వద్దన్నా కుప్పలు తెప్పలుగా ‘క్యాష్ ఆన్ డెలివరీ’ పార్సిళ్లు, తట్టుకోలేక విదేశాలకు వెళ్లిపోయిన ఇన్ఫ్లూయెన్సర్

ఫొటో సోర్స్, Veeramani/Instagram
కేరళ వెళ్లేందుకు సాయం చేయమని కోరిన ఒక ఇన్ఫ్లుయెన్సర్ చివరకు ఊరు వదిలి వెళ్లాల్సి వచ్చింది. నెటిజన్ల ధాటికి తట్టుకోలేకే ఆయన విదేశాలకు వెళ్లిపోయారని భార్య చెబుతున్నారు.
‘‘ఇంటికి రావడానికి భయపడుతున్నారని, ఇరుగు పొరుగు వారు కూడా తమపై కోపంగా ఉన్నార’’ని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మదురైకి చెందిన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ వీరమణి, సోషల్ మీడియాలో తన ఇంటి అడ్రస్, ఫోన్ నంబర్ షేర్ చేసుకున్న తర్వాత చిక్కులు మొదలయ్యాయి.
"రోజుకు కనీసం 30 నుంచి 40సార్లు 'క్యాష్ ఆన్ డెలివరీ' ద్వారా మా ఇంటికి సరుకులు వస్తున్నాయి. ఇంటి యజమాని, ఇరుగుపొరుగు వారు సహా అందరూ చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. దయచేసి మీ వ్యక్తిగత వివరాలు ఓపెన్‌గా చెప్పొద్దు" అని సుమంగళి వీరమణి అన్నారు.
గత కొన్ని రోజులుగా అమెజాన్, స్విగ్గీ, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్లైన్ యాప్‌ల ద్వారా గృహోపకరణాలు, ఆహారం, ఇతర వస్తువులు వీరమణి ఇంటికి వస్తున్నాయి.

వీటన్నింటినీ 'క్యాష్ ఆన్ డెలివరీ' పద్ధతిలో నెటిజన్లు పంపిస్తున్నారు. వాటికి డబ్బు చెల్లించలేక వీరమణి కుటుంబం ఆ వస్తువులను తీసుకోవడం లేదు.
" డెలివరీ కోసం ఎప్పుడూ ఎవరో ఒకరు తలుపు తడుతూనే ఉన్నారు. తలుపు తెరవాలంటేనే భయంగా ఉంది. ఇది మేం ఆర్డర్ చేయలేదని చెప్పినా వాళ్లు వినడం లేదు. దీని కారణంగానే నా భర్త విదేశాలకు వెళ్లిపోయారు. ఆర్థికంగా కూడా నష్టపోయాం" అని వీరమణి భార్య సుమంగళి వీరమణి ఆవేదన వ్యక్తం చేశారు.
అదే సమయంలో, ఇంటి చిరునామా, ఫోన్ నంబర్ వంటి వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో పంచుకోవద్దని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఫొటో సోర్స్, Veeramani/Instagram
అసలేం జరిగింది?
మదురైకి చెందిన వీరమణి సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. ఆయనకు ఇన్‌స్టాగ్రామ్‌లో 3 లక్షలకుపైగా ఫాలోవర్లు ఉన్నారు.
కేరళకు వెళ్లడానికి సహాయం చేయమంటూ తన ఫాలోవర్లను కోరుతూ తన ఫోన్ నంబర్‌ను షేర్ చేస్తూ ఓ వీడియోలో అభ్యర్థించారు. ఈ అభ్యర్థన తర్వాత తనకు 6వేల రూపాయలు వచ్చాయని చెబుతూ మరో వీడియో పోస్టు చేశారు.
ఆ తర్వాత ఫాలోవర్లలో కొంతమంది ఇంటి చిరునామా చెపితే తాము కూడా బహుమతులు పంపుతామని కోరడంతో వీరమణి మదురైలోని తన ఇంటి చిరునామా చెప్పారు.
"ఆ రోజు నుంచి ఇంటికి కొన్ని సరుకులు రావడం మొదలైంది. కానీ అన్నీ 'క్యాష్ ఆన్ డెలివరీ' రూపంలోనే కావడంతో ఇబ్బందిపడుతున్నాం" అని వీరమణి భార్య సుమంగళి వీరమణి బీబీసీతో అన్నారు.
"వారు ఐఫోన్ 17, టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఫర్నిచర్, బట్టలు, కిరాణా సామాను వరకు లక్షల రూపాయల విలువైన వస్తువులు పంపుతున్నారు. కొన్ని రోజుల కిందట, ఎవరో 20 కేజీల బిర్యానీ కూడా 'క్యాష్ ఆన్ డెలివరీ' పద్ధతిలో పంపారు" అని చెప్పారు.
దీని తర్వాత, వీరమణి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక వీడియో పోస్ట్ చేశారు. అందులో, "నాకు వస్తువులు వస్తూనే ఉన్నాయి. వాటిని తెచ్చే డెలివరీ ఏజెంట్లతో నేను మాట్లాడలేను. దయచేసి, ఎవరూ నా కోసం వస్తువులు ఆర్డర్ చేయకండి" అని అభ్యర్థించారు.
"వారు 'క్యాష్ ఆన్ డెలివరీ' పద్ధతిలో వస్తువులు తెస్తూ ఉన్నారు. కిడ్నీ దానం కోసం కూడా నా నంబర్ ఇచ్చేశారు, అందుకే నేను విదేశాలకు వెళుతున్నా. దయచేసి ఎలాంటి వస్తువులు పంపవద్దు" అని మరో వీడియోలో అభ్యర్థించారు.

ఫొటో సోర్స్, Veeramani/Instagram
'100కు పైగా పార్శిళ్లు'
అయితే, 'క్యాష్ ఆన్ డెలివరీ' ద్వారా వీరమణి ఇంటికి సరుకులు వస్తూనే ఉన్నాయని ఆయన భార్య సుమంగళి వీరమణి వాపోతున్నారు.
"నా భర్త ఇంకా మదురైకి తిరిగి రాలేదు. ఆయన ఇంటికి రావడానికి భయపడుతున్నారు. ఇంటికి సరుకులు తెచ్చే ఏజెంట్లు ఓటీపీ అడుగుతారు, వాటిని ఎవరు పంపిస్తున్నారో కూడా తెలియదు. నేను అదే విషయం చెబితే కొందరు అర్థం చేసుకుంటే, మరికొందరు కోపగించుకుని గొడవపడతారు. దీనివల్ల ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే భయంగా ఉంది" అని ఆమె చెప్పారు.
వీరమణి మదురైలోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవారని సుమంగళి పేర్కొన్నారు. "ఆయన ఇప్పుడు నిరుద్యోగి. ఆయన ఎప్పుడూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు పోస్ట్ చేస్తూ ఉండేవారు. ఇలాంటి సమస్య వస్తుందని అనుకోలేదు. ఈ సమస్య వల్ల ఇంటి యజమాని, ఇరుగుపొరుగు వారు కోపంగా ఉన్నారు. మేం త్వరలోనే ఈ ఇంటిని ఖాళీ చేస్తాం" అని అన్నారు.
ఒక ప్రైవేట్ డెలివరీ కంపెనీ ఉద్యోగి అయిన అరుణ్ (పేరు మార్చాం) చెప్పిన దాని ప్రకారం, వీరమణి పేరు మీద 100కు పైగా పార్శిళ్లు వచ్చాయి, కానీ అవి ఇంకా డెలివరీ కాలేదు.
"మేము తీసుకువెళ్లే 'క్యాష్ ఆన్ డెలివరీ' ఆర్డర్లు తిరిగి వచ్చినప్పుడు, అది మా పనిపై ప్రభావం చూపుతోంది. ఆ డెలివరీకి శ్రమించాల్సి వస్తోంది. పెట్రోల్ ఖర్చు అవుతోంది. ఒకే రోజులో వీరమణి ఇంటి చిరునామాకు 30-40 వస్తువులు ఉన్నప్పుడు, వాటిని తీసుకెళ్లడానికి సిబ్బంది నిరాకరిస్తారు లేదా తప్పించుకుంటారు" అని ఆయన అన్నారు.
' ఫేమస్ కావాలనే కోరికతో... '
"సోషల్ మీడియాలో పాపులర్ కావడం కోసం ఆలోచించకుండా ఇలాంటివి చేస్తారు. నేటి ఆన్లైన్ ప్రపంచంలో, తెలియకుండా షేర్ చేసుకునే అతి చిన్న సమాచారం కూడా పెద్ద నేరాలకు కారణం కావచ్చు" అని సైబర్ సెక్యూరిటీ నిపుణుడు, న్యాయవాది బాలు అన్నారు.
"డేటా గోప్యత లేదా సమాచార గోప్యత అంటే ఏంటి, దాని ప్రభావం ఎలాంటిది అనే దానిపై ప్రజల్లో అవగాహన లేకపోవడమే ఇటువంటి సమస్యలకు కారణం" అని ఆయన అన్నారు.
"లక్షల రూపాయల విలువైన ఇలాంటి వస్తువులను ఒకరికి 'క్యాష్ ఆన్ డెలివరీ' పద్ధతిలో నిరంతరం పంపడం మానసిక వేధింపు. దీనిని ఆపడానికి పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయవచ్చు. అయితే, కేవలం కేసులతోనే ఇలాంటి ఆర్డర్లను పూర్తిగా ఆపలేం. కానీ ఇప్పటివరకు ఈ పార్సిళ్లను ఎవరు పంపారో కనుక్కోవచ్చు" అని బాలు అన్నారు.
"ఇలా ఇంటి చిరునామా, ఫోన్ నంబర్ బహిరంగంగా ఇవ్వడం ఆర్థిక మోసాలకు దారితీయవచ్చు. నకిలీ ఐడీ కార్డులను కూడా సృష్టించవచ్చు" అని ఆన్లైన్ ఫ్యాక్ట్ చెక్ నిపుణుడు మురళీకృష్ణన్ చిన్నదురై అంటున్నారు.
"మనం ఎవరితో ఏ సమాచారాన్ని పంచుకుంటున్నామనేది చాలా ముఖ్యం. దేనికోసం పంచుకుంటున్నామో, అది ఆ ప్రయోజనం కోసమే వినియోగిస్తున్నారో లేదో కూడా నిర్ధరించుకోవాలి" అని ఆయన అన్నారు.
"మీ వివరాలను సోషల్ మీడియాలో ఎక్కువగా బయటపెట్టినప్పుడు, అది అనేక రకాలుగా హాని కలిగించే అవకాశం ఉంది. కాబట్టి, సోషల్ మీడియాలో ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు అనే విషయంలో స్వీయ నియంత్రణ కలిగి ఉండాలి" అని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























