివాదాస్పద పుస్తకాలు ఎంపిక ప్రక్రియను ఎలా సాధ్య మైందని ఆ బృందం ప్రశ్నించింది.

ఈ లైబ్రరీని ముఖ్యమంత్రి విజయ్ ప్రారంభించారు
ఫొటో క్యాప్షన్, ఈ లైబ్రరీని ముఖ్యమంత్రి విజయ్ ప్రారంభించారు

అంతర్గత ఆడిట్‌కు ఆదేశాలు

ప్రభుత్వ గ్రంథాలయాల్లోని పుస్తకాల సేకరణపై రాష్ట్ర ప్రభుత్వం అంతర్గత ఆడిట్‌కు ఆదేశించింది.

ప్రాథమిక తనిఖీల్లో పుస్తకాల ప్రామాణికత, నాణ్యతపై అనుమానాలు తలెత్తడంతో చెన్నైలోని చారిత్రక కొన్నెమరా పబ్లిక్‌ లైబ్రరీ నుంచి ఇప్పటికే 523 పుస్తకాలను తొలగించినట్లు రాజ్‌మోహన్‌ తెలిపారు.

పెరియార్‌ అరివులగం గ్రంథాలయం నుంచి కూడా వివాదాస్పద పుస్తకాలను తొలగించామని, మరోవైపు అవినీతి నిరోధక అధికారులు కొనుగోళ్ల రికార్డులను పరిశీలిస్తూ ఇతర గ్రంథాలయాల్లోనూ తనిఖీలు చేస్తున్నారని ఆయన చెప్పారు.

ఈ వివాదం తమిళనాడులో రాజకీయ దుమారానికీ దారితీసింది. గత డీఎంకే ప్రభుత్వం ఈ వివాదాస్పద పుస్తకాలను కొనుగోలు చేయాలని ఆదేశించిందని రాజ్‌మోహన్‌ ఆరోపించారు. విచారణలో అక్రమాలు జరిగినట్లు తేలితే ప్రజాధనాన్ని తిరిగి రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

అయితే ఈ ఆరోపణలను రాజకీయ ప్రేరేపితమైనవని డీఎంకే ఖండించింది. పుస్తకాల కొనుగోళ్లపై విచారణ జరపాలని ఆ పార్టీ కూడా డిమాండ్‌ చేసింది.

రచితా ప్రసాద్ అదనపు రిపోర్టింగ్‌తో

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)