‘‘మహిళలపై లైంగిక వేధింపులను బయటపెడుతున్నా, అందుకే నన్ను చంపాలని చూస్తున్నారు.. ’’

- రచయిత, శాలీ నబీల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
(ఈ కథనంలో లైంగిక దాడికి సంబంధించిన వివరాలు మిమ్మల్ని కలవర పరిచే అవకాశం ఉంది)
"కారు ఆపి కిందకు దిగు" అని ఒక మహిళ పెద్దగా అరుస్తున్నారు. తను నడుస్తూ వెళుతుంటే డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడంటూ ఆమె ఆయనతో గట్టిగా వాదిస్తున్నారు.
బాగ్దాద్‌లోని రద్దీగా ఉండే వీధిలో ఆమె తన ఫోన్లో ఈ దృశ్యాన్ని చిత్రీకరిస్తున్నారు. ఆమె కారు తలుపు తీయడానికి ప్రయత్నిస్తుంటే ఆ డ్రైవర్ లోపలి నుంచి అడ్డుకోవడం కెమెరాలో రికార్డైంది.
ఇరాకీ మహిళల హక్కుల కార్యకర్త సారా జాసిమ్ ఇన్‌స్టా పేజీలో ఇలాంటి వీడియోలు చాలా కనిపిస్తాయి.
ఇరాకీ పురుషులు, యువకుల నుంచి లైంగిక వేధింపులు, దాడులు ఎదుర్కొన్న మహిళల తరఫున ఆమె వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

"మీ చేతిలో ఉన్న కెమెరాయే మీ ఆయుధం" అని ఆమె బీబీసీతో అన్నారు.
"ఒక మహిళ తనను వేధించిన వ్యక్తిపై కేసు పెట్టాలనుకుంటే సాక్ష్యాలను భద్రపరచడానికి ఇది ఒక మార్గం. కనీసం ఆ వ్యక్తిని సమాజంలో దోషిగా నిలబెట్టడానికైనా ఇది ఉపయోగపడుతుంది" అని ఆమె పేర్కొన్నారు.
తాము పోస్ట్ చేసిన వీడియో సాయంతో పాఠశాల విద్యార్థినులను వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక పోలీసు అధికారి అరెస్ట్ అయ్యారని ఆమె తెలిపారు.
అయితే ఇలాంటి వీడియోలను పోస్ట్ చేయడం తనతో పాటు బాధితులకు కూడా చాలా ప్రమాదకరమని జాసిమ్ చెప్పారు.
ఇరాక్‌లో లైంగిక వేధింపులను ఎదుర్కొన్న అనేక మంది బాధితులతో బీబీసీ మాట్లాడింది. సమాజం తరచుగా బాధితులనే నిందిస్తుందని వాళ్లు చెప్పారు.
"నన్ను చంపేస్తామని, యాసిడ్ పోస్తామని బెదిరించారు" అని జాసిమ్ ఆవేదన వ్యక్తం చేశారు.
"మహిళలు మౌనంగా ఉండాలని కోరుకునే ఈ సమాజంలో వారిని మాట్లాడమని ప్రోత్సహిస్తున్నాను. ఈ పని చేస్తున్నందుకు సమాజంలో నైతిక విలువలు దెబ్బ తీస్తున్నానని నాపై విమర్శలు చేస్తున్నారు" అని ఆమె అన్నారు.
ప్రాణహాని ఉండటంతో ఆమె ఇల్లు వదిలి రావడం లేదు. పెంపుడు కుక్కతో ఇంట్లోనే గడుపుతున్నారు.
ఇరాక్ శిక్షాస్మృతిలో ప్రస్తుతం 'వేధింపులు' 'లింగ ఆధారిత హింస' వంటి పదాలు లేవని వీటిని నేరంగా పరిగణించే కఠినమైన చట్టాలు రావాలని ఆమె వాదిస్తున్నారు.
"సమస్యను పరిష్కరించడానికి దాన్ని గుర్తించడమే ఉత్తమ మార్గం. మాకు రక్షణ కావాలి. వేధింపులకు పాల్పడేవారిని భయపెట్టే చట్టాలుండాలి" అని ఆమె డిమాండ్ చేశారు.

ఫొటో సోర్స్, Instagram
"నిన్ను చంపేసినా ఎవరూ పట్టించుకోరు"
న్యాయ, పోలీసు వ్యవస్థలు తమను ఆదుకోవడంలో విఫలమయ్యాయని చాలామంది ఇరాకీ మహిళలు బీబీసీతో చెప్పారు.
వేధింపులు లేదా అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఇరాక్‌లో చాలా సుదీర్ఘమైన ప్రక్రియ అని న్యాయవాదులు, హక్కుల కార్యకర్తలు చెప్పారు.
"మహిళలు, బాలికలపై జరుగుతున్న హింస ఇరాక్‌లో విస్తృతంగా ఉంది. చాలా సందర్భాల్లో ఇది బయటకు నివేదించబడటం లేదు" అని మహిళలపై వివక్షకు వ్యతిరేకంగా పనిచేసే ఐక్యరాజ్యసమితి కమిటీ మే నెల నివేదికలో పేర్కొంది.
బలమైన చట్టాల కోసం ఆ కమిటీ పిలుపునిచ్చింది.
డజన్ల కొద్దీ సిఫార్సులతో పాటు అత్యాచార నిందితులు బాధితులను వివాహం చేసుకుంటే వారిని నిర్దోషులుగా వదిలేసే 'వివక్షాపూరిత' చట్టాలు రద్దు చేయాలని 'పరువు హత్యల' కేసుల్లో నిందితులకు శిక్షలను తగ్గించే నిబంధనలను తొలగించాలని కమిటీ అధికారులను కోరింది.
అమల్ (బాధితురాలి అసలు పేరు కాదు) దాదాపు ఐదు సంవత్సరాలుగా కోర్టులో పోరాడుతున్నారు.
అప్పట్లో తన మాజీ భర్త తన 18 ఏళ్ల లోపు వయసున్న కూతురిపై తుపాకీ గురిపెట్టి పదేపదే అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించారు.
ఆ గదిలో జరిగిన భయానక సంఘటనను గుర్తు చేసుకుంటూ తండ్రి తన గదిలోకి వచ్చి బెడ్‌పై తుపాకీ పెట్టాడని కూతురు చెప్పినట్లు ఆమె గుర్తు చేసుకున్నారు.
'నేను నిన్ను చంపేసినా ఎవరికీ వినబడదు' అని ఆయన తన కూతురిని బెదిరించినట్లు ఆమె తెలిపారు.
ఇరాక్‌లో లైంగిక వేధింపులను చాలా కాలంగా ఒక నిషిద్ధ అంశంగా చూస్తున్నారు. కుటుంబం నుంచి ఎదురయ్యే వ్యతిరేకత కారణంగా దీనిని దాచిపెట్టడానికే ఇష్టపడతామని చాలా మంది బాధితులు మాకు చెప్పారు.
సమాజంలో ఎదురయ్యే అవమానాలు, పోలీసుల వేధింపుల భయంతో లైంగిక నేరాలపై ఫిర్యాదు చేయడానికి భయపడుతున్నామని మరికొందరు అన్నారు.
కానీ అమల్ మాత్రం న్యాయం కోసం పట్టుబట్టి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
"ఆమె మణికట్టు చుట్టూ చాలా గాయాలు ఉన్నాయి. అతను ఆమె చేతులను గట్టిగా పట్టుకున్నాడు. ఆమె అరవడానికి ప్రయత్నించినప్పుడల్లా నోరు నొక్కేసేవాడు" అని అమల్ చెప్పారు.
ఈ ఆరోపణలకు సాక్ష్యంగా డీఎన్ఏ ఆధారాలతో సహా వైద్య పత్రాలను అమల్ మాకు చూపించారు.
తన మాజీ భర్త ఎంతటి క్రూరుడో చెప్పడానికి మరో ఉదాహరణ ఇస్తూ ఒకవేళ తను అరెస్ట్ అయితే 'ఆమెను చంపేయండి' అని అతడు తన కుటుంబ సభ్యుడికి చెప్పడం తాను విన్నానని అమల్ తెలిపారు.
"మెడికల్ రిపోర్ట్ బయటకు రాకుండా, దాడి రుజువు కాకుండా ఉండటం కోసమే నా మాజీ భర్త నా కూతురు ప్రాణాలు తీయడానికి ప్రయత్నించాడని నేను అనుకుంటున్నా" అని ఆమె అన్నారు.
ఆమె మాజీ భర్త ప్రస్తుతం పరారీలో ఉన్నారని కోర్టులో కేసు ఇంకా నడుస్తూనే ఉందని ఆమె తెలిపారు.
"నేను ఒంటరిగా పోరాడాను" అంటూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు.
తన మాజీ భర్త పలువురు న్యాయవాదులను నియమించుకున్నారని కానీ తనకు న్యాయ సహాయం పొందే ఆర్థిక శక్తి లేదని తన కుటుంబం కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
కోర్టు తీర్పు తనకు అనుకూలంగా వస్తుందనే నమ్మకం ఆమెకు ఇక లేదు.
"అతను నా జీవితం నుంచి శాశ్వతంగా దూరంగా ఉంటే చాలు" అని ఆమె నిట్టూర్చారు.

హక్కుల కార్యకర్త హత్య
ఇరాక్‌లో ఇళ్లలోనే లైంగిక వేధింపులకు గురవుతున్న ఇతర మహిళలతో పోలిస్తే అమల్ కుమార్తె కొంత అదృష్టవంతురాలని చెప్పాలి. ఎందుకంటే ఆమెకు ఉండటానికి సురక్షితమైన స్థలం ఉంది.
చాలా మంది బాధితులకు సొంత ఆదాయం లేదు. వెళ్ళడానికి చోటు లేదు.
వేధింపులు ఎదుర్కొనే మహిళలకు ఆశ్రయమిచ్చే షెల్టర్లు చాలా తక్కువగా ఉన్నాయి.
ఆ షెల్టర్లలో కొన్నింటిని అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన మహిళల హక్కుల కార్యకర్త యనార్ మొహమ్మద్ స్థాపించిన సంస్థ ఏర్పాటు చేసింది.
ఈ ఏడాది మార్చ్‌లో బాగ్దాద్‌లోని ఆమె ఇంటి వెలుపల సాయుధ దుండగులు ఆమెను దారుణంగా హత్య చేశారు.
నిందితులు ఎవరో ఇప్పటికీ తెలియలేదు.
మొహమ్మద్ యనార్ను చంపేస్తామని కొన్నేళ్లుగా బెదిరింపులు వస్తున్నాయని.. ఇవి 'మత తీవ్రవాదుల' నుంచి వచ్చినట్లు నమ్ముతున్నామని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి నిపుణులు తెలిపారు.
ఇటీవలి సంవత్సరాలలో తమ తోటి కార్యకర్తలపై టార్గెటెడ్ దాడులు పెరుగుతున్నాయని మహిళా హక్కుల నాయకులు బీబీసీతో చెప్పారు.
మొహమ్మద్ హత్యకు గురికావడానికి రెండు రోజుల ముందే తాను ఆమెను కలిశానని మరో ప్రముఖ మహిళా హక్కుల కార్యకర్త హనా ఎడ్వర్ చెప్పారు. తనకు కూడా బెదిరింపులు వచ్చాయని ఆమె అన్నారు.
"ఇరాక్‌లో మహిళలకు చట్టాలు లేవు. రక్షణ లేదు. న్యాయం అంతకంటే లేదు" అని ఎడ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు.
"మహిళల మౌనం ఇక్కడ సమస్య కాదు. వాళ్లు మాట్లాడినప్పుడు వినడానికి ఈ వ్యవస్థలో తగిన ఏర్పాట్లు లేకపోవడమే అసలు సమస్య" అని ఇరాకీ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ అధినేత ముస్తఫా సాదూన్ బీబీసీతో చెప్పారు.
"లైంగిక హింసపై ఫిర్యాదు చేయాలనుకునే మహిళ మొదట తన కుటుంబాన్ని, ఆ తర్వాత పోలీస్ స్టేషన్, ఆపై కోర్టును దాటాలి. ప్రతిచోటా ఎవరో ఒకరు ఈ విషయాన్ని నిశ్శబ్దంగా సర్దుబాటు చేసుకోమని సలహా ఇస్తూనే ఉంటారు" అని వారు వివరించారు.

'కారులో వెంబడించారు'
ఈ వ్యవస్థ తమను ఆదుకోవడంలో విఫలమైందని భావిస్తున్న ఇరాకీ మహిళల్లో సమీరా (బాధితురాలి అసలు పేరు కాదు) కూడా ఒకరు.
పదేపదే ఎదురవుతున్న వేధింపుల కారణంగా తాము వీధిలో నడవడానికే భయపడుతున్నామని ఆమె బీబీసీతో చెప్పారు.
"ఒకసారి బస్సులో వెళుతున్నప్పుడు ఫోన్లో అశ్లీల చిత్రాలు చూస్తున్న ఓ వ్యక్తి దాన్ని తెచ్చి నా ముఖానికి దగ్గరగా పెట్టాడు" అని ఆమె వివరించారు.
బాగ్దాద్‌లో జరిగిన మరో సంఘటనను కూడా ఆమె వివరించారు.
ఒక వ్యక్తి తన కారులో దాదాపు 10 నిమిషాలకు పైగా తనను వెంబడించాడని ఆమె చెప్పారు.
"అది నన్ను తీవ్రంగా భయపెట్టింది. ఆ సమయంలో నాకు అక్కడ ఒక పోలీసు కారు కనిపించింది. నేను వారి దగ్గరకు వెళ్లి జరిగిన విషయం చెప్పాను. కానీ తామేమీ చేయలేమని తమకు అధికారాలు లేవని వాళ్లు చెప్పారు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తల్లి తనను ప్రేమిస్తూ, మద్దతుగా నిలుస్తున్నప్పటికీ తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి సమీరా తల్లికి చెప్పుకోవడం లేదు.
"నేను ఈ విషయాలు కుటుంబ సభ్యులకు చెబితే నా రక్షణ కోసం నన్ను వెంటనే ఇల్లు వదిలి బయటకు వెళ్లవద్దని కోరతారు" అని ఆమె అన్నారు.
ప్రభుత్వ సంస్థలపై ఆమె పూర్తిగా నమ్మకం కోల్పోయారు.
"పోలీసు అధికారులతో సహా చాలామంది పురుషులు లైంగిక వేధింపులను తప్పుగా భావించడం లేదు. ఒకవేళ మీరు ఎవరినీ వేధించకపోతే మీరు నువ్వు అసలు మగాడివే కాదు అనేలా వారి ఆలోచనా విధానం ఉంటుంది" అని ఆమె పేర్కొన్నారు.
ఇరాక్‌లో బీబీసీతో మాట్లాడిన అనేకమంది మహిళలు పోలీసులే తమను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపించారు.
ఈ ఆరోపణలను బీబీసీ ఇరాక్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి ముక్దాద్ మీరి దృష్టికి తీసుకెళ్లింది.
"పోలీసులు లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయి. కానీ అవి చాలా తక్కువ. అలాంటి వారికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించడంతో పాటు ఉద్యోగం నుంచి తొలగించడం లాంటి కఠినమైన శిక్షలు ఉన్నాయి" అని మీరి చెప్పారు.

ఫొటో సోర్స్, Hanaa Edwar
పోలీసులకు ఫిర్యాదు చేయడానికి భయపడిన మహిళలు సోషల్ మీడియాలో ఈ వేధింపులను సాక్ష్యాలతో సహా పోస్ట్ చేస్తున్నారనే విషయాన్ని బీబీసీ మీరి వద్ద ప్రస్తావించింది.
దీనిపై మీరి స్పందిస్తూ "అధికారికంగా ఫిర్యాదు చేయడం కంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తేలిక. సమస్యపై అందరి దృష్టిని ఆకర్షించడానికి ఇది సాధారణ మార్గంగా మారడం వల్లే వారు అలా చేస్తున్నారు" అని అన్నారు.
సమీరాకు ఎదురైన అనుభవాన్ని కూడా బీబీసీ ఆయన ముందుంచింది.
వేధింపులను ఆపడానికి తనకు అధికారం లేదని ఒక పోలీసు అధికారి ఆమెతో చెప్పిన విషయాన్ని ప్రస్తావించగా సమీరా ఆ అధికారిపైనే ఫిర్యాదు చేసి ఉండవచ్చని మీరి సమాధానమిచ్చారు.
ఇరాక్‌లో లైంగిక హింస లేదా వేధింపులకు సంబంధించి అధికారిక గణాంకాలు లేవు.
ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు పోలీసులకు లైంగిక హింసపై దాదాపు 300 ఫిర్యాదులు వచ్చాయని మీరి బీబీసీతో చెప్పారు.
అయితే ఈ కేసుల సంఖ్య దీనికంటే చాలా ఎక్కువగా ఉండవచ్చని ఆయన అంగీకరించారు.
సమాజం, ఆచారాలు సంప్రదాయాల కారణంగా చాలా కేసులు అసలు పోలీసుల దాకా చేరడం లేదు.
కేవలం లైంగిక హింసకు వ్యతిరేకంగా మాత్రమే కాకుండా, సమాజంలో లోతుగా పాతుకుపోయిన పాత ఆలోచనా విధానాలు, నమ్మకాలకు వ్యతిరేకంగా కూడా మహిళలు పోరాడుతున్నారని కొంతమంది మహిళలు బీబీసీకి చెప్పిన వివరాల్ని బట్టి తెలుస్తోంది.
ఎడ్వర్డ్ 50 ఏళ్లకు పైగా మహిళల హక్కుల కోసం పోరాడుతున్నారు.
ప్రస్తుత పరిస్థితి నిరాశాజనకంగా ఉందని ఆమె అన్నారు.
సద్దాం హుస్సేన్ పాలన అంతమై 23 ఏళ్లు గడుస్తున్నా మహిళల హక్కుల విషయంలో మనం ఇంకా వెనకడుగు వేస్తున్నట్లే కనిపిస్తోందని ఆమె అన్నారు.
అయితే తాము పట్టు వదలబోమని ఆమెతో పాటు జాసిమ్ కూడా చెప్పారు.
"అందరూ భయంతో పారిపోతే ఇక్కడ ఏదీ మారదు" అని సారా జాసిమ్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























