క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ: పెళ్లి చుట్టూ తిరిగిన డ్రామా మెప్పించిందా?

క్రేజీ కళ్యాణం
ఫొటో క్యాప్షన్, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, నరేష్ ప్రధాన పాత్రల్లో వచ్చిన 'క్రేజీ కళ్యాణం' కూడా ఒక యూత్‌ఫుల్ కథే.
    • రచయిత, సాహితి
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

యూత్‌ఫుల్ ఫ్యామిలీ కథలకు ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. కథ, కథనంలో దమ్ముంటే చిన్న సినిమాలు కూడా పెద్ద విజయాన్ని అందుకునే జానర్ ఇది.

అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, నరేష్ ప్రధాన పాత్రల్లో వచ్చిన 'క్రేజీ కళ్యాణం' కూడా ఒక యూత్‌ఫుల్ కథే. ఈ కథలో ఉన్న కొత్తదనం ఏమిటి? ఈ కళ్యాణం ఎంత కళగా సాగింది?

తెలంగాణ నేపథ్యంలో సాగే కథ ఇది. పర్వతాలు (నరేష్ వీకే)కి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురికి పెళ్లి చేస్తాడు. కానీ అల్లుడు బాలరాజు (తరుణ్ భాస్కర్) అప్రయోజకుడు. పైగా మందు అలవాటు. తాగి ఊరంతా బలాదూర్ తిరగడమే ఆయన పని.

పెద్ద కూతురి జీవితం అలా అయిపోయిందని కుమిలిపోయే పర్వతాలు, తన చిన్న కూతురు కీర్తి (అనుపమ పరమేశ్వరన్)కైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం ఊళ్లన్నీ జల్లెడపడతాడు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

చివరకు కీర్తికి అమెరికా సంబంధం కుదురుతుంది. కాకపోతే తన కాళ్లపై తాను నిలబడాలని, ఉద్యోగం చేయాలని కీర్తి అనుకుంటూ ఉంటుంది.

అంతేకాదు, ఉదయ్ (అఖిల్)తో ప్రేమలో ఉంటుంది. మరి కీర్తి ప్రేమ విషయం తెలిసిన పర్వతాలు ఎలా స్పందించాడు?

కీర్తి తను కోరుకున్న ప్రేమను, ఉద్యోగాన్ని సాధించిందా? అనేది మిగతా కథ.

క్రేజీ కళ్యాణం
ఫొటో క్యాప్షన్, క్రేజీ కళ్యాణం సినిమాలో కీలక పాత్ర పోషించిన నరేష్, అనుపమా పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖిల్

కూతురి భవిష్యత్తా? తండ్రి పరువా?

'కూతురి చదువు కోసం ముప్పై వేలు ఇవ్వలేని తండ్రి, అదే కూతురి పెళ్లికి ముప్పై లక్షలు ఖర్చు చేస్తాడు.' ఈ సినిమాలో ఓ పాత్ర చెప్పే డైలాగ్ ఇది.

నిజంగా దర్శకుడు ఈ ఆలోచనతోనే ఈ కథ రాసుకున్నాడు. ఆడపిల్లను ఎంత త్వరగా పెళ్లి చేసి, బరువు దించుకోవాలనే మనస్తత్వం సమాజంలో కనిపిస్తుంది.

కానీ అదే ఆడపిల్ల తనకు నచ్చినట్లుగా జీవించే అవకాశం ఇస్తే, తను ఎంతో ప్రగతి సాధించగలదు.

ఆడపిల్ల తండ్రి పరువు నిలబడేది అల్లుడిలో కాదు, కూతురు సాధించిన విజయాల్లో ఉంటుందనే మంచి ఆలోచనను దర్శకుడు భద్రప్ప 'క్రేజీ కళ్యాణం' ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు.

సందేశం సరే..

సందేశం వరకూ బాగానే ఉంది. కానీ ఈ ఆలోచనను ఆసక్తికరమైన కథనంగా మార్చడంలో కొన్ని లోపాలు కనిపిస్తాయి.

సినిమా మొదలైన తొలి 20 నిమిషాల్లో అసలు ఇది ఎవరి కథ? ఏ పాత్రను అనుసరించి కథను ఫాలో అవ్వాలనే విషయంలో స్పష్టత కనిపించదు.

దీంతో తెరపై జరుగుతున్న సన్నివేశాలు అలా సోసోగా సాగిపోతున్నట్లు ఉంటాయి.

కీర్తి, ఉదయ్ ప్రేమకథ, తాగుబోతు బాలరాజు పాత్ర ఆశించినంత వినోదాన్ని పంచలేకపోతాయి.

తన చిన్న కూతురికి పెళ్లి చేయాలని నరేష్ తీసుకునే నిర్ణయంతో కథలో కొంత కదలిక వస్తుంది. ఆ పెళ్లి కుదిరిన తీరు అందరూ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది.

కాకపోతే ఈ కథను ముందుకు నడిపించడంలో దర్శకుడు మరింత కసరత్తు చేయాల్సిన అవసరం అడుగడుగునా కనిపిస్తుంది.

సెకండాఫ్‌పై ఏమాత్రం ఆసక్తిని పెంచలేని విరామ ఘట్టం, ఆ తర్వాత నడిచే స్పోకెన్ ఇంగ్లీష్ డ్రామా పెద్దగా వినోదాన్ని అందించవు.

క్రేజీ కళ్యాణం
ఫొటో క్యాప్షన్, చివర్లో ఒక ఆడపిల్ల తండ్రికి కనువిప్పు కలిగించే తరహాలో అల్లుకున్న సన్నివేశం, అందులోని మాటలు ప్రేక్షకులను హత్తుకునేలా ఉంటాయి.

సుదీర్ఘ పెళ్లి నాటకం

అసలు ఈ సినిమాకు 'క్రేజీ కళ్యాణం' అనే టైటిల్ ఎందుకు పెట్టారనే జస్టిఫికేషన్ కోసమే అన్నట్లుగా, దాదాపు ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్‌ను ఒక పెళ్లి మండపం చుట్టూ తిప్పారు.

ఆ సుదీర్ఘ ఘట్టం చివర్లో వచ్చే సందేశం బాగున్నప్పటికీ, డ్రామాను, ఎమోషన్‌ను ప్రేక్షకులకు కనెక్ట్ చేయడంలో వైఫల్యం కనిపిస్తుంది. సన్నివేశాల్లో బలం సరిపోలేదనే భావన కలుగుతుంది.

కాకపోతే, చివర్లో ఒక ఆడపిల్ల తండ్రికి కనువిప్పు కలిగించే తరహాలో అల్లుకున్న సన్నివేశం, అందులోని మాటలు ప్రేక్షకులను హత్తుకునేలా ఉంటాయి.

అనుపమా పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్
ఫొటో క్యాప్షన్, కీర్తి పాత్రలో అనుమప నటన సహజంగా ఉంది. తరుణ్ భాస్కర్ పాత్రలో సరైన ఆర్క్ కనిపించలేదు.

అనుపమ ఇలా.. తరుణ్ అలా!

అనుపమ పరమేశ్వరన్ నటన గురించి మళ్లీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కీర్తి పాత్రలో ఆమె నటన సహజంగా ఉంటుంది.

ప్రేమ, కెరీర్‌పై ఆశ, తండ్రిపై గౌరవం ఉన్న పాత్రలో చక్కగా రాణించింది. కాకపోతే, ద్వితీయార్థంలో ఆ పాత్రను సరిగ్గా ఉపయోగించుకోలేదనే భావన కలుగుతుంది.

తరుణ్ భాస్కర్ పాత్రలో సరైన ఆర్క్ కనిపించలేదు. తాగుడు అలవాటును ఏదో గ్లోరిఫై చేసినట్లుగా చూపించారు.

చివర్లో తన పాత్రకు ఒక ఫైట్ ఉంటుంది. కానీ దానివల్ల ఆ క్యారెక్టర్‌కు అదనంగా ఒరిగిందేమీ లేదు.

నరేష్ మరోసారి తన అనుభవాన్ని చూపించారు. సెకండాఫ్‌లో పెళ్లి సన్నివేశం దగ్గర ఆయన పెర్ఫార్మెన్స్‌లో వచ్చే వేరియేషన్స్ ఆకట్టుకునేలా ఉంటాయి.

అఖిల్ నటన కూడా డీసెంట్‌గా ఉంది. కాకపోతే, ఈ ప్రేమకథలో కాన్ఫ్లిక్ట్ పాతదే కావడంతో తన పాత్ర కూడా రొటీన్‌గా అనిపిస్తుంది.

నిర్మాణ పరంగా సినిమా మంచి క్వాలిటీలో ఉంది. దర్శకుడు రాసుకున్న మాటల్లో, సన్నివేశాల్లో ఎక్కడా అసభ్యత కనిపించకపోవడం బాగుంది.

కెమెరా పనితనం కథకు తగ్గట్టుగా ఆహ్లాదకరంగా ఉంది. కాకపోతే, దర్శకుడు కథనంలో నవ్యత చూపించి ఉంటే ఈ కళ్యాణం మరింత కళగా ఉండేది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)