సల్మాన్ నుంచి టైగర్ దాకా.. బాలీవుడ్ నటులపై దాడులతో ఆందోళన

బాలీవుడ్ నటులు
ఫొటో క్యాప్షన్, ఆదివారం నాడు టైగర్ ష్రాఫ్ గురి కావడానికి ముందు... గతంలో సల్మాన్ ఖాన్, సైఫ్‌పై కూడా దాడులు జరిగాయి
ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌ కారుపై కాల్పులు జరపడం బాలీవుడ్ నటులలో ఆందోళన రేెకెత్తిస్తోంది.

"టైగర్ ష్రాఫ్ సురక్షితంగా బయటపడ్డారు. ఆయనకు ఎలాంటి బులెట్ తగల్లేదు. గాయాలు కాలేదు" అని డీసీపీ మోహిత్ గార్గ్ తెలిపారు.

దుండగుల కాల్పుల్లో డ్రైవర్ గాయపడిన తర్వాత ష్రాఫ్ స్వయంగా కారు నడుపుకొని వెళ్లినట్టు ప్రత్యక్ష సాక్షి షారుఖ్ షేక్ తెలిపారు.

గత కొన్నేళ్లుగా బాలీవుడ్ సెలబ్రిటీలపై దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు టైగర్ ష్రాఫ్‌పై జరిగిన దాడి మరింత ఆందోళన పెంచింది.

ఇటీవల కాలంలో దాడులకు గురైనవారు, లేదా దాడులకు లక్ష్యంగా మారిన సినీ పరిశ్రమకు చెందిన కళాకారులలో, సల్మాన్ ఖాన్ సైఫ్ అలీ ఖాన్ కూడా ఉన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సల్మాన్ ఖాన్
ఫొటో క్యాప్షన్, సల్మాన్ ఖాన్ పై కాల్పుల కేసులో బిష్ణోయ్ పేరు పలుమార్లు ప్రస్తావనకు వచ్చింది

సల్మాన్ ఖాన్‌పై

ముంబైలో సల్మాన్ ఖాన్ ఇంటి బయట 2024 ఏప్రిల్‌లో కాల్పులు జరిగాయి. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో ఎక్కువసార్లు లారెన్స్ బిష్ణోయ్ పేరు పలుమార్లు ప్రస్తావనకు వచ్చింది.

బిష్ణోయ్ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు నల్లజింకను పవిత్రంగా భావిస్తారు.

ఇరవై ఏళ్ల క్రితం ఒక షూటింగ్‌ సమయంలో సల్మాన్ ఖాన్ రెండు జింకలను వేటాడినట్టు ఆరోపణలు ఉన్నాయి.

ఇదే బిష్ణోయ్ ముఠా ఆగ్రహానికి కారణమైందని పోలీసులు చెబుతున్నారు.

సైఫ్ అలీఖాన్‌పై

సైఫ్ అలీ ఖాన్‌పై 2025 జనవరి 16 రాత్రి కత్తితో దాడి జరిగింది. ఖాన్ ఇంట్లోకి చొరబడిన దుండగుడు కత్తితో దాడి చేశాడు. దాడికి పాల్పడిన హెహజాద్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

బాలీవుడ్, టైగర్ ష్రాఫ్, సల్మాన్ ఖాన్, సైఫ్ అలీఖాన్, రోహిత్ శెట్టి, రాకేశ్ రోషన్
ఫొటో క్యాప్షన్, సినీ దర్శకుడు రోహిత్ శెట్టిపై ఇంట్లో ఉండగానే 2026 ఫిబ్రవరి 13న కాల్పులు జరిగాయి.

రోహిత్ శెట్టిపై..

ముంబైలోని జుహులో ఉంటున్న సినీ దర్శకుడు రోహిత్ శెట్టిపై ఇంట్లో ఉండగానే 2026 ఫిబ్రవరి 13న కాల్పులు జరిగాయి.

ఈ దాడి శుభమ్ లోంకర్ ముఠా పనిగా పోలీసులు చెప్పారు. అక్రమంగా డబ్బులు వసూలు చేయడం, భయాందోళనలు సృష్టించడమే వారి లక్ష్యమని తెలిపారు. తర్వాత ఈ కేసులో అనుమానితులుగా ఉన్న పలువురిని దర్యాప్తు అధికారులు అరెస్టు చేశారు.

ఈ కేసులో ప్రదీప్ కుమార్ అలియాస్ గాత్‌ను ఉత్తర్‌ప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్, ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆగ్రాలో 2026 అక్టోబర్‌లో అరెస్టు చేశారు.

బాలీవుడ్, టైగర్ ష్రాఫ్, సల్మాన్ ఖాన్, సైఫ్ అలీఖాన్, రోహిత్ శెట్టి, రాకేశ్ రోషన్
ఫొటో క్యాప్షన్, సినీ నిర్మాత రాకేశ్ రోషన్‌పై 2000 జనవరి 12న ముంబైలోని ఆయనకార్యాలయం బయటే కాల్పులు జరిపారు.

హృతిక్ రోషన్ తండ్రిపై..

సినీ నిర్మాత రాకేశ్ రోషన్‌పై 2000 జనవరి 12న ముంబైలోని ఆయన కార్యాలయం బయటే దాడి జరిగింది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఆయన చేతికి, ఛాతీపై బుల్లెట్లు తగిలి గాయాలు అయ్యాయి.

తన కుమారుడు హృతిక్ రోషన్ కహో నా ప్యార్ హై చిత్రంతో తెరంగేట్రం చేసి విజయం సాధించిన తర్వాత ఈ ఘటన జరిగింది. అయితే బెదిరింపులకు లొంగకుండా, డబ్బులు చెల్లించేందుకు నిరాకరించడంతోనే ఈ ఘటన జరిగినట్టు చెబుతారు.

బీబీసీ కోసం చేసిన ఇంటర్వ్యూలో కరణ్ థాపర్‌తో మాట్లాడిన హృతిక్ రోషన్ ఈ దాడిని గుర్తు చేసుకున్నారు. తన మొదటి సినిమా మంచి ఆదరణ పొందుతున్న సమయంలో కాల్పులు జరిగిన విషయాన్ని తెలుసుకొని దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పారు.

"ఆయన ఛాతీ, చేయిపై బుల్లెట్లు తగిలాయి. నేను క్షేమంగా ఉన్నానో లేదో అని ఆందోళనతో ఆయన నాకు ఫోన్ చేయడం నాకు బాగా గుర్తుంది" అని హృతిక్ చెప్పారు. కుటుంబంలోని ఇతర సభ్యులు ప్రమాదంలో ఉండొచ్చని ఆయన చాలా భయపడ్డారని తెలిపారు.

దిశాపటానీ
ఫొటో క్యాప్షన్, సినీనటి దిశా పటానీ తండ్రి జగ్దీష్ పటానీ పూర్వీకుల ఇంటి వద్ద గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.

దిశాపటానీ పూర్వీకుల ఇంటి వద్ద

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరైలీలో సినీనటి దిశా పటానీ తండ్రి జగ్దీష్ పటానీ పూర్వీకుల ఇంటి వద్ద గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.

ఆ దాడికి తామే బాధ్యులమని గోల్డీ బ్రార్, రోహిత్ గొదారా ముఠాలు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాయి.

ఆధ్యాత్మిక గురువులను ఉద్దేశించి దిశా పటానీ సోదరి ఖుష్బూ పటానీ కామెంట్స్‌ చేసినందుకు హెచ్చరికగా ఈ కాల్పులు జరిపారని వార్తలు వచ్చాయి.

ఈ కాల్పుల్లో భాగమైన ఇద్దరు వ్యక్తులు ఘజియాబాద్‌లో జరిగిన పోలీస్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు.

రాజీవ్ రాయ్‌పై..

'గుప్త్'లాంటి చిత్రాలను నిర్మించిన దర్శకుడు రాజీవ్‌ రాయ్‌పై 1997లో మధ్య ముంబైలో ఐదుగురు దుండగులు దాడి చేశారు.

వీరికి అబూ సలేం ముఠాతో సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి.

రాయ్ తన కార్యాలయం నుంచి బయటకు వస్తున్న సమయంలో దుండగులు కాల్పులు జరిపారు. అంతకు ముందు జరిగిన దాడుల బెదిరింపులతో ఆయనకు పోలీసు భద్రత కల్పించారు.

వారు ఈ దుండగులను ఎదుర్కొని తరిమికొట్టారు. ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక దుండగుడు గాయపడినట్టు రిపోర్ట్ అయ్యింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)