చైనా బొగ్గు గనిలో భారీ పేలుడు, 90 మందికి పైగా మృతి

ఫొటో సోర్స్, China Photos/Getty Images
- రచయిత, స్టీఫెన్ మెక్‌డొనెల్, టిన్షుయ్ యెంగ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
చైనాలోని ఒక బొగ్గు గనిలో జరిగిన భారీ పేలుడులో 90 మందికి పైగా మరణించినట్లు అక్కడి ప్రభుత్వ అధికారిక మీడియా వెల్లడించింది.
షాంగ్జీ ప్రావిన్సులోని టోంగ్జౌ గ్రూప్‌కు చెందిన లియుషెన్యు బొగ్గు గనిలో గ్యాస్ పేలుడు జరిగింది.
వందలాది మంది సహాయక సిబ్బందిని ఘటనా స్థలానికి పంపారు.
ప్రభుత్వ మీడియా ప్రసారం చేసిన దృశ్యాల్లో.. ఘటనా స్థలంలో పారామెడిక్స్ స్ట్రెచర్లను మోసుకెళ్తుండగా.. వారి వెనుకాల అంబులెన్స్‌లు కనిపించాయి.
100 మందికి పైగా ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 7:29 గంటలకు (భారత కాలమానం శుక్రవారం సాయంత్రం 4:59) ఈ పేలుడు సంభవించింది.
ప్రమాదం జరిగిన సమయంలో గనిలో దాదాపు 247 మంది కార్మికులు విధుల్లో ఉన్నట్లు చెబుతున్నారు.

గాయపడిన వారికి చికిత్స అందించడంలోనూ, గాలింపు చర్యల్లోనూ ఎలాంటి అలసత్వం ఉండకూడదని ఈ ఘటన తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అన్నారు.
ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరపాలని, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన సూచించారు.
ఈ బొగ్గు గని నిర్వహిస్తున్న అధికారులను అదుపులోకి తీసుకున్నట్లు ప్రభుత్వ మీడియా పేర్కొంది.
గ్యాస్ పేలుడుకు గల కారణం ఇంకా తెలియలేదు. కానీ, గనిలో అత్యంత విషపూరితమైన, వాసనలేని గ్యాస్ కార్బన్ మోనాక్సైడ్ స్థాయిలు ''పరిమితికి మించి'' ఉన్నట్లు ప్రభుత్వ మీడియా తన కథనంలో నివేదించింది.

ఫొటో సోర్స్, Xinhua
ఈ సహాయక చర్యలలో పాల్గొనేందుకు ఆరు రెస్క్యూ టీమ్‌ల నుంచి 345 మంది సిబ్బందిని చైనా అత్యవసర నిర్వహణ మంత్రిత్వ శాఖ రంగంలోకి దింపింది.
చైనాలోని అత్యంత పేద ప్రావిన్సులలో ఒకటైన షాంగ్జీ, ఆ దేశపు బొగ్గు గనుల రాజధానిగా పేరొందింది.
2000వ దశాబ్దం ప్రారంభంలో, చైనా బొగ్గు గనుల పరిశ్రమలో ప్రాణాంతక ప్రమాదాలు సర్వసాధారణంగా ఉండేవి. అయితే, ఇటీవల కాలాల్లో భద్రతా ప్రమాణాలను కఠినతరం చేశారు. కానీ, ప్రమాదాలు మాత్రం ఇంకా జరుగుతూనే ఉన్నాయి.
2023లో, ఉత్తర ఇన్నర్ మంగోలియా ప్రాంతంలోని ఒక ఓపెన్ పిట్ బొగ్గు గని కూలిపోవడంతో.. 53 మంది మరణించారు.
అంతకుముందు 2009లో ఈశాన్య ప్రాంతంలోని హేలాంగ్‌జాంగ్ ప్రావిన్సులో ఒక గనిలో పేలుడు సంభవించి 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
రికార్డు వేగంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని భారీయెత్తున సాధిస్తున్నప్పటికీ.. ప్రపంచంలో అతిపెద్ద బొగ్గు వినియోగదారిగా, గ్రీన్‌హౌస్ గ్యాస్‌లను ఎక్కువగా విడుదల చేసే దేశంగా చైనా ఉంది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

























